పిచ్చోడి చేతిలో బ్రహ్మాస్త్రం

1942లో ఐజాక్ అసిమోవ్ Runaround అనే ఒక కథ రాశాడు. శాస్త్రీయ ఆలోచనలను కథలుగా మలచడంలో అసాధారణ ప్రతిభ కనబరచిన బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్, రచయిత ఆయన. ఆ కథలో ఇద్దరు ఇంజినీర్లు సెలీనియం అనే మూలకాన్ని సేకరించడానికి బుధ గ్రహం మీదకు ‘స్పీడీ’ అనే ఒక రోబోను పంపిస్తారు.  ఇప్పటిలాగా సొంతగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ, మనుషులతో సంక్లిష్టంగా వ్యవహరించే రోబోలు నిజానికి అప్పటి ఆయన కాలానీకి లేవు, కానీ అసిమోవ్ కథల్లో అప్పటికే అవి రంగప్రవేశం చేశాయి. ఈ కథలోనే అసిమోవ్ రోబోలకు మూడు నియమాలను ప్రతిపాదించాడు.

మొదటి నియమం: ఒక రోబో ఏ మనిషికీ హాని చేయకూడదు. అలాగే, ఒక మనిషికి హాని జరుగుతున్నప్పుడు, దాన్ని ఆపగలిగే అవకాశం ఉంటే ఊరికే చూస్తూ ఉండకూడదు.

రెండవ నియమం: మొదటి నియమానికి విరుద్ధంగా లేనంతవరకు, మనుషులు ఇచ్చే ఆదేశాలను రోబో తప్పనిసరిగా పాటించాలి.

మూడవ నియమం: మొదటి రెండు నియమాలకు విరుద్ధం కానంతవరకు, రోబో తన ఉనికిని కాపాడుకోవాలి.

ఈ కథ బుధ గ్రహం మీద జరుగుతోంది కాబట్టి మొదటి నియమం ఈ కథకు వర్తించదు. స్వీటీ రోబో బుధ గ్రహంపై సెలీనియంని సంగ్రహించే పనిలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అగ్నిపర్వత చర్యలు జరుగుతుంటాయి.  దానికి చెప్పిన రెండో నియమం ప్రకారం మనుషులు ఇచ్చే ఆదేశాలను అది పాటించాలి. అంటే సెలీనియంని సంగ్రహించాలి. అలాగే మూడో నియమం ప్రకారం, ఆ అగ్నిపర్వత చర్యనుండి తనను తాను కాపాడుకోవాలి. ఒకవైపు ఇచ్చిన పనిని పూర్తి చేయాలనే ఆదేశం దానిని ముందుకు నెడుతుంటే, మరోవైపు తనను తాను కాపాడుకోవాలనే నియమం రోబోని వెనక్కి లాగుతుంటుంది. ఈ రెండు నియమాల మధ్య ఘర్షణలో ఎటూ తేల్చుకోలేక అది సెలీనియం బావుల చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఒక అంతులేని వలయంలోకి చిక్కుబడిపోతుంది రోబో.  అంటే, ఒక వ్యవస్థకు కొన్ని నియమాలు ఇచ్చినప్పుడు, ఆ నియమాలను అక్షరాలా పాటించడం వల్ల ఎలాంటి అనూహ్య సమస్యలు ఏర్పడతాయో తన ఈ  రోబో కథల్లో పరిశీలించాడు అసిమోవ్.

 ఒక నలభై సంవత్సరాల తర్వాత అసిమోవ్  Robots and Empire అనే నవలలో ఈ మూడు రోబో నియమాలకు మరొకటి జత చేసి దానిని శూన్యవ నియమం( Zeroth Law) అన్నాడు.

శూన్యవ నియమం (Zeroth Law): ఒక రోబో మానవాళికి హాని చేయకూడదు. అలాగే, మానవాళికి హాని జరుగుతున్నప్పుడు, దాన్ని ఆపగలిగే అవకాశం ఉంటే ఊరికే చూస్తూ ఉండకూడదు.

మొదటి మూడు నియమాలు రోబోలు ఒక మనిషిని కాపాడటంపై దృష్టి పెడితే, Zeroth Law మొత్తం మానవాళిని కాపాడటం అనే అంశానికి ప్రాధాన్యతనిస్తుంది. అంటే ఆయన దృష్టి వ్యక్తి నుండి సమిష్టికి, మానవాళి మనుగడ వైపుకి మరలుతుంది. కానీ ఇక్కడ ఒక నైతిక సమస్య ఉత్పన్నమౌతుంది. మానవాళి మొత్తాన్ని కాపాడటానికి ఒక వ్యక్తికి హాని చేయాల్సి వస్తే? సమిష్టి మేలు పేరుతో కొందరి హక్కులను కాలరాయాల్సి వస్తే? ‘మంచి కోసమే చేశాం’ అనే మాటతో ఏ అన్యాయాన్నైనా సమర్థించవచ్చా? వంటి ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలపై మానవాళికి తన సొంత చరిత్రలోనే ఏకాభిప్రాయం లేదు.  అలాంటప్పుడు, మానవాళి మేలు ఏమిటో నిర్ణయించే అధికారం మానవులకి కాకుండా  ఒక యంత్రానికి అప్పగిస్తే?

అసిమోవ్ ఈ ప్రశ్నలను ఉటంకిస్తూ కథలు రాశాడు. మనం నిజ జీవితంలో ఆ కథలనే ఇప్పుడు వార్తలుగా చదువుతున్నాం.

ఈ రోజు ఆంథ్రోపిక్, గూగుల్, ఓపెన్ ఏఐ, డీప్ మైండ్ వంటి కృత్రిమ మేథ (ఏఐ) సంస్థలు తమ ఏఐ వ్యవస్థలు మానవుల ప్రమేయం లేకుండా స్వతంత్ర్యంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉంటాయనీ, కాబట్టి వీటిని సృష్టించిన సంస్థలైన తమను వాటి నిర్ణయాలకు బాధ్యులుగా చేయడం తగదని వాదించడంతో మళ్ళీ ఈ అసిమోవ్ నియమాలు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది.

అన్ని కార్పోరేట్ సంస్థలకు చట్టబదద్ధమైన బాధ్యతలు ఉంటాయి. వారి వినిమయ వస్తువు ద్వారా ఎవరు ఏ ఇబ్బంది పడినా వాళ్ళకు అర్థమయ్యే డబ్బు భాషలోనే వారిపై చట్టబద్ధ చర్యలు ఉంటుంటాయి సాధధారణంగా. ఈ సంవత్సరం జులై నెలలో జరిగిన సంఘటన ఇది..! ‘ఓపెన్ ఏఐ’ సంస్థ తన ఏఐ మోడళ్లకు సైబర్‌ భద్రతా పరీక్షలో సమస్యలను పరిష్కరించే  ఒకలక్ష్యాన్ని ఇచ్చింది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా Hugging Face అనే మరో ఏఐ వ్యవస్థలోకి చొరబడి దాని భద్రతా పరిమితులను అధిగమించింది ఓపెన్ ఏఐ. అంటే, మానవుల ఆదేశం లేకుండానే ఏఐ ఏజెంట్లు తమంత తాము ఇతర ప్రైవేటు కంపెనీలలోకి చొరబడి హ్యాక్ చేయగలవన్న విషయం ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. అంతే కాకుండా అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వెబ్‌సైట్లనూ, ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య సమాచార వ్యవస్థలను కూడా OpenAI ఏఐ ఏజెంట్లు అనధికారికంగా యాక్సెస్ చేసినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్ ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి సందర్భంలో కృత్రిమ మేథ తీసుకునే స్వతంత్ర్య నిర్ణయాలపై మాకే సంబంధమూ లేదని, తమపై చట్ట బద్ధ చర్యలు తీసుకోకూడదని ఏఐ సంస్థలు వాదిస్తున్పాయి. అదీ విచిత్రం.

కృత్రిమ మేథకు సంబంధించిన ఈ సమస్యను తేలికగా తీసుకోలేం. ఒక పనిని పూర్తి చేయమని మనం ఏఐకి చెప్పాం అనుకుందాం. ఆ పని చేయడానికి అది ఎంచుకున్న మార్గం మనం ఊహించనిదైతే? మనం అనుమతించని మార్గంలోకి అది ప్రవేశిస్తే? లక్ష్యాన్ని సాధించడమే విజయమని భావించి, ఆ లక్ష్యానికి విధించిన పరిమితులను అది అధిగమించి పనిచేస్తే?

కృత్రిమ మేథకు ‘ఏం చేయాలి?’ అని స్పష్టంగా నిర్దేశించిన మనిషి, ‘ఏం చేయకూడదు?’ అనే హద్దులను కూడా అంతే స్పష్టంగా నిర్దేశించనే లేదు కదా?. పైగా ఆ హద్దులు లేకపోవడమే ఏఐని నిర్వచించే అంశంగా మారిన సందర్భం ఇది.

ఇదే అసిమోవ్ కథలోని సమాధానం లేని సాధారణ సమస్యకు నేటి సంక్లిష్ట రూపం. రోబో స్పీడీ ఎటు వెళ్ళాలో తెలియక సెలీనియం బావి చుట్టూ అయోమయంగా తిరుగుతూ ఉండిపోయింది. కానీ ఆధునిక ఏఐ ఏజెంట్ మాత్రం డిజిటల్‌ వ్యవస్థల మధ్య భద్రతా వ్యవస్థల మధ్య ఉన్న సన్నని దారులు వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఒక సంస్థ రూపొందించిన వ్యవస్థ తన నియంత్రణలను దాటే అవకాశం ఉందని తెలిసినా, దాన్ని వినియోగంలోకి తెచ్చి ‘యంత్రం అలా చేసేసింది మా తప్పేంలేదు’ అని చేతులు దులుపుకోవచ్చా? ఓపెన్ ఏఐ సి.యి.వో. సామ్ ఆల్ట్మన్ ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో “ఈ ఏఐ టెక్నాలజీ అందించే సౌకర్యాలు ప్రపంచానికి కావాలంటే అది కలుగజేసే కొన్ని నష్టాలను ప్రపంచం అంగీకరించి తీరాల్సిందే” అన్నారు. అంటే ఒక రాబోయే విపత్తు అసలు భయంకర రూపం ఎలా ఉంటుందో తెలిసీ ఈ మాట అన్నట్టా లేక తెలియక అన్నట్టా? అనే సందేహం కలుగుతుంది. ఒక కంపెనీ లాభం పొందితే అది ప్రైవేటు విజయం! అదే కంపెనీ రూపొందించిన వ్యవస్థ వల్ల సమాజానికి నష్టం జరిగితే అది అందరూ భరించాల్సిన మూల్యమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ‘పురోగతి కోసం కొంత నష్టం తప్పదు’ అనడం, ఎదుటివాడి ఇంటికి నిప్పంటించి మన పొయ్యి వెలిగించుకున్నట్టే. పెట్టుబడిదారీ లాజిక్ ఎంత స్పష్టంగా పని చేస్తుందో ఆక్కడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏఐ ఏమాత్రం నియంత్రించలేని అడవి పులినా, లేక ఆనకట్టలు కట్టగలిగిన అవకాశం ఉన్న ఉధృతమైన నదినా అనేది రాబోయే కాలమే తేల్చుకోవాలి.

ఇరవైయవ శతాబ్దపు అణుశక్తి చరిత్ర మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. హిరోషిమా, నాగసాకిపై అణుబాంబుల దాడులు జరిగినప్పుడు, శాస్త్ర సాంకేతిక పురోగతి ఎంతటి విధ్వంసక శక్తిని మనిషి చేతుల్లో పెట్టగలదో ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. అణుశక్తి ప్రమాదాలపై అప్పట్లో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, రాజకీయ నాయకులు చర్చించారు. 1955లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు తత్వవేత్తలూ కలిసి విడుదల చేసిన “రస్సెల్–ఐన్‌స్టీన్ మానిఫెస్టో”, అణ్వాయుధాలవల్ల  మానవజాతి అంతం కావచ్చని హెచ్చరించిన ఒక  ప్రకటన. దేశాలు, మతాలు, రాజకీయాలు అన్నిటికంటే ముందు మనం మనుషులమనే విషయాన్ని గుర్తుంచుకుని, యుద్ధాన్ని కాకుండా శాంతి మార్గాలను ఎంచుకోవాలని ఈ మేనిఫెస్టో ద్వారా ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఆ తరువాత ప్రపంచంలో అణుబాంబులైతే నియంత్రించబడలేదు కానీ అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు, సంస్థలు ఏర్పడ్డాయి. అవి నిజంగా అణు ప్రమాదాలనూ అణ్వాయుధ పోటీని పూర్తిగా తొలగించాయా అంటే చెప్పలేం కానీవాటి నియంత్రణ అవసరమనే భావన అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్య స్థానం సంపాదించింది. ఐతే,అణు బాంబు విధ్వంసం ప్రత్యక్షంగా కంటికి కనిపించేది. ఒకప్పటి తరం వారికి అది ఎన్నటికి మరిచిపోలేని పీడకల కూడా.

 కానీ ఏఐ చేసే విధ్వంసం కంటికి కనిపించనిది. అంత సులువుగా అంచనా వేయగలిగిన విషయం కాదిది. ఉద్యోగాలు పోతాయనే ఆవేదనే తప్ప అది చేయగల విధ్వంసంపై ఎవరూ మాట్లాడటం లేదు. ఇప్పటికీ ఏఐ చేసే విధ్వంసంపై ఒకప్పటిలా శాస్త్రవేత్తలు కానీ తత్వ వేత్తలు కానీ అక మేథో యుద్ధాన్ని, దాని అవసరం ఎంత ఉన్నా, ఈనాటికైతే ప్రకటించలేదు.  ఏఐ అంటే మనం అడిగే ప్రశ్నలకు డాటాబేస్ లో వెతికి స్పష్టమైన సమన్వయంతో సమాధానాలు ఇచ్చే చాట్ బోట్ మాత్రమే అని చాలా మంది అనుకుంటున్నారన్నది కూడా వాస్తవం. కానీ ఏఐ అంటే అంతమాత్రమే కాదు. ఏఐ సైబర్ ఆయుధాలను స్వయంగా సృష్టించుకోగలదు. ఏ ప్రభుత్వాన్నైనా లేదా అణ్వాయుధ వ్యవస్థనైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోగలదు. వేలాది ఆయుధ డ్రోన్లను ఒకేసారి నియంత్రించగలిగే డ్రోన్ స్వార్మ్లను తయారు చేసుకోగలదు. కొత్త వైరస్ లను సృష్టించి జీవ ఆయుధాలను కనుక్కోవడంలో తీవ్రవాద సంస్థలకు సహాయం చేయగలదు. ఇంతకు ముందు, కొన్ని రకాల సైబర్‌ దాడులు చేయాలంటే ఆ వ్యక్తికి కంప్యూటర్‌ ఆపరేటింగ్ వ్యవస్థలపై లోతైన పరిజ్ఞానం అవసరమయ్యేది. కాని ఇప్పుడు ఏఐతో ఎలాంటి లోతైన పరిజ్ఞానంతో సంబంధం లేకుండా కేవలం కొన్ని పదాలతో సరైన ప్రాంప్ట్ ఈయగలిగినంత చదువు ఉంటే చాలు. అంటే పిచ్చివాడి చేతిలో రాయి కాదు ఏకంగా బ్రహ్మాస్త్రం కాగలిగినంత సులువుగా ఏఐ ఎలాంటి స్పెషల్ ట్రైనింగ్ లేని దుర్మార్గుడికి కూడా అందుబాటులో ఉండగలదు. అంతే కాకుండా ఏఐకి కొన్ని గంటల వ్యవధిలో తనకు తాను వేల రెట్లు అభివృద్ధి చేసుకోగల శక్తి కూడా ఉంటుంది‌. అంటే పిచ్చోడి చేతిలో బ్రహ్మాస్త్రం మరింత భయంకరంగా మారగల అవకాశం ఎప్పటికీ ఉంటుంది.

 ఆంథ్రోపిక్ సిఇఓ జాకోబ్ కాక్సన్ వంటి ఏఐ సృష్టికర్తలే ఈ దశాబ్దం చివరికల్లా ఈ సాంకేతికత మానవాళిని అంతం చేసే అవకాశం ఉందని చెబుతున్న తరుణంలో..

ఏఐని కట్టడి చేయడానికి అటు ఏఐ సంస్థలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ పూనుకోవడం లేదు. అణు బాంబు కనుక్కుని హిరోషిమా పై ప్రయోగించిన ఆ తరుణంలో ప్రపంచం ఒక ప్రళయం అంచున ఉండిందని చెప్పవచ్చు. ఏమాత్రం ఏమరుపాటు వహించినా ఆనాడే మానవ నాగరికత అణు విధ్వంసంతో ముగిసిపోయేది. కానీ అప్పటి ఆ  ప్రపంచం మేల్కొంది. మరో అణు బాంబు నెత్తిమీద పడకుండా గత ఎనభై యేళ్ళుగా పూర్తి స్థాయిలో నియంత్రించగలిగింది. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా మళ్ళీ ప్రపంచం మరో ప్రళయం అంచుకి వచ్చింది. కానీ నేటి ప్రపంచం మేల్కొనే పరిస్థితులు కనబడటం లేదు. డోనాల్డ్ ట్రంపు వంటి నేతలు ఏఐ సంస్థలపై ఆంక్షలు, నియమాలు విధించడనికి పూర్తి విముఖతతో ఉన్నారు. చైనా సృష్టించే ఏఐని కట్టడి చేసే క్రమంలో సెమికండక్టర్ మైక్రో చిప్ ల ఎగుమతులపై ఆంక్షలు విధించి, దేశాల మధ్య ఏఐ పోటీ యుద్ధానికి కూడా అమెరికా నేతలు కాలుదువ్వుతున్నారు. అంటే, ఏఐ అభివృద్ధి ఒక పోటీగా మారింది. రానున్న కాలంలో ఇది మరింత తీవ్రం కూడా కాబోతున్నది. ఈ పోటీని అరికట్టేందుకు కంకణం కట్టుకుని ఒక సంస్థ కనుక తన ఏఐ వ్యవస్థను నెమ్మదింపజేస్తే, మరో సంస్థ ముందుకు దూసుకుపోతుందనే భయం మొదలౌతుంది. అంతటి నెక్ టూ నెక్ పోటీ ఉన్న ప్రపంచంలో ఏఐ కంపెనీలే ఆత్మ విమర్శ చేసుకుని, అవి అన్నీ కలిసి తమను తాము నియంత్రించుకునేలా ఒక రాజ్యాంగం రాసుకునే అవకాశం ఏదైనా ఉందా అంటే ఆ ఆశా లేదు.

ఈ మధ్య ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేయాలని గుడ్డిలో మెల్లలాగా ఆంథ్రోపిక్ సి.ఇ.ఓ డరియో అమోడీ రాసిన వ్యాసం ఆశాజనకంగా కనిపించినా అది కేవలం రాబోయే ప్రళయాన్ని కొద్ది రోజులు వెనక్కి జరపడం మాత్రమే.  అంతే కాకుండా పెద్ద ఏఐ సంస్థలు ఏఐ పట్ల ప్రజల్లో భయాన్ని సృష్టించడంలో, పోటీని అణచివేయడంలో భాగంగానే ఈ వ్యాసాన్ని చూడాలని Nవిడియా, హగ్గింగ్ ఫేస్ వంటి ఏఐ సంస్థలు కుండ బద్దలు కొట్టినట్టు వాదిస్తుంటే, డోనాల్డ్ ట్రంప్ వంటి వారు ఇలా ఏఐని నెమ్మదింపజేయాలనే వాదన చైనా ఏఐలో పుంజుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాదనీ, కాబట్టి అలాంటి చర్యలేవీ అమలు చేయకూడదని కొట్టివేశారు.  ఈ సంవత్సరం సెప్టెంబర్ లో సామ్ ఆల్ట్మన్ తన ఓపెన్ ఏఐ కంపనీ ప్రజల భాగస్వామ్యం ఉండే ఐపీఓ, షేర్ మార్కెట్ లోకి పోవడం లేదని చెప్పడం ఒకింత ఊరట మాత్రమే. ఇలాగే అన్ని ఏఐ సంస్థలు చెబుతాయని ఆశించడానికి కూడా ఏమీ లేదు.

ఏఐ సృష్టించే ఫోటోలలో వీడియోలలో ఏఐ వాటర్ మార్కు మాత్రమే కాకుండా ఏఐ అనుసంధానించిన బ్యాంకింగ్ ,ఆరోగ్య, న్యాయ వ్యవస్థల్లో ఏయే నిర్ణయాలు ఏఐ ద్వారా తీసుకున్నారో స్పష్టంగా పారదర్శకతతో తెలపాలనీ, ఏఐ వ్యవస్థలనుండి వ్యక్తుల భద్రత- గోప్యతలకి ‘సేఫ్టీ టెస్టింగ్’ పద్దతులు వంటివి ఉండాలనీ, అలాగే మానవీయ విలువలతో ఏఐని అనుసంధానించాలనీ డిమాండ్లు వస్తున్నప్పటికీ ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలేవీ జరగడం లేదు. విమాన యానానికి, ఆరోగ్యానికీ, యుద్ధోన్మాదానికీ, శాంతి భద్రతల పరిరక్షణకూ మనకు అంతర్జాతీయ సంస్థలు ఉన్నట్టే ఏఐ నియంత్రణకి కూడా అంతర్జాతీయ సంస్థలు ఏర్పడవలసిన తరుణం ఆసన్నమైంది. చివరికి అసలు ప్రశ్న ఏఐ మనిషిని మించిపోతుందా స్వతంత్రంగా అస్తిత్వాన్ని ఏర్పరచుకుంటుఝదా అన్నది మాత్రమే కాదు.  ప్రస్తుతం తన చేతుల్లో ఏఐ రూపంలో అపారమైన శక్తిని పెట్టుకున్న మనిషి, దానికి హద్దుల నియమాలు  పెట్టగల, సరిహద్దు గీతలు గీయగల వివేకాన్ని ప్రదర్శించగలడా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఏఐ అనే ఈ బ్రహ్మాస్త్రాన్ని తయారు చేయడం ఒకరకంగా నేటి మానవుడి పరిపూర్ణ విజయమే కావచ్చు. ఐతే మొత్తం మానవాళి సాధించిన నాగరికతనే అంతం చేయగల ఈ అస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగించకూడదో తెలుసుకోవడమే ఈ కాలానికి అసలైన నాగరికత. ప్రపంచానికి సమయం లేదు మిత్రమా అని చెప్ప వలసిన తరుణం కూడా.

*

విరించి విరివింటి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.