నదిని చూస్తే నదంతా
సముద్రాన్ని చూస్తే సముద్రమంతా
విశాలమవుతాయి కనులు
ఆకుపచ్చ వనాలను చేరగానే
విప్పారుతుంది ముక్కు
మామూలుకన్నా ఎక్కువ గాలిని
నిండా నింపుకుంటాయి ఊపిరి తిత్తులు
వాన చినుకుల్ని ఒడిసిపట్టాలని
బైటకొచ్చే నాలుక
పక్షుల పాటలకి
సెలయేటి సవ్వడికి
గులకరాళ్ల శబ్దాలకి
రిక్కించే చెవులు
చల్లటి గాలిలోకి రాగానే
తనువంతా తెరుచుకునే చర్మం
నా లోపల ఒక పూలతోట ఉన్నట్టుంది
ప్రతి అవయవమూ ఒక్కో మొగ్గ కాబోలు
ప్రకృతిలోకి వెళ్లినపుడు వికసించబోతాయి
నాగరికత తన మొరటు వేళ్లతో ముట్టుకోగానే
అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకుపోతాయి
*








Good poem
Congratulations