పగోడైనా ముందర పాతా ఉంటే యనక ఈపైనా చూస్తాము అనే సామెత మా పల్లె మనుసుల్లో ఇంకా మిగిలే ఉంది. ఊర్లో జనాలు పక్కమనిసి బాగుంటేనన్నా కుళ్ళు కుంటారేమోగాని, ఎవరికన్నా పాణమగదప్పినా, ఏదన్నా జరగరానిది జరిగినా, పగోనింటికైనా ఊర్లో అందరూ వాళ్ల సోమత కాటికి మాట సాయం కాడ నుండి, మనిషి సాయం, దుడ్డు సాయం కూడా చేస్తారు. చిన్నచలిజొరమొచ్చిన మనిసిని కూడా ఇసారిస్తారు.
మూడు దినాలకు ముందు మా కాంత పెద్దమ్మకు నడిజామ కాడ కడుపునొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకుపోయినారు. ఆ మరుసనాడు ఆసుపత్రి నుండి ఆయమ్మ ఇంటికొచ్చింది. ఆయమ్మను ఇసారించే దానికి ఊర్లో జనాలందరూ పండో, పలమో తీసక పోయిచ్చి పలకరించి ,అదెంత పెద్ద జబ్బైనా నిన్నేమీ చేయదు అని ధైర్నం చెప్పి వచ్చినారు.
గెడిసేపు తీరికలేదు, గెంటెడు ఆదాయం లేదు అన్నట్లే ఉంది నాపని. ఎబుడూ పని పని అని సరిపోతంది. ఒగ అగములే సుగములే, మంచిలే చెడ్డలే , తిరణాలులే తేరులే, ఊరులే ఉగములే ! నాకెబుడూ ఇంటిచాకిరి, పొలంపని ఈటితోనే సరిపోతుంది . ఈ పొద్దు యాడపని ఆడ ఇడిసిపెట్టి ఉడుకుడుకు సంగటి గెలుక్కొని, మా వొరి పొలములో ఎలక బుట్టేసింటే ఎలకలు బన్నాయి, ఆ ఎలకల కూర చేసి ముద్ద సంగటి, రెండు గెంట్లు కూర క్యారీ కేసుకుని మా కాంతపెద్దమ్మ ఎట్లుందో చూద్దామని వాళ్లింటికి పోతి. నట్టింట నవారు మంచం మింద పనుకోనుంది, నన్ను చూస్తానే ఏం నాయనా ఇప్పటికైనా దొరికిందా తీరిక, మూడు దినాలయింది నేనొచ్చి, నువ్వు రానేలేదే అనే. యాడ పెద్దమా వొరి నాట్లుండే, నువ్వు ఆసుపత్రికి పోయినాపోద్దే నీ గురించి ఇసారిస్తే బాగానే ఉందండ్రి, అందుకే నిదానం చేస్తి, లేదంటే ఆ పొద్దే వొచ్చున్నా. లెయ్యి ఉడుకుడుగ్గా సంగటి తిందువు అంటి.
తిందాంలే నాయన నువ్వు కూసో అని ఆయమ్మ పక్కలో నన్ను కూసన్న పెట్టుకుండే. నేను ఆయమ్మ చెయ్యి పట్టుకొని. కాదు పెద్దమా ఆసుపత్రికి పోయినావు కదా ఏం జరిగింది, మంచేమి చెడ్డేమని అనడిగితి. ఆ మాటకు కాంతపెద్దమ్మ ”కాదు నాయనా మొన్నట్రేతిరి సరిగ్గా నడిజామ కాడ కడుపు నొప్పి ఎత్తుకుంది. మామూలు నొప్పినేమో పోతుంది కదా అని గంటసేపు దనియాల నీళ్లు అవిఇవి వుడకపెట్టి తాగితి. గుణములేదు. గొంతుకోసేసిన కోడి పిల్ల ఎట్ల తనకలాడుతుందో అట్లా తనకలాడతా ఉండా. నా బాద చూడలేక అంబులెనుసుకి పోన్ చేసి మా వాళ్ళు దాంట్లో తోడుకొని పొయిరి . తొలిత దర్మాస్పత్రికి పోతిమి. వాళ్ళు తత్తుకాలానికి సూదేసిరి. దాంతో కాసింత నొప్పి తగ్గింది. క్యానింగుకు(స్కానింగ్) రాసిచ్చిరి. అది తీసుకొనొస్తే కుడిపక్క కిడ్నీ ల్లో మూడు రాల్లుండాయని డాక్టరు చెప్పి మందులిచ్చినారు. దాంతో రాళ్లు పడిపోవచ్చు లేదంటే ఆపరేసన్ చేయాలంట. దినానికి ఐదు లీటర్ల నీళ్లు తాగమన్నారు అనే “.
ఆ యమ్మ వక్కాకు బలే నములుతుంది . నాతో అరువులు చెప్తానే వక్కాకు తిత్తి తీసి ముందరేసుకొని నువ్వు నములు నాయనా అని వక్కాకు నాక్కూడా ఈబాయ. అది ఆయమ్మ కొడుకు చూసి చూడక్క ఈ యమ్మ ఎప్పుడు వక్కాకు నిలిపేస్తే అబుడు బాగుపడుతుంది. అన్ని రోగాలు ఆ వక్కాకు వల్లే వస్తా ఉండాయనే. ఆ మాటకు కాంత పెద్దమ్మ “కాదు నాయనా, నా వయసు ఇప్పుడు సుమారు అరవై ఏండ్లు, నేను పదేండ్ల బిడ్డబటి నుండి ఈ వక్కాకు నేర్సిన. ఇబుడు మానమంటే మాన్లేను. ముపైఏల్లాయ , నేను గంపేపారం మొదలుపెట్టి. సంసారానికి మీ పెదనాయన వలపటెద్దయితే ,నేను దాపటెద్దే గతం ఈ సంసారాన్ని ఈడుసు కుంటా వొచ్చిన. నాలుగు దినాలుగా ఒళ్లు బాగలేక యాపారానికి పాలే . నిత్తి రోజు నాలుగు గంట్ల రేతిరిలో లేసి, ఇంట్లో అన్నం కూర చేసి, మగం కడిగి, తలకాయి దుగి, బొట్టు పెట్టుకొని, సొమ్మునీళ్లు తాగి వక్కాకు ఏసుకొని గంపనిండా మూడునాలుగు రకాల కూరగాయలు, ఆకుకూరలు ఏసుకుంటా . తక్కిడి తూకం రాల్లే మూడు కేజీలుంటాయి. అన్నీ లెక్కేసుకుంటే ముప్పై కేజీల బర్తి సుట్ట బెట్టి నెత్తిన పెట్టుకొని బస్సు రోడ్డు కాడికి మైలు దూరం నడసల్ల. ఆడ నుండి గంప బస్సుకేసుకొని ఐదు గంటలకే టౌన్లో దిగితే బజారైన బజారు తిరిగి అమ్మేది. గంప కాలీ అయ్యేదంక గంప నెత్తినే ఉండు. ఓనాడు ఏగులేసిన టైం బాగుంటే గంప బిన్నకాళీ అయితుంది. లేదా గంట నిదానం అవతాయి. పన్నెండు లేక ఒంటిగంటకు ఇంటికొచ్చి అబుడు అన్నం తిందు. మల్ల కూరగాయలకు రైతులు కాడికి పోదు. మరుసు నాటికి కూరగాయలు తెచ్చి పెట్టుకొని ఇంట్లో పనులు అన్నీ చేసుకుందు. నీళ్లు తాగి వక్కాకేసుకొని ఇన్నేల్లు రెండుపూట్లు మాత్రమే తింటా యాపారం చేసినా ఒగనాడు కూడా ఆస్పత్రి మగం జూల్లా. ముక్కు చెక్కు నొచ్చింది కాదు. అంత బర్తి నెత్తిన పెట్టుకొని కూడా రెండు చేతులు ఇడిచేసి నడస్తావుంటి. ఆ గంప మోసి మోసి నా నెత్తి చూడు ఎట్లా సదరమైపోయిందో, కోడిగుడ్డు నిలబెట్టినా నిలుస్తుంది. నా నెత్తి బొరువంతా ఒగ తావనేస్తే ఈ ఊరు సరిపోదు. నీళ్లు తాగి బతికిన దాన్ని. ఇప్పుడు కిడ్నీలో రాళ్లంట , డాక్టరు దినానికి ఐదు లీటర్ల నీళ్లు తాగమంటారు. నీళ్లు తాగి యాపారానికి పోయేది సాద్యమేనా? ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టినప్పటి నుండి ఆడదానికి ఒంటికి, దొడ్డికి వస్తే ఎంత గగనమో మనందరికీ తెలిసిందే. ఒగబుడు అంటే ఇరవై ఏళ్లకు ముందు నేను యాపారానికి పోతే టౌనులో నైనా సరే బజార్లో ఆడాడా చెట్లుండేవి. కాళీతావులు ఉండేవి. వొంటికొచ్చినా యాడో ఒగతావున పోసుకునే దాన్ని. అబుడు యాపారం సులువుగా ఉండేది. ఒంటికి దొడ్డికి వస్తే అంత ఉక్కట్టు ఉండేది కాదు. ఈ పదేల్లు గా తేనీగల రేడేకతం టౌనుంది. ఆ రేడ లో ఎన్ని సందులు ఉంటాయో అట్లా అంతస్తులు మీద అంతస్తులు కట్టేసినారు ఇండ్లు . తేనీగులే కతం యాడ చూసిన గుంపులు గుంపులుగా జనాలు. మగసిల కార్తిలో మేతకొచ్చిన పచ్చులే కతం ఎక్కడెక్కడ ఉండే జనమంతా టౌను చేరిపోయినారు. యాడేగాని అరచేతంత బీడు లేదు, ఇండ్ల ముందర కుక్కలు. పెద్దపెద్ద గేట్లు. ఎంత అరిచినా బయట రారు.
వొగొగ ఇంటికాడ ఒగ గంట నిలబడల్ల . ముందు మా యట్లా చిన్న యాపారస్తులకు ఇలువిచ్చేవాళ్ళు కొందరన్నా. ఇబుడు వాల్లిండ్ల కాడికి అప్పడగను పోయినట్లు నాలీసుగా చూస్తారు. అట్లాని కొన్నాల్లు తిరగలేక నిలిపేసి కూలికి పోతి. ఎవురో వొగరు యాల యాపారానికి పోంది అనేది. నాకు వాడిగ్గా సరుకిచ్చే రైతులు కూడా నన్ను నమ్ముకుని ఉంటారు . వాల్లు ఒగపక్క అడగతారు. పనులుకాడ కుసాలగా నామింద పాటలు పాడేది.
కూరగాయల గంపెత్తుకొని మార్కెట్టుకే నేబోతే
మార్కెట్లో మాదారి సాయిబు కొప్పు మింద చెయ్యేసె గదన్న
చిక్కితి వాని చేతిలోన దక్కితి దయగలరా సోమి
మొక్కితి మొగినాలతో పొందు మోసమాయ గదరా సామి
వంకాయల గంపెత్తుకొని మార్కెట్కే నేను పోతే
వొంగి చూసే వన్నెకాడు వయ్యారంగా నవ్వే గదన్న
చిక్కితి వాని చేతిలోన దక్కితి దయగలరా సోమి
మొక్కితి మొగినాలితో పొందు మోసమాయ గదరా సోమి
యాపారం చేసిన చేయి ఊరికే ఉండక, మల్ల గంపలో కూరగాయలు ఎత్తుకొని పోయి రోడ్లు పక్కన ఏడన్నా కాళితావుంటే ఆడపెట్టుకొని అమ్ముకుంటావుండా . మొన్నటెనక వారానికి ముందు జరిగిన కతఇది. బీటీకాలేజీ పారి గోడ అనుకోని చింతచెట్టుంటే ఆమాను మొదుట్లోగంప పెట్టుకొని కుసోనుండా. నా పక్కనే పెద్ద సైట్ కాలవ. నాకు అప్పటికే రెండు దినాలుగా ఒళ్ళునొప్పులు. సలి సలిగా ఉంది. జొరం పొంగు తగిలింది. అయినా అట్లే గంపెత్తుకొని పొయినా . సరిగ్గా పది అయింది. రోడ్డుమింద వొచ్చే జనం పోయే జనంతో కిక్కిరిస్తా ఉండారు. ఆ పక్కన మందుల షాపు ఉంటే పొయి, వొల్లు నొప్పుల మాతర, జొరం మాతర రెండూ తీసుకొని వొగ్లాసు టీ తాగి మాతర్లు మింగి మల్లా వొచ్చి గంప కాడ కూసుంటి. కాంచేడికంత ఒల్లంతా సర్తు బట్టి ఒల్లు సల్లబడే. సర్తు తుడుసుకుంట కుసోనుండ. ఎబుడెబుడు గంపకాలీ అయితుందా ఇంటికెల్లి పోదామా అనిపిస్తుంది పానం. అబుడనంగానే ఒంటికొచ్చినట్లాయ. ఓరి బగవంతుడా ఇబుడెట్ల చేసేది. తలకాయి ఎర్రి యాకోలమైపాయ. కడుపులో బండెడు అగ్గి బన్నెట్లాయ . ఏం చేసేది సోమీ నేనుండే తావు నుండి ఒక మైలు దూరం నాలుగు దిక్కుల్లో ఏడేగాని కక్కసు రూములు లేవు. ఇంగ పోతే ఆర్టీసు బస్టాండుకు పావల్లని నాలో నేనే సతమతమైతా ఉండా. వొగడు సావు నలుపు, బాన కడుపు, దున్నపోతే గతం ఉండాడు. వచ్చి నా పక్కన బారెడు దూరం కూడా లేని సైటు కాలవ గడ్డన నిలబడి వాని ప్యాంటు జిబ్బు తీసి, వాని సామాను బయట తీసి ఒక చేత్తో పట్టుకొని అ సైట్ కాలవ లో ఉచ్చలు జుమ్మతా ఉండాడు. నేను పక్కనే ఉండానన్న ఇరితి కూడా వానికి లేదు. పొరపాటున తలకాయి పక్కకు తిప్పితే వాడు ఉచ్చలు జుమ్మేది బూడిదరంగులో వాని సామానంతా కనపడతా ఉంది. నాకే కాదు ఆ సైడు నడిచే జనాలం దరికీ కనిపిస్తాఉండాది , అయినా గాని సిగ్గు లేకుండా దిమాగ్గా పోస్తా ఉండాడు. ఇంత జనం ఉండారే కుసోనన్నా పోద్దాము అని కూడా లేదు.
నాకు కడుపూది పోతావుంది కానీ నేను ఆ సైటు కాలవ పక్కన కూసోని పోయలేను. కొక్కిరి కూసోని బోసినా మొగోల్ల మాదిరి సామానూ కనపడదు కానీ చిన్నప్పటి నుంచి ఉచ్చలు మరుగునే పోయల్లని ఇని ఇని పానము మరుగే తారాడుతుంది. వాడు పోస్తా వుంటే జనం సూసీసూన్నట్టు ఎలిపాతా ఉండారు. అదే నేను ఉచ్చబోస్తే ఎక్కడుండే జనం నేను ఏదో కూనీ చేసినట్లు నాకల్లనే చూస్తారన్న బయము . మగోనికి నాకు పానం ఒకటే కదా, ఆకలి దప్పులు ఒకటే కదా, ఆ దేవుడైనా ఆడదానికి మలమూత్రాలు లేకుండా చేయాల్సింది. ఈ తేడా పెట్టిన్నాబట్టలు ఎవురో నా చేతికి దొరికితే నిజంగానే నడిరోడ్లో నరకదామా అని పిచ్చింది . అబుటికే కడుపు ఊదకొచ్చేసింది. ఉక్కట్టై పోయింది. ఎంత సేపని బిగపట్టుకుందు. కడుపులో నుండి ఎగదన్ని కండ్లల్లో కారేటిగా ఉండాయి ఉచ్చలు. ఆ బాద తట్టుకోలేక ఆటోవాన్ని పిలిసి ఆటోకి యాబై రూపాయలిచ్చి ఆర్టీసి బస్టాండుకు పోయి ఆడ ఇరవై రూపాయలిచ్చి ఒంటికి పోస్తే అబుడు పోయిన పానం మల్ల తిరిగొచ్చినట్లాయ.
మొన్న డాట్టర్లు కూడా నన్ను దినానికి ఐదు లీటర్ల నీళ్లు తాగమంటారు. అన్ని నీళ్లు తాగి యాపారానికి పోతే నేను యాడ ఒంటికి పోసేది ? ఏమైనా నాయట్లావాల్లింగ టౌనులో యాపారం చేయలేరు నాయనా. యాపారానికి నాకు ఇంతే రుణము, ఇంగ చేయలేను. ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అంటారు కానీ ఉప్పెత్తుకొని పోతే ఊపిరే మిగిలేటిగా లేదు.” అని చెప్పి బాదపడే కాంతపెద్దమ్మ.
అర్థాలు
ఉక్కట్టు = ఊపిరి ఆడ కుండా, బరువుగా బిగింపుగా
ఇరితి = విచక్షణ
చెక్కు = చెంప
తత్తుకాలానికి = అవసరానికి
క్యానింగు = స్కానింగ్
చిత్రం: రాజశేఖర్ చంద్రం








Add comment