సుమంగళీ మాత

ఫ్రెంచి యానాం కథలు

యానాం – 1830

యానాంలో ఆ సంవత్సరం వేసవి తొందరగా వచ్చింది.

గోదావరి నీళ్లు ఉదయాన్నే వెచ్చగా అనిపించేవి. రేవులో కట్టిన పడవల చెక్క పలకలు ఎండకు వేడెక్కి, వాటి మీద నడిచే కూలీల పాదాలను సురుక్కుమనిపించేవి.

ఆ ఉదయం అక్కన్న ఇంటి ముందు మాత్రం మామూలు సందడి లేదు. రెండురోజుల క్రితం వరకు అక్కన్న వద్ద మంచి చెడు చెప్పించుకోవటానికి వచ్చినవారి చెప్పులతో వాకిలి నిండి ఉండేది  అక్కన్న భార్య పోలమ్మ గాజుల గలగల వినిపించేది. ఇప్పుడు గడప దగ్గర మట్టికుండలో నీళ్లు పెట్టి ఉన్నా ఎవరూ తాకలేదు. వాకిట్లో వేసిన ముగ్గు సగం చెరిగిపోయింది. తలుపు పక్కన వేలాడుతున్న తులసిమాల ఎండిపోయి గాలికి కదులుతోంది.

అక్కన్నకు  కలరా సోకింది

మొదట రోజంతా విరేచనాలు. వాంతులు. శరీరం ఒక్కసారిగా నీరంతా కోల్పోయినట్టు కుంచించుకుపోయింది. రెండోరోజు మధ్యాహ్నానికి కళ్ళు లోపలకిపోయి జీవం కోల్పోయాయి. సాయంత్రానికి చేతివేళ్లు చల్లబడ్డాయి. రాత్రి ఫ్రెంచి డాక్టర్ పిథోయిస్ ను పిలిపించారు.  తెల్లటి చొక్కా, ముదురు రంగు పంట్లాం. ఆ రూపంలో గానీ, నిశ్చలంగా ఉన్న అతని చేతుల్లో గానీ ఎలాంటి తొందరా లేదు, ఒక వింతైన ప్రశాంతత తప్ప…   ఎన్నో మరణాలు చూసిన వైద్యుడి చేతులవి. అతను వచ్చేసరికి అక్కన్నకు జ్ఞానం సగమే మిగిలింది.  పిథోయిస్‌ తన తోలుబ్యాగు తెరిచి మందుల సీసాలు, చిన్న గాజు సీసాలో ద్రవం, బట్టలో చుట్టిన కొన్ని పొడులు బయటకు తీశాడు

“నీళ్లు కొద్దిగా మాత్రమే,” అని ఇంటివాళ్లకు చెప్పాడు. “శరీరం పట్టుకోవడం లేదు.”

గదిలో మృత్యువు నిశ్శబ్దంగా కవాతు చేస్తోంది. అక్కన్న తండ్రి  కోటయ్య గోడకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. నుదుటి మీద మూడు విభూతి రేఖలు, మధ్యలో ఎర్రటి కుంకుమ. ముతక పంచె, భుజంపై పాత ఉత్తరీయం.  వయసు పెరిగినా కళ్లలో చురుకుదనం తగ్గలేదు. పైకి కన్నీళ్లు తుడుచుకుంటున్న ఆ తండ్రి చూపులు మాత్రం కొడుకు ముఖం మీద లేవు. ….గోడ మూల నిశ్శబ్దంగా ఉన్న ఇనుప పెట్టె ఇకపై ఎలాంటి అడ్డంకీ లేకుండా పూర్తిగా తన సొంతం కాబోతుందనే ఒక రహస్యమైన నిశ్చింత.  దుఃఖాన్ని నటించే ఆ ముడతలు పడ్డ ముఖం వెనుక… తనకిస్తే ఎక్కడ తగలేస్తానో అని కొడుకు దాచిన సంపాదనంతా తనదే కాబోతుందన్న ఆనందం ఏమాత్రం బయటపడకుండా అతను చేస్తున్న ప్రయత్నం, ఆ గదిలోని నిశ్శబ్దం కంటే భయంకరంగా ఉంది.

పిథోయిస్ అక్కన్న నాడి పట్టి, కాసేపు అతని ముఖం చూశాడు. తర్వాత తల అడ్డంగా ఊపాడు.

“ఇక ఎక్కువ సమయం లేదు.” అని చెప్పి తెరిచిన మందు సీసాను మూసేశాడు.

పోలమ్మ ఆ మాట విన్నది.  ఆమె వయసు పదహారే. పెళ్లయి రెండేళ్లు కూడా కాలేదు. భర్తను కోల్పోవడం అంటే ఏమిటో అర్థం చేసుకునే వయసు కూడా ఇంకా రాలేదు. మెరుపు ఇంకా తగ్గని ఆమె మాంగల్యపు నల్లపూసలు మెడలో ఉన్నాయి. జడలో మల్లెపూలు ఎండిపోయి వేలాడుతున్నాయి. కళ్లలో భయం.  భర్త మంచం పక్కన కూర్చుని అతని చేతిని పట్టుకుంది. అక్కన్న వేళ్లు చల్లబడుతున్నాయి.

“దొరగారూ…” అని పిథోయిస్ వైపు చూసింది.

అతను ఆమెను చూశాడు. ఏమీ చెప్పలేదు.

ఆమె చేతిలో ఉన్న అక్కన్న వేళ్లు మెల్లగా జారిపోయాయి.

ఆ రాత్రి యానాంలో కలరా మరో ఇంటి దీపాన్ని ఆర్పింది.

ఆ ఇంట్లో చనిపోయింది ఒక్క అక్కన్న మాత్రమే కాదు. మరొకరి భవిష్యత్తు కూడా ఆ రాత్రే చితికి కట్టబడింది.

***

అక్కన్న చనిపోయిన వార్త తెల్లవారకముందే ఊరంతా వ్యాపించింది.

మొదట వచ్చినవాడు తిమ్మరాజు.  పోలమ్మ తండ్రి.  నుదుటి మీద చెమట తుడుచుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అల్లుడి శవం ఇంటి చావిట్లో  నేలమీద పరచిన తెల్లని వస్త్రం మీద ఉంది. తల దగ్గర నూనె దీపం. పక్కన తులసి దళాలు. కోటయ్య లోగొంతుకతో  నారాయణస్మరణ చేస్తున్నాడు.

తిమ్మరాజు శవాన్ని ఒక్కసారి చూశాడు.

తర్వాత మెల్లగా అడిగాడు—

“రాతకోతలేమైనా అయ్యాయా…?”

అది విన్నకోటయ్య  ఒక్కసారిగా అతని వైపు చూసాడు.

“ఇప్పుడా మాట?” అని అతని కళ్లే అడిగాయి.

తిమ్మరాజు మాత్రం సిగ్గుపడలేదు. “నేను అడిగింది పిల్ల భవిష్యత్తు కోసమే” అన్నట్టు ముఖం పెట్టాడు”

అక్కన్న సంపాదించినది తక్కువ కాదు. గోదావరి ఒడ్డున పదెకరాల పంట భూమి,  యానాం గ్రాండ్ బజారు  వీధిలో పెద్ద పెంకుటిల్లు. వెనక చిన్న తోట. కొంత బంగారం. పోలమ్మకు పెళ్లిలో పెట్టిన నగలు. ఇవన్నీ అక్కన్న తన చేతులతో సంపాదించినవి.  కోటయ్యకు దుబారా అలవాటు. వచ్చినది వచ్చినట్టే పోయేది, పూజలకో, పండితసత్కారాలకో, విందులకో, అప్పుల తీర్చడానికో. డబ్బు నిలవదు.  కొడుకు సంపాదించాడు. తండ్రిని మాత్రం ఆ సంపాదనను ముట్టుకోనివ్వలేదు.

ఇప్పుడు కొడుకు లేడు.

ఆస్తి మాత్రం ఉంది.

అదే సమస్య.

***

అక్కన్నకు చితి సిద్ధం చేసే పనులు మొదలయ్యేలోపే కోటయ్య మనసులో లెక్కలు మొదలయ్యాయి. కొడుకు కష్టపడి సంపాదించిన పొలం, ఇల్లు, నగలు—అన్నీ తన చేతుల్లోనే ఉంటే తన శేషజీవితానికి కొదవ ఉండదు. కానీ పోలమ్మ బతికి ఉంటే? ఆమె తండ్రి ఆమెను తీసుకెళ్తాడు. రేపో మాపో కోర్టుకెక్కి, భర్త ఆస్తిలో తన హక్కు అడుగుతుంది. అప్పుడు ఉన్నదంతా పరాయి చేతుల్లోకి జారిపోతుంది.

ఆమెను చంపేస్తే? ఆ ఆలోచన అతని మనసులో మెదిలింది. కానీ వెంటనే పోలీసులు, విచారణ, కోర్టు, జైలు గుర్తుకొచ్చాయి. కొడుకు ఆస్తి కోసం తన జీవితాన్ని జైలులో గడపడం అతనికి ఇష్టం లేదు. అంతలోనే నాలుగు తరాల క్రితం ఎప్పుడో  తమ తండ్రితరపు పూర్వీకులలో జరిగిన ఒక సతీసహగమన ఉదంతం గుర్తుకొచ్చింది. అప్పటి నుంచి ఆ ఘటనను ఇంట్లో కులగౌరవంగా, వంశప్రతిష్టగా చెప్పుకుంటూనే ఉన్నారు. అదే పని ఇప్పుడు జరిగితే? సతీసహగమనం హత్య కాదు- నేరం కాదు-ఆచారం. పేరుకి వంశగౌరవం, చేతికి కొడుకు ఆస్తి.

ఆ ఆలోచన మొదట అతనికే అసహ్యంగా అనిపించింది.. కానీ ఆశ ఒకసారి మనసులో మొదలైతే అది అక్కడే ఉండదు—తనకు అనుకూలమైన ధర్మాన్ని వెతుక్కుంటుంది. కాసేపటికి ఆ ఆలోచనే తన సమస్యకు సరైన పరిష్కారంలా తోచింది.

ఆ మాటను మొదట అతను ఎవరికీ నేరుగా చెప్పలేదు. మెల్లగా ఒకరి చెవిలో ఒక మాట వేశాడు.

“అక్కన్నకి భార్య మీద చాలా మమకారం. నిన్న రాత్రి చనిపోయేముందు చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడట…”

మరొకరి దగ్గర—

“కోడలు కూడా భర్తతోనే పోతానంటోందట.”

మూడో వ్యక్తి దగ్గర—

“మన వంశంలో ఇంతటి సతీ జరిగితే ఇంటి పుణ్యం పెరుగుతుంది.”

మాటకు రెక్కలు వచ్చాయి.

మధ్యాహ్నానికి అది నిజమైపోయింది.

“పోలమ్మ సతి అవుతుందట.”

పోలమ్మకు మాత్రం ఆ మాట ఎవరూ చెప్పలేదు.

ఆమెను అడిగినవారూ లేరు.

కోటయ్య భార్య లక్ష్మమ్మకు భర్త వేసిన ఎత్తుగడ అర్థమైంది. ముప్పై ఏళ్ళ నుంచి కాపురం చేస్తోంది మరి.

వంటింటి గోడకు ఆనుకుని కూర్చుని ఉందామె. చేతిలో కాస్త పత్తి పట్టుకుని, శవం దగ్గర పెట్టిన దీపం కోసం యాంత్రికంగా వత్తులు పేనుతోంది. ఆమె వేళ్లు కదులుతున్నాయి, దృష్టంతా శూన్యంలోనే ఉండిపోయింది.

“ఇది తప్పు.”

ఆమె మనసు గట్టిగా చెప్పింది.

“పోలమ్మ చిన్న పిల్ల.”

“పదహారేళ్లు కూడా లేవు.”

“కానీ…” భర్త ముఖం గుర్తొచ్చింది. కోటయ్య తనతో ఎప్పుడూ గొడవపడడు.  అయినా అతని కోపం ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. ఒకసారి నిర్ణయించుకున్నాక ఎదుటివారి మాట వినడు. అంతేకాదు—సతి జరిగిన కుటుంబానికి వచ్చే గౌరవం గురించి ఆమె కూడా ఎప్పుడో విన్నది. ఊరంతా పూలు చల్లుతుంది. ముత్తైదువులు పాదాలకు నమస్కరిస్తారు. కుటుంబం పేరు తరతరాలకూ చెప్పుకుంటారు.

చివరికి ఆమె మౌనంగా కూర్చుంది.

మనిషి కుత్సితం చాలా సార్లు చెడ్డవాడి వల్ల మాత్రమే గెలవదు. మంచివ్యక్తి మాట్లాడకుండా ఉండటం వల్ల కూడా గెలుస్తుంది.

****

నలుగురూ మాట్లాడుకొంటున్న విషయాలు గ్రహించి విషయం తెలుసుకొందామని తిమ్మరాజు వచ్చి కోటయ్యతో ఒంటరిగా మాట్లాడాడు.

“కార్యక్రమాలయ్యాక పిల్లను మా ఇంటికి తీసుకెళ్తాను.” అన్నాడు  అవతలి వ్యక్తిమనసులో ఏముందో పరీక్షించటానికి

కోటయ్య చిరునవ్వు నవ్వాడు.

“ఎందుకు?”

“ఆమె మా అమ్మాయి.”

“కన్యాదానం చేసాక  ఆమె ఈ ఇంటి అమ్మాయి అయ్యింది. మీకిక ఏం సంబంధం?”

తిమ్మరాజు మౌనంగా ఉన్నాడు.  అతనికి విషయం అర్థమైంది. శాస్త్రం వియ్యంకుని వైపే ఉంది.  ఏం జరుగుతుందో చూద్దాం. అనుకొని మౌనంగా ఉండిపోయాడు.  ఆ క్షణమే  అతని తండ్రితనం చనిపోయింది.

***

చింతలూరు నుంచి వచ్చిన మత్తు మందు ఒక చిన్న మట్టి సీసాలో ఉంది. కోటయ్య దాన్ని రహస్యంగా, ఆఘమేఘాలమీద తెప్పించినట్లు ఎవరూ గమనించలేదు.

“దుఃఖం తగ్గడానికి, పూజలో మనసు నిలవడానికి” అని  చింతలూరు మందుకలిపిన ఒక పానీయం ఇచ్చారు పోలమ్మకు. మొదట ఆమె తాగలేదు. లక్ష్మమ్మ కోడలు చేతిలో గిన్నె పెట్టి, “కొంచెం తాగమ్మా” అని అడిగింది.

లక్ష్మమ్మ చేతులు వణికుతున్నాయి. పోలమ్మ ఆమెను చూసింది.

“అత్తయ్యా… నన్ను మా నాన్న దగ్గరకు పంపుతారా?” లక్ష్మమ్మ కళ్లలో నీళ్లు మెరిశాయి.

“ఈ కార్యక్రమాలన్నీ అయ్యాక పంపుతాం అమ్మా” అని అబద్ధం చెప్పింది.

పోలమ్మ గిన్నె పెదవులకు తీసుకుంది.

ఆమెకు తెలియదు, ఈలోకంలో దుఃఖం తగ్గడానికి మందు లేదని.

కొద్దిసేపటికి ఆమె కళ్లు భారమయ్యాయి. గది గోడలు కదులుతున్నట్టనిపించాయి. ఎవరో తన తల నిమురుతున్నట్టు అనిపించింది. ఎవరైనా “అమ్మా… భర్తను విడిచి ఎలా బతుకుతావు?” అని చెబుతున్నట్టు వినిపించింది. ఆమెకు మాటలు స్పష్టంగా వినిపించలేదు.

కోటయ్య మాత్రం బయటికి వచ్చి ఊరి వాళ్లకు చెప్పాడు—

“నిన్న రాత్రి పోలమ్మకు అక్కన్న స్వప్నంలో కనిపించాడట. ‘నా దగ్గరకు రా’ అని పిలిచాడట.”

ఆ వార్త యానాం వీధుల్లో పరుగులు తీసింది.

***

పోలమ్మను సతిగా పంపాలని ఊరంతా నిర్ణయం చేసేసింది.

మధ్యాహ్నానికల్లా ముత్తైదువులు ఇంటికి రావడం మొదలైంది. పసుపు, కుంకుమ, పూలు, నూనె, గాజులు—ఇంట్లో పండుగ ఏర్పాట్లలా కనిపించాయి. ఎవరో ఆమె జుట్టుకు నూనె రాశారు. ఎవరో చేతులకు గాజులు తొడిగారు. మరొకరు ఆమెకు పట్టు చీర కట్టించారు. భర్త చనిపోయిన ఇంట్లో విధవరాలికి తెల్లని వస్త్రం ధరింపచేస్తారు;  చితికి వెళ్లే సతికి మాత్రం పెళ్లికూతురిలా అలంకారం.

ఆ వైరుధ్యం ఎవరికీ కనిపించలేదు.  కనిపించినా ఎవరూ చూడలేదు.

పోలమ్మను కూర్చోబెట్టి ఆమె మెడలోని మంగళసూత్రానికి పసుపు పూసారు. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టారు. చెవులకు బంగారు కమ్మలు, మెడలో హారం, చేతులకు రవ్వల గాజులు, నడుముకు వడ్డాణం, పాదాలకు నూపురాలు అలంకరించారు.

ఆమె ముఖంలో మాత్రం కళ లేదు.

అద్దంలో తనను తాను చూసుకుంది.

తనకు ఎదురుగా కూర్చున్నది తానేనా అని ఆమెకు అనిపించింది.

“నేను ఎక్కడికి వెళ్తున్నాను?” అని అడగాలనుకుంది.

గొంతులో మాట రాలేదు. మత్తు ఇంకా ఆమె రక్తంలో ఉంది.

***

ఆ రోజు సాయంత్రం యానాం మొత్తం ఒక విచిత్రమైన ఉన్మాదం అలముకుంది.

చితి కోసం ఎండుకర్రలు తెచ్చారు. సాంబ్రాణి, నెయ్యి, కర్పూరం సిద్ధం చేశారు. చితి సాధారణ చితిలా కాదు; ఎనిమిది అడుగుల లోతుగా నిర్మించారు. దానికి ఒకవైపున కొద్దిగా ఎత్తుగా ఒక వేదిక నిర్మించారు.  చుట్టూ జనాలు నిలబడటానికి స్థలం వదిలారు. పురోహితులు వేదికపై నిలుచుని మంత్రాల కోసం సిద్ధమయ్యారు. భాజా భజంత్రీలు పిలిపించారు.

జనం తండోపతండాలుగా చేరారు.

కొంతమందికి ఇది పుణ్యకార్యం.

కొంతమందికి అద్భుతం.

కొంతమందికి కులగౌరవం.

కొంతమందికి ఉచితంగా కనిపించే ఒక అరుదైన దృశ్యం.

మరికొందరికి… బంగారం.

పోలమ్మ వేసుకున్న నగలపై కొందరి చూపులు అప్పటికే పడ్డాయి.

అదే సమయంలో ఫ్రెంచి పెద్దదొర భవనంలో దొరల అత్యవసర సమావేశం జరుగుతోంది.

Amedee de Lesparda తన నగిషీలుచెక్కిన కుర్చీలో కూర్చున్నాడు. తెల్లని చొక్కా, ముదురు కోటు, మెడకు కట్టిన సన్నని వస్త్రం. అతని ముందు పత్రాలు. పక్కన యానాం పరిస్థితులపై నివేదికలు. 1824లో ఫ్రెంచి ప్రభుత్వం యానాంలో చెలరేగిన కులఘర్షణలను సర్దుమణచడానికి అతన్ని యానాం పెద్దొరగా నియమించింది; పరిపాలనను సరిచేసి వ్యాపారాలని పెంపుచేసి ఈ ప్రాంతాన్ని  గొప్ప అభివృద్ధిపథంలో నడిపించిన అధికారిగా లెస్పార్డా మంచి పేరు తెచ్చుకొన్నాడు.

అతని ఎదురుగా జడ్జి ఫారే. పక్కన పోలీసు అధికారి బొర్నెట్. కొద్దిదూరంలో ప్రముఖ ఫ్రెంచివ్యాపారి కుర్సన్. చర్చి ఫాదర్ జాకోబిస్ మార్టిన్.

ఊరి వ్యవహారాలు తెలిసిన కామిశెట్టి బాపనయ్య, బెజవాడ పేరమ, వర్ధినీడి నాయుడు, దరియాఖాన్, బళ్ళ వెంకట కృష్ణయ్య వంటి స్థానిక ప్రముఖులు.

కుర్సన్ మెల్లగా అన్నాడు “ఊరు ఉద్రిక్తంగా ఉంది.”

జడ్జి తన వేళ్లతో బల్లమీద తట్టాడు. అందరూ అటు తిరిగారు.

“మనం స్థానిక ఆచారాలను అడ్దుకోవడం ప్రమాదకరం. ప్రజలు దాన్ని వారి మతంలో జోక్యంగా భావిస్తారు. అంతే కాదు 1778 నాటి మన చట్టం స్థానిక ఆచార వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా మనల్ని పరిపాలించమని సూచిస్తుంది. ”

జాకోబిస్ వెంటనే అతని మాటను అడ్డుకున్నాడు.

“ఇది ఆచారం కాదు.”

అందరి చూపూ అతని వైపు తిరిగింది.

“ఆచారం పేరుతో ఒక బాలికను చంపబోతున్నారు.”

జడ్జి ముఖం గంభీరంగా మారింది.

“ఫాదర్, మనం చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం.”

“నేను మనిషి గురించి మాట్లాడుతున్నాను.” అన్నాడు జాకోబిస్.

గదిలో నిశ్శబ్దం.

బొర్నెట్ కిటికీ బయటకు చూశాడు. రేవు వైపు దూరంగా జనసమూహం కదులుతోంది.

లెస్పార్డా మెల్లగా అడిగాడు

“ఎంతమంది?”

“చెప్పలేం.” అన్నాడు బొర్నెట్. “వందల మంది.”

“అల్లర్లు?”

“అవకాశం ఉంది.”

జడ్జి తలెత్తాడు.

“ఇప్పుడే అడ్డుకుంటే అలజడి వస్తుంది. ఇక్కడ మన పాలన బలహీనంగా కనిపిస్తే బ్రిటిష్ వాళ్లు ఆ  అవకాశాన్ని వదులుకోరు.”

ఆ మాట గదిలో ఓ బరువైన నిశ్శబ్దాన్ని పరిచింది.

ఫ్రెంచి, బ్రిటిష్ శక్తుల మధ్య రాజకీయంగా  యానాం సున్నితమైన స్థలం. ఇక్కడ  చిన్న మతపరమైన గొడవ  కూడా పెద్ద రాజకీయ సమస్యగా మారే ప్రమాదం ఉంది.  అప్పటికి యానాం ఫ్రెంచివారి చేతుల్లోంచి మూడుసార్లు బ్రిటిష్ వారి ఆక్రమణలోకి వెళ్ళి అతికష్టం మీద తిరిగి ఫ్రెంచివారికి వచ్చింది.

లెస్పార్డా కొద్దిసేపు ఆలోచించాడు.  ఇక్కడ అల్లర్లు జరిగితే ఇదే అదునుగా భావించి  పొరుగున ఇంజరంలో ఉండే బ్రిటిష్ వారు  మరలా యానాన్ని కైవసం చేసుసుకుంటారు.  అదే జరిగితే ఫ్రెంచి రాజ్య చరిత్రలో మనం హీనులుగా మన ప్రజలముందు నిలబడవలసి వస్తుంది అనుకొన్నాడు

బొర్నెట్ వైపు చూశాడు. “బందోబస్తు పెంచండి.” అన్నాడు.

“దీనిపై మరొక్కసారి …” అంటూ జాకోబిస్ ఏదో చెప్పబోయాడు.

లెస్పార్డా అతన్ని ఆపాడు.

“ఇంకేం మాట్లాడవద్దు ఫాదర్.” అతని గొంతులో అధికారపు కాఠిన్యం ధ్వనించింది.

“జనం మీద దాడి చేయకండి. ఆచారాన్ని బలవంతంగా ఆపకండి. పరిస్థితి అదుపు తప్పకుండా చూడండి.”

జాకోబిస్ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. అతని ముఖంలో నిరాశ.

అతను మళ్లీ ఏదో చెప్పబోయాడు.

కుర్సన్ అతని వైపు చూశాడు వారిస్తున్నట్లు.

బెజవాడ పేరమ తల అడ్డంగా ఊపాడు. “ఇప్పుడు వద్దు.” అన్నట్టుగా.

సమావేశం ముగిసింది.

బయటికి వెళ్లేటప్పుడు జాకోబిస్ ఒక్కసారి వెనక్కి తిరిగి లెస్పార్డాను చూశాడు.

ఆ కళ్లలో ప్రశ్న ఉంది.

“కళ్లెదుటే ఒక మనిషిని మంటలలోకి తోసి కాల్చి చంపుతుంటే మౌనంగా చూడటం మీ పరిపాలనకు ఏ రకమైన గౌరవం?”

ఆ ప్రశ్నకు సమాధానం లెస్పార్డా వద్ద లేదు.

***

పోలమ్మను పల్లకీలో కూర్చోబెట్టారు.

ఆమెకు చుట్టూ ముత్తైదువులు. ముందుగా భాజా భజంత్రీలు. వెనుక పురోహితులు. మరింత వెనుక ఊరి జనసందోహం. పల్లకీ కదిలింది.

ఆమె కళ్లకు ముందున్న ప్రపంచం మసకగా కనిపిస్తోంది.

దారి ఇరువైపులా నిలబడ్డ మహిళలు చేతులు జోడిస్తున్నారు.

కొంతమంది పల్లకి దగ్గరగా చేరి  ఆమె పాదాలకు మొక్కుతున్నారు.

“సతీమాత…” అని పిలుస్తున్నారు.

ఆమెకు అర్థం కాలేదు.

ఆమె ఇంకా పోలమ్మే.  పదహారేళ్ల క్రితం పుట్టిన ఒక అమ్మాయి. రెండు సంవత్సరాల క్రితం పెళ్లయిన ఒక బాలిక.  మొన్నటివరకు భర్త బయటకు వెళ్లినప్పుడల్లా, ఎప్పుడు తిరిగి వస్తాడా అని గుమ్మం వైపు చూస్తూ ఎదురుచూసిన ఒక భార్య.

తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు కాలరాసి ఇప్పుడు వాళ్లందరూ ఆమెను “ఒక దేవత”గా మార్చుతున్నారు.

దేవతగా మార్చిన క్షణంలోనే ఆమెను మనిషిగా చంపేయడం సులభమవుతుంది.

పల్లకీ వెనుక నడుస్తున్న కోటయ్య కళ్లకు పోలమ్మ కనిపించదు. చితి కనిపిస్తుంది. చితి తర్వాత తనకు మిగిలే ఆస్తి కనిపిస్తుంది. జనాలు తన కుటుంబాన్ని “సతీ కుటుంబం” గా గౌరవించే భవిష్యత్తు కనిపిస్తుంది.

లక్ష్మమ్మ మాత్రం పల్లకీ వెనక నడుస్తోంది.

ఆమె చేతిలో పెద్ద ఇత్తడి పళ్ళెం దానిలో రాసులు పోసిన పసుపు, కుంకుమలు.

పోలమ్మ ఒక్కసారి ఆమె వైపు చూసింది. ఆ చూపు లక్ష్మమ్మ గుండెల్లో కత్తిలా దిగింది.

“అత్తయ్యా…” అని పోలమ్మ పెదవులు కదిలాయి. లక్ష్మమ్మ వినలేదు.  విన్నా విననట్టే నడిచింది.

అక్కన్న శవాన్ని పడుకోబెట్టిన చితి దగ్గరకు పోలమ్మ  చేరేసరికి జనసమూహం గర్జనలా మారింది. పురోహితుల మంత్రోచ్ఛారణలు పెరిగాయి. భాజా భజంత్రీలు మోగాయి. సాంబ్రాణి పొగ గాలిని నింపింది. చితిమీద నెయ్యి పోశారు. మంటలు మొదట నీలంగా, తర్వాత పసుపుగా, ఆపై ఎర్రగా ఎగిశాయి.

ముత్తైదువలు పోలమ్మను చితి వేదిక దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె కాళ్లు తడబడుతున్నాయి.

మత్తు ఇంకా ఉంది.

ఆమె అందమైన ముఖంలో కళ లేదు. అలసిపోయింది.  కళ్లలో కాంతి లేదు. తడబడుతూ నడుస్తున్నది శరీరం; నడిపిస్తున్నది ఎవరో.

ఆమెను చితి వేదిక మీదకు ఎక్కించారు.

ఆమె వేసుకున్న నగలను ముత్తైదువులు ఒక్కొక్కటిగా తొలగించడం మొదలుపెట్టారు. మొదట గాజులు. తర్వాత కమ్మలు. మెడలోని హారం. నడుము వడ్డాణం. పాదాల నూపురాలు.

ప్రతి నగ ఒక చేతి నుంచి మరో చేతికి వెళ్లింది. చివరికి అవి పురోహితుల దగ్గరకు చేరాయి. వారు వాటిని పంచుకొన్నారు.  చితి ముందు వంచన కూడా పుణ్యకార్యంలా కనిపిస్తుంది.

పురోహితులు మంత్రాలు వేగంగా చదువుతున్నారు.

జనం “సతీమాతకి జై” అని అరుస్తున్నారు.

పోలమ్మ కళ్లకు మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఒక్కసారిగా ఆమెకు మెలకువ వచ్చినట్టయింది. ఆమె కళ్ల ముందు ఒక చిన్న ఇల్లు. అందులో అక్కన్న నవ్వుతున్నాడు.

“పోలమ్మా…ఇవిగో మల్లెపూలు”

ఆమె పెదవులు కదిలాయి.

అది నిజమా?

స్వప్నమా?

మత్తు ప్రభావమా?

ఆమెకే తెలియదు.

మంత్రాలు మరింత గట్టిగా వినిపించాయి.

డోలు మోగింది. మంటలు ఎగిశాయి. జనం కేకలు పెట్టారు. ఆమె శరీరం ఒక్కసారిగా ముందుకు కదిలింది.

అది ఆమె సంకల్పమా? మత్తు తెచ్చిన భ్రమా? చుట్టూ ఉన్న వందల గొంతుల ఒత్తిడా? లేదా ఆమెకు తన ముందున్న మంటలే మిగిలిన ఒకే దారిగా అనిపించాయా?

వేదికపైనుంచి కాలుతున్న భర్త చితి మీదకు పోలమ్మ…..

మంటలు ఆమెను చుట్టుకున్నాయి. భాజా భజంత్రీల శబ్దం పెరిగింది. సాంబ్రాణి పొగ దట్టమైంది. ఎవరో పెద్ద మొత్తంలో నెయ్యి పోశారు.

జనం “హరహరా” అంటూ అరిచారు.

ఆమె నుంచి వచ్చిన ఒక చివరి ఆక్రందన డోలు శబ్దంలో కలిసిపోయింది.

లక్ష్మమ్మ చెవులు మూసుకుంది. కోటయ్య మాత్రం కళ్లు మూసుకుని ఏదో మంత్రం జపిస్తున్నట్టు నటించాడు.

తిమ్మరాజు జనాల వెనుక నిలబడి ఉన్నాడు. మొదట అతని చూపు మొదట్లో కూతురి ఆస్తిపై ఉండింది కానీ చుట్టుపక్కల వాళ్లు  “సతిని కన్న తండ్రి” అంటూ అతని భుజాలు తడుముతూ పొగడటం మొదలుపెట్టేసరికి, తన  లోపలి కల్మషాన్ని  ఏ పేరుతో పిలవాలో తెలియక అతను అయోమయంలోకి జారిపోయాడు.

మరుసటి ఉదయం యానాంలో ఆ సంఘటన గురించి జనాలందరూ పోలమ్మ సతీమాత అయింది. అది మహాపుణ్యం. ఆ కుటుంబానికి వంశగౌరవం తెచ్చింది. ఆమెకు దైవత్వం వచ్చింది. అంటూ మాట్లాడుకొన్నారు

జాకోబిస్ మాత్రం చర్చి గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు.

అతని ముందు చిన్న కొవ్వొత్తి. అతని చేతుల్లో ప్రార్థనా పుస్తకం. కళ్లు మాత్రం పుస్తకంలో లేవు. ఎక్కడో ఎర్రని మంటలతో వెలిగిన ఆరిన చితి అతని మూసిన కనుల వెనుక స్పష్టం కనిపిస్తోంది. అతను ఆ నిన్న లెస్పార్డాతో చెప్పిన మాట గుర్తుచేసుకున్నాడు—

“ఇది ఆచారం కాదు. ఆచారం చాటున జరుగుతున్న కుట్ర.”

అతను ఆ మాటను మరలా తనలోనే గొణుక్కున్నాడు.

అప్పటికే ఆలస్యమైపోయింది.

***

కొన్నేళ్లు గడిచాయి. యానాం మారింది. కొత్త ఇళ్లు వచ్చాయి. కొన్ని పాత గోడలు కూలాయి. రేవులో కొత్త పడవలు కనిపించాయి.

పోలమ్మ చితి చేసిన ప్రదేశంలో  నాలుగు కర్రలతో చిన్న పందిరి కట్టారు. మధ్యలో రాతితో ఒక ఎత్తయిన ఫలకం పెట్టారు. దాని మీద పసుపు, కుంకుమ, పూలు. ఉదయాన్నే కొందరు మహిళలు వచ్చి దీపం వెలిగించేవారు. మధ్యాహ్నానికి దూరపు గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు అక్కడ కొబ్బరికాయలు కొట్టేవారు. సాయంత్రానికి ముత్తైదువులు పసుపు అద్దేవారు.

“ఇక్కడే “సుమంగళిమాత” వెలిసిందట.” అని వాళ్లు చెప్పుకునేవారు.

కథకు మరో కథ జతపడింది.

“పోలమ్మ చితిలోకి వెళ్లే ముందు తన మామగారికి కనిపించి—నేను “సుమంగళిమాత” గా వెలుస్తాను. నన్ను దర్శించిన వారికి దీర్ఘసుమంగళత్వం కలుగుతుంది—అని చెప్పిందట.”

ఎప్పుడు చెప్పింది? ఎవరు చూశారు? ఎవరికీ తెలియదు.  కథలకు సాక్ష్యం అవసరం లేదు. నమ్మేవాళ్లు ఉన్నారు .  ….అంతే.

పందిరి దగ్గరికి జనాలు తండోపతండాలుగా రావడం మొదలైంది. పిల్లలతో వచ్చిన మహిళలు పసుపు చల్లారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు పోలమ్మ రాతిఫలకానికి నుదురు తగిలించి భర్తలు క్షేమంగా ఉండాలని మొక్కుకున్నారు.

ఆ గుడికి పూజారి కోటయ్య.  అదే కోటయ్య. పోలమ్మను చితికి పంపించిన మామగారు.

ఇప్పుడు అతను తెల్లని గడ్డంతో, నుదుటి మీద విభూతి రేఖలతో, పసుపు రంగు వస్త్రం ధరించి, చేతిలో గంట పట్టుకుని సుమంగళిమాతకు హారతి ఇస్తున్నాడు.

ప్రజలు అతని పాదాలకు నమస్కరిస్తున్నారు.

“సుమంగళిమాత కటాక్షం కలగాలి” అని అతను ఆశీర్వదిస్తున్నాడు. అతని ముందున్న హుండీలో నాణేలు పడుతున్నాయి. కొంతమంది బంగారు రూపులు వేస్తున్నారు. కొత్తగా పెళ్లైన అమ్మాయి భర్తతో కలిసి వచ్చి సుమంగళిమాత ముందు నమస్కరించినప్పుడు కోటయ్య ఆమెకు చిన్న ఆకులో  పసుపు, కుంకుమ ఇచ్చి “దీర్ఘసుమంగళీ భవ.” అని దీవిస్తున్నాడు

*

చరిత్ర: CPT Laplace (1793-1875)  అనే ఫ్రెంచి ప్రపంచ యాత్రికుడు 1830 జూలై నెలలో యానాంలో ప్రయాణించి తన అనుభవాలను “Voyage au tour du monde” (Travel around the world)) అనే పుస్తకంలో పొందుపరిచాడు ఈ పుస్తకపు 298-300 పేజీలలో అప్పటికి కొంతకాలం క్రితం యానాంలో ఒక బ్రాహ్మణ బాలికకు మత్తుపానీయాలు తాగించి జరిపిన సతీసహగమన ఉదంతాన్ని  Laplace  వర్ణించాడు.  ఆ వివరాల ఆధారంగా ఈ కథ రాయటం జరిగింది. పాత్రలు, సంభాషణలు, సంఘటనలు కథనం కొరకు చేసిన కల్పన)

 

బొల్లోజు బాబా

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.