నిశ్శబ్దాన్ని జయించిన కథ

మల్లీశ్వరి గారి ఇటీవలి కథ సుక్ర బల్ముచు మళ్ళీ ఒకసారి సాహిత్య ప్రయోజనానికి సంబంధించిన  చర్చను లేవదీసింది. రచయిత రాసిన అంశాలను కాక చదువరులు కొందరు వారి ఆకాంక్షలను ఈ కథలో వెతికి కొంత నిరాశకు లోనైనట్లు ఇటీవలి చర్చలు చెబుతున్నాయి. ఆ చదువరులలో కొందరు సాహిత్య పండితులూ, సాహిత్య విమర్శకులూ, అభ్యుదయం మార్గదర్శకంగా ఆలోచించే మేధావులూ ఉండడం సంతోషాన్ని కలిగించే విషయం. ఇంత చర్చకు అవకాశమిచ్చిన ఆ కథలో ఇంతకూ ఉన్నదేమిటి?

ఇటీవలి కాలంలో బహుళ చర్చకు దారితీసిన కథ కనుక కొంచం సావకాశంగానే ఈ కథను పరిశీలిద్దాం. ఏదైనా ఒక సాహిత్య ప్రక్రియను పరిశీలించేందుకు విమర్శకులు ఆ సాహిత్య ప్రక్రియకు సంబంధించిన స్థల కాలాల విచికిత్సనూ  పరిశీలిస్తారని గత ప్రామాణిక విమర్శకుల విమర్శల ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. ముందు ఈ కథ స్థల కాలాలను పరిశీలించి తర్వాత కథావిషయాన్ని చూద్దాం.

కథ కాలం సమకాలీనం. స్థలం నూతనంగా రైల్వే శాఖ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ఆధునీకరణ విస్తరణ జరుగుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతం. కథలోని పాత్రలు అక్కడ పనిచేస్తున్న కూలీలూ కూలీ మేస్త్రీలూ గుత్తేదారులూ పోలీసులూ పత్రికా విలేకరులూ. కూలీలలో అక్కడి గిరిజన ప్రాంతం నుండి వచ్చిన వారూ ఉన్నారని కథలోని ప్రధాన పాత్రద్వారా మనకు తెలుస్తుంది.

బురుబొంగా అనే కొండ దేవుడిని కొలిచే పూర్వీకుల ఆత్మల పండుగ ప్రస్తావన ప్రధాన పాత్ర కలలోకి రావడంతో కథ మొదలవుతుంది.

ప్రధాన పాత్ర కలలో ఉత్సవ వాయిద్యాల శబ్దాలనూ,  ఇద్దరు పిల్లలు ఎగురవేస్తున్న గాలిపటాలనూ, వెయ్యి గూడ్సు పెట్టెలంత ఉన్న గాలిపటాల తోకలనూ, తల వంచుకుని మొవా పూలను ఏరుకుంటున్న ఒక స్త్రీనీ, కొండమీది జంతువులనూచెట్లనూ లక్షచేతులతో జవురుకుంటూ భూమినుంచి ఆకాశం వరకూ శివాలెత్తుతున్నపర్వతపు ఆత్మ బురుబొంగా అని పిలవబడే కొండ దేవుడినీ చూస్తాడు.

కలలో బురుబొంగా‘పూర్వీకుల ఆత్మల సంచారానికి ఇంకా రావేమిరా’ హూంకరిస్తాడు.

పొలికేకలు పెడుతూ నిద్రలోనుంచి ఒక్క ఉదుటున లేస్తాడు లైన్ మాన్ సుక్ర.

కథాప్రారంభంలో రచయిత చిత్రించిన వాతావరణంలో ఇద్దరు పిల్లలూ, తలవంచుకుని మొవా పూలను ఏరుకుంటున్న స్త్రీ, గూడ్సు పెట్టెలూ, సుక్ర ఇహ లోకపు వాస్తవికతను చిత్రిస్తే, అడవి జీవులనూ ప్రకృతినీ  లక్షచేతులతో జవురుకుని కాపాడే కొండ దేవుడు బురుబొంగా పారలౌకిక ఊహను ధ్వనిస్తారు. కథలోని విష్కంభాన్ని రచయిత కథ ప్రారంభంలోనే సూచించడం కథా రచనపై రచయితకు ఉన్న పట్టును తెలియజేస్తుంది.

సుక్ర. ఆలోచనలు  చిన్నచిన్న ఆలోచనలు. ఊరు, కొండ, పెళ్ళాంపిల్లలు, దైవికశక్తులు, రైలుపట్టాలు, పోల్స్ అతడి జీవితానుభవం అంతే. అడవి మధ్యన ఉండే వూరు, ఊరిని శాసిస్తాయని అతడు నమ్మే దైవిక శక్తులూ, తన జీవితంలో భాగమైన భార్యా పిల్లలూ అంతే.

ఆధునిక నాగరికత అడవిని మైదానంలోకీ మైదానాన్ని అడవిలోకీ ఉదృతంగా ప్రవహింపజేస్తున్న రోజులివి. మైదాన ప్రాంత జీవితం వారికి ఇంకా అర్థం కాని ఒక మాయే. వారికి మేలు చేసిన మనుషులే వాళ్లకు దేవుళ్ళు. రూపాయి విలువ ఇంకా పూర్తిగా తెలియని సమాజంలోనుండి వచ్చిన సుక్రకు తెలిసింది ఆకలి ఒక్కటే. అడవి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మైదానంలోకి ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన గిరిజనుడతడు.

ఆకలి తీరకుండానే పనిలో పడిన సుక్ర హటాత్తుగా తను ఎక్కిన కరెంటు స్థంభం నుండి కిందపడి ప్రాణం విడుస్తాడు.

అక్కడ ప్రమాదాన్ని చూసిన దండాసి సుక్ర నడుముకు ఉన్న తెగిపోయిన నడుంబెల్టునిసుక్రశరీరం నుంచి వేరుచేసి “అన్నియ్యా నన్ను చమించు, నాకోసంగాదు, అందరికోసం ఇలగసేసాను, చమించు అన్నియ్యా”  అని సుక్ర కాళ్ళు పట్టుకుని బతిమలాడడం కథను మరింత సున్నితంగా మార్చే అంశం.

గుత్తేదారు ప్రఫుల్ల అందరు గుత్తేదార్లలాగే లాభాలకోసం పని చేస్తున్న మనిషి. పనుల జాప్యం, సకాలంలో నిధుల విడుదల కాకపోవడం, అధికారుల అజమాయిషీలూ అతడిని ఊపిరి సలపనివ్వని ఆర్ధిక స్థితిలోకి నెట్టడం ఒక సాధారణ అంశం. అదనంగా పనిచేసే కార్మికులకు ఎదురయ్యే ప్రమాదాలు ఇంకా చికాకు పరుస్తాయి. ప్రఫుల్ల ఇప్పుడు అలాంటి సంకటంలో పడ్డాడు. తన చేతిలోని రెండు లక్షలు తప్ప వేరే వనరు లేదు. భార్య బంగారం తనను అవసరాలకు ఆదుకోదు. కొడుకు తను వద్దంటున్నా తన దారిలోకే వస్తానంటున్నాడు.

ప్రమాద స్థలానికి చేరుకున్న గుత్తేదారుకు లేబర్ మేస్త్రీ కుశరాజూ అతడితో పాటు ఒక విలేఖరీ కనిపిస్తారు. విలేఖరి బెదిరింపులను డబ్బుతో ఎదుర్కుంటాడు గుత్తేదారు కొడుకు సంతోష్.

కుశరాజు ద్వారా పరిహారబేరం కుడుర్చుకోవాలనుకుంటాడు యజమాని. ఎంత కావాలో చెప్పమని సుక్రభార్యనూ తండ్రినీ అడుగుతాడు కుశరాజు. నాగరిక సమాజపు ఆర్ధిక విషయాలు తెలియని కుటుంబం తమ లెక్కలు తాము వేసుకుని కొంత మొత్తం చెబుతారు. ఆ బేరం చూసి కుశరాజూ, యజమాని కూడా ఆశ్చర్యపోతారు. ఆ కుటుంబం అడిగినంతా ఇస్తారు. అడిగిన దానిని తగ్గించకుండా ఇచ్చినందుకే సంతోషపడుతుంది ఆ కుటుంబం. యజమాని కొడుకు అదనంగా కొంత మొత్తం ఇవ్వడంతో సుక్ర కుటుంబం యజమాని పట్ల చూపే కృతజ్ఞత రచయిత మాటల్లోనే.

“ఊహించని ఆ ఔదార్యానికి కొండ కరిగినట్లు జలజలా రాలింది దామి. ఆపళంగా పిల్లలిద్దర్నీ ప్రఫుల్ల పాదాలమీద పడవేసి మొక్కించింది. చేతులు మొహంవరకూ చేర్చి పరిపరివిధాల దండాలు పెట్టింది. దామితండ్రి ప్రఫుల్ల తలమీద చేయిఉంచి రాగయుక్తంగా మంత్రాలు చదివి ఆశీస్సులు ఇచ్చాడు”.

దండాసి మాత్రం తనుచేసిన పనికి పశ్చాత్తాపంతో బాధపడుతూనే ఉంటాడు.

ఇప్పుడు కథాకథనాన్ని గమనిస్తే రచయితకు ఈ కథావిషయం పట్ల ఉన్న దృక్పథం తెలుస్తుంది. “నన్ను కలవరపెట్టిన మరణాల చుట్టూ ఉన్న గ్రే ఏరియాలని పట్టుకునే క్రమంలో రాసిన కథ. ‘సుక్ర బల్ముచు’” అంటారు రచయిత.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు కథ అంటే ఏమిటి? కథను రచయిత చెప్పిన తీరు ఏమిటి? కథలోని పాత్రల పరిధులూ పరిమితులూ ఏమిటి? రచయిత తన కథనంలో  పాత్రల సహజ ఔచిత్యానికి తగినట్లుగా చిత్రించారా లేక తన ఊహలోని ఉదాత్తతను కథగా మార్చే ప్రయత్నం చేశారా? ఈ కథ చెప్పడంద్వారా రచయిత పాఠకులనుండి ఆశిస్తున్న స్పందన  ఏమై ఉంటుంది?

ఒక రచనలోని పాత్రలకు ఆపాత్రల  పరిసరాలనుండీ జ్ఞానం నుండీ అనుభవం నుండీ వచ్చే ఔచిత్యం కాక రచయిత ఔదార్యం ఆ పాత్రల చిత్రణను నిర్దేశిస్తే రచయిత ఆ పాత్రలకు అన్యం చేసినట్లే.

ఒక రచయిత ఒక కాల్పనిక సాహిత్య సృష్టికి పూనుకున్నప్పుడు అది తను మాత్రమే చేయగల పనిగా ఆ రచయిత భావిస్తేనే ఆ సృష్టికి మూలమైన స్థల కాలాలనూ తను సృష్టిస్తున్న పాత్రల పరిమితులనూ పరిగణనలోకి తీసుకుని ఆ సాహిత్య సృష్టి చేస్తేనే ఆ సృష్టి పాఠకుల స్పందనకు పాత్రమవుతుంది.

రచయిత ఆ సృష్టికి మూలమైన సంఘటననో సందర్భాన్నో చూసినప్పుడు, విన్నప్పుడు తనకు కలిగిన అనుభూతినీ భావ సంచలనాన్నీ తన భాష ద్వారా పాఠకులకు అందించగలిగితేనే పాఠకుల సహానుభూతినీ సాధించగలరు. ఒక రచన సాధించగలిగిన అత్యుత్తమ ప్రయోజనం అదే.

ప్రపంచంలో దుఖం ఉంది, బాధ ఉంది, కష్టమూ మృత్యువూ ఉన్నాయి. అయితే మనిషికి వీటన్నింటినీ తనదైన పద్దతిలో ఎదుర్కునే వ్యూహమూ ఉంటుంది. అయితే సుక్ర లాంటి విషాదాంతాన్ని ఎదుర్కునే పాత్ర పరిసరాల చైతన్యం ఈ కథకు ముగింపు అవుతుంది.

ఈ సందర్భంలో కాల్పనిక రచనల పట్ల రచయిత ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ రచయితకు ఆ రచనను పూనుకునే శక్తీ వస్తుంది.

రచయిత పద్మా లక్ష్మి How to tell a story అనే పుస్తకానికి ముందు మాటలో “Storytelling is the best thing about being human. And I believe it can change the world. That’s right. Stories can and do change the world”. అంటారు.

ఆ నమ్మకమే రచయితను మిగతా మనుషులకంటే ప్రత్యేకంగా నిలుపుతుంది.

“సమాజం సంక్షోభమయంగా ఉన్నప్పుడు ఆ సంక్షోభం సాహిత్యంలో ప్రతిఫలించక తప్పదు. తుఫాను భీభత్సంలో నట్టనడి సముద్రంలో చిక్కుబడిన ఓడ మీద మనిషి ఆర్తారావంలా ఉంది ఇవాళ సాహత్యం” అంటారు తెలుగు కథా విమర్శకులు ఎన్ వేణుగోపాల్ “తెలుగు కథలలో వీస్తున్న మానవ సంబంధాల గాలి” అనే వ్యాసంలో.

“ఆ ఆర్తారావంలో గత జ్ఞాపకాల వెలుగు నీడలూ ఉంటాయి. వర్తమాన నిస్సహాయ ఆక్రోశమూ ఉంటుంది” అంటారాయన.

“నన్ను కలవరపరిచిన మరణాలు” అని చెప్పుకున్న రచయిత కథకు ఇచ్చిన ముగింపుతో కొందరు విమర్శకులు కలవరపడ్డారు. ఆశావహ దృక్పథాన్ని చూపలేని కథ అన్నారు.

కథలో రచయిత చిత్రించిన పాత్రలకు రచయిత చిత్రించిన దానికి మించిన చైతన్యాన్ని ఆశించడం కానీ రచయిత ఇచ్చిన ముగింపును మించిన ముగింపును ఆశించడం కానీ మన ఊహలకు రెక్కలను ఇవ్వడమే అవుతుంది.

రచయిత ఈ కథ ద్వారా ఆశించిన సాహిత్య ప్రయోజనం కథలోని పాత్రల పరిణామాలతో, పరిధులు దాటని పాత్రల చిత్రణతో మనసులను కదిలించిన రచన పట్ల  సహానుభూతి అయితే రచయిత నిస్సందేహంగా ఆ లక్ష్యాన్ని సాధించారు.

“తన దృక్పథమేమిటో స్పష్టంగా గుర్తించిన, నిర్వచించుకున్న రచయిత కథలో  సమగ్రత ఉంటుంది. ఏ కథావస్తువును ఎంచుకోవాలో, అసలు కథ రాయవలసిన అవసరమేమిటో, పాఠకులమీద ఈకథ ఎటువంటి ప్రభావాన్ని వేయాలని ఆశిస్తున్నారో, ఈ కథారచయితకు  స్పష్టత ఉంటుంది. కథ చట్రం,  కథాంశాలూ, సన్నివేశాలూ పాత్రలూ పాత్రల ప్రవర్తన, ముగింపు వంటి అంశాలన్నీ ఒకదానితో ఒకటి సమన్వయంలో ఉండి మొత్తంగా కథ ఒక సమగ్రతను రూపుకడుతుంది” అని ఎన్ వేణుగోపాల్ గారు రాసిన మాటలు ఈ కథకు చక్కగా సరిపోతాయని నా భావన.

ప్రపంచ సాహిత్యంలోని మహాకథకులు సైతం సమకాలీన సామాజిక వాతావరణాన్నీ పాత్రలనూ ఆయా పరిమితులతోనే చిత్రించడం ద్వారా చదువరుల ఆలోచనా విధానాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు.

తాము భావగర్భితంగా చెప్పిన విషయాలను అర్థం చేసుకునేవారితోపాటు అర్థం చేసుకోలేనివారూ ఉంటారు. రచయిత అందించిన text ఆధారంగా చేసుకుని సమాజాన్నీ పాత్రలను స్థలకాలాలనూ విశ్లేషించి చదువరులకు అందించే పనిని సాహిత్య విమర్శకులు చేపడతారని నేననుకుంటాను.

కథ ద్వారా రచయిత ప్రత్యక్షంగా పరోక్షంగా చెపుతున్న విషయాలను అర్థం చేసుకోలేని పాఠకులకు దాన్ని అర్థం చేసుకోవడానికి విమర్శకులు సహకరించాలి. రచయిత చెప్పని విషయాలను గురించి రచయితను ప్రశ్నించడం, ఆ రచనను ఆధారంగా చేసుకుని రచయితను పరిమితికిలోనైన వారిగా చిత్రించడం విమర్శకులకు తగదేమో అని నా భావన.

ఈ సందర్భంలో నాకు చిన్న కథల పెద్ద రచయిత లూసున్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. “Silent soul of the people”ను పట్టుకోగలగడమే రచయిత చేయగలిగిన పెద్ద పని అంటారాయన. జాజి మల్లి ఈ కథలో ఆ పనిని చక్కగా చేశారు.

*

చిత్రం: అక్బర్ (ఆంధ్రజ్యోతి ఆదివారం సౌజన్యం)

చంద్రశేఖర్ కర్నూలు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.