నాలుగు అంకాల జగన్నాటకం

మొదటి అంకం – డేవిడ్ కథ:

పన్నెండేళ్ల వయసులో మొదటిసారి తండ్రితోబాటు సూదికొండెక్కి, గోచీ సాధువుని చూడడం డేవిడ్‌కి గుర్తుండిపోయింది. ఆ వయసులో అది పెద్ద కొండలాగా కనబడింది; నిజానికది సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న గుట్ట.  వాళ్లు పైకి చేరేసరికే ఎండ చుర్రుమంటోందిగానీ, రివ్వుమని వీస్తున్న గాలి తాకిడితో వేడి తెలియడం లేదు. తెల్లని నురగల్ని చిమ్ముతూ, తీరాన్ని మృదువుగా తాకి, వెనక్కి మళ్లుతూన్న నీలి కెరటాల జలతారు; దూరంగా యారాడకొండ; లంగరు దించిన ఓడలు; గాలి తాకిడికి ఉప్పొంగిన తెరచాపలతో, అంతు లేని సముద్రంలోకి ధైర్యంగా అడుగుపెడుతూన్న జాలరి పడవల సమూహం – ఇవన్నీ కలగలిసిపోయి, డేవిడ్ ఙ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఎప్పుడో ఒక రోజున సముద్రం మీద ప్రయాణించాలనే తలంపు అతనిలో చిగురించింది కూడా ఆనాడే.

చురుగ్గా అడుగులు వేస్తూన్న ఆ తెల్ల గెడ్డపు బక్క సాధువు వంటి మీద గోచీ తప్ప ఇంకేమీ లేకపోవడం డేవిడ్‌కి ఆశ్చర్యం కలిగించింది. సాధువు శిష్యులు గుడిసెలో ఉన్న కుండలోంచి తాటి దొప్పతో దోసిట్లో పోసిన చల్లటి నీళ్లు కడుపునిండా త్రాగడం బాగా గుర్తుంది.

అప్పటికే కొంతమంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లంతా ఒక వరసలో నిలబడి, ఒక్కొక్కళ్లూ ముందుకి వస్తూ, సాధువు కాళ్లకి మొక్కుతున్నారు. భక్తుల నెత్తిపై ఓసారి తాకి, ప్రక్కనే ఉన్న శిష్యుడు అందించిన విభూతిని నొసళ్లకి అద్ది, ‘ఇక దయ చెయ్యండి,’ అన్నట్లుగా తల ఊపుతున్నాడు, సాధువు. భక్తులంతా దండాలు పెడుతూనే తిరుగు ముఖం పడుతున్నారు. ఇవన్నీ డేవిడ్‌కి వింతగా కనిపించాయి.

అక్కడ జరిగిన విషయాల్ని డేవిడ్‌ తండ్రి రిచర్డ్ చాలాసార్లు చెప్పాడు. ఆయన మళ్లీ మళ్లీ చెప్పే కథలకు ప్రతీసారీ కొత్త వివరాల్ని జోడించి, నగిషీలు చెక్కుతాడని డేవిడ్‌కి తెలుసు. బర్మానుంచి తెచ్చిన టేకు కుర్చీలో జేరబడి కూర్చొని, రెడ్ వైన్ చప్పరిస్తూ, ప్రక్కనే చిన్న రోజ్‌వుడ్ టేబిల్ మీద వైన్ గ్లాసుని నిలబెడుతూ, రంగూన్ కబుర్లు చెబుతాడు, రిచర్డ్. మధ్యలో అతని భార్య లేచి, వేయించిన చేప ముక్కల ప్లేటుని వంటింట్లోంచి హడావుడిగా తెచ్చి, టేబిల్‌మీద పెట్టి, మళ్లీ లోపలికి పరుగు తీస్తుంది. అప్పుడు డేవిడ్ ఒక్కడే శ్రోతగా మిగులుతాడు.

మరి కాసేపట్లో, డేవిడ్ తల్లి, “ఇంక చాలు! భోజనానికి వేళైంది,” అని ప్రకటిస్తుంది. రిచర్డ్, అయిష్టంగా, ఇబ్బంది పడుతూ, వాలు కుర్చీలోంచి లేచి, భోజనాల బల్ల వైపుగా కదులుతాడు.

ఈ దృశ్యాలన్నీ డేవిడ్ లోలోపల ముద్రితమయ్యాయి. కథలే అతుకులబొంతలా మిగిలిపోయాయి. ‘ఎన్ని అతుకులున్నా బొంత ఒకటే కదా?’ అని డేవిడ్ ఉపశమనం పొందుతాడు. తండ్రి చెప్పే కథల్ని శ్రద్ధగా వినకుండా పెడచెవిన పెట్టినందుకు డేవిడ్ తనని తానే నిందించుకుంటాడు. ఇప్పుడా తండ్రీ లేడు; తల్లీ లేదు. తాను మాత్రం, మర్చంట్ నేవీలో కేప్టెన్ అయ్యాడు. సరిగ్గా సాధువు చెప్పినట్లే జరిగింది.

చిన్నతనంలో పట్టించుకోలేదుగానీ, తండ్రి జీవితం గురించి ఊహాగానాలు చెయ్యడం ఇటీవలి కాలంలో డేవిడ్‌కి ఒక వ్యసనంగా మారింది. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన ఉత్తరాలు, కాగితాలు, ఫొటోలు జాగ్రత్తపెట్టాడు. ఒక్కోసారి అతనికి అనిపిస్తూంటుంది: ‘ఇది రిటైరై, ఇంకా ఒంట్లో కాస్త సత్తువ మిగిలి ఉన్న వాళ్ల హాబీయా, లేక అనవసరపు ఆరాటమా? తన తరవాత ఎవరికైనా వీటి మీద ఆసక్తి ఉంటుందా? తన స్వంత అనుభవాలు ఎక్కడైనా రాసి పెట్టుకోవాలా?’ ఏదైతేనేం?  కొన్ని అతుకుల్ని పట్టుకోగలిగేడు. మొత్తం బొంత చేతికి అందలేదు.

రెండవ అంకం – డేవిడ్ తండ్రి రిచర్డ్ చెప్పిన కథ:

జనం అతని చుట్టూ గుమిగూడడం సాధువుకి ఇష్టం ఉండదు. శనివారాలు మాత్రమే అతని దర్శనం. మా నొసళ్లకి కూడా విభూతి రాసి, “ఇక బయిల్దేరండి,” అన్నాడు.

“మావాడి సంగతి కొంచెం చెప్తారని వచ్చాం, మహాశయా!” అని బ్రతిమాలుకున్నాను.

సాధువు, మన డేవిడ్ నెత్తిమీద చెయ్యిపెట్టి, ఒక్క నిమిషం కళ్లు మూసుకున్నాక, “వీడిని అడ్డుకోకండి. అల్లరచిల్లరగా తిరుగుతాడుగానీ సముద్రాల మీద ప్రయాణాలు చేసి, వీరుడిగా మళ్లీ ఈ ఊరు వస్తాడు,” అన్నాడు.

“పోనీ క్షేమంగా వస్తాడు కదా?” అన్నాన్నేను.

“అధిక ప్రసంగం వద్దు. వీరుడిగా తిరిగి వస్తాడంటే అదే కదా అర్థం?” సాధువుకి కోపం వస్తోందని గ్రహించాను. అయినప్పటికీ – మిగతా వాళ్లకి అర్థం కాకూడదని ఇంగ్లీషులో అడిగాను,

“మహానుభావా! మావాడి జాతకం చూసి చెబుతారని ఎంతో ఆశతో వచ్చాను.”

కొన్నేళ్ల క్రిందట బర్మా ఆయిల్ కంపెనీలో తనతో బాటు రంగూన్‌లో పని చేసి రిటైరైన టేలర్‌దొరని తీసుకొచ్చినప్పుడు సాధువు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడతాడని రిచర్డ్‌కి తెలిసింది.

“నేను జాతకాలు చూడడం మానేసి చాలా సంవత్సరాలైందని తెలీదా? మీ ఊరివాళ్లే – ఒట్ఠి పనికిమాలిన సంత – పురిట్లోనే పోయినవాడి కుండలి వేయించి, జాతకం చెప్పమని నన్ను వేధించలేదా? అప్పటితో మానుకున్నాను… నాకే పరీక్ష పెడతార్రా?… లమ్డీ కొడుకులు!”

“తప్పైపోయింది, స్వామీ! ఆ వెధవలకి బుద్ధి చెప్పాం.”

“జాతకం లేదు, గీతకం లేదు. నీ కొడుకు విషయంలో ఎప్పుడైనా, ఏదైనా ఇబ్బంది వస్తే వచ్చి కనబడు. అమ్మవారిని అడిగి చెబుతాను. ఇంక దయచెయ్యి.”

***

మరుసటేడు కాబోలు, రాంబాబు, భవానీ భీమిలి వచ్చారు, రిచర్డ్‌ని కలవడానికి. భీమిలి చిన్న ఊరు. ‘రిచర్డ్, బర్మా ఆయిల్ కంపెనీ,’ అని అడగ్గానే ఇల్లు చూపించారు. రాంబాబు తన కుటుంబంతో సహా విశాఖపట్నం వొచ్చేశాడని చెప్పినప్పుడు రిచర్డ్ చాలా సంతోషించాడు. తన భార్యని పరిచయం చేశాడు. ‘భోజనం చేసి వెళ్లాలి,’ అని ఆమె పట్టుబట్టింది.

“టేలర్‌ దొర గారు ఇక్కడే ఉన్నారని విన్నాను?”

“లేదు రాంబాబూ! క్రిందటేడు వాళ్ల దేశానికి వెళిపోయాడు. అతని భార్య ఇక్కడే చనిపోయింది. అతనికి ఇక్కడే ఉండాలని ఉండేదిగానీ, భార్య పోయాక ఒక్కడూ ఉండలేకపోయాడు.”

“అయ్యో! అలాగా?”

రంగూన్‌లో తమకొక దారి చూపించిన టేలర్‌ దొరనీ, దొరసానినీ కలుసుకొనే అవకాశం లేకుండా పోయినందుకు రాంబాబు, భవానీలకి ఆశాభంగం కలిగింది. రంగూన్‌ వెళ్లి పదేళ్లే గడిచినా, ఆ ఙ్ఞాపకాలన్నీ గతజన్మ స్మృతుల్లాగా అనిపించాయి, వారిరువురికీ.

“మీ ఫ్రెండు నాయుడు ఎలా ఉన్నాడు?”

“పార్టీ మీద నిషేధం వచ్చినప్పుడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళిపోయాడు. అప్పటినించీ అతనితో కాంటాక్ట్‌ లేదు.”

తెలంగాణా సాయుధ పోరాటం ముగిసిపోయి మూడు నెలలు కావస్తున్నా నాయుడి ఆచూకీ తెలియలేదు. నాయుడిని స్వంత అన్నకన్నా ఎక్కువగా ప్రేమించే భవానీ, అతని కోసం బెంగ పెట్టుకుంది. రాంబాబుకి కూడా నాయుడు ఆత్మీయుడు. బయటకి అనకపోయినా, నాయుడిని పోలీసులు పట్టుకొని కాల్చి చంపేశారేమోనని వాళ్లిద్దరికీ లోలోపల చాలా భయంగా ఉంది. నాయుడి ప్రస్తావన వొస్తే ఎక్కడ కన్నీళ్లు బయటపడతాయో, తోటి వ్యక్తిలో ఎక్కడ ధైర్యం, ఆశ సన్నగిల్లుతాయోనని తమ శంకని బయటపెట్టకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు – రాంబాబు, భవానీ దంపతులు. అలాగని ఒకరి భయాలు మరొకరికి తెలియవని కాదు.

రిచర్డ్‌కి నాయుడు గుర్తుకొచ్చాడు. “అవును, గుర్తుంది. మీరంతా పార్టీ మనుషులు కదా? మీకు నమ్మకాలుండవుగానీ, ఒక సాధువు సలహా విని టేలర్‌దొర ఇంగ్లండు వెళిపోయాడు,” అన్నాడు.

“ఎవరా సాధువు?”

రిచర్డ్ ఆ ఉదంతం వివరించాడు.

***

మూడవ అంకం – సూదికొండ సాధువు కథ:

సూదికొండ సాధువు వయసు రెండు వందల ఏళ్ల పైమాటే అని కొందరూ, మూడు వందలేళ్లకు తక్కువ ఉండదని మరి కొందరూ అంటారు. బంకోలా దొంగలు ఊళ్ల మీద పడ్డప్పుడు ఈ కొండకి వచ్చాడంటారు – ఇంకొందరు. అసలీ సాధువే ఒక బంకోలా దొంగ అన్నవాళ్లూ ఉన్నారు. మరాఠీ దండుతో వచ్చి ఇక్కడ ఉండిపోయాడని కూడా అంటారు. కాకపోతే ఆ కొండమీద ధ్యానం చెయ్యగా చెయ్యగా, ఇతని మనోనేత్రం విచ్చుకున్నది; అమ్మవారి సాక్షాత్కారం అయింది.

భగవంతుడి దర్శనం కోసం భక్తులు ప్రార్థనలు చేస్తారు; తీరా సాక్షాత్కారం జరిగితే తట్టుకోలేరు. చిన్నచిన్న మహిమలు చూపిస్తే ఆనందంతో పొంగిపోతారుగానీ, మొత్తం మహాసత్యం ఒక్కసారి మీద పడితే మానవమాత్రులెవరూ భరించలేరు. ఆ దెబ్బతో సాధువుకి మతి చలించిన మాట వాస్తవమే. అప్పట్నించి నలుగురు శిష్యులతో నిత్యం సూదికొండ మీదే ఉంటున్నాడు. అతడూ, అతని శిష్యులూ ఒక్కోసారి నెలల తరబడి కనబడకుండా ఎటో పోతారు. తీర్థయాత్రలకు వెళ్లారని మనం ఊహించుకోవాలి.

ఆయన శనివారాల్లోనే దర్శనం ఇస్తాడు. మిగతా రోజుల్లో శిష్యులతోబాటు పగలంతా గంజాయి తాగి, నిషా బాగా తలకెక్కాక రాత్రిపూట పిచ్చి కేకలు వేస్తుంటాడు అంటారు కిట్టనివాళ్లు. దెయ్యాలతో సహా అందరికీ అతనంటే చచ్చేటంత భయం. అసలే కోపిష్ఠి; శపిస్తాడేమోనని జనం జంకుతారు. అతని వద్ద శిష్యరికం కోసం  చిన్న సాధువులు వస్తూంటారు. ఈయనగారు, ‘నన్ను మోసుకుపోవడానికి ఈ నలుగురూ చాలు,’ అని వాళ్లని తగిలేస్తాడు.

నేను టేలర్‌ దొరని వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు మొదట్లో బాగానే మాట్లాడాడు. “ఈ సూదికొండ అంటే ఏమిటనుకున్నారు? దీని మీద దీపస్తంభం ఉండేది. రోజూ దీపాల్లో నూనె పోసి రాత్రంతా వెలిగించి ఉంచడానికి ఒక మనిషి ఉండేవాడు. ఊళ్లో ఉన్న కోమట్లంతా ఆ ఖర్చులన్నీ భరించేవాళ్లు. ఆ దీపం, ఓడలకి దారి చూపించేది. ఓడల్లేకపోతే వ్యాపారం లేదు. ఆ సంగతి కోమట్లకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదు,” అనండు మాతో.

ఊరుకోమని సైగ చేస్తున్నా పట్టించుకోకుండా, “అవన్నీ మీరు చూశారా? అప్పుడు మీరున్నారా?” అని అడిగేశాడు దొర, అమాయకంగానే.

సాధువు దొరని వింతగా చూసి, “నేను కళ్లు మూసుకుంటే అన్నీ కనిపిస్తాయి; మీరు కళ్లు తెరిచినా ఏమీ కనబడవు – అదే తేడా,” అన్నాడు, శాంతంగా.

కాసేపు కళ్లు మూసుకున్నాక, దొరతో ఇంగ్లీషులో, “నువ్వు కళ్లు మూసుకో. నీ భార్య కనబడుతుంది. కళ్లు తెరిచి చూస్తే నీకు కనిపించేది దెయ్యమే,” అన్నాడు.

టేలర్ దొర నిర్ఘాంతపోయాడు. అసలతను వొచ్చింది ఆ సమస్యకు పరిష్కారం కోసమే.

“మీకెలా తెలుసు!? ఊళ్లో వాళ్లు చెప్పారా?”

దొర అయోమయపు చూపుని చూసి జాలిపడి, సాధువు వివరించాడు. “ఈ ఊళ్లో చాలా దెయ్యాలున్నాయి. అన్నీ మంచివే – ఒకటి, రెండు తప్ప. మొగుడితో కాపురం ఉందామని వచ్చిన దొరసానీ, ఆమె శిశువూ వాలెందు (హాలెండు)  నుంచి వస్తూ సముద్రపుటొడ్డున మునిగిపోలేదూ? విషజ్వరాలతో దొరలు కట్టగట్టుకొని చావలేదూ? అమ్మవారిని లక్ష్యపెట్టకుండా తిరిగినన్నాళ్లూ దొరలు నానా బాధలూ పడలేదూ? మీవాళ్లు తరవాతెప్పుడో ఊడిపడ్డారు. మీకన్నా ముందెప్పుడో వాలెందులు  వచ్చారా లేదా? అప్పట్నించీ ఇదే తంతు. మీ దేశం పొమ్మని అమ్మవారు ఎప్పుడో తెల్ల దొరలకి చెప్పింది. ఇప్పుడంటే సంవత్సరానికొక గొర్రెని సమర్పిస్తున్నారు. ఆ మాత్రానికే అమ్మవారు సంతోషించి ఊరుకుంటుందా? మీ దొరలంతా కలిసి మొత్తం కళింగదేశం దొబ్బారు! నక్కజిత్తులోళ్లు! కంత్రీ నా కొడుకులు!…”

సంభాషణ గాడి తప్పుతోందని గ్రహించి, “ఈ దొరకి మన సంగతులు సరిగ్గా తెలియవు స్వామీ! ఈసారికి వదిలేసి, ఆయనకి పరిష్కారం చెప్పండి. పాపం చాలా కష్టపడి కొండెక్కి వచ్చాడు, మీ దర్శనం కోసం,” అన్నాన్నేను.

“ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. అసలీ కొండలొకప్పుడు గుండు సాధువులకు నిలయం. వాళ్లంతా నామరూపాల్లేకుండా పోయారా, లేదా? నామరూపాలు లేకపోవడం అంటే ఏమిటి? ఆత్మలు ఉన్నాయన్నమాటే కదా? అంచేత పోయిన వాళ్లంతా దెయ్యాలైనా అయి ఉండాలి లేకపోతే దేవతలైనా కావాలి. మనకిప్పుడు నామరూపాలున్నాయి, రేప్పొద్దున్న పోతాయి. అంటే ఏమిటన్నమాట? మనం కాబోయే దెయ్యాలం. ఎప్పుడైనా ఒక్కోసారి దేవతలం. బతికున్న వాళ్లని వేధిస్తే దెయ్యాలు, దీవిస్తే దేవతలు – అంతే. చెప్పినమాట వినకుండా వెధవ్వేషాలేస్తే వేధించే దెయ్యాలు చాలానే ఉంటాయి. తప్పులు దిద్దుకొని కాళ్లమీద  పడితే దీవించే దేవతలు కొంతమందే ఉంటారు; వాళ్లే అమ్మవార్లు. వాళ్లతో ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండాలి. ప్రతీదీ గమనిస్తూంటారు. వేషాలేస్తే ఊరుకోరు; సర్వనాశనం చేస్తారు. దేవుళ్లెవరైనా చల్లగానే చూస్తారు; లేకపోతే, ‘మీ కర్మాన మీరే పోతారు,’ అని ఊరుకుంటారు. ఈ అమ్మవార్లతోనే జాగ్రత్తగా ఉండాలి.”

టేలర్‌ దొర నోరు పెగల్లేదు. “ఇప్పుడేమి చెయ్యమంటారు స్వామీ?” అన్నాను.

“ఇదిగో రోజూ ఈ విభూతి రాసుకొని, వాళ్ల దేవుడికి దండం పెట్టుకొని పడుకోమను. మూడు రోజుల్లో అతని భార్య కలలో కనిపిస్తుంది. మంచి మాటలాడి, ‘నేనూ నీ దగ్గరకి వచ్చేస్తున్నాను, ఓపిక పట్టు,’ అని చెప్పమను. ఆమె ఇతన్ని వదల్లేక, దెయ్యమై తిరుగుతోంది. ఇతనూ వదల్లేకపోతున్నాడు.”

టేలర్‌ దొర వాదనకి దిగుతాడేమోనని భయపడ్డాను. అదృష్టవశాత్తూ ఆ సంభాషణ అంతటితో ముగిసింది. సాధువు చెప్పినట్టే చేశాడు దొర. ఫలితం కనిపించింది. ఆమె అతని జోలికి రావడం మానుకుంది. రాత్రి పూట వంటింట్లోంచి, తోటలోంచి చప్పుళ్లు రావడం ఆగిపోయింది. దొర మళ్లీ రెండే రెండు స్కాచ్ పెగ్గులతో ప్రశాంతంగా నిద్రపోసాగాడు. అంతే కాదు, తన తరఫున అమ్మవారి జాతరకి ప్రతీ సంవత్సరం ఒక పొట్టేలుని పంపించే ఏర్పాటు చేసి, ఇంగ్లాండు వెళ్లిపోవడానికని టిక్కెట్టు కొనుక్కున్నాడు. ఇంగ్లాండు వెళ్లే ముందు చివరిసారి సాధువు దర్శనం చేసుకున్నాడు.

“చెప్పాపెట్టకుండా చెక్కేయడం కాదు. నీ భార్య సమాధి దగ్గర ప్రార్థన చేసి, వెళ్లిపోతున్నానని ఆవిడకి చెప్పు. దెయ్యాలు ఇంగ్లాండు రాలేవనుకుంటున్నావా? దేవతలు మహిమలు చూపించి మాయమైపోతూంటారుగానీ, దెయ్యాలు మాత్రం మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి; ఎందుకంటే మనుషులు చేసే పుణ్యాలకన్నా పాపాలు చాలా ఎక్కువ,” అన్నాడు సాధువు, ఆవేశంగా.

టేలర్‌ దొర సాధువు సలహా పాటించాడు. ‘అమ్మవారంటే మరెవరోకాదు; మేరీమాతకి ప్రతిరూపమే,’ అని టేలర్‌ దొర ఆలోచనల్లో స్థిరపడిపోయింది. ఇంగ్లాండు వెళ్తూ వెళ్తూ ఓవల్టీన్ డబ్బాడు విభూతి పట్టుకుపోయాడు. ‘అమ్మవారి దయవల్ల అంతా సవ్యంగానే ఉంది,’ అని రిచర్డ్‌కి ఉత్తరం రాశాడు. ఆ తరవాత ఏమైందో తెలీదు.

***

నాలుగవ అంకం – భవానీ, రాంబాబుల కథ:

భవానీ, తన భర్తతో, ” భీమిలీ ఎల్దావేటి? అన్నయ్య గురించి సాధువేటంటాడో  అడుగుదాం,” అన్నది.

నాయుడి విషయమై ఆమె సింహాచలం అప్పన్న కొండకే కాకుండా, అదనంగా తిరుపతి వెంకటేశ్వరస్వామికి కూడా మొక్కుకుంది – ఎందుకైనా మంచిదని. ఓ ఆదివారం నాడు బయలుదేరి, మధ్యాహ్నం పూట – రిచర్డ్, అతని భార్యా చర్చి నుంచి ఇంటికి వచ్చే వేళకి – భీమిలి చేరుకున్నారు.

“రిచర్డ్ సర్! మేమా సూదికొండ సాధువుని కలుసుకోవాలంటే వీలవుతుందా?” ప్రాధేయపడుతూన్నట్లుగా అడిగాడు, రాంబాబు.

“ఆయనగానీ, ఆయన శిష్యులుగానీ చాలా కాలంగా కనబడలేదు. తీర్థయాత్రలకు వెళ్లాడేమో అనుకున్నాం. గతంలో అలా వెళ్లినప్పుడు ఒకటి రెండు నెలల్లో వచ్చేసేవాడు. ఈసారి ఆరు నెలలపైనే అవుతోంది. నేను విన్నదేమిటంటే – తన ప్రథమ కోపాన్ని వొదిలించుకొనే దాకా తిరిగిరానని శిష్యులకి చెప్పి హిమాలయాలకు వెళ్లిపోయాడట. ఆఖరిసారి కలిసినప్పుడు ఒక విచిత్రమైన మాటన్నాడు. నాకు బాగా గుర్తుండిపోయింది,”

“ఏమన్నాడు?”

“మనమంతా కొన్నివేల ఏళ్లుగా నడుస్తూన్న నాటకం చూస్తున్నామట!”

“చాలామంది వేదాంతులు అలానే అంటారు.”

“అవును. కానీ ఇతనేమంటాడంటే – ఆ నాటకం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు; మనం చూసేది ఒక జీవితకాలమే; మూడు గంటల సినీమాని మధ్యలో ఎక్కడో ఒక అర సెకెండు చూసినట్లన్నమాట. మనం చూసిందే నాటకం అనుకుంటాంగానీ, అది చాలాచాలా స్వల్పం. అంచేత మనకి తెలిసిందే పరమసత్యం అనడం మూర్ఖత్వం. మొత్తం తెలుసుకోవాలంటే ఎవరికీ సాధ్యం కాదు. ఋషులకి, మహానుభావులకి కొన్ని సైగలు అందుతాయి; వాళ్లు వాటితోనే అల్లుకుపోతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం; మనకన్నా ముందు ఎంతోమంది ఈ నాటకాన్ని ఎంతో కొంత చూశారు. ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాళ్లు చెప్పినవాటిల్లో నలుగురికీ ఉపయోగపడేవి తీసుకోవాలి.”

“మాబాగా చెప్పాడు,” అన్నాడు రాంబాబు, అతనికి పెద్దగా నమ్మకాలు లేకపోయినా.

భవానీ చిన్నతనంలో ‘కురుక్షేత్రం’ నాటకం చూడడం గుర్తు చేసుకున్నది. నాటకం ఎంతసేపటికీ మొదలవ్వలేదు; అమ్మ ఒడిలో నిద్రపోయింది. మధ్యలో తెలివొచ్చింది. ఎవరో – ‘అడుగో, రెండో కృష్ణుడు,’ అన్నారు. ఇంకెవరో ఈల వేశారు. వొచ్చీ రావడంతోటే రెండో కృష్ణుడు పద్యం అందుకున్నాడు. భవానీ కాసేపు నాటకం చూసింది. కృష్ణుడు పద్యం ముగించి ముక్తాయింపు ఎత్తుకున్నాడు; అదలా సాగుతూనే ఉంది. భవానీకి ఆకలైంది. అమ్మ ఇచ్చిన జంతిక తిని, మరచెంబు వొంచి నీళ్లు తాగి, పద్యం వింటూ, మళ్లీ నిద్రపోయింది. మర్నాడు పొద్దున్న ఇంట్లోనే లేచింది.

***

ఆరోజు ఇంటికి వెళ్లాక సాధువు అన్న మాటలను దంపతులిరువురూ మననం చేసుకున్నారు. కూరలు తరిగి అందించిన భర్తకి చిన్ననాటి ‘కురుక్షేత్రం’ సంగతి వివరించి, వంట చేస్తూనే, భవానీ ఇలా అన్నది:

“మనం సూసినా సూడప్పోయినా నాటకం నడుస్తుంటాది. అందరు సూసీదీ అదే నాటకం; మనం సూడ్డంలేదనీసి కత మారిపోద్దేటి? కతా మారిపోదు; నాటకవూఁ ఆగిపోదు. ఆ పాండవులూ అంతే, ఆ కౌరవులూ అంతే; ఆల్లు ఉండుండి మరోలాగైపోతారేటి? ఆల్లు మారరు. అందుకే కదా, రాయబారాలు పన్జెయ్యలేదు; ఉట్టి పున్నేన ఏ రాజయినా రాజ్జం ఒదిలీసుకుంటాడేటి?”

రాంబాబుకి, ‘ఏదో రూపంలో యుద్ధం నడుస్తూనే ఉంటుంది,’ అని చివరిసారిగా కలుసుకున్నప్పుడు నాయుడన్న మాటలు గుర్తుకొచ్చాయి.

“అంటే యుద్ధాలు తప్పవంటావు?”

“మరేటి? అయిదూర్లడిగినా కౌరవులు ఇచ్చారు కాదు. మరా క్రిస్న బగమానుడే యుద్ధం తప్పించకుండ పల్లకుండిపోండు. జగడం మొదలవ్వడంతోటే, ‘ఆలు, ఈలని సూడకండగ బానం ఏసీవోయ్, బావా!’ అనీసి పురమాయించీనేదా? ఆయనకన్నీ ఎరికే.  ఈ బూమండలంల ఆస్తులున్నంత కాలం ఆస్తి తగాయిదాలూ ఆగవు; రాజ్జాలున్నంత కాలం రాజ్జం కోసం కొట్టుకోని సావడాలూ ఆగవు. నాటకం నడుస్తానే ఉంటాది. పద్దెం పాడీవోడు పాడతానే ఉంటాడు; కత్తి తీసీవోడు తీస్తానే ఉంటాడు,” అన్నది, భవానీ.

“ఎంత బాగా చెప్పేవే, పిల్లా!” అన్నాడు రాంబాబు, నవ్వుతూ. భార్య తెలివితేటలకు మురిసిపోయి, ఆప్యాయంగా ఆమెను వెనకనుండి వాటేసుకున్నాడు.

“మీద పడక, పొయ్యి కాడున్నాను!” అంటూ, మోచేత్తో మొగుడ్ని డొక్కలో పొడిచి వొదిలించుకుంది.

రాంబాబు నవ్వుతూనే ఉన్నాడు.

“ఇకటాలు సాలుగాని, బేగెల్లి కంచాలు తియ్యి, ఒడ్డించేస్తాను!” భర్తని గదమాయించి, నుదిటికి పట్టిన చెమటని పైటతో తుడుచుకుంది భవానీ.

*

ఉణుదుర్తి సుధాకర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భవానీ రాంబాబు నాయుడు రిచర్డ్ .. చెదిరిన పాదముద్రలు నవల్లోని పాత్రలు నాలుగంకాల జగన్నాటకంలోకి నడిచొచ్చేశారు. నాటకం మనం ఉన్నా లేకపోయినా చూసినా చూడకపోయినా నాడుస్తూనే వుంటుంది. ‘కాలో హి నిరావధి: విపులా చ పృధ్వీ’ కాలం నిరంతరం, అవిచ్చిన్నం. దాన్ని మనకు తెలిసిన మనం చూసిన విన్న చరిత్రలోకి కుదించి ఆలోచిస్తాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.