విశ్వవీధిలో తెలుగు పతంగం ‘సారంగ’

‘సారంగ’ మరీ ముఖ్యంగా కొత్త రచయితలకు తక్షణ గమ్యం.  వారికి తగినంత ప్రోత్సాహం ‘సారంగ’ బృందం నుండి లభిస్తున్నది.  సారంగలో తన రచన చూసుకున్న ప్రతి యువ రచయిత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

‘సారంగ’ – 14 సంవత్సరాల తెలుగు సాహిత్య యాత్రని పూర్తి చేసుకుంది.  ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు కవులకు, రచయితలకు, సామాజిక విశ్లేషకులకు ‘సారంగ’ ఒక గమ్యం మాత్రమే కాదు ఒక బంధం, ఒక ఆశ కూడా.

మూడు దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ తో మొదలైన డిజిటల్ యుగం సమాజానికే కాదు సాహిత్యానికీ కూడా అనేక మనుగడ సవాళ్లను విసిరింది.  మనిషి వ్యక్తిగత, సామాజిక జీవితంలోకి చొచ్చుకొస్తున్న టెక్నాలజీ అనేక వ్యవస్థల రూపురేఖల్ని మార్చేసింది.  అది సాహిత్యాన్ని పాఠకుల వద్దకు చేర్చే వ్యవస్థని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది.  “ఇంటర్నెట్‌లో తెలుగు సాహిత్యం నిలబడగలదా? పాఠకులు ఇక్కడికి వస్తారా?” అనే ప్రశ్న బలంగా వినపడింది.  ఈ సందేహాలకు సమాధానంగా 14 ఏళ్ల క్రితం ‘సారంగ’ ఆన్లైన్ సాహిత్య వార పత్రికగా ఆవిర్భవించింది.  బలంగా నిలబడింది.  ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ‘సారంగ’ ప్రయాణ రీతిని, తాను నెలకొల్పిన ప్రమాణాల్ని, తెలుగు సాహిత్యం ఉన్నతీకరణకు దోహదం చేస్తున్న వైనాన్ని ఒకసారి గుర్తు చేస్తుకోవాల్సిన అవసరముంది.

‘సారంగ’ కథలు, కవితలు, ధారావాహికలు, సాహిత్య విమర్శలు, సామాజిక విశ్లేషణా వ్యాసాలు, కాలంస్,  అనువాదాలతో అవిచ్ఛిన్నంగా, విజయవంతంగా ప్రస్తుతం పక్ష పత్రికగా కొనసాగడంలో ఆఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడుల కృషి చెప్పుకోవాల్సి వుంది.  అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వీరు తమ పుట్టిన గడ్డతో నిరంతర సజీవ సాహిత్య సంబంధాన్ని కొనసాగించడం ద్వారా  తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారనడంలో సందేహం లేదు.

 

‘సారంగ’ మామూలు సాహిత్య పత్రిక కాదు.  ‘సారంగ’కి ఒక స్పష్టమైన ప్రజాస్వామిక దృక్పథం, విధానం వుంది.  ఇందులో కాలక్షేప సాహిత్యానికి చోటులేదు. సమాజంలో ఘర్షించే ప్రశ్నలతో కూడిన భిన్న రూపాల సాహిత్యం మాత్రమే సారంగలో అచ్చవుతుంది.  విప్లవ సాహిత్యం, దళిత, మైనారిటీ, స్త్రీవాదం వంటి వివిధ రూపాల అస్తిత్వ సాహిత్యం సారంగలో కనిపిస్తుంది.  సాహిత్యమనే సృజనాత్మక ప్రక్రియ ద్వారా గొప్ప మేథో మథనం ‘సారంగ’లో చూడొచ్చు.  ఇదో ప్రజాస్వామిక స్థలం.  ఎన్నో ఆఫ్ లైన్, ఆన్ లైన్ మేగజైన్స్ ఇవ్వలేని ప్రజాస్వామిక స్థలాన్ని ఇచ్చే ఒకట్రెండు ఆన్లైన్ మేగజైన్స్ లో సారంగ ఒకటి.  కవిగా, కథకుడిగా, జర్నలిస్ట్ గా, ఉపాధ్యాయుడిగా ‘సారంగ’ సారధులకు  వున్న నాలుగు దశాబ్దాల పైని అనుభవం ‘సారంగ’కి పెద్ద బలం అని చెప్పొచ్చు.  అన్ని తరాలకు చెందిన వందలాదిమంది రచయితలని ఒక పర్సనల్ టచ్ తో పలకరిస్తూ, వారిని ప్రేరేపిస్తూ రచనలు చేయించడంలో అఫ్సర్ పద్ధతి అనన్య సామాన్యమైనది.  అఫ్సర్ ప్రోద్బలం  వల్లనే నేను సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వ్యాసాలతో ‘కొంచెం నీరు కొంచెం నిప్పు’ అనే శీర్షికని మూడు సంవత్సరాల పాటు రాయడం జరిగింది.

‘సారంగ’లో తన రచన చూసుకోవాలని పురోగామి ఆలోచన చేసే ప్రతి తెలుగు రచయిత ఆశిస్తాడు. సారంగలో ప్రచురితం అవడం అంటే ఆ రచనకి ఒక స్టాండార్డ్ వున్నట్లే అనే భావన తెలుగు సాహిత్యలోకంలో వుంది.  ‘సారంగ’ మరీ ముఖ్యంగా కొత్త రచయితలకు తక్షణ గమ్యం.  వారికి తగినంత ప్రోత్సాహం ‘సారంగ’ బృందం నుండి లభిస్తున్నది.  సారంగలో తన రచన చూసుకున్న ప్రతి యువ రచయిత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అన్ని జీవన పార్శ్వాలూ డిజిటలైజ్ అవుతున్న వర్తమాన సందర్భంలో సమాజ శ్రేయస్సుని కాక్న్షించే సాహిత్య దీపస్తంభంగా నిలుస్తున్న ‘సారంగ ‘కి శుభాభినందనలు.  మరో నూటా నలభై ఏళ్లైనా ఆ వెలుగులు అలానే ప్రసరించాలని కోరుకుంటున్నాను.

*

చిత్రం: సృజన్ రాజ్ 

అరణ్య కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు