ఎందుకీ కత్తెరలూ, ముళ్ళ కంచెలూ?!

సాహిత్యవిమర్శ సాధారణంగా, సూత్రరీత్యా నిర్మొహమాటమైన అభిప్రాయం. కాని అభిప్రాయమంటేనే వివాదంగా కనబడే రోజుల్లో దానికి అవరోధాలు తప్పవు.

సారంగలో చాల రోజులుగా రాద్దామనుకుంటూ ఆగిపోతూ ఇవాళ ప్రారంభిస్తున్న నా కొత్త ధారావాహికకు ‘అసాహిత్య విమర్శ’ అనే శీర్షిక ఎందుకు ఎంచుకుంటున్నానో కారణం చెప్పాలి. ఈ పదబంధాన్ని సృష్టించడం కేవలం చమత్కారం కోసమో, ఎవరిమీదో ఏదో కినుకతోనో కాదు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నావరకు నాకు కొన్ని కారణాలున్నాయి. ఈ శీర్షికలో అనేక రకాలుగా అసాహిత్య విషయాల గురించి, సాహిత్యానికి నేరుగా సంబంధం లేదని అనిపించే, లేదా కొందరు అనుకునే విషయాల గురించే మాట్లాడదలిచాను. సాహిత్య, సాహిత్యేతర అనే ద్వంద్వమే అనవసరమైనదీ అసంగతమైనదీ అని నా అభిప్రాయం. ఆ అవగాహనను ఎన్నో స్థాయిలలో, ఎన్నో కోణాల నుంచి చర్చించదలచాను, ఆ క్రమంలో నా అభిప్రాయాలను కూడ విమర్శకు లక్ష్యం చేయదలిచాను. అసలు ఇటువంటి విమర్శలకు వర్తమానకాలం ఎప్పటికన్నా చాల అవసరమైన, అనువైన కాలం అని కూడ అనుకుంటున్నాను.

నన్ను సాహిత్య విమర్శకుడిగా గుర్తిస్తారో లేదో తెలియదు. ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సాహిత్య విమర్శ అని నేననుకునేది రాస్తున్నాను. నాలుగైదు ‘సాహిత్య విమర్శ’ వ్యాసాల పుస్తకాలు కూడ వేశాను. మరొక నాలుగైదు పుస్తకాలకు సరిపడిన ‘సాహిత్య విమర్శ’ వ్యాసాలు పత్రికల్లో అచ్చయి ఉన్నాయి గాని, నేను సాహిత్య విమర్శకుడినేనా అని నాకు కాస్త అనుమానం. ఆ విషయంలో నా సహ సాహిత్య విమర్శకుల్లోనూ మిత్రులలోనూ కొందరికి కించిత్తు అనుమానం కూడ లేదని నాకు తెలుసు. నేను సాహిత్య విమర్శకుడిని, అసలు రచయితను, కానే కానని వారి అచంచల విశ్వాసం. అందువల్ల ఈ శీర్షిక  ప్రారంభంలోని ‘అ’ నా సందేహాస్పద ప్రతిపత్తికి ఒక సంకేతం. నా ‘సాహిత్య విమర్శ’ పట్ల ప్రతికూల అంచనాలను నేను ఆమోదిస్తున్నాననే ఒప్పుకోలు. అంటే ఈ శీర్షిక అసాహిత్యవిమర్శకుడి విమర్శ.

అలాగే, ఇందులో సాహిత్యానికి సంబంధించనివని అనిపించే అంశాలూ, సుదూరంగా సంబంధించే అంశాలూ, వాటి సాహిత్య, సాహిత్యేతర అంశాలూ చర్చకు పెడదామనుకుంటున్నాను గనుక మొదటి పదం సాహిత్యకు అ ప్రత్యయం చేర్పు ఇతర, ప్రతికూల అనే అర్థాలకు కూడ సూచన. అంటే ఇది ప్రధానంగా సాహిత్య నేపథ్యంలో ‘అసాహిత్య’ అంశాల మీద లేదా ‘అసాహిత్య దృష్టి’ నుంచి విమర్శ.

ఇక ఈ పదబంధంలో మొదటి పదం వివాదాస్పదం కావచ్చు గాని, రెండో పదంలో మాత్రం ఏ చమత్కారమూ లేదు. స్పష్టంగా ఇది విమర్శే. “ఎవరైనా ఒక కళాఖండాన్ని ఆస్వాదించడం నుంచీ, సృజించడం నుంచీ దాన్ని విమర్శించడంలోకి పయనించారంటేనే, వారు కళ నుంచి బైటికి వెళుతున్నారని స్పష్టమే. దాన్ని ‘బైటి’ నుంచి చూడడం మొదలు పెడుతున్నారనేది స్పష్టమే. కాని కళకు బైట ఉన్నదేమిటి? ముత్యం అనేది ముత్యపు చిప్పలో ఉత్పత్తి అయినట్టుగానే, కళ అనేది సమాజంలో ఉత్పత్తి అవుతుంది. అంటే కళకు బైట నిలబడడమంటే సమాజం మధ్యలో నిలబడడమనే అర్థం. శుద్ధమైన కళాస్వాదన నుంచీ కళా సృజన నుంచీ విమర్శను వేరు చేసేది దానిలో ఇమిడి ఉండే సామాజిక అంశమే” అన్న క్రిస్టఫర్ కాడ్వెల్ మాటలు నా దృక్పథానికి ఒక పునాది. అందువల్ల ఆ రెండో పదాన్ని సూటిగానే, నేరుగానే వాడుతున్నాను.

అయితే ఇది సాహిత్య విమర్శ అయినా, అసాహిత్య విమర్శ అయినా, రచయిత అసాహిత్యకుడైనా, సాహిత్యకుడైనా వర్తమాన కాలంలో, ముఖ్యంగా తెలుగు మేధో ప్రపంచంలో విమర్శకు మాత్రమే కాదు, పరిశీలనకు, అసలు అభిప్ర్రాయ ప్రకటనకే ఎన్నో అవరోధాలున్నాయనేది ఒక వాస్తవం. ఎన్ని అవరోధాలున్నా వాటిని అధిగమించి విమర్శ సాగించవలసిన అవసరాలూ ఉన్నాయనేది అంతకన్న పెద్ద వాస్తవం. ఆ అవరోధాలను నేను స్వానుభవం మీదా ఇతరుల అనుభవం మీదా గ్రహించాను, గ్రహిస్తున్నాను. ఆ అవసరాన్ని నేను నా దృక్పథం వల్లా, అధ్యయనం వల్లా గ్రహిస్తున్నాను.

సాహిత్య విమర్శకు, లేదా కనీసం విమర్శకు అవరోధాలు కొత్తవేమీ కావు. కనీసం నా అనుభవంలో ఆ అవరోధాలు ఇరవై ఐదు, ముప్పై ఏళ్లుగా ఉన్నాయి. అంతకుముందు కూడ నేను అధ్యయనం చేసిన మేరకు, నాకు తెలిసిన మేరకు సాహిత్య విమర్శకూ విమర్శకూ ఇటువంటి అవరోధాలు ఉంటూనే ఉన్నాయి. అసలు ఆ అవరోధాలు లేని కాలం బహుశా లేదేమో గాని చాల ఎక్కువగా ఉన్న సందర్భాలూ తక్కువగా ఉన్న సందర్భాలూ మాత్రం ఉన్నాయి.

సాహిత్యవిమర్శ సాధారణంగా, సూత్రరీత్యా నిర్మొహమాటమైన రాగద్వేష రహితమైన అభిప్రాయం. కాని అభిప్రాయమంటేనే వివాదంగా కనబడే రోజుల్లో దానికి అవరోధాలు తప్పవు. సాహిత్య విమర్శ దాని ఆదర్శవంతమైన స్థితిలో గుణదోష నిరూపణగా, సంభాషణగా, చర్చగా ఉండాలి, ఉంటుంది. కాని తెలుగు సాహిత్య విమర్శ ఆ ఆదర్శవంతమైన స్థితికి చాల దూరంలో ఉంది. ఆ స్థితికి చేరడానికి చాల అవరోధాలున్నాయి. ప్రతి రచయితా తన రచన, తన రచన మాత్రమే, సకలగుణాభిశోభితమని ప్రగాఢంగా విశ్వసిస్తున్నప్పుడు కనీసమైన దోషాల ప్రస్తావన కూడ నేరంగా కనబడి అది పెద్ద అవరోధమవుతుంది. విమర్శ అవసరం లేకుండా పోతుంది. లేదా ప్రతి రచయితా తన ప్రత్యర్థి రచన, అసలు ఇతరుల రచనలన్నీ సకలదోషభూయిష్టమని ప్రగాఢంగా విశ్వసిస్తున్నప్పుడు, ఆ ప్రత్యర్థి రచనలో గుణాలున్నాయనే ప్రస్తావనే ఆ సాహిత్య విమర్శను గర్హనీయం చేస్తుంది.

ఇవి సాధారణ అవరోధాలు కాగా, మరికొన్ని అదనపు అవరోధాలు కూడ ఉన్నాయి. నిజానికి ఇవి సాహిత్యవిమర్శ మీద, అంటే విమర్శ లోని వస్తువు మీద, చర్చనీయాంశం మీదనో, చర్చా పద్ధతి మీదనో అభ్యంతరాలు కావు. ఆ సాహిత్య విమర్శ చేస్తున్న వ్యక్తి మీద అభిప్రాయ దురభిప్రాయాలే, ఆ విమర్శకు పాత్రమవుతున్న రచన మీదనో, రచయిత మీదనో అభిప్రాయ దురభిప్రాయాలే యథాతథంగా విమర్శ మీదికి బదిలీ అయిన సందర్భంగా వస్తున్న అవరోధాలు. ‘ఆ సాహిత్య విమర్శకుడి మొఖం నాకు నచ్చదు. కనుక ఆ సాహిత్య విమర్శ ఏదైనా సరే చదవకుండానే అది చెత్త అని అభిప్రాయం ప్రకటించే హక్కు నాకు వస్తుంది’, ‘ఆ సాహిత్య విమర్శకుడు మెచ్చుకున్న లేదా లోపాలు చూపించిన రచన/రచయిత నాకు నచ్చరు. కనుక అది మెచ్చుకోలు అయితే నేను అంగీకరించను, అది ఖండన అయితే నేను అంగీకరిస్తాను’, ‘ఆ విమర్శకుడు నా అభిమాన రచయితనో, నన్నో విమర్శించాడు. కనుక అతను రాసిందేదైనా నేను అంగీకరించను’ వంటి అభిప్రాయాలే తెలుగు సాహిత్యలోకంలో సాగుతున్నాయి.

అవి మరీ వ్యక్తిగతమైన, స్వీయమానసిక అభిప్రాయాలు లేదా దురభిప్రాయాలు అనుకుంటే, అంతకన్న కాస్త పైస్థాయిలో సామాజిక, సాధారణ అభిప్రాయ, దురభిప్రాయ అవరోధాలు కూడ తెలుగు సాహిత్యలోకంలో విస్తరిస్తున్నాయి. సాహిత్య విమర్శకుడు పుట్టిన కులం, మతం, ప్రాంతం ప్రధాన అవరోధమో, అవకాశమో అవుతున్నది. ఆ సాహిత్య విమర్శకుడు ఏమి రాశాడనేదానికన్న ప్రధానంగా అనుకూల కులంలో పుట్టాడా, ప్రతికూల కులంలో పుట్టాడా అనేదే ఆ విమర్శ మీద అభిప్రాయానికి దారి తీస్తున్నది. అలాగే సాహిత్య విమర్శకులకు కూడ రచన మీద నిర్మొహమాటమైన అభిప్రాయం కన్న రచయిత పుట్టిన కులాన్ని బట్టి ఆ అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చునా లేదా అనేది నిర్ణయమవుతున్నది. సాధారణంగా విమర్శలో ఏమి ఉన్నదనే దానికన్న ఆ విమర్శ రాసిన/చేసిన విమర్శకుడి ఉద్దేశాలు ఏమై ఉండవచ్చుననే చర్చే పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఉద్దేశాలు ఉన్న సందర్భాలు కూడ ఉండవచ్చు గాని, ఉన్నా లేకపోయినా ఉద్దేశాల వెతుకులాట మాత్రం ఎక్కువగా జరుగుతున్నది.

ఇవి మాత్రమే కాక కొన్ని చాల సులభంగా పరిష్కరించగల సాంకేతిక సమస్యలు, భాషా వ్యక్తీకరణ సమస్యలు కూడ తెలుగు సాహిత్య విమర్శకు అవరోధాలుగా ఉన్నాయి. ‘ఈ రచయిత ఉపయోగించిన పద స్వరూపం సరైనది కాదు’ అనడం తప్పు. ‘వాక్య నిర్మాణం సరిగా లేద’నడం తప్పు. ‘పద ప్రయోగం లక్ష్యార్థాని కన్న భిన్నమైన, వ్యతిరేకమైన అర్థాన్ని ఇస్తున్నద’నడం తప్పు. ‘ప్రస్తావించిన ఘటన ప్రస్తావించిన స్థలంలో, ప్రస్తావించిన తేదీన జరగలేదు, మరొక స్థలంలో, మరొక తేదీన జరిగింది’ అని చెప్పడం తప్పు. ‘ఆ ఉటంకింపు ప్రస్తావించిన పేజీలో లేదు, మరొక పేజీలో ఉంది’ అని చూపడం తప్పు. ‘ఆ పదానికి, వాక్యానికి అన్వయదోషం ఉంది, అది మరొక అర్థాన్ని ఇస్తున్నది’ అని చూపడం తప్పు. చివరికి ‘రచయిత కోలన్ పెట్టవలసిన చోట ఫుల్ స్టాప్ పెట్టారు, కామా పెట్టవలసిన చోట పెట్టలేదు, విరామ చిహ్నాల వాడకంలో అవసరమైన జాగ్రత్త తీసుకోలేదు’ అనడం తప్పు. ఈ పొరపాట్లు ఎత్తిచూపడాలు ఎంత సోపపత్తికంగా జరిగినా, సాక్ష్యాధారాలను చూపినా సరే, అంగీకరించని స్థితి ఉంది. రెండు రెళ్లు నాలుగు అనే మాటకు కూడ అన్నవారిని బట్టి ఆమోద, తిరస్కారాలు దొరుకుతున్నాయి. రెండు రెళ్లు నాలుగు అన్నవారి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి,  ప్రాంతాన్ని బట్టి, శిబిరాన్ని బట్టి, భావజాలాన్ని బట్టి అది తప్పో ఒప్పో నిర్ణయమవుతున్నది.

అలా సాహిత్య విమర్శను స్వీకరించే పద్ధతిలో సమస్యలు మాత్రమే కాదు, సాహిత్య విమర్శ వ్యక్తీకరణలో కూడ సమస్యలున్నాయి. సాహిత్య విమర్శ రాస్తున్న వారిలో చాల మందికి అవసరమైనంత అధ్యయనం, విశ్లేషణాశక్తి ఉండడం లేదు. రాగద్వేషాలు పక్కనపెట్టి వస్తుగతంగా విశ్లేషించవలసిన చోట అది జరగడం లేదు. తొంబైతొమ్మిది దోషాలున్న చోట కూడ ఒక గుణం ఉంటే అంగీకరించాలనీ, తొంబైతొమ్మిది గుణాలున్న రచనలో కూడ ఒక దోషం ఉంటే ఎత్తిచూపాలనీ, సాహిత్య విమర్శ ఒక నిర్మమకారమైన ప్రక్రియ అనీ సాహిత్య విమర్శకులు గుర్తించడం లేదు.  అలాగే, గతంలో లాగ విస్తృతమైన సాహిత్య విమర్శ వ్యాసాలు రాసే సమయం సాహిత్య విమర్శకులకు లేకపోవడమూ, చదివే సమయం పాఠకులకు లేకపోవడమూ ఇప్పుడు సాహిత్య లోకపు అనుభవం. సాహిత్య విమర్శకు ఇరవై, ముప్పై పేజీలు కేటాయించిన భారతి, సృజన, సంవేదన, అరుణతార రోజుల నుంచి ప్రస్తుతం ఇరవై వాక్యాలు కూడ ఎక్కువనిపించేంత స్థల ఆంక్షల వాతావరణం పత్రికలలో నడుస్తున్నది. ఇక సాహిత్య విమర్శ నేరుగా పుస్తక రూపంలో వెలువడడం అపురూపమైన సంగతి. గతంలో పత్రికల్లో అచ్చయిన సాహిత్య విమర్శ వ్యాసాల సంకలనాల ప్రచురణ కూడ చాల తక్కువగా జరుగుతున్నది. మొత్తంగా సాహిత్య విమర్శకులని పేరు పడిన వాళ్లు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరిగే ధన్యులైపోతున్నారు.

కొన్ని అవరోధాలను సాధారణీకరించి చెప్పడానికి నేనిక్కడ ప్రయత్నించాను గాని, ఇవి ఒక సాహిత్య లేదా అసాహిత్య విమర్శకుడిగా నేను ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న నిత్యజీవితానుభవ సమస్యలు కూడ.

ఇటీవల ఒక సాహిత్యకారుడి జీవితచరిత్ర పేరుతో ఒక పుస్తకం వచ్చింది. ఆ సాహిత్యకారుడు పుట్టిన కులం వల్ల ఆ పుస్తకం చదవకుండానే దాని మీద అంగీకార, అనంగీకారాలు స్థిరపడిపోయాయి. ఆ పుస్తకం జాగ్రత్తగా చదివి, అందులో కనీసం రెండు డజన్ల తప్పులు, పొరపాట్లు నేను నమోదు చేశాను. డజన్ల కొద్దీ భిన్నాభిప్రాయాలు కూడ ఉన్నాయి గాని అభిప్రాయాలు ఎవరివి వారి సొంతం. కేవలం స్థల, కాల, నామవాచకాల తప్పులే, సంఘటనల వివరణలలో తప్పులే, వ్యక్తుల వివరాల్లో తప్పులే నేను నమోదు చేశాను. కాని ఆ వ్యాసం రాయడానికి భయపడ్డాను. అటువంటి తప్పులను కూడ ఎత్తి చూపడానికి వీలులేని స్థితి ఉంది. ఇటీవలనే మరొక ముఖ్యమైన పుస్తకం వెలువడింది. ఒక అంతర్జాతీయ స్థాయి గ్రంథాలయంలో ఉన్న తెలుగు పుస్తకాల పట్టిక అది. తెలుగు సమాజానికి చాల అవసరమైన గ్రంథసూచి. కాని అది ఎంత తప్పుల తడకగా తయారయిందంటే, ఇంగ్లిష్ జాబితా తీసుకుని గూగుల్ ట్రాన్స్ క్రిప్షన్ సాఫ్ట్ వేర్ నడిపినట్టున్నారు (మచ్చుకు రెండు ఉదహరణలు: “శ్రీ నలనమవత్సరసిట్ స్వతీకరీతి” ‘గురజాడ అప్పారావు – త్రన్స్లతి ఒన్ ఆఫ్ బయోగ్రఫీ…’). ప్రతి పేజీ లోనూ రచయితల పేర్లు, పుస్తకాల పేర్లు అచ్చు తప్పులో, ట్రాన్స్ క్రిప్షన్ తప్పులో కుప్పలుగా ఉన్నాయి. అంత అవసరమైన, ముఖ్యమైన, ఆసక్తికరమైన పుస్తకం అంత అజాగ్రత్తగా, అబందరగా వేశారేమిటని ప్రశ్నించడానికి వీలు లేని స్థితి. అది ఒక ప్రభుత్వ సంస్థ వేసింది గనుక, దానిలో తప్పులను విమర్శిస్తే ప్రభుత్వ వ్యతిరేకి కావడం వల్లనే తప్పులెన్నాడనే ఎదురునింద వెంటనే పడిపోతుంది. ఇంత అవసరమైన పుస్తకం కదా అని వెలువడిన వెంటనే కొనుక్కుని, పేజి పేజికీ, ప్రతి ఆరోపానికీ బాధపడి, ఎక్కడా విమర్శ రాయడానికి కూడ అవకాశం లేక ఆ బాధ రెట్టింపు అయింది.

ఎవరు ఏమనుకుంటే ఏం, చెప్పవలసింది చెప్పడమే అనే మొండితనం అలవరచుకోవాలని మిత్రులు అంటారు గాని, అట్లా కొంతకాలం ఉండి, చెప్పేది నిర్మమకారమైన వాస్తవం అయినప్పుడు ఎందుకు భయపడాలని నిర్మొహమాటంగా రాసిన విమర్శలు ఎందరినో దూరం చేశాయి, ఎందరినో ఎడతెగని శత్రువులను చేశాయి. ఒక పద్యానికి, పద్యంలో రెండు చోట్ల వచ్చిన ఒకే మాటకు రెండు వేరువేరు అర్థాలు చెప్పడం అన్వయదోషం అని అని రాసినందుకు, ప్రజా ఉద్యమాల ఫలితమైన సాహిత్యాన్ని పరిశీలిస్తూ సామాజిక పరిణామ కాలక్రమాన్ని తారుమారు చేశారని చూపినందుకు ఆ రచయితలతో రెండు దశాబ్దాలుగా వైమనస్యం సాగుతున్నది. ఒక కవిని పొగడడానికి మరొకరిని కించపరుస్తూ, పొగడదలచిన కవి రచన ప్రాధాన్యతను ఎక్కువచేసి చూపడానికి, దాన్ని పుస్తక ముఖచిత్రంగా వేశారని ఒకరు రాసినప్పుడు, ‘ముఖచిత్రం మీద కాదు, అది ఫలానా పేజీలో ఉంది’ అని ఒక నలుపు తెలుపుల చారిత్రక సమాచారం చెప్పినందుకు పుట్టిన కులం పేరు మీద నిందలు పడిన సందర్భం ఉంది. ముఖచిత్రంగా వేసి ఉంటే ఆ రచనకు వచ్చే అదనపు ప్రాధాన్యతా లేదు, లోపలి పేజీల్లో వచ్చిందని అంటే దిగజారిపోయే ప్రతిష్టా లేదు. అది ఒక సమాచార కచ్చితత్వం అంతే. కాని, ఆ వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించడం కాకుండా, ఫలాని కులంలో పుట్టినందువల్ల పుస్తకం ఉంచుకునే సౌలభ్యం ఉందనీ, మరొక ఫలానా కులంలో పుట్టినందువల్ల తప్పుగా ఉటంకించే హక్కు వస్తుందనీ వాదనలు వచ్చాయి.

ఇటువంటి అనుభవాలు నా ఒక్కడివే కూడ కాదు, ‘వీరబ్రహ్మం గారి తత్వాలలో చెప్పినవి జరగవు, జరగలేదు’ అన్నందుకు ఆ విమర్శ చేసిన వారిని వీరబ్రహ్మం పుట్టిన కులంలో పుట్టామని చెప్పుకుంటున్నవారు చీల్చి చెండాడిన సందర్భం ఉంది. స్థలంలో వందలాది కిలోమీటర్లు, కాలంలో వందల సంవత్సరాలు అంతరం ఉన్నప్పటికీ ఒక రచయితనో, సామాజిక వ్యక్తినో “తమవాడు”గా భావిస్తూ, వారి మీద సాధికారికమైన, సోపపత్తికమైన విమర్శ అయినా సరే రాగూడదనే వాదన ప్రస్తుతం చలామణీలో ఉంది. సామాజిక సంపదను పోగుచేసి, సొంతం చేసుకునే ఒక వృత్తి కులం చరిత్ర మీద ఒక అభిప్రాయం ప్రకటించినందుకు, రామాయణ కావ్యంలో పాత్ర చిత్రణ గురించి సాహిత్య విమర్శ చేసినందుకు నిందలు, దూషణలు, భౌతిక చర్యలు, శిక్షలు అనుభవించవలసి వచ్చిన సందర్భాలు కూడ ఇంకా స్మృతి పథంలో చెరిగిపోలేదు.

అలా చెపుతూ పోతే అభిప్రాయాలు ఉండడమే, ప్రకటించడమే నేరమూ, దోషమూ, అభ్యంతరకరమూ అవుతున్న స్థితిలో, విమర్శా, సాహిత్య విమర్శా ఎదుర్కొంటున్న ఎన్నెన్నో అవరోధాలు నానాటికీ పెరిగిపోతున్న స్థితిలో మనం ఉన్నాం. కాని ఎన్ని దూషణలూ తిరస్కారాలూ నిందలూ ప్రతికూల పరిస్థితులూ ఉన్నా సమాజానికీ సాహిత్యానికీ రచయితలకూ సాహిత్య విమర్శ అవసరం. ఒక రచనలోని దృక్పథాన్నీ, సామాజిక వాస్తవికతనూ, సామాజిక ప్రయోజనాన్నీ విప్పి చెప్పడం ద్వారా సాహిత్య విమర్శ సమాజానికి మేలు చేస్తుంది. ఒక రచనలో వ్యక్తమైన సాహిత్య సంప్రదాయపు నేపథ్యాన్ని, లేదా నూతన ప్రయోగాలను వివరించడం ద్వారా సాహిత్య విమర్శ సాహిత్యానికి మేలు చేస్తుంది. ఒక రచనలోని సాహిత్యకతను, రచయిత ప్రయోగశీలతను, రచయిత ప్రతిభనూ లోపాలనూ చూపడం ద్వారా సాహిత్య విమర్శ రచయితకు మేలు చేస్తుంది. ఏ కారణం కోసమైనా సరే సాహిత్య విమర్శను, మొత్తంగా విమర్శనాత్మకతను కత్తిరించడం మన చూపు మీద మనం కత్తెరలూ ముళ్లకంచెలూ స్థాపించుకోవడమే.

(భాషలో, ముఖ్యంగా కర్త, క్రియ ప్రయోగాల్లో పుంలింగం రాకుండా చూడడానికి చాల జాగ్రత్త పడతాను, బహువచనం రాసి తప్పించుకుంటాను గాని ఇక్కడ ‘సాహిత్య విమర్శకుడు’ అని పుంలింగం వాడక తప్పలేదు. సాధారణ పుంలింగం స్థానంలో స్త్రీలింగం వాడే సంప్రదాయం ఇంగ్లిష్ లో కొంతవరకు అలవాటయినట్టుగా, తెలుగులో ఇంకా పరిచయం కూడ కాకపోవడం ఒక కారణం. విమర్శకుడు అని వచ్చిన ప్రతిచోటా /విమర్శకురాలు అని రాయడంలోని సంక్లిష్టతను తప్పించుకోవాలనుకోవడం మరొక కారణం)

*

ఎన్. వేణుగోపాల్

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏ కారణం కోసమైనా సరే సాహిత్య విమర్శను, మొత్తంగా విమర్శనాత్మకతను కత్తిరించడం మన చూపు మీద మనం కత్తెరలూ ముళ్లకంచెలూ స్థాపించుకోవడమే.
    అది గ్రహించడంలేదనేగా ఈ ఆవేదనంతా!
    అయినా ఇంకొకటి మరిచి పొయ్యావు, వేణు!
    సాహిత్య విమర్శల మీద పార్టీల ప్రభావం కూడా ఉంది!
    లెఫ్టా? రైటా! చి న

  • సాహిత్యంలో ఒక ముఖ్యమయిన అవసరానికి మంచి మొదలు. సాహిత్య విమర్శ శాస్త్రీయ సాహిత్యకారుడు చేస్తేనే అవుతుందా లేదా పాఠకుడు చేసిన అవుతుందా అన్నది కూడా చర్చనీయమే.
    “సాహిత్య విమర్శ దాని ఆదర్శవంతమైన స్థితిలో గుణదోష నిరూపణగా, సంభాషణగా, చర్చగా ఉండాలి, ఉంటుంది” అన్న మాట నిజమే. ఆధునిక సాహిత్యమంటే అభిరుచి ఉన్న పాఠకుడు ఒక సాహిత్య ప్రక్రియను – నవల-కధ-కవిత-నాటకం- చదువుతున్నప్పుడు తనకు కలిగిన భావనను లేదా అభిప్రాయాలను సోదాహరణంగా చెప్పినప్పుడు వాటిని పట్టించుకోకుండా ఆ విమర్శను తీసిపారేసే స్థితి కూడా ఉంది ప్రస్తుత సాహిత్య వాతావరణంలో.

    ఒక రచనకు ముందు మాట, ఆ రచనను చదివించడానికి ఉపయోగపడేలా ఉండాలని పాతకుడుగా నా అభిప్రాయం. కానీ చాలా సార్లు ఆ ముందు మాటకూ రచనకూ పెద్దగా సంబందం ఉండదు. అలా ఎందుకు రాస్తారో మరి. కిందటి సంవత్సరం నే ను చదివిన చాలా మంచి ముందు మతాలలో, గీతాంజలి గారు రాసిన “హస్బెండ్ స్టిచ్”కు సత్యవతి గారు రాసిన ముందు మాట.

    మంచి ప్రయత్నం మొదలు పెట్టిన అఫ్సర్ గారికీ, వేణుగోపాల్ గారికీ అభినందనలు.

    • గీతాంజలి గారి హస్బెండ్ స్టిచ్ కి ముందు మాట నేను కాదు వ్రాసింది
      సత్యవతి

      • క్షమించాలి . ఏ.కె.ప్రభాకర్ గారు రాశారు. వారిని నేను అభినందించను కూడా.

      • క్షమించాలి . ఏ.కె.ప్రభాకర్ గారు రాశారు. వారిని నేను అభినందించాను కూడా. లాగే ముందు పెట్టిన వ్యాఖ్య లో పాఠకుడు బదులు పాతకుడు ఉంది. రాయాలనే ఆదుర్దాలో అచ్చు తప్పులు గమనించనని మిత్రులు వేణు నన్ను హెచ్చరిస్తుంటారు .

  • చర్చించాల్సినవి, ఆలోచించాల్సినవి అయిన అంశాలను పైపైన మాత్రమే స్పర్శించారెంచేత వేణు గారూ? నాకైతే ఒక్కో అంశంతోటీ ఒక్కో వ్యాసం రాసినా సరిపోదనిపించింది.
    పూర్తి వివరాలు ఇవ్వని కారణం చేత – “అవి మీ స్వంత అనుభవాలు మాత్రమే “నన్న వంకతో చర్చలోకి రాకుండా తప్పించుకుంటారేమో ‘రావలసినవారు’
    అయినా ఇది మొదటిదేగా – వచ్చే వ్యాసాల్లో ఇంకాస్త సూటిగా ‘సూచిస్తార’ని ఆశ.

  • ‘పంక పంకజ న్యాయము’.

    పంకమునకు పంకజమునకు సంబంధము లేదు. మనము పంకజము యొక్క సువాసన లేదా దుర్వాసననే తరచవలయును.

    పంకమున పుట్టిన పంకజము ఇంకా దానిని అంటించుకునే యున్నప్పటికినీ పరిమళము మాత్రము సువాసనగా వున్న చాలును.

    పంకములోపుట్టినను పంకజము ఒక మాధ్యమము మాత్రమే. మనము పరిమళమునే ఆస్వాదించవలయును.

    పంకజము యొక్క విధి పరిమళమును వెదజల్లుటయే, అది ఏ విధమైన పంకములోనే తన జీవితమును ఇంకను గడుపుచున్నప్పటికినీ మనము దానిని లెక్కించక పంకజమును ఒక మాధ్యమముగానే లెక్కించవలెను.

    వ్రాసినవ్యక్తి గొంగళిపురుగు నుండి సీతాకోకచిలుకగా మారే క్రమంలోనే వున్నారా, ఆ క్రమంలో భాగంగానే వ్రాసెనా లేదా గొంగళిపురుగుగానే వుంటే తన ఊహల్లోనే సమాజాన్ని ఉద్ధరించే క్రమంలో వ్రాసెనా, లేక, తన గొంగట్లోనే వెంట్రుకలు ఏరుతున్నాడా అనేది కూడా లెక్కించవలెను.

    ఇంకను, ఏకాక్షిన్యాయము, అనగా ఒకవైపు మాత్రమే మాట్లాడుతూ, చూస్తూ, ిరెండోవైపు అంతా పరమ క్రూరమైనదనే నిర్ధారణకు వచ్చేసి, లేదా మన లక్ష్యము సమసమాజ, మానవత్వము గాన అనేక విషయముల గురించి కొన్ని లేదా అన్నీ అసత్యాలనే ఇప్పటికీ తాము నమ్ముతూ, ఇతరులను నమ్మిస్తూ, అవి అసత్యములని తమకు తెలిసినప్పటికీ, లేదా తెలుసుకోడానికి కనీస ప్రయత్నము చేయక, మార్గము ఏదైనను లక్ష్యము గొప్పగా వున్నందున దోషము లేదని, సంభాషణ అనేది సాగనివ్వని తత్త్వము కూడా వున్నది.

  • నా వ్యాసంలో ఒక పెద్ద భాషాపరమైన పొరపాటు దొర్లింది. పదానికి చేర్చే ప్రతిదీ ప్రత్యయమేనని అనుకుని, అసాహిత్య లో అ ప్రత్యయం అని రాశాను. అది తప్పు. ముందు చేర్చేదాన్ని ప్రత్యయం అనగూడదు, ఉపసర్గ అనాలి. ఈ పొరపాటును గుర్తించి, సవరించిన నా గౌరవనీయ మిత్రులు, సంస్కృత, తెలుగు పండితులు ఎం నారాయణ శర్మ గారికి కృతజ్ఞతలు.

  • 1. పుస్తక విమర్శ వేరు, సాహితీ విమర్శ వేరు. సాంకేతిక విమర్శ, అచ్చుతప్పులు ఇటువంటివి (అంటే, పాఠుకుడు అనుగమించగలని అడ్డులు) సాహితీ విమర్శ లో చోటు ఉండదు.

    2. సాహితీ విమర్శ గురించి మీరు చెప్పిన సాధకబాధకాలు అర్థం అవుతున్నాయి. కానీ, సాహితీ విమర్శ కేవలం అభిప్రాయప్రకటన కాదు. అప్పుడు సాహితీ విమర్శ అభిప్రాయ బేధాలుగా కనబడుతుంది. ఆత్మ, పర స్తుతి, నింద గా మారుతుంది. మీరన్నట్లు సూత్రపరంగా సాగాలి.

    అందులో ఉంది ముఖ్యమైన కష్టం. ఏ సూత్రాలను ఆధారంగా చేసుకొని మీరు విమర్శ చేస్తున్నారు? ఆ సూత్రాలు పాఠకులు అంగీకరించారా? మరి రచయితలు అంగీకరించారా? ఈ సాహితీ విమర్శ చట్రం అందరికీ కొంచెం అయినా ఆమోదం అయితే, విమర్శ అభిప్రాయ బేధంగా కాకుండా, ఆబ్జెక్టివ్ గా ఉంటుంది.

    మీరు క్రిస్టోఫర్ కాడ్వెల్ ఒక పునాది అన్నారు. నాకు దానితో అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ, మీరు ఏ ఫ్రేంవర్క్ వాడుతున్నారు అనేది ఇంకా వివరంగా చెప్పాలి. ఆ ఫ్రేంవర్క్ ఎందుకు సమంజసమో, ఉపయోగకరమో చెప్పాలి. ఉదాహరణకి కాడ్వెల్ మార్క్సిస్టు సాహితీ విమర్శలో కూడా అందరూ ఒకే స్థానాన్ని ఇవ్వరు. అది అసంపూర్ణం. దానికి ఏమి కలుపుతున్నారు?

    ఒక విధంగా చెప్పాలంటే, సాహిత్యమే కాదు, విమర్శ ను కూడా deconstruct చేయవలసి ఉన్నది. ఏ విషయాలను మీరు స్వయంసిద్ధ న్యాయాలు గా భావిస్తారు? విమర్శ పరమావధి ఏమిటి? ఇవి ఇంకాస్త చెప్పవలసి ఉన్నది.

    ఇవన్నీ చదువరులకి చెప్పకపోతే మీ విమర్శ స్వీయాభిప్రాయ ప్రకటన అవుతుంది. చదువరులకు చెప్పినా వారికి అర్థం కాకపొతే, అది మీ విమర్శనా వైఫల్యం అవుతుంది (లేదా, వేరే చదువరుల్ని ఎంచుకోవచ్చు — సీరియస్ గానే అంటున్నాను). చదువరులకి అర్థం అయి కూడా మీ విమర్శని నిందిస్తే, అప్పుడు మీరు నిస్సందేహంగా చెప్పవచ్చు “వీరు విమర్శకి గౌరవం ఇవ్వరు” అని.

    మీ విమర్శలు చదవటానికి సిద్ధంగా ఉంటూ,
    రామారావు కన్నెగంటి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు