నిన్ను నన్ను భూమ్యాకాశాలుగ చెప్పినప్పుడు
నిజంగా నేను తెలుసుకోలేకపోయాను
సుదూర తీరాన అక్కడెక్కడో
నీవు నేను
ఒకటిగా కలిసున్నట్టుగానే కనపడుతుంది
తీరా ఆ తీరానికి చేరితే
మళ్ళీ ఇంకో తీరాన కనిపిస్తావు
అంతే – ఎక్కడ ఒక్కటిగా కనపడుతామో
అక్కడికి వెడితే
మొదటగా చూసినప్పటి దూరమే
ఇదంతా భ్రమే…
అయినా
అక్కడెక్కడో ఇద్దరం
ఒక్కటిగా కనపడుతున్నామనే ఊహా
ఎంత ఊపిరిని చేర్చుతుందో
ఈ జీవితానికి
తేనెక్కువగా తాగితే
మత్తెక్కుతుందని మనుషుల మాట
నీ ప్రేమనంతగా తాగుతున్నపుడు
సోయిలేకుండా నా కళ్ళు మూతలు పడ్డప్పుడే
ఆ తీపి మత్తు మాయ ఎరుకైంది నాకు
నది నీటి పారుకపు కోత గురుతే
అదేడకుజేరి ఆగిపోయిందనే సోల్తి తెల్వడానికి
ఆ ఆనవాలుగ నేనుండడానికి
ఎన్ని జీవితకాలాలైనాకాని
నీ ప్రేమ పారకపు కోతను
ఓపికగా ఓర్సుకుంటా
నీవు నేను
పూలు దారమోతిగా కలుసున్నమంటే
నేనేమీ చెప్పలేను
కానీ
దారానికంటుకున్న పూలవాసన తీరు
నా జీవితాన నీవని
పూల మీద ఒట్టేసి చెప్పుదును
ప్రేమా…
దూపయ్యే ఆళ్లకు
గొంతు తడుపుకునే నీళ్ల తావు నువ్వు
ఆకలేలకు
కడుపు నింపే తీపన్నం తీరు నువ్వు
ఊపిరాగేటాళ్లకు
జీవం బోసే జీవగంజి నువ్వు.
*








Add comment