పసుపుకొమ్ము నవ్వింది

కనుచూపు మేర ఆకుపచ్చని పొలాలు. లేలేత వరికంకులతో చిన్న పిల్లల నవ్వుల్లా చిరుగాలికి అటు ఇటు ఊగుతున్నాయి. గాలి వరికంకుల నుంచి మట్టి… లేలేత ధాన్యపు గింజల జమిలి వాసనను మోసుకొస్తుంది.
పొలం గట్టు కాసింత బురదగా… ఒక్కోచోట కాసింత గట్టిగాను ఉంది.

కొన్ని గట్ల మీద ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవాలన్నంత తాపత్రయంతో ఉన్నాయి కొబ్బరి చెట్లు.

ఓ పొలం గట్టు పక్కనే ఉన్న మునగ చెట్టు కింద నుంచుని ఉన్నారు పలివెల గ్రామ కరణం కొప్పేశ్వర రావు. తెల్ల చొక్కా.. తెల్ల పంచ కట్టుకున్నారు. ఆయన ముఖం మీద ఎప్పుడూ ఉండే చిరునవ్వు మునగ పిందెలకి వేల్లాడుతున్న మంచు బిందువులా ఉంది.

కరణం కొప్పేశ్వర రావు గారి వెనుక ఆకాశం కమలా పండు రంగులో ఉంది.

కరణం గారిని దూరంగా నుంచుని చూస్తున్న వారికి కింద ఆకుపచ్చని పొలాలు, మధ్యలో కరణం గారి తెల్ల చొక్కా.. ఆయన నెత్తి మీద కమలా పండు రంగులో ఉన్న ఆకాశాన్ని కలిపి చూస్తే ఆ మూడు రంగులూ మధ్యలో అశోకచక్రం లేని జాతీయ జెండాలా కనిపిస్తోంది.

“కరణం గారూ.. ఈ రోజు కొలతలైపోతే బకాయి డబ్బు ఇచ్చేసి రిజిస్ట్రేషన్‌ చేయించేసుకుంటాం. ఆ పని కానివ్వండి ఎలాగైనా” అన్నారు కరణంగారి పక్కనే ఉన్న రమేష్‌.

“అలాగే చేసేద్దామనుకున్నా. కానీ పొలం ఆసామి శర్మగారి ఇంట్లో ఏదో ఆటంకం వచ్చింది. ఆయనే రెండు రోజులు ఆగమంటేనూ ఆగుతున్నాను” అని సమాధానం ఇచ్చారు కరణం కొప్పేశ్వర రావు గారు.
కాసింత దూరంగా నుంచున్న రమేష్‌ కరణంగారి కుడి చెవి దగ్గరికి వచ్చి

” ఓ మూడు లింకులు కలిపేయండి. తృణమో.. ఫణమో మీకే ఇచ్చుకుంటా. ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికి ఎక్కడం లేదు. మీకు కాకపోతే మీ అబ్బాయికి ఉపయోగపడతాయి కదా ఆ డబ్బులు” అన్నారు.

” ఇదిగో రమేషూ.. నీకు చాలాసార్లు చెప్పాను. ఈ వృత్తిలో ఉన్నది ప్రజలకు మేలు చేయడానికి. అంతే కాని ఇలా లింకులు కలిపేసి.. వీడదీసేసి నేనో, నా కుటుంబమో బాగుపడాలి అనుకోను. మీ నాన్నకి తెలుసు నేనేంటో… నా పని ఏంటో.. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు” అని కొప్పేశ్వరరావు మెత్తగా చివాట్లు పెట్టారు రమేష్‌కి.

“ఈయనింతే… ఆయన బాగుపడరు.. ఎదుటి వారిని బాగుపడనీయరూ. ఈ కాలంలో ఇలా ఉంటే ఎలా” అని మనసులోనే అనుకుని పైకి మాత్రం నవ్వుతూ….

” సరే మీ ఇష్టం. ఎల్లుండి పని పూర్తి చేసేయండి. ఉంటా” అంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు రమేష్‌.

రమేష్‌ వెళ్తున్న వైపు చూస్తూ… ” వీళ్లింతే మారరు. ఎదుటి వారి సొమ్ములు పాపిష్టివని వీళ్లకి ఎప్పుడు తెలుస్తుందో” అనుకుంటూ కరణంగారు కూడా ఇంటి ముఖం పట్టారు.

*** *** ***

కొప్పేశ్వర రావు గారి తండ్రిగారు మహదేవుడు గారు కరణంగా ఉండగా వాళ్లిల్లు లంకంత ఉండేది. ఇంటినిండా నౌకర్లు ఉండేవారు. వీధరుగు మీద ఎప్పుడూ ఓ పది మందికి తక్కువ కాకుండా ఉండే వారు. లౌకిక విషయాలతో పాటు లోకాభిరామాయణం కూడా సాగేది అక్కడ. ఇంటి పెరట్లో నిత్యాగ్నిహోత్రం. కాఫీలు, టిఫిన్లు… ఒక్కోసారి భోజనాలు కూడా అక్కడే.

మహదేవుడి గారి వయసు పెరుగుతూంటే ఆయన ఆస్తి పాస్తులు తరుగుతూ ఉండేవి.
మహదేవుడిగారు కాలం చేసే సరికి లంకంత ఇల్లు కూడా కొప్పేశ్వరరావుగారి చేయి దాటి పోయింది.
మహదేవుడు గారు ఉండగా బంధుమిత్రులకి చేసిన మర్యాదలకి ఉన్న నాలుగెకరాలు ఉళ్లో రాజుల పాలయ్యింది.
మహదేవుడు గారు తన ఒక్కగానొక్క కొడుక్కి వారసత్వంగా తన కరణీకాన్ని అప్పగించారే తప్ప పైసా ఆస్తి కూడా ఇవ్వలేదు.

అన్నట్లు ఎప్పటికీ కరిగిపోని… చేజారిపోని “పెద కరణంగారిలాగే ఈయనాను. పైసా కూడా ఎక్కువ తీసుకోరు” అనే మాటని మిగిల్చారు.
ఇంతే కాదు ” పెద కరణంగారి కంటే ఓ ఆకు ఎక్కువే కూడానూ ఈ చిన కరణంగారు. పెద్దాయన కనీసం పాలు, కూరగాయలైనా తీసుకునే వారు. ఈ చిన కరణంగారు అదీ లేదు” అనే మాటని కొప్పేశ్వర రావుగారు స్వార్జితంగా సంపాదించుకున్నారు.

*** *** ***

కొప్పేశ్వర రావుగారిది రోడ్డుకి ఆనుకుని ఉన్న చిన్న పెంకుటిల్లు. వీధరుగు ఎత్తుగాను, ఇంటి గోడలు పొట్టిగానూ ఉంటాయి.
నాలుగ్గదులున్న ఆ ఇంటిలో ముఖ ద్వారాన్ని ఆనుకుని ఉన్న మొదటి గదే కొప్పేశ్వర రావుగారి ఆఫీసు… నివాసం కూడా. భార్య కాలం చేసినప్పటి నుంచి ఆ చిన్న గదే ఆయనకు అన్నీ.

వరుసగా ఉన్న మిగిలిన మూడు గదుల్లోనూ రెండో గదిలో కొడుకు, కోడలు, మనవరాలు ఉంటారు. ఆ తర్వాత గదిలో ఓ మూల వంట కోసం కేటాయిస్తే ఈశాన్యం వైపున్న మూలని దేవుడి పటాలు ఉంటాయి. నాలుగో గది ఉన్నా లేనట్లే. అది వాడుకుందుకు పనికి రాదు. తీసేయడానికి వీలు కాదు.

ఈ నాలుగో గది గోడలు పెచ్చులూడి వాటి మధ్యలో మర్రి మొక్కలు మొలుస్తూంటాయి. ఒకటి రెండు చోట్ల వేప మొక్కలు కూడా మొలుస్తూంటాయి.

ఈ మొక్కల్ని పని పాటలేని కొప్పేశ్వర రావు కొడుకు చిన మహదేవుడు అప్పుడప్పుడు పీకేస్తూ ఉంటాడు. అయినా అవి మొలుస్తూనే ఉంటాయి.

ఆ మొక్కలు రావడం.. వాటిని చిన మహదేవుడు పీకేయడం ఓ ఆటలా నడస్తూంటుంది ఆ ఇంట్లో.
పెరట్లో ఓ మూల తాతల కాలం నాటి నుయ్యి. దానికి కొంచెం దూరంలో స్నానాల గది. దాన్ని ఆనుకునే పాయిఖానా.

ఈ రెంటికి మధ్యలో చేతి పంపు ఉంటుంది.

ఈ చేతి పంపు ఎప్పుడూ కిలుం పట్టి ఉంటుంది. పంపు కింద నీళ్లు వచ్చే చోట ఏనాడో వేసిన సిమెంట్‌ చప్టా ఉంది కానీ అది కనిపించదు. దాని చుట్టూ మట్టి పేరుకుపోయి బురద బురదగా ఉంటుంది.
ఆ బురద దగ్గరే నుంచుని పంపు కొట్టుకుని అక్కడే తండ్రీ, కొడుకు స్నానాలు చేస్తారు.
కోడలు, మనవరాలు మాత్రం సీవెండి బకెట్లోకి నీళ్లు కొట్టుకుని స్నానాల గదిలో తమ పని కానిస్తారు.

మనవరాలు సరే చిన్నపిల్ల… మిగిలిన ముగ్గురికి ఆ పంపు చుట్టూ బాగు చేయించాలని ఏనాడు అనిపించదు.
అక్కడ స్నానం చేసిన తర్వాత పాదాలంటిన మట్టిని చివరి చెంబులోకి పట్టిన నీళ్లతో ఇంటికి చివరి గది, పెరటికి మొదటి గది దగ్గరికి వచ్చి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోతారు.

ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాల కోసం పెరట్లోకి వచ్చే కొప్పేశ్వర రావు స్నానం తర్వాత వంట గదిలో మూలనున్న దేవుడికి ఓ దండం పెట్టుకుని తన గదికి వెళ్లిపోతారు.
ఇక మళ్లీ ఆ మర్నాటి ఉదయం వరకూ పెరటి వైపు తొంగి చూడరాయన. భోజనం కూడా తన గదిలోనే చేస్తారు.

*** *** ***

తండ్రి నుంచి వచ్చిన వారసత్వ కరణీకమే ఆ కుటుంబాన్ని పోషిస్తోంది. కొడుకు చిన మహదేవుడుకి తాను కరణంగారి మనవడ్ని…. కుమారుడ్ని అనే గర్వం నరనరాన జీర్ణించుకుపోయింది. ఏడాదికి ఒకసారి జమాబందీ లెక్కల సమయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడం మినహా మిగిలిన రోజుల్లో ఏ పని లేకుండా చిన మహదేవుడు రికామీగా తిరుగుతాడు. దీనికి తోడు రాత్రి అయితే స్నేహితులతో కలిసి తాగుడు కూడా నేర్చాడు ఈ మధ్య. పదోతరగతి కూడా పాస్‌ కాని కొడుకు చిన మహదేవుడికి తన తర్వాత కరణీకం కొడుకుదే అనే ధీమా కొప్పేశ్వర రావుగారికి ఉంది. పోనీ అని మధ్యలోనే కరణీకం అప్పగిద్దామా అంటే వాడు వినడం లేదని బాధ పడుతూంటారు కొప్పేశ్వర రావు గారు.

పెళ్లి చేస్తే ఓ దారిన పడతాడేమోనని బంధువులు, కొప్పేశ్వర రావుగారి స్నేహితులు చెప్తే “నిజమే కామోసు” అని పెళ్లి కూడా చేశారు.
పెళ్లి అయిన ఏడాదిన్నరకే తండ్రి అయ్యాడు చిన మహదేవుడు. కానీ బాధ్యతలు మాత్రం వంట పట్టలేదు.
కోడలు జానకి మంచి మనిషి. మామగారికి సమయానికి అన్నీ సమకూర్చడంతో పాటు ఇంటిని వొద్దికగా నడుపుకొస్తోంది.
తాను కాలం చేస్తే ఈ ఇల్లు ఎలా నడుస్తుందో అనే భయం వెంటాడుతూనే ఉంటుంది కొప్పేశ్వర రావు గారికి. “ఏది ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది” అనుకుని కాలం గడిపేస్తున్నారాయన.

*** *** ***

ఓ రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత రోజూలాగే గ్రామ సావిడి దగ్గరకు బయలు దేరారు కొప్పేశ్వర రావు గారు. వీధిలో నడిచి వెళ్తూంటే ఎదురైన వారంతా నమస్కరిస్తూనే ఆయన వైపే తరచి తరచి చూస్తున్నారు. ఆయనకి ఏం జరిగిందో తెలియక కాసింత ఆయోమయంలో ఉన్నారు.
అలా నడుచుకుంటూ గ్రామ సావిడి దగ్గరకు వచ్చేప్పటికి అక్కడే ఉన్న మునసబు గౌరి నాయుడు, మరి కొందరు పెద్ద వాళ్లు కొప్పేశ్వర రావు గారికి ఎదురొచ్చారు. ఓ నలుగురైదుగురి చేతిలో ఆ రోజు దినపత్రికలున్నాయి.

సావిడి దగ్గరున్న కుర్చీలో కొప్పేశ్వర రావు గారు కూర్చున్నాక మునసబు గౌరి నాయుడు ఓ దిన పత్రికని ఆయన చేతిలో పెట్టారు.
పత్రికని రెండు చేతుల్లోకి తీసుకుని మొదటి పేజీలో పతాక శీర్షికలో ఉన్న వార్త హెడ్డింగ్‌ చూసి చేతులు వణికాయి కొప్పేశ్వర రావు గారికి. పెద్ద పెద్ద అక్షరాల్లో “గ్రామ కరణం.. మనసబు వ్యవస్థ రద్దు” అది ఆ పతాక శీర్షిక. దాని కింద చిన్న అక్షరాల్లో “వారి స్థానాల్లో వీఆర్‌ఓలు” అని… “పాత వ్యవస్థకు చెల్లుచీటి” అని… “ప్రభుత్వ ప్రకటన ” అని రాసి దాని కింద వార్త మొత్తం ఉంది.

వార్త మొత్తం చదివేందుకు ప్రయత్నించారు కానీ కన్నీటి పొర చదవనీయ లేదు. వార్త సగం చదివి ఆ కుర్చీలోనే వేల్లాడిపోయారు కొప్పేశ్వర రావు గారు.

పక్కనే ఉన్న వాళ్లు ముఖం మీద కాసిన్ని నీళ్లు చల్లితే లేచారు. ఓ గ్లాసుతో మంచినీళ్లు ఇస్తే తాగారు.
ప్రధాన వార్త కింద ఓ బాక్సులో మరో వార్త “నెల రోజుల్లోనే కొత్త వ్యవస్ధ” అని ఉంది.
అంటే నెల తర్వాత తన కరణీకం ఇక ఉండదా. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఈ వృత్తి తనతోనే సమాప్తమా… ఏం చేయాలి.. ఎలా జీవితాన్ని నెట్టుకురావాలి అనే ఆలోచనలతోనే ఇంటికి చేరారు.
ఇంట్లో కొడుకు చిన మహదేవుడు, కోడలు జానకి దిగాలుగా ఉన్నారు. మామ గారికి మంచినీళ్ల గ్లాసు అందించింది జానకి. ఆ గ్లాసు తీసుకోకుండానే మౌనంగా తన గదిలో మంచం మీద వాలిపోయారు కొప్పేశ్వర రావు గారు.

*** *** ***

ఓ వారం రోజుల పాటు గ్రామంలో వారంతా కొప్పేశ్వర రావు గారి ఇంటికి వచ్చి పరామర్శించారు.
“మీకు తోడుగా మేమున్నాం” అన్నారు
“మీ కష్టాలు మావి కావా” అని కూడా అన్నారు
“అబ్బాయిని దారిలో పెడదాం. కంగారు పడకండి” అని భరోసా కూడా ఇచ్చారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కరి రాక తగ్గింది.

కొప్పేశ్వర రావుగారు వీధిలో నడిచి వెళ్తూంటే నమస్కారం మాట దేవుడెరుగు ఆయన వైపు చూసే వారు కూడా కరవయ్యారు.
ఇవన్నీ చూస్తున్న కొప్పేశ్వర రావు గారు మానసికంగా కృంగిపోయారు. ఇంట్లోంచి బయటకు రావడమే తగ్గించేశారు.
మనసబు గౌరి నాయుడు హైదరాబాద్‌లో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్లిపోయారు.
రెండు నెలల్లోనే ఇవన్నీ జరిగిపోయాయి. కొప్పేశ్వర రావు గారి నిజాయితీ ఆయన్ని మరణం నుంచి కూడా కాపాడలేక పోయింది.

ఓ అర్ధరాత్రి కొప్పేశ్వర రావు గారు మంచ మీద పడుకున్నాయన పడుకున్నట్లే కాలం చేశారు.
ఆ పది రోజులూ ఉర్లో వాళ్లే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయించారు. ఇంటి చివరి గదిలో మొలిచే మర్రి, వేప మొక్కలు అలా అలా పెరుగుతూనే ఉన్నాయి.

*** *** ***

పుట్టింటి వారు అడప దడపా చేస్తున్న సాయంతో ఆ ఇల్లు గెంటుకొస్తోంది జానకి.
ఓ రోజు జానకి “ఇప్పటికైనా మీరు మారకపోతే ఎలా.. పిల్ల ఎదుగుతోంది. ఏ పనో చేసి నాలుగు రాళ్లు సంపాదించకపోతే ఎలా” అని భర్త చిన మహదేవుడి మీద అరిచింది.
అలా కోపాన్ని ప్రదర్శిస్తూనే తన మెడలో ఉన్న పుస్తెలతాడుని కుడి బొటనవేలుతో బయటకి తీస్తూ “మా పుట్టింటి వారు పెట్టిన ఆ బంగారం తాడు కూడా హరీమనిపించారు. ఇదిగో ఇప్పుడు ఈ పసుపు కొమ్ము కట్టుకోవాల్సి వచ్చింది” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జానకి.
అప్పటికే చీటికి మాటికి ఇల్లు వదిలి వెళ్లిపోతున్న చిన మహదేవుడు ఈసారి కూడా విసవిసాలాడుతూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.
అలా ఇల్లు వదిలి వెళ్లిన చిన మహదేవుడు ఏడాది దాటినా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు.
కరణం గారి కుటుంబం కష్టాల్లో ఉందని ఒకరిద్దరు తమకి చేతనైన సాయం చేస్తున్నారు.

*** *** ***

ఓ రోజు ఉదయాన్నే జానకి వాకిలి కడుగుతూండగా పక్క వీధిలో ఉంటున్న సుబ్బారావుగారి భార్య అన్నపూర్ణమ్మ గారు కాలం చేశారని ఎదురింటి వాణి చెప్పింది.
వార్త తెలిసిన మరుక్షణమే సుబ్బారావుగారి ఇంటికి పరుగులు తీసింది జానకి. పిల్లలు లేని ఆ దంపతులకి ఒకరికొకరు పిల్లల్లా ఉండే వారని అనుకుంది.
అన్నపూర్ణగారు కాలం చేసారు కదా… మరి సుబ్బారావుగారి పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంది.
సుబ్బారావు గారికి పక్షవాతం వచ్చినప్పటి నుంచి ఇంటి బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు అన్నపూర్ణ.
చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా పునిస్త్రీగా చనిపోతే పన్నెండో రోజున ఇచ్చే మూసి వాయినాలు తీసుకోవడం ప్రారంభిచారు.
గడచిన రెండు సంవత్సరాలుగా అన్నపూర్ణ గారు ఆ వృత్తిలోనే ఉంటూ ఇల్లు నెట్టుకొస్తున్నారు.
మరో వైపు అన్నపూర్ణమ్మ గారి అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

*** *** ***

కొంచెంసేపు సుబ్బారావుగారి ఇంటి దగ్గరే ఉన్న జానకి ఇంటికి వచ్చేసింది. స్నానం చేసి బట్టలు మార్చుకుంది.
సరిగ్గా అప్పుడే ఊళ్లో షావుకారు పాత బకాయి వసూలు కోసం కొట్లో ఉన్న కుర్రాడ్ని పంపాడు.
“మీరు ఇవ్వాల్సిన కిరాణా బకాయి నాలుగు నెలలైపోయిందట. వెంటనే డబ్బులు ఇవ్వమని మా షావుకారు గారు నన్న పంపారు” అన్నాడు ఆ కుర్రాడు.
“త్వరలో మీ బకాయి తీర్చేస్తా బాబూ. మీ షావుకారిగారికి నే చెప్పానని చెప్పు ” అని ఆ కుర్రాడ్ని పంపించేసింది జానకి.
కూతురికి జడ వేస్తున్నా… వంటకు అన్ని సిద్ధం చేసుకుంటున్నా…
బట్టలు ఆరేస్తున్నా జానకి మనసు అన్యమనస్కంగానే ఉంది.
” బతకాలి. బాగు పడాలి. నా జీవితంలా పిల్ల జీవితం ఉండకూడదు” అని మనసులోనే అనుకుంది.
జానకమ్మ చూపు ముందుగా పెరట్లో నూతికి స్నానాల గదికి మధ్యలో ఉన్న చేతి పంపు మీద పడింది.
చేతిలోకి చిన్న గునపం తీసుకుంది. కొంగు నడుముకు చుట్టుకుంది.
ఆ పంపు దగ్గరకు వెళ్లి మట్టి పేరుకుపోయిన పంపు చప్టా కింద భూమి మీద గునపాన్ని బలంగా దించింది.
అక్కడే మరో దెబ్బ… మళ్లీ ఇంకో దెబ్బ. మరోసారి మూడో దెబ్బ.
చప్టా కాసింత కదిలింది. అలా చప్టా చుట్టూ గునపంతో తవ్వడం ప్రారంభించింది.
అక్కడే నేల మీద కూర్చుని చప్టా చుట్టూ పేరుకుపోయిన మట్టిని చేతితో తీయడం ప్రారంభించింది.
ఓ అరగంట అలా చేసి మట్టి అంతా తీసేసింది.
పంపు చుట్టూ ఉన్న మట్టిని నీళ్లతో కడిగేసింది.
సబ్బు నీళ్లలో గుడ్డను ముంచి ఆ పంపు చుట్టూ ఉన్న చప్టాని శుభ్రం చేసింది.
పెరట్లో పెరిగిన మొక్కలన్నీ తీసి శుభ్రం చేసింది.
అన్ని పనులు అయ్యాయి అనుకున్నాక ఓ సారి పెరడంతా చూసింది.
చాలా శుభ్రంగా.. అందంగా కనిపించిన ఆ పెరటిని చూసి ఆనందపడింది.
జానకికి సంతోషంగా ఉంది
జానకికి ఉత్సాహంగా ఉంది
జానకికి జీవితం కొత్తగా ఉంది.

*** *** ***

అన్నపూర్ణ గారి దశదిన కర్మలు పూర్తి కావచ్చాయి. పన్నెండో రోజు దానాలు అవి ఇప్పిస్తున్నారు బ్రహ్మ గారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న జానకి వీధరుగు మీద కూర్చుని అన్ని కార్యక్రమాలు చూస్తోంది.
ఓ పక్కన ఆ పనులు చేస్తూనే మాటి మాటికి వీధి వైపు చూస్తున్నారు కార్యక్రమాలు చేయిస్తున్న బ్రహ్మగారు.
మధ్యాహ్నం పన్నెండు దాటింది. అన్ని దానాలు అయ్యాయి. ఒక్క మూసి వాయినం మిగిలింది.
మూసి వాయినం కోసం కూడా ఏర్పాట్లు చేశారు.

ఓ వెదురు చేట నిండా బియ్యం పోశారు. పసుపు, కుంకుమ పొట్లాలు ఓ వైపు.. గంథం.. బొట్టు బిళ్లల ప్యాకెట్‌, పువ్వులు, ఇతర అలంకరణ సామాగ్రి మరో వైపు ఉంచారు.
సుబ్బారావుగారి బంధువొకరు బ్రహ్మ గారితో “ఏమిటీ కంగారుగా ఉన్నారు. ఆ మూసి వాయినం కూడా ఇప్పించేస్తే పని అయిపోతుందిగా ” అన్నారు.

“అ.. అ.. అదే చూస్తున్నాను. మూసి వాయినం తీసుకునే మనిషి ఇంకా రాలేదు” అన్నారు.
సరిగ్గా ఆ సమయంలోనే బ్రహ్మ గారి శిష్యుడొకరు వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్పారు.
ఆ మాట విన్న బ్రహ్మ గారు కాసింత కంగారు పడి సుబ్బారావుగారి బంధువుని పక్కకి పిలిచి “ఇక్కడ కాని, ఈ చుట్టు పక్కల కాని మూసి వాయినం ఎవరైనా తీసుకునే వారు ఉన్నారేమో వాకబు చేయండి” అన్నారు.

“చంపారు. ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు. ఏం మీరు తీసుకువచ్చే వారు రావడం లేదా ” అన్నారు బంధువు.
“రావాలి. కాకపోతే చివరి నిమిషంలో ఏదో అడ్డు వచ్చిందట. ఇప్పుడే కబురొచ్చింది. చివరి నిమిషమాయే. ఎవరినైనా చూడండి” అని అక్కడి నుంచి కార్యక్రమం జరుగుతున్న చోటకి వెళ్లిపోయారు బ్రహ్మగారు.
ఇలా మూసి వాయినం తీసుకునే ఆడ మనిషి రాలేదని మెల్లిగా అక్కడున్న వారందరికి తెలిసింది.
మూసి వాయినం తీసుకోవడమంటే పురుషులు తీసుకునే తిలాదానం వంటిది.
ఈ వాయినం తీసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్లని చాలా తక్కువగా చూస్తారు. శుభ కార్యాలకి పిలుపు ఉండదు.
ఎదురుపడితే తప్పించుకుని వెళ్లిపోతారు.
అరుగు మీద కూర్చున్న జానకి బ్రహ్మ గారి దగ్గరికి వచ్చి “మీకు అభ్యంతరం లేకపోతే మూసి వాయినం నేను తీసుకుంటాను” అంది.
ఆ మాట విన్న అక్కడున్న వారంతా ఓ ఆశ్చర్యానికి గురయ్యారు.

ముందుగా తేరుకున్న సుబ్బారావుగారే… “అమ్మా జానకి.. ఈ వాయినం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయో నీకు తెలియదమ్మా” అన్నారు.
మళ్లీ ఆయనే “ఈ రెండేళ్లలో పూర్ణ కారణంగా ఇల్లు గడుస్తోంది కానీ.. అది లోలోపల పడిన వేదన అంతా ఇంతా కాదమ్మా” అన్నారు.
ఆ మాటలకి జానకి “నేను ఇష్టంతోనే తీసుకుంటున్నాను పెదనాన్నగారు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా” అంది.
“సరే… ఆవిడ ఇష్ట నిర్ణయం అంటున్నారు కదా.. కానిచ్చేద్దాం” అంటూనే “మీరిలా వచ్చి నుంచోండి” అని జానకిని పిలిచి… అక్కడున్న ఆడవారిని ఉద్దేశించి బ్రహ్మ గారు
“బంధువుల్లో ఎవరైనా ఇద్దరు ముత్తైదువులు ఈవిడకి స్నానం చేయించి తీసుకురండి” అన్నారు.
ఆ ఆడవాళ్లలో ఒకరు “అసలు భర్త ఉన్నాడో.. లేదో.. ఊళ్లు పట్టుకుని వెళ్లిపోయిన వాడ్ని ఉన్నాడని ఎలా అనుకుంటాం” అన్నారు.

కాసేపు నిశ్శబ్దం…
కాసేపు మౌనం…
కాసేపు సందిగ్ధం…

ఆ సమూహానికి కాస్తంత దూరంగా ఉన్న ఆసామి ఒకరు “ఆ మాట తప్పు. మొన్నామధ్య శ్రీశైలం వెళ్తే అక్కడ చిన మహదేవుడు కనిపించాడు. నన్ను గుర్తు పట్టలేదు. నేను కూడా గుర్తు పట్టనట్లే వచ్చేశాను” అన్నాడు.
ఆ మాట విన్న జానకి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది.
“సరే అయితే కానివ్వండి. ఇంకెందుకు ఆలస్యం. ఆ అమ్మాయిని స్నానానికి తీసుకు వెళ్లండి” అని మరోసారి అన్నారు బ్రహ్మగారు.
ఓ నలుగురు ఆడవారు జానకిని తీసుకువెళ్లేందుకు ముందుకు కదిలారు.

వాళ్లు కదులుతున్న సమయంలోనే…
ఈ తంతుకి కాసింత దూరంగా ఉన్న వారిలో ఒకాయన…
“అవునూ… మీరు ఆరువేల నియో…” అని అంటూంటే..
జానకి ఆ మాటలు వచ్చిన వైపు చూస్తూ…

“ముందు ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలి కదండి” అంటూ… మెడలో ఉన్న పసుపు తాడుకి వేల్లాడుతున్న పసుపుకొమ్ముని చూస్తూ అదోలా నవ్వింది.
జానకిని చూసి….
పసుపుకొమ్ము కూడా నవ్వింది.

***

ముక్కామల చక్రధర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.