నువు పరిచయం కాకపోయుంటే 

నిన్ను చూసిన మొదటి క్షణం
నా కింకా గుర్తుంది
ఎవరికి వారం నడిచిన
దారులేవీ గుర్తుకులేవు కానీ
మనం కలిసి నడిచిన
సమయాలన్నీ గుర్తున్నాయి
మొదటి సారి కలుసుకున్నప్పుడు
ఎలా పలకరించుకున్నామో
మనసులో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటుంది
ప్రపంచీకరణ సంస్కృతి సర్వవ్యాపితమైన కాలంలో
కన్నీళ్ళు పెట్టించే వారే ఉంటారు కానీ
కన్నీళ్ళు తుడిచేవాళ్ళు ఎవరుంటారని అనుకుంటున్న వేళ
మనం ఒకరికొకరం ఎదురుపడ్డామేమో
జీవితంలో ఒంటరిగానే మిగిలి పోతానని అనుకుంటున్నప్పుడు
నేనూ నీతోనే ఉన్నానని చెప్పి
నా పక్కన నిలబడ్డావు
పొంగి పొర్లుతున్న నదిని
పడవపై దాటుతున్నట్లు
లోతు తెలియని ఈ జీవితాన్ని
నీ చేతి చిటికనవేళు పట్టుకొని దాటుతున్నాను
ఎన్ని అనుభవాలు
ఎన్ని కన్నీళ్ళు
ఎన్ని ఙ్ఞాపకాలు
వెనుదిరిగి చూసుకుంటే!
ఇప్పుడనిపిస్తుంది
బహుశా,
నువు పరిచయం కాకపోయుంటే
నా పేరు ఎప్పుడో
తెల్లని గోడలపై
ఎర్రని అక్షరాలై మెరిసేది కావొచ్చని
ఒక పాటనయ్యో
స్మృతి గీతాన్నయ్యో
గాలిలో కలిసేవాణ్ణేమో!
తెలియదు.
*

వెంకట్ నాగిళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు