నానా గురించి ఎలా చెప్పాలి?!

కొంతమంది గురించి చెప్పాలి అంటే అక్షరాలు సరిపోవు. విశేషణాలు మూగవోతాయి.అలంకారాలు అలంకారప్రాయం అవుతాయి. ఏ అలంకారమూ లేకుండా నిరలంకారంగా వాళ్ళను పిలవడమే వాళ్లకు మనం ఇవ్వగల అతిపెద్ద గౌరవం.అలాంటి వ్యక్తులకు మరణం ఉండదు.మరణించిన క్షణం నుండీ వాళ్ళు ప్రజల జ్ఞాపకాలలో,హృదయాలలో,మాటలలో,పాటలలో,చేతలలో జీవించడం మొదలు పెడతారు.అవును. They start living freshly. అదుగో అలాంటి అరుదైన మనిషి   నానా పటేకర్.

నానా మనందరికీ నటుడుగా తెలుసు. కానీ చాలా కొద్దీ మందికే అతడు పరిపూర్ణమైన మనిషిగా తెలుసు. నానా పటేకర్ ను తలచుకుంటే చాలామందికి పరిందా గుర్తుకువస్తుంది.క్రాంతివీర్,అగ్నిసాక్షి,ప్రహర్ అబ్ తక్ చప్పన్,సలాం బాంబే, నట సామ్రాట్ ఇలా చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి.తబ్రేజ్ ఆలమ్ గుర్తుకు వస్తాడు.బ్రిజ్ గోపాల్ గుర్తుకు వస్తాడు. గణపత్ బెల్వాల్కర్ గుర్తుకువస్తాడు. కానీ నాకు మాత్రం

“జీవితం నేను ఆశించిన దాని కన్నా ఎక్కువే ఇచ్చింది.మన అవసరాలు పరిమితంగా ఉంటే ప్రతిదీ సుఖంగానే అనిపిస్తుంది.అలాంటి జీవితమే నాకిష్టం. నగరాలలో మనుషుల చుట్టూ గోడలు ఉంటాయి. మేముండే  చోట చుట్టూ కొండలు ఉంటాయి.వాటి మధ్యే మేం జీవిస్తాం . అక్కడ జీవితం సులువుగా ఉంటుంది ” అని చెప్పే సంతృప్త మానవుడు గుర్తుకువస్తాడు.

నెలకు 35 రూపాయలు సంపాదించే స్థాయి నుండి దాదాపు 80 కోట్ల ఆస్తిని సంపాదించిన నానా పటేకర్ తన చివరి ఆస్తి గా ప్రకటించింది 12 మణుగుల కట్టెలు మాత్రమే!

“మనందరం ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని విడిచి పోవాల్సిందే. ఎవ్వరూ ఇక్కడ శాశ్వతం కాదు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా చివరికి మనం చస్తే, శవాన్ని పూర్తిగా కాల్చడానికి 12 మణుగుల కట్టెలు కావాలి. నేను మిగిల్చేది అదొక్కటే.నా కోసం 12 మణుగుల కట్టెలను దాచి పెట్టాను. అవి కూడా ఎండు కట్టెలు. పచ్చి కట్టెలను వాడకండి. నేను దాచిన ఎండు కట్టెలతో నా అంత్యక్రియలు చేయండి. ఎందుకంటే పచ్చి కట్టెలతో కాలిస్తే ఆ పొగకు నా శవాన్ని చూడడానికి వచ్చినవాళ్ల కళ్లల్లో నీళ్లు వస్తాయి. అవి చూసి, వీళ్లంతా నా కోసం ఎంతగా ఏడుస్తున్నారో అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కనీసం చనిపోయే సమయంలో అయినా సరే ఇలాంటి అపార్థాలు, అపోహలు  లేకుండా పోతే బాగుంటుంది…’ అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు నానా. వేదాంతం అంటే మాటలు చెప్పడం కాదు. జీవితంలో ఆచరించి చూపించడం

కష్టాలలో ఉన్న రైతులు కుటుంబాలను ఆదుకునేందుకు నామ్ ఫౌండేషన్ స్థాపించి రైతులకు ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా నీటి సమస్య పరిష్కారానికి చాలా చెరువులను కుంటలను బాగుచేయించారు. కోటిన్నర రూపాయలతో కారుకొనాలని బయలు దేరి మధ్యలో మనసుమార్చుకుని ఆ కోటిన్నరను 15000 ల రూపాయల చెక్కులుగా మార్చి రైతులకు పంచిపెట్టారు.

ప్రహార్ ది ఫైనల్ అటాక్ లో నటించిన నానా పటేకర్ ఆ తెర మీది పాత్రను కార్గిల్ యుద్ద సమయం లో నిజజీవితం లో పోషించారు. లేహ్,బారాముల్లా,కుప్వారా,ప్రాంతాలలో 60 రోజులపాటు యుద్ధం లో పనిచేశారు.క్విక్ రియాక్షన్ టీమ్ లో నానా పనిచేసారు.యుద్ధం లోకి వెళ్ళేటప్పుడు 76 కిలోల బరువున్న నానా బయటకు వచ్చేసరికి 56 కిలోలకు వచ్చారు. అంటే ఇరవై కిలోల బరువు తగ్గారు అంటే అక్కడ ఎలా పనిచేసారో అర్ధం చేసుకోవచ్చు. ప్రహార్ సినిమా కోసం తీసుకున్న శిక్షణ నానా కి అప్పుడు పనికి వచ్చింది

నానా ని చాలా మంది బిగ్గర్ దాన్ హీరో అంటారు. సహా నటులు ఆయన పక్కన నటిస్తే తాము కనపడమని భయపడతారు. ఈ మాటలన్నీ నిజమే. నానా కి కథ నచ్చాలి. పాత్ర నచ్చాలి. నచ్చితే తప్ప చేయడు. ఒకసారి కమిట్ అయితే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. “ఆ గయే మేరే మౌత్ కా తమాషా దేఖ్నే ! హాసో ఖుషియా మనావో” అంటూ క్రాంతివీర్ లో థియేటర్ లో ప్రేక్షకుడిని ప్రేక్షకుడుగా ఉండనీయక ఒక ఆవేశం లోకి, ఒక అపరాధ భావంలోకి ఒకేసారి తీసుకుని వెళతాడు. ఫైరోఫోబియా తో నిప్పుని చూస్తే గజగజా వణికిపోతూనే   సొంత భార్యాపిల్లలలను సజీవదహనం   చేసే అన్నా సేథ్ గా పరిందాలో ప్రేక్షకుడికి భయం,బీభత్సం ఏక కాలం లో రుచి చూపిస్తాడు.

నానా గురించి చెప్పాలి అంటే ఎన్ని హ్యూమన్ డైనామిక్స్ తెలిసి ఉండాలి. ఒకసారి ముంబై లోనో, హైదరాబాద్ లోనో సరిగ్గా తెలియదు కానీ హోటల్ లో రిలాక్సింగ్ విశ్రాంతి తీసుకుంటున్నాడట నానా. గది కిటికీ తలుపు తెరిస్తే మంద్ర మంద్రంగా వేణుగానం గాలి అలలలో తేలి వచ్చి నానాను చుట్టుముట్టింది. హోటల్ బోయ్ ను పిలిచి ఆ రికార్డ్ ఎవరిదీ అని అడిగారట. అప్పుడా హోటల్ బోయ్ రికార్డ్ కాదు కింద ఒక సంగీత కచేరీ జరుగుతున్నది అని చెపితే నానా కిందకు వెళ్లి ఆ వేదిక దగ్గర అలా నిలబడి ఆ కచేరీ మొత్తం ఆస్వాదించాడట. కచేరీ మొత్తం అయిపోయాక వేణు గాన కళాకారుడిని కలిసి “నా పేరు నానా పటేకర్! మీ గానం అద్భుతం” అని పరిచయం చేసుకున్నారట.

ఇంత సింప్లిసిటీ మరొక నానా స్థాయి నటుడిలో మనం చూడలేము. అందుకే నానా ను బిగ్గర్ దాన్ హీరో అని కాదు బిగ్గర్ దాన్ హ్యూమన్ బీయింగ్ అనాలి అనిపిస్తుంది

బిగ్గర్ దాన్ హ్యూమన్ బీయింగ్ అని నేను అంటే చాలా మందికి కోపం రావచ్చు. తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు గుర్తుకు రావచ్చు. వెలుగు నిచ్చే లాంతరు వెనుక కూడా చీకటి ఉంటుంది. కాదు అనలేము. తనుశ్రీ దత్తా 2008 లో నానా తనతో అనుచితంగా ప్రవర్తించాడు  అని 2018లో ఆరోపించింది. నానా ఆ ఆరోపణలను ఖండించారు. పోలీస్ కేస్ అయింది. కోర్ట్ కి వెళ్ళింది. పదిహేను మంది సాక్షులను విచారించిన కోర్ట్  నానా అనుచిత ప్రవర్తనకు తగిన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పింది. 2025 లో కేసు డిస్పోస్ అయింది. నానాను నిర్దోషి అనలేదు. అలా అని దోషి అని కూడా అనలేదు.కనుక మనం కూడా నానా గురించి ఏ జడ్జెమెంట్ ఇవ్వకూడదు అనుకుంటాను.  నానా చనిపోయాక తనుశ్రీ దత్తా మాత్రం Evil Dead అని ట్వీట్ చేసింది.

నానాకి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి, ఒక పద్మశ్రీ వచ్చింది,మరికొన్ని ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి ఇవన్నీ నటుడుగా అతడి ప్రతిభకు కొలమానాలు అయితే కావచ్చు కానీ మనిషి గా అతడి ఎత్తును కొలిచే అవార్డు ఏదయినా ఉన్నదా మనం ఇవ్వడానికి. హృదయం లో అతడికో సింహాసనాన్ని కేటాయించడం తప్ప

మిస్ యు నానా!

*

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.