సగం గడిచాక

ఇంకేముందీ

సగం చేజారిపోయాక
ఎగసిపడే
యవ్వనపు గర్వాలు అణగిపోయాకఆనాడు
నా పదునైన బాణాలు
తూట్లు పొడుస్తున్నా భరించావు
పలుకులు సూటిగా దూసుకుపోయి
ఛిద్రం చేసినా సహించావుస్ధానబలిమితో విర్రవీగుతూ
నీ కలలకు నిప్పుపెట్టి
నిన్ను నీకు కాకుండా చేసినా
తలెత్తిన మొలకల ముఖాలను

ఆపేక్షగా తడుముతూ
మౌనంగా నాతో నడిచావు
రహస్యదుఃఖాలలో తడిసావుకాలం
నిర్ధాక్షిణ్యంగా
ముందుకు ఈడ్చుకుపోతున్నప్పుడు
గాయాలను కప్పెట్టి
పెదవుల గుమ్మాలలో
చిరునవ్వుల తోరణాలను వేళ్ళాడదీసి
ప్రదర్శించావునేడు క్షమాపణ అడగడానికి
స్వాభిమానం
అనుకుంటున్నదేదో అడ్డొస్తోంది
చేతులు జోడించడానికి
నా మీసం అడ్డంగా నిలుచుంది

ఇక పాలు తాగిన పిట్టలు
రెక్కల బలాన్ని సరి చూసుకుంటూ
ఎగిరిపోయాక
కథ  సగానికి పైగా పూర్తయ్యాక
సూర్యుడు కొండల్లోకి
జారిపోయే సమయంలో
నువ్వూ నేనూ
ఒకే కప్పు కింద
ఒంటరిజంటగా ఉన్నపుడు
నీ సహనపు  మెత్తదనం మృదుత్వం
నాలో తెలియని మంటలు రేపుతోంది

కానీ నాలో
ఇంకా ఏదో మిగిలే ఉంది
ఆశ్చర్యంగా నీలోనూ
వానకు గొడుగు పట్టడానికి
ఏదో సిద్ధంగా ఉన్నట్టుంది.

*

పద్మావతి రాంభక్త

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు