జడ్జ్ చేయడం నచ్చదు: అక్కిరాజు భట్టిప్రోలు

మనం ఉన్న జీవనం పట్ల  అనుభూతి ఉంటే తప్పా రాయకూడదు అని నమ్ముతాను.

థా  సాహితీ  కథ  2003 ఆవిష్కరణకి  విశాఖ  వెళ్లేవాళ్ళమంతా  సికింద్రాబాద్  రైల్వే స్టేషన్  ఫ్లాట్  ఫామ్  మీదకి  చేరుకున్నాం. అక్కడ  మొదటి  సారి  అక్కిరాజు, నేను  వొకరిని వొకరం  చూసుకొన్నాం.   గుర్తుపట్టిన   నవ్వుల  స్నేహాలింగనం.  చూస్తూనే  చక్కని  స్నేహితులం  అయిపోయాం. 

సాహిత్యం  యెప్పటికప్పుడు ఆయా  కాలాలకు  సంబంధించిన  రచయితలని  పాఠకులకు  అందిస్తుంది.  అలా  తెలుగు  కథాసాహిత్యంలోకి  నందిని , అంటుకొమ్మ, గేటెడ్  కమ్యూనిటీ  లాంటి  కథలు  అప్పటి  సమాజపు  మార్పులని  పట్టుకొంటూ వచ్చాయి.    

ఆర్ధిక, సాంకేతిక  రంగాల్లో తీసుకొన్న  నిర్ణయాలు, వాటిని  అమలుచేసెటప్పుడు  సమాజంలో  సామాజికంగా  వచ్చే  మార్పులు,  ఆలోచనల్లో  జరిగే  సంఘర్షణ, యెదురయ్యే  సంతోషాలు, చుట్టూ వున్న  వారి  జీవితాల్లో ని  యెత్తుపల్లాల పట్ల  మనకి  వున్న కన్సర్న్ ఆయా   రచయిత  తన  కథల్లో  యెలా  మాటాడతారోనని   గమనించినప్పుడు అక్కిరాజు  కథలు  కొత్తగా, తను మాత్రమే  రాసేవిగా  పాఠకులు, సంకలన కర్తలు, విమర్శకులు గుర్తించారు.   

చాలా కాలంగా యెదురు చూస్తున్న అక్కిరాజు  కథా  సంపుటి  మూడు బీర్ల తర్వాత యీ నెల 12 వ తేదీన  ఆవిష్కరణ జరిగిన  యీ  సంతోషపు సమయంలో అక్కిరాజుతో  మనందరి కోసం జరిపిన  సంభాషణ.  

సాహిత్యం మీద, రాయడం మీద ఆసక్తి యెప్పట్నించీ మొదలయింది

ఇంట్లో చదివే వాతావరణం ఉండేది. పల్లెటూళ్లలో పెరగడంతో వేరే ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండేది కాదు మా అమ్మా, నాన్నలకి.  పుస్తకాలు, రేడియో తప్పా.   నాన్న రాజకీయ స్పృహ ఉండడంతో ఏవో సైద్ధాంతిక పుస్తకాలూ, న్యూస్ పేపర్లు ఎక్కువ చదివేవాడు.  అమ్మ చదువుకున్నది ఐదో తరగతి అయినా  కాలక్షేపం పేరుతో దొరికిన పుస్తకమల్లా చదివేది.

నాన్న ప్రతినెలా భద్రాచలం వెళ్లి జీతాలు తెచ్చేవాళ్ళు టీచర్లందరికీ. వాటితో పాటే ఇంటికి కావల్సిన సరుకులు. ఆ సరుకుల్లో ముఖ్యవయినది చందమామ.

కొంచెం పెద్దయ్యాక నాన్న పనిచేసే జిల్లాపరిషత్ బళ్ళలో ‘లైబ్రరీ బడ్జెట్’ లాంటిదేదో ఉండేదనుకుంటా.  ప్రతి సంవత్సరం వేసవి సెలవల్లో విజయవాడ వళ్లినప్పుడు దాదాపు ఓ పాతిక పుస్తకాలు నవలలూ, అనువాదాలూ లాంటివి నాన్న కొనేవాడు. అవి మాతో పాటే సెలవలంతా తిరిగి వెనక్కి వచ్చాక స్కూలు లైబ్రరీలో చేరేవి. నాన్న పనిచేసిన చాలా స్కూళ్ళలో ఇలా పుస్తకాలు చేరాయి.  దాదాపు  అమ్మ, అక్క, నెను అన్నీ చదివేసే వాళ్ళం సెలవలు అయ్యేలోపు.   అలా చదివిన పుస్తకాల్లొ నాకు గుర్తున్నవి, చెప్పుకో దగ్గవి    స్పార్టకస్, ఒథెల్లో, రూట్స్, జంటనగరాలు (టేల్ ఆఫ్ టు సిటీస్),  యాకోవ్ పెరెల్మాన్ నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం లాంటి అనువాదాలు. ఇహ ఒరిజినల్ తెలుగువయితే చెప్పలేనన్ని. ఇవ్వన్నీ పదో తరగతి లోపే.   ఒథెల్లో  ఎవరు అనువాదం చేశారో గుర్తులేదు, కొంచెం గ్రాంథికంలా ఉన్నట్టు గుర్తు. కానీ పుస్తకంలో ఆ ఆఖరి సీన్ చదివాక ఓ వారం పాటు మామూలు మనిషిని కాలేక పోవటం ఇప్పటికీ గుర్తు. బహుశా వయసుకి మించిన పుస్తకమనుకుంటా అప్పటికి.

అలాగని అంతా గొప్ప సాహిత్యమే చదివాననుకోకండి.  గౌరిదేవిపేటలో చదివేటప్పుడు (ఆరు నించి పది) ఊళ్ళో ఓ ఎలిమెంటరీ స్కూలు టీచర్ ఉండేవాడు. క్యారంబోర్డు ఆడటం కోసమని చెప్పి వాళ్లింటికి చేరే వాణ్ణి.  ఆయన దగ్గర లేని డిటెక్టివ్ పుస్తకం ఉండేది కాదు. మధుబాబు పుస్తకాలు లెక్కలేనన్ని చదివాను ఆయన పుణ్యమాని.   నా చదువు వేగం పెరగడానికి మధుబాబు పుస్తకాలు ప్రధాన కారణం అని చెప్పాలి.  నిజం చెప్పొద్దూ,  ఆ డిటెక్టివ్ పుస్తకాలతో పాటు బూతు పుస్తకాలు కూడా ఉండేవి అక్కడక్కడా.   అలా అన్ని రకాల జంక్ పుస్తకాలు కూడా చదివేవాణ్ణి.

రేడియో బాల వినోదం  వినేవాళ్ళం.  పిల్లలనించి నాటికలు రాసిపంపమని అడిగేవాళ్ళు. ఓ రెండు నాటికలు అలా రాసి పంపిస్తే అవివచ్చాయి కూడా.  బహుశా అవి నా మొదటి రచనలు అనుకోవాలేమో.

ఆ తర్వాత రాజకీయ స్పృహ, సీరియస్ లిటరేచర్ చదవటం మొదలయ్యింది.  శ్రీశ్రీ, రావిశాస్త్రి, చలం నాకు త్రిమూర్తులు.   తర్వాత వీళ్ళకు దీటైన, మెరుగైన రచనల్ని చదివి ఉండొచ్చేమో గానీ, నా  సాహిత్య, ఆలోచనల ప్రయాణానికి పునాది వీళ్ళే.

అమెరికా వెళ్లి సాహిత్య వాతావరణం లో చర్చల్లో పాల్గొనటంతో మొదటి సారి సాహిత్యం గురించి అభిప్రాయాలు పంచుకోవడం మొదలయింది.  తెలుసా, రచ్చబండ లాంటివి నాకు దొరికిన గొప్ప అవకాశాలు.  ఆ వాతావరణమే నన్ను కథలు రాసేందుకు సన్నద్ధుణ్ణి చేసిందనుకోవాలి. ఎలావస్తుందో చూద్దాం అనుకుంటూ ఓ కథ రాయడం, అందరూ బానే రాశావు అనడంతో ఇంకోటీ అలా అలా ఈ పది పన్నెండు కథలూ రాశాను.  ఇప్పటికీ ఓ చెయ్యితిరిగిన రచయితని అని నా గురించి నాకు అనిపించదు.

US వెళ్ళడానికి ముందు, వెళ్లిన తర్వాత ఆ దేశం మీద అభిప్రాయం… 

అమెరికా వెళ్ళకముందు నాకు అక్కడిగురించి ఏమీ తెలీదు.  ఇప్పట్లా టి.వి, సోషల్ మీడియా లాంటివేమీ లేవు కదా!  నాకు రెండే రకాల అమెరికా అమెరికా తెలుసు. ఒకటి వామపక్ష సాహిత్యం ద్వారా చదువుకున్న  ప్రపంచ విలన్ అమెరికా.  నిజానికి కోల్డ్ వార్ లో మన దేశం USSR వైపు కాబట్టి మన మామూలు వార్తా ప్రపంచం కూడా కొంచెం అమెరికా  వ్యతిరేకంగానే ఉండేదనుకుంటా.  డబ్బులు, హింస, ప్రపంచ దాదా గిరీ.. ఇదీ అమెరికా అంటే.

రెండోది, కంప్యూటర్ సైన్స్ చదవటం మొదలెట్టాక ఎన్నిరకాల టెక్నాలజీస్ అక్కణ్ణించి వచ్చాయి, ఎలా గొప్ప గొప్ప పరిశొధనలు అక్కడి విశ్వవిద్యాలయల్లో జరుగుతాయి అని తెలియ రావడంతో ఆ దృష్ట్యా గొప్ప గౌరవం ఏర్పడింది.

పై రెండు కోణాల్లోనూ కనపడనిది అక్కడి మనుషులు ఎవరూ, ఎలా ఉంటారూ అనేది.   ఆ విషయం అక్కడికి వెళ్ళాక తెలిసింది.  మొదట్లో అంతా అయోమయంగా ఉండేది. కానీ మెల్లిగా అక్కడి వాళ్ల స్నేహాలు ఏర్పడ్డం మొదలయ్యాక పై, పై అలవాట్లు మాటలూ తప్పా అంతరాంతరాల్లో  మనుషులందర్లోనూ ఒకే సందేహాలూ, ప్రేమలూ, భయాలూ ఉంటాయని అర్థమయింది.  దాదాపు ఓ సంవత్సరం తర్వాత అనుకుంటా నాకు ఆ అనువాదం అలవాటయింది. ఒక సారి ఆ సమాంతర ఆలోచన మొదలయ్యాక నాకు వ్యక్తుల్ని దాటి  సాంఘిక, సామాజిక, రాజకీయ అంశాల్లోకూడా పై, పై పొరల కింద ఉన్న ఒకే రకమైన ఆలోచనా సరళి  అవగతమైంది.

ముఖ్యంగా కాలిఫోర్నియాలో  ఏ దేశం వాడవనీ, ఏ జాతి వాడవనీ unconditional గా తనలొ కలుపుకోయే ఆ సంస్కారం ముందు తలవంచి నమస్కారం పెట్టాల్సిందే.  సరే అదో పరుగో పరుగు సాంకేతిక ప్రపంచం. ఆ పోటీ, పనితనంతో మాత్రమే బతగ్గలగటం లాంటి చుట్టూ ఉండూ మంచీ చెడులు ఇప్పుడు మనం ఇండియా సిటీల్లొ చూస్తున్న కార్పొరేట్ సెక్టార్ కి భిన్నంగా ఏమీ ఉండదు.

అలాగే ప్రపంచ పటంమీద అమెరికా పాత్రమీద ఆ దేశంలోనే ఇంకా ఎక్కువ విమర్శ చేసే మేధావులూ, చెయ్యనిచ్చే  ప్రజాస్వామిక వాతావరణం ఉందని తెలిసొచ్చింది.  అలా  అంతకుముందున్న కొన్ని ఆలోచనలు మరింత బలపడ్డాయి

మీరు  అమెరికా  వెళ్లి,  మళ్లీ వెనక్కి వచ్చేటప్పటికి తెలుగు సమాజంలో మీరు గమనించిన మార్పు…   

చాలా మారింది.  లిబరలైజేషన్ కి ముందు అమెరికా వెళ్లి, లిబరలైజేషన్ తర్వాత తిరిగొచ్చాను కదా.   ఇక్కడ జరిగే మార్పులన్నీ తెలియవని కాదు.  వార్తలు చదవడం వేరు, బతకడం వేరు కదా.

ముఖ్యంగా మధ్యతరగతి అంతకుముందు మరింత బాధ్యతగా ఉండేది అనిపించింది.  మొత్తం సమాజానికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడే మధ్యతరగతి యువతరం ఒకటుండేది. అది extreme left నించి extreme right దాకా, సైధ్దాంతిక వైరుధ్యాలున్నా వీళ్ళు మొత్తం జనాల గురించి మాట్లాడే వాళ్ళు.  ఆ మధ్యతరగతి, ఆ యువకులు పూర్తిగా అదృశ్యమయి పోయారు.

వాటి స్థానంలో కొత్తగా వచ్చిన కార్పొరేట్ ప్రపంచం, అమెరికా ఆశలు, తయారవుతున్న కోట్ల కోట్ల సంపదలో ఎంత ఎలా ఒడిసి పట్టుకుని ఎంత త్వరగా మధ్యతరగతి దాటి ‘నియో రిచ్’ తరగతిలోకి పోతామో అన్న తపన ఒకటి తయారయింది.

అ వెర్రిలో సైన్సు, ఇంజనీరింగ్ తప్పా మిగతా చదువులూ, కళలూ, రాజకీయాలూ, స్పృహ అలాంటి వన్నీ అనవసరమనే ఒక ఆలోచన ప్రభుత్వాల్లో ఉండే పెద్దలనించి చదువుకునే పిల్లల దాకా స్థిరపడిపోయింది.  వీటన్నింటినీ కలిపి ‘కెరీర్’ అనేశారు.  అమెరికాలో ‘కెరీర్’ అంటే ‘బాధ్యతా రాహిత్యం’ అని అర్థం కాదనుకుంటా!

చదువుకునే వాడు పూర్తిగా స్వార్థంతో ఆలోచించడం  ఏదో అపరాధం చేస్తున్నట్టుగా ఉన్నవాతావరణం, నేను తిరిగొచ్చే టప్ప టికి స్వార్థంగా ఆలోచించలేక పోవడం అసమర్థతగా, చెడిపోవడంగా, టైం వేస్ట్ గా తయారయాయి.

ఇహ నగరాల్లో  మాత్రమే జరిగిన అభివృద్ధి, ఇన్ఫ్రా స్ట్రక్చర్ లాంటి వాటికి లబ్దిదారుల్లో నేనొక్కణ్ణి.  ఆ కన్ఫ్యూజన్ ని చెప్పే  ప్రయత్నమే గేటెడ్ కమ్యూనిటీ కథ.

ప్రవాస కథల్లో నాస్టాల్జియా, తలపోతలు యెక్కువగా వుంటాయనివుండేవనీ  వో  అభిప్రాయం వుంది. మీ  కథల్లో ఆ తలపోతలు మరీ  యెక్కువగా వుండవు. చాలా కాంటెంపరీగానే వుంటాయనిపుస్తుంది.  అదెలాసాధ్య పడింది?

మిగతా వాళ్ల కథల్లో నాస్టాల్జియా ఎక్కువ వుంది అనేది సరయిన ఆలోచన అవునో కాదో నేను చెప్పలేను.  ఎందుకంటే తెలుసా, రచ్చబండ లాంటి గ్రూపుల్లో అలాంటి తలపోతల రచనల మీద పెద్ద సానుభూతి ఏమీ ఉండేది కాదు.  అయితే గ్రూపు చర్చల్లొ  చిన్ననాటి గుర్తుల్నీ, జ్ఞాపకాలనీ పంచుకోవడం ఉండేది కానీ అదేదీ సాహిత్యమనుకునే అపోహ ఆ గ్రూపుల్లో ఉన్నవాళ్ళకి ఉందని నేననుకోను.

అయితే  ప్రవాస సాహిత్యం 1995  కి ముందు చాలా ఉండింది.  అందులో నువ్వన్నట్టు ఈ తలపోతల సాహిత్యం ఏమన్నా ఎక్కువగా ఉందేమో నాకు తెలీదు.

నా కథల్లో నాస్టాల్జియా గురించి ఎక్కువ లేకపోవడానికి ఆ తెలుసా, రచ్చబండ చర్చలు కారణం కావచ్చు.  ఆ రచనల పట్ల సానుభూతి బాగా చదువుకున్న వాళ్లలో లేదనీ, ఉండదనీ నాకు మొదటి కథ రాయకముందే తెలిసింది.

పైగా నేను ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, ఒక్కొక్క ప్రపంచాన్నీ దాటుకుంటూ వెళ్తున్న వాణ్ణి.  కొత్త  స్థలాన్ని, కొత్త ప్రపంచాన్ని, కాలాన్ని  జడ్జ్ చెయ్యకుండా అర్థం చేసుకోవాలి అనే adaptive  స్పృహ నా survival instincts లోంచి వచ్చి ఉండాలి.

అలాగని నా కథల్లో నాస్టాల్జియా లేదని అంటే అందరూ ఒప్పుకోరేమో!  అంటుకొమ్మ, గేటెడ్ కమ్యూనిటీ కథల్లో చాలా ‘పాత’  కొంత వాచ్యంగా కొంత సటిల్ గా ఉంటుంది.  కాకపోతే దాన్ని కాంట్రాస్ట్ కోసం వాడాలి అనే ప్రయత్నం చేశాను కాబట్టి అంత తలనెప్పి తలపోత అనిపించలేదేమో నీకూ, పాఠకులకీ.  అది నిర్ణయించాల్సిన న్యాయనిర్ణేతలు పాఠకులే కదా!

మీ  బ్లాగు గురించి చెపుతారా… 

ఫేస్ బుక్ లాంటివి వచ్చాక బ్లాగుల అవసరం అంతలేదు.  ఇంతకు ముందు మన ఆలోచనల్ని ఒకచోట ప్రోది పర్చాలంటే బ్లాగే మార్గం.   సాహిత్య గ్రూపుల్లో జరిగే చర్చల్లో ఒక్కోసారి చాలా ఆలోచించి, మథనపడి, క్రోడీకరించి  కొన్ని రాసేవాణ్ణి.  వాటిని ఆ చర్చముగిశాక పోగొట్టుకోవడం నచ్చేది కాదు.  వాటిని మళ్లీ కొన్నాళ్ల తర్వాత చదివితే ఎలా ఉంటుందో తెలియాలంటే అవ్వన్నీ ఒక చోట ఉండాలి. అందుకే  after3beers.com అని ఒక డొమైన్ రిజిస్టర్ చేసి  ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ రాయడం మొదలు పెట్టాను.

ఇంగ్లీషు బ్లాగు పూర్తిగా ప్రొఫెషన్ కి సంబంధించింది.  టెక్నాలజీ, మేనేజెమెంట్ విషయాల్లొ నా అవగాహన, అభిప్రాయాలూ,  నేను కాన్ఫరెన్సుల్లో మాట్లాడినవీ అక్కడ  పిజర్వ్ చేశాను. అది కొంచెం జూనియర్స్ కి ఉపయోగపడాలి అనే ఉద్దేశం.

తెలుగులో telugu.after3beers.com లో ‘మూడుబీర్లతర్వాత’ అనే టాగ్ తో నడిపాను. అందులో నేను తెలుగులో రాసిన దాదాపు అన్ని రచనలూ ఉన్నాయి.  మొన్నటిదాకా నా కథలు కూడా అక్కడ పెట్టాను.  ఈ పుస్తకం బయటకి తేవాలనుకున్నప్పుడ మాత్రం కథలు తీసేశాను.

నేను రాసిన మొదటి కథ మూడు బీర్ల తర్వాత. అందులో బాగా తాగేసిన ఒక ప్రొఫెషనల్ చుట్టూతా ఉన్న హిపోక్రసీని ఎండ కడుతూ ఉంటాడు.  అదే స్పిరిట్ తో నా బ్లాగులో ఏ హిపోక్రసీ లేని నిజాయితీ ఆలోచనల్ని పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ పేరు పెట్టాను బ్లాగ్ కి.  అందుకే ‘తలకాయకీ, గుండె కాయకీ సమన్వయం కుదిర్చే వృథా ప్రయాస’ అనే ట్యాగ్ లైన్ కూడా చేర్చాను.

ఇప్పుడు ప్రొఫెషనల్ ఆలోచనలన్నీ ఇంగ్లీషులో linkedin note  లానూ, తెలుగు ఆలోచనల్ని facebook note లానూ ప్రస్తుతం రాస్తున్నాను.  మళ్లీ వాటిని బ్లాగులో పోస్ట్ చేస్తున్నాను గానీ, ఆ బ్లాగు ఇంకా అవసరమా అనిపిస్తొంది.

యిండియా తిరిగొచ్చాక రాసిన కథలమీద యిక్కడి ప్రభావం. కథల్లో మార్పులు

వెనక్కి వచ్చాక నేను చూసిన మార్పులు ఎలా నా చేత గేటెడ్ కమ్యూనిటీ కథ రాయించిందో ఇంతకు ముందే చెప్పాను.

అలాగే ఇక్కడి సాహిత్య సమూహంతో పరిచయం కూడా నా కథల మీద ప్రభావం చూపింది.  అమెరికా సాహిత్యం సమూహం  ఎక్కువ బుర్రతో అలోచించేట్టు చేస్తే,  ఇక్కడి సాహిత్య సమూహం నన్ను గుండెతో ఎక్కువ ఆలోచించేట్టు చేసింది.  రెండు వాతావరణాల్నీ అర్థంచేసుకునే అవకాశం దొరికిన చాలా అదృష్టవంతుణ్ణి నేను.

అప్పటిదాకా నేను కార్పొరేట్ నేపథ్యం ఉన్న కథలే రాశాను.  ఇక్కడి ప్రపంచం గురించి ఇక్కడ లేకుండా రాసే సాహసం నేను చెయ్యలేదు.   ఇక్కడి జీవితం గురించి అక్కడ కూర్చుని రాసిన కథల్ని‘తలపోతలు’ గా  ఇక్కడి వాళ్ళు అభివర్ణించడం నాకు తెలుసు.  అలాగా ఇక్కడ కూర్చుని అక్కడి భారతీయుల జీవితాల పట్ల జాలి చూపిస్తూ రాసిన కథల్ని  చూసి అక్కడ ఎంత నవ్వుకుంటారో కూడా తెలిసిన వాణ్ణి, నవ్విన వాణ్ణి.  అందుకే మనం ఉన్న జీవనం పట్ల  అనుభూతి ఉంటే తప్పా రాయకూడదు అని నమ్ముతాను. అందుకే  తిరిగొచ్చాక  రమాదేవి ఎందుకు రమ్మంది, జంధ్యం లాంటి కథలు రాయ గలిగాను.

మనం  క్లోజ్  ఫ్రెండ్స్ మి.  కొన్ని  విషయాలని  దగ్గరగా  గమనించిన  స్నేహితురాలిగా  అడుగుతున్నా…  మీ రాతల్లోనూ, ప్రవర్తనలోనూమీ జీవనం లోనూ వొక క్లారిటీ ఆఫ్ థాట్ వుంటుంది. చేసే పని కూడా ఫోకస్డ్ గా వుంటుంది. కథలు కూడా. యెలా వచ్చింది అంత క్లారిటీ ఆఫ్ థాట్ గానీ ఫోకస్ గానీ?

అవునా!  నాగురించి ఇలాంటి అబ్జర్వేషన్ వినడం చిత్రంగా ఉంది.  నాకు నేను చాలా కన్వ్యూజ్డ్ అనే అనుకుంటాను.

బహుశా నా లిమిటేషన్స్ నాకు బాగా తెలుసనుకుంటాను.  నామీద నాకేమీ పెద్ద అపోహలు లేవు.    ఎలాగంటే,  నువ్వు ఎవరెస్ట్ ఎక్క గలవా అంటే ‘లేదు’ అని చెప్పడం సులభం. వీధి చివరి దాకా నడవ గలవా అంటే ‘అవును’ అని చెప్పడం కూడా సులువు.  ఆ రెంటి మధ్యలో ఎక్కడో ఓ గీత ఉంటుంది మనం దాటి పోలేనిది.  దాని పట్ల మనకి నిజాయితీగా ఓ స్పృహ, ఓ అంచనా ఉండాలి.  అప్పుడు జీవితం చాలా సులువవుతుంది. అసంతృప్తి, అశాంతి లాంటివి ఉండే అవకాశం తగ్గుతుంది.

రచయితగా చూసుకుంటే, నేను గొప్ప రచయితల సరసన చేరలేను అని నాకు తెలుసు.  అలాగే  నిజమయిన మనుషులూ, సంఘటనలూ లేని పిచ్చి కథలు కూడా నేను రాయను అని నాకు తెలుసు.  ఆ మధ్యలో ‘కొన్ని మంచి కథలు’ రాయగల ననేది నా మీద నా అంచనా.

అలాగే నా ప్రొఫెషన్లో  నేను నేర్చుకున్నవి నా బతుకులోనూ, రచనల్లోనూ కూడా ఉపయోగ పడ్డాయి.   మేం చేసే ప్రాజెక్టుల్లో బోలెడన్ని అయోమయాలు (uncertainties) ఉంటాయి.  అన్నీ క్లియర్ అయ్యాక మొదలెడదామంటే ఏ పనీ ఎప్పటికీ అవదు. ఆ అయోమయాల మధ్యలోంచే చిన్న చిన్న క్లారిటీలు వెతుక్కుంటూ ఒక్కొక్క పనే చేసుకుంటూ వెళతాం.   ఒకసారి దీనికి అలవాటు పడితే బతకడంలో కూడా ఇలాగే ప్రయత్నించొచ్చు.  అందుకే ఏదొచ్చినా కొంపలంటుకు పోయినట్టు నేను గగ్గోలు పెట్టను.  అదేదో నాకు చాలా  క్లారిటీ ఉందనో, ధైర్యం ఉందనో కాదు.

మీ వ్యక్తిగత జీవితంలోని  యిద్దరు స్త్రీల  పాత్ర గురించి  మనం  చాల సార్లు  మాటాడుకొన్నాం.  మీ  జీవితానికి  కథలకి  సంబంధించిన    జీవాధార  నాకు చాల యిష్టం. మీకు  అభ్యంతరం  లేకపోతే  పాఠకులతో  పంచుకొంటారా, అక్కి. 

అసలు మొదలు నేను అమ్మ కూచిని.  స్వర్ణ (మా అవిడ) ఇప్పటికీ అమ్మకూచి అని నన్ను ఏడిపిస్తుంది.  మా అన్నయ్య చిన్నతనం లోనే చదువుకి బయటికి వెళ్లి పోవడంతో పెరిగిందంతా అక్కతోటే, దాంతో గొడవ పడుతూనే.   ఏమయినా వాళ్లిద్దర్నీ నేను దబాయించేసే వాణ్ణి.  నా అంత చదువూ చదివి, నగరంలో పెరిగి, నాకన్నా ప్రపంచజ్ఞానం ఎక్కువ తెలిసిన  స్వర్ణ  నా జీవితంలోకి వచ్చాక నాకు బుద్ధిగా ఆగి వినాల్సిన అవసరం వచ్చింది.  తన కన్నా నాకు పుస్తక జ్ఞానం ఎక్కువ.  కానీ స్వర్ణకి ప్రపంచం తెలుసు. భీభత్సమైన ప్రాక్టికల్.   ఏదయితే నాదగ్గరలేదొ, అది స్వర్ణ పట్టుకొచ్చింది.  అందుకే ఇంటికి సంబంధించిన చాలా నిర్ణయాలూ పన్లూ తనే చేస్తుంది.  నేను తన వెనక నడవడమే, కథలూ కాకరకాయలూ రాసుకుంటూ.   వ్యక్తిగతంగా నాకున్న చాలా పెద్దబలం తను.  అలాగని నా తిక్క ఏం తక్కువ కాదు. చాలా మనస్పూర్తిగా కొట్టుకుంటాం అప్పుడప్పుడూ!

ఇహ భావన. అదొచ్చిన తర్వాత దాని చుట్టూతానే మా ప్రపంచం.  చిన్నప్పట్నించీ కథలూ పుస్తకాలూ చదవటం దానికీ అలవాటయింది.  ఇంట్లో ఆ వాతావరణం ఉండటం కారణం కావచ్చు.   నాలాగే మొండిది.  కానీ నాకున్న అయోమయం కాకుండా, స్వర్ణకి ఉన్న క్లారిటీ వచ్చింది దానికి.  దానికేంకావాలో దానికి ఖచ్చితంగా తెలుసు.  అలాగని పూర్తిగా స్వార్థపరురాలు కాదు అని నమ్ముతాను.

ఇంట్లో ప్రిన్సిపుల్ ఏంటంటే ఎవరికి వాళ్లకి వాళ్ల సొంత  స్పేస్ ఒకటి ఉంటుంది అని.  అలాంటి గీత  దంపతుల మధ్యా,  పిల్లలకీ పెద్దలకీ మధ్యకూడా ఉంటుందని ఒప్పుకోవాలి, నమ్మాలి.  బహుశా అమెరికా నేర్పించిందేమో ఇది మాకు.  అందుకే మేము బయటికి ఒకే యూనిట్ లా కనపడతాం. మా మధ్యలో ఉండే గీతలు మాకు స్పష్టంగా తెలుసు.

నువ్వడిగావని చెప్పడం తప్పా, మేమేదో ఓ గొప్ప ఆదర్శ కుటుంబమనో ఇంకోటో అనో అపోహలేమీ లేవు.  అందర్తో మంచిగా ఉండాలని ప్రయత్నించే  ఓ మామూలు హాపీ ఫామిలీ! స్నేహితులకి ముగ్గురం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంతే!

Thank you  అక్కి,  ఆదర్శ కుటుంబమంటే  యింట్లో యెవరికి వాళ్లకి వాళ్ల సొంత స్పేస్ వొకటి వుంటుంది అని,  అలాంటి గీత దంపతుల మధ్యా,  సహచరుల  మధ్యా,  పిల్లలకీ పెద్దలకీ మధ్యకూడా  వుంటుందని, వుండాలని  బలంగా  నమ్మి అలాంటి  కథలు  రాసిన  నాకు  అలాంటి  వాతావరణం  మీ  ముగ్గురి  మధ్య  వుంటూ మన స్నేహితుల మన్సుల్లోకి  ఆ  జీవనసారం ప్రవహించటం  తెలుసు  నాకు . యీ  అంశం  యెంత  వ్యక్తిగతమో  అంత  సామాజికం  కూడా.  అందికే  అడిగా.

అక్కి రుతువుకోసారైనా  కథ  రాయాలని  కోరుకొంటూ, మరోసారి  హృదయ  పూర్వక  శుభాకాంక్షలు.

*

 

కుప్పిలి పద్మ

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • .మంచి చర్చ. ఆయన చెప్పిన ఈ మాటలు నాకు నచ్చాయి “వాటి స్థానంలో కొత్తగా వచ్చిన కార్పొరేట్ ప్రపంచం, అమెరికా ఆశలు, తయారవుతున్న కోట్ల కోట్ల సంపదలో ఎంత ఎలా ఒడిసి పట్టుకుని ఎంత త్వరగా మధ్యతరగతి దాటి ‘నియో రిచ్’ తరగతిలోకి పోతామో అన్న తపన ఒకటి తయారయింది.

    అ వెర్రిలో సైన్సు, ఇంజనీరింగ్ తప్పా మిగతా చదువులూ, కళలూ, రాజకీయాలూ, స్పృహ అలాంటి వన్నీ అనవసరమనే ఒక ఆలోచన ప్రభుత్వాల్లో ఉండే పెద్దలనించి చదువుకునే పిల్లల దాకా స్థిరపడిపోయింది. వీటన్నింటినీ కలిపి ‘కెరీర్’ అనేశారు. అమెరికాలో ‘కెరీర్’ అంటే ‘బాధ్యతా రాహిత్యం’ అని అర్థం కాదనుకుంటా!”

    మధ్యతరగతి యువతీ యుకులు సాధరణంగా సమాజంలో జరిగే అన్యాయాలను వ్యతిరేకించే వారని అంటుంటారు . కానీ ప్రస్తుతం రాజ్యంలో జరుగుతున్న మత రాజకీయాలు, వాటి వెనక దళితులనూ, ముస్లింలనూ పెట్టే హింసకు వ్యతిరేకత కనిపించకపోవడం. వ్యతిరేకిస్తున్న రచయతలనూ . లయర్లనూ , 90 శాతం వికలాంగులయిన సాయిబాబా గారిని అండ సెల్ లో పెట్టి హింసించిడమూ కూడా మధ్యతరగతిని కదిలించకపోవడం, అలా ప్రశ్నించే వారి మోద దేశద్రోహం నేరం మోపదమూ కూడా వీరిని కదిలించకపోవడం బాధ కలిగిస్తుంది.

    • మీ అభిప్రాయం పంచుకొన్నందుకు కృతజ్ఞతలు సర్.

  • ఒక జీవితాన్ని చదివినట్లు ఎంత బాగుందో కదా!
    అమెరికా పట్ల ఇండియా పట్ల స్పష్టమైన అభిప్రాయం ఉండటం చాలా అరుదు. అదీ తొంబై లకు ముందు వెనుక అన్నట్లు మార్పులు చర్చి ంచడం…!

    • Thirulapalu గారు, అవును జీవితాలని పట్టుకొన్న రచయిత అతను.
      మీ అభిప్రాయాన్ని చదవటం నాకు బాగుంది. Thank you very much.

  • చాలా బావుంది, కథకుడ్ని, ఆయన రచన నేపధ్యాన్ని చక్కగా పట్టిచ్చిన ఇంటర్వ్యూ.
    మూడు బీర్ల తర్వాత టైటిలే నాకెందుకో మొదట నచ్చలే, అక్కిరాజు గారు చెప్పినట్లు ఇదేదో కార్పోరేట్ కథలే అనుకున్నాను పద్మగారూ. ఈ ఇంటర్వ్యూ చదివాక కథలూ చదవాలి అనిపిస్తోంది.

    • డాక్టర్ నూకతోటి రవికుమార్ garu, ఆ పేరుతో కథ వుంది. చదవండి వీలుచూసుకొని. యెన్ని ఆలోచనలు యిస్తాయో చూడండి.
      మీకు యీ సంభాషణ నచ్చినందుకు నాకు సంతోషం కలిగింది.
      Thank you very much అండి.

  • Clarity of thought గురించిన ప్రశ్న, జవాబు రెండూ బాగున్నాయి

    • Sailaja Kallakuri గారు, మీకు ఆ ప్రశ్న జవాబు నచ్చినందుకు, పంచుకొన్నందుకు మీకు కృతజ్ఞతలు.

  • చక్కటి ఇంటర్వ్యూ. మూడు బీర్ల తర్వాత బ్లాగు చాలా ఏళ్ళ క్రితమే తెలిసినా, రచయిత గురించి పెద్దగా తెలియదు. ” అందుకే మనం ఉన్న జీవనం పట్ల అనుభూతి ఉంటే తప్పా రాయకూడదు అని నమ్ముతాను.” , “నాకన్నా ప్రపంచజ్ఞానం ఎక్కువ తెలిసిన స్వర్ణ నా జీవితంలోకి వచ్చాక నాకు బుద్ధిగా ఆగి వినాల్సిన అవసరం వచ్చింది” లాంటి కొన్ని జవాబులు రచయిత మీద గౌరవాన్ని కలిగించాయి. నేలమీద నడిచే మనిషిలా అనిపించారు.

    దాదాపు కథలన్నీ బ్లాగులో ఇంతకూ ముందే చదివినా, పుస్తకం కొని మళ్ళీ చదువుతాను.

    • పద్మవల్లి గారు, మీకు నచ్చినందుకు మీరు ఆ విషయాన్ని పంచుకోన్నందుకు భలే ఆనందంగా వుంది.

      “నాకన్నా ప్రపంచజ్ఞానం ఎక్కువ తెలిసిన స్వర్ణ నా జీవితంలోకి వచ్చాక నాకు బుద్ధిగా ఆగి వినాల్సిన అవసరం వచ్చింది” – నాకు బోలెడంత నచ్చింది. స్వర్ణ గారిని నా హీరోయిన్ అంటాను.

      కథలు మీకు నచ్చుతాయని ఆశిస్తాను.

      Thank you very much Padmavalli garu.

  • One of the best best interviews I have read in the recent past. I know Akki for over 15 years and every word he spoke here shows how down to earth this man is. Maadi Goppa Aadarsha kutumbamemi kaadu antune oka Aadarsha kutumbamante ilaage undali anipinchindi thana chinna kutumbam gurinchi chadivinappudu. Hats off Akki buddy. I know you know that I am not a great reader but I will surely read all the 11 stories. Who knows, after all, you might inspire someone to write… Would love to see you writing more.

    • Madhav garu, మీకు నచ్చినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
      కథలు చదివాక మీకూ వో కథ రాయాలనిపించాలని కోరుకుంటున్నా. కథలు చదవటం నాకిష్టం.

      సో… యెదురు చూస్తాను మీ కథ కోసం. All the best Madhav garu.

  • ఎన్నో కొత్తవిషయాలు తెలిసాయి. ముఖాముఖి పూర్తయ్యాక అక్కిరాజు గారి కధలు తప్పక చదవాలనిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు