సంచులు

చేసిన అప్పులే గుర్తొస్తున్నాయి. బయటున్న ధరకు పోల్చుకుంటే కింటల్ 8-10 వేలకు పోవాల్సినది, నాలుగు వేలకు దిగింది. గీ సంచుల కాడ సుతం మోసమే.

‘హా…ఆ…హ్చ్,‘

అంజయ్య లారీ నుండి కిందికి దిగగానే, ఓ దళారి తుమ్ము గట్టిగానే వినబడింది. ‘ఇది మిర్చి యార్డు మరి…తుమ్మే ఈడ స్వాగతం చెప్తదే’ డ్రైవర్ నవ్వుకుంటూ దిగి అన్నాడు.

మే నెల కాబట్టి ఎండ సురసురమంటుంది అనేకంటే, సూర్యుడుకి కూడా మిర్చీ ఘాటు తాకిందేమో అనడం కరెక్టు…సెగలు కక్కుతూ మండిపోతున్నాడు. కాళ్లకు చెప్పులు లేకుండా దిగేసరికి పెనం మీద అడుగేసినట్టైంది. మార్కెట్ యార్డులో అటు మిర్చి ఘాటు ఇటు ఎండ దగడు పోటీపడి పెట్టే ఒళ్లు మంటకి చెప్పులు తొడుక్కోవడం ఎంత ముఖ్యమో  తొడుక్కున్న అంగి ఇప్పేయడం కూడా అంతే ముఖ్యమని అదే పనిలో పడ్డారు ఇద్దరు.

లోడ్ వచ్చి ఆగిందని దూరం నుండే గమనించి, మిర్చీ దించడానికి ఒక్కసారిగా లారీ చుట్టు ఎగబడ్డట్టు వచ్చారు హమాలీలు. ‘ఆగండి ఆగండి‘ అని సైగ చేసి, మార్కెట్ యార్డు లోపలున్న ఓ గోదాంలోకి వెళ్ళాడు అంజయ్య. అక్కడ నుండి రిజిస్టర్ పట్టుకొని తిరిగే ఓ ఆఫీసర్ను  వెంట పట్టుకొచ్చుకున్నాడు.

“ఇది జీటి మిర్చి కదయ్యా, ఇప్పుడంతా రెడ్ టాప్ కే రేటుంది. సర్లే, తెచ్చావ్ కాబట్టి కింటల్ కి నాలుగు వేలు” అన్నాడు లారీ చుట్టు తిరుగుతూ.

“పంట మొత్తం పండిన తర్వాత దేనికో రేటొచ్చింది అంటే ఎట్లా సార్?! పోయినేడాదికి కంటే  కింటల్ కి ఐదొందలే తేడానా…బయటేమో కొనలేనంత ఉంటే!”

“బయటంతా కాశ్మీర్ మిర్చి అమ్ముతాండ్రయ్యా. మస్తు ఎర్రెర్రెగా ఉంటది కానీ తియ్యగుంటది. జనాలకి సుతం అదే నచ్చుతాంది. అయినా గదంతా పక్కనెట్టు, నీ మిర్చి దించుతున్నావా లేదా? ” అడిగాడు ఒపెన్ చేసున్న రిజిస్టర్లో క్యాలుకులేటర్ నొక్కుతూ.

అంజయ్య ఆఫిసర్ ని అడగాలా వద్ద అనుకుంటేనే మెల్లగా “సార్, అట్లే సంచులకు సుతం” అని అడిగాడు.

“సంచులా! సంచులకేంది? మార్కెట్ ఎప్పుడో ఫిక్స్ చేసిన రేటే. ఒక్కోటి 16 రూపాయలు” ఈసారి క్యాలుకులేటర్లో లెక్కలు ఆపేసాడు.

“ఇది మరీ అన్యాయం సార్. బయట 40 రూపాయలకు కొనుక్కొచ్చినం ఒక్కోటి. ఆ లెక్కన సంచులతోనే రెండు కింటల్ల మిర్చి లాస్ అయితున్నట్టు!”

చిరాగ్గా “గదంతా నాకు తెల్వదోయ్. కమిటోళ్లు, వ్యాపారస్తులు కలిసి డిసైడ్ చేసిండ్రు. దానికి నేనేం జేస్తా! మీ రైతు సంఘాలు అన్ని దాని గురించే మార్కెట్ చైర్మన్ సార్ ముందే ఉన్నాయి. కావాలంటే నువ్వు కూడా వాళ్లతో పాటు పోయి అడుక్కోపో” రిజిస్టర్ ముసేసాడు. అంజయ్యకి ఒళ్లు మండింది, కానీసారి మర్చి వల్ల అయితే కాదు.

అంజయ్య ఏమంటాడో అని ఆ ఆఫీసర్ కంటే లారీ చుట్టు చేరిన హమాలీలే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. మండుటెండలో మిర్చి బస్తాలను వీపు మీదనో, తల మీదనో పెట్టుకొని కుస్తీ పడడం వాళ్లకు అలవాటైన బతుకు. ఒళ్లంతా ఎర్రగా మారి ఒకటే మంటా. ఆ మంట ఎక్కువైనట్టు అనిపిస్తే కౌంటర్ ఫైర్ లా నాలుగు మిర్చీలు నోట్లో కుక్కుకొని మరీ కసి పెంచుకుంటూ పని చేస్తారు. గట్టిగ చీదినా, దగ్గిన, రక్తం పడేంత వేడి ఒంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఆ వేడికి మూత్రం పోస్తే…మంటకి కండ్ల లోంచి కూడా కారుతుంటాయి. అలానీ వారి మాటలు మంట పెట్టవు “అరే సూరిగా, గోదాంలో పత్తి పక్కకే మిర్చి పెడితే ఫైరింజనొస్తదారా? ఎందుకంటే మిర్చి మంటెట్టుద్ది కద్రా, అంటుకోదూ” నవ్వులు పూయిస్తారు. చెమటతో ఒళ్లు చిటచిట పెట్టిన, కండ్లల్లో దుమ్ము పడ్డా కూడా మిర్చి చేతితో తూడ్చుకుంటే మంట ఇంకెక్కువ అవుతుందని ఊరకుంటునే ఎదురుచూస్తున్నారు.

అంజయ్య ‘సరే‘నని తలూపగానే హమలీల్లో చిన్న పిల్లలు సైతం నవ్వుతూ మిర్చి దించుతున్నారు..

కింటల్ నాలుగు వేలు అని తెలిసాక,

“అంజన్నా, ఇగ నా డబ్బులు ఇచ్చెయ్యే. పోయేలోపు కొన్ని ఖర్చలున్నాయి” అడిగాడు లారీ డ్రైవర్ స్లిప్ ఇస్తూ.

ఆ లెక్క చూసి “గింతనారా, మొన్న పత్తి లోడ్ పట్టుకొస్తే మల్లిగానికేమో ఓ రేటు, గిప్పుడు నాకేమో గింత”

“అరే అన్నా, పత్తి అనుగుతది కానీ మిర్చి వట్టిగనే ఇరుగుతది గదే. హైట్ లోడ్ ఎక్కువ పెట్టాల్నే. అట్లా ఇంజన్ మీద బరువు పడి పెట్రోల్ ఎక్కువ తాగుతది. పైగా మనకున్న గుంతల రోడ్లకి, టర్నింగ్ల దగ్గర, చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు ఎన్ని అడ్డంకులున్న మిర్చి బస్తాలు కూలకుండ తెచ్చినందుకు ఎక్కువే అయ్తది”, లారీ డ్రైవర్

“గివన్ని ముందే శెప్పలేదు!”

“అరే మిర్చికి మంచి రేటే వచ్చింది గదా, ఇయ్యడానికి ఏంది. మొన్న సీనన్న లోడు పట్టుకొని బొంబాయి మార్కెట్ దాకా పోయిన కూడా కింటల్ 3500 ఇయ్యనీకి లొల్లులైనయి. నీకు మస్తు నయం ఈడ” ఢ్రైవర్

“నువ్వు ఈడ్నే ఆగు. ఇంకా లెక్కలు తేలాలే” అంటూ అంజయ్య వేరే గోదాం లోపలికి వెళ్ళిండు. అప్పటికే చాలా మంది రైతులు, సంఘం పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ ముందు కూర్చున్నారు.

“చెప్పినం కదండీ…సంచికి సంచి లెక్క.

గిదే బెస్టు పద్ధతి కానీ అన్ని సంచులు లేవు కాబట్టే పైసలు ఇస్తున్నాం. అందులో కూడా గోనే సంచులు మాత్రమే తీస్కుంటం బోరాన్ సంచులు నడవయి” మార్కెట్ కమిటోళ్లలో ఒకరు.

“అరే 30-40 కి తెచ్చిన గోనే సంచి 16కి ఎట్టిస్తం సార్. కనీసం 25 అన్న ఇయ్యుండ్రి. అట్లైతెనే అమ్మేది లేకపోతే లేదు” సంఘం నుండి ఒకరు

“ఇవ్వము. మీరు రేటు కోసం కొట్లాడి ఎవరితో మాట్లాడించినా ఇదే ఫైనల్. మమల్ని కాదని కోర్టుకు కూడా పోయిండ్రు కదా, ఏమైంది? తీర్పు రానీకి ఇంకో ఆర్నెల్లు పట్టుద్ది. అప్పుడు రాపోండ్రి సుద్దాం. కావాలంటే ఆ చివరి మూడు గోదాముల్లో పాతవి పెట్టినట్టే ఈ సారి కూడా సంచులను అందులో నిల్వ పెట్టుకోండి” ఛైర్మన్

“ఈడ మీరు సక్కగా లేకనే కదా కోర్టు దాకా పోయింది. ఒక్కసారో రెండు సార్లో అంటే వేరు, ఆరేండ్ల సంది ఆ గోదాంలల్లో సంచులు అట్లనే ఉంటున్నాయి. రేటు ఏమో రాదు, అవేమో అమ్ముడుపోవు. గోదాంలల్లో ఉండి ఉండి సంచులు మగ్గుతున్నాయి కానీ రూపాయి కూడా మార్తలేదు.”

“అరే, గోదాంలల్లో సంచులు నింపుకొని నేనేమైన  వ్యాపారం జేస్తున్ననా?! అంతుంటే 16 కే అమ్ముకోండ్రి, అద్దన్ననా. ఆరేండ్లు దాటినయని మీరే అంటుర్రు కదా, మరి అన్నేండ్లు ఆ గోదాంలలో సంచుల బదులు పత్తో పసుపో మిర్చో పెట్టుంటే కనీసం అద్దె వచ్చేది మాకు! మూడు గోదాములకు లక్షల్లో లాస్! మరి ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తరు ?”, ఈ సారి ఇంకా గట్టిగా అన్నాడు ఛైర్మన్

వాదనలు నడుస్తూనే ఉన్నాయి. అంజయ్య తలకిందికి వేసేకుంటా బయటికొచ్చి కూర్చున్నాడు. కోపంతో కూడిన బాధ ఎక్కడి నుండో తన్నుకొస్తుంది.

‘కన్న కూతురి పెండ్లి కంటే ముందు,

కొడుకు సదువుకంటే ముందు,

చేసిన అప్పులే గుర్తొస్తున్నాయి. బయటున్న ధరకు పోల్చుకుంటే కింటల్ 8-10 వేలకు పోవాల్సినది, నాలుగు వేలకు దిగింది. గీ సంచుల కాడ సుతం మోసమే. ఇప్పుడంటే కౌలుకు తీస్కున్న పొలంలో మిర్చి పండిత్తి. దానికి కంటే ముందు వడ్లు, దానికి ముందు పత్తి, ఇంకా మక్కలు. సంవత్సరానికి రెండు-మూడు పంటలే గగనం, కానీ పంట వేసే ప్రతిసారీ ఇత్తనాలు, మందులతో పాటు సంచుల ఖర్చు వేస్తుంటే భయమైతాంది. థూ నీయవ్వ ఏం బతుకైపోయిందిరా. ఎవళ్లకన్న శెప్పిన సంచుల కష్టమేందని నవ్వుతరేమో’ కండ్లల్ల నీళ్లు తిరిగినయి.

‘అంజన్నా ఏడుస్తానవానే?’ డ్రైవర్ వచ్చిండు.

‘యే లేదు. మిర్చి ఘాటు కండ్లల్ల వడ్డదిరా’ అని తూడ్చుకుంటూ మళ్లీ లారీ దగ్గరికి వచ్చాడు దు:ఖం ఆపుకుంటూ.

హమలీలు లోడ్ దించేసారు. వాళ్లందరికీ ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ల  సేటు వచ్చి తీస్కున్నాడు. సేటు ముందు వెళ్లినట్టే వెళ్లి, ఆయన పోగానే అందరి బదలు ఓ హమాలీ వచ్చి ‘ఛాయ్ పైసల్ ఇయ్యుండ్రి సారు‘ అని అడిగింది.

“గింత వేడికి ఛాయ్ ఆ?!”

“ఈడ మిర్చి రాజేసే మంటకి మా సెమట సుక్కే పెట్రోలెక్క, ఒళ్లు ఎప్పుడూ కాలిపోతునే ఉంటుంది సారు. ఆ ఛాయ్ బొట్టే మమ్మల్ని సల్లారవెడ్తది” అందామె.

ఆమె చెప్పిన సమాధానం కన్నా,

తాను ఓ రైతు అని తెల్సి కూడా ‘సారు‘ అని పిలిచినందుకు ఇవ్వాలి అన్పించి ఇచ్చేసాడు.

***

మార్కెట్ యార్డులో నైట్ డ్యూటీ చేస్తున్నా నరేష్ కు కూర్పాట్లు పడ్తున్నాయి. ఘాటుకు తుమ్మి తుమ్మి ముక్కు పట్టుకున్నట్టైంది. కండ్లకు నిద్ర కమ్ముకొస్తున్నా, దోమలు తల సుట్టు తిరుగుతూ చిరాకు తెప్పిస్తున్నాయి. అక్కడక్కడా ఫోకస్ లైట్ల ఉన్నా చీకటిగానే ఉంది, రూఫ్ల మీద ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా మార్కెటంతా ఒకలాంటి నిశబ్దం. గాలిలేక ఉక్కపోత. గోదాంలకు తాళాలేసి ఇప్పటికీ మూడు రోజులైంది. మార్కెట్ తెరవక రెండు రోజులు. కొంత మంది రైతులు ఇంటికి పోలేక గేటు బయట బట్టలు పర్సుకొని నిద్రపోతున్నారు. అక్కడక్కడే దొరికిన సర్వపిండ్లు, ప్యాలాల ముద్దలనే తింటూ తడకప్పలెక్క మార్కెట్ బయట తండ్లాడుకుంటా మూడు రోజులు గడిపారు.

నరేష్ ఫోన్ రింగ్ అవగానే లిఫ్ట్ చేసి,

“అమ్మ శెప్పే…

ఇయాల్ల కాదు రేపు పొద్దున్నే వస్తా ఊరికి…

ఇంకా తిన్లేదు…(గుర్తొచ్చి టిఫిన్ బాక్స్ తెరిచాడు)

సామాను ఆర్డర్ పెట్టిననే, వస్తున్నాయి. రేపు రాంగ పట్టుకొస్తా, ఊకూకే ఫోన్ చెయ్యకు…

(ఏదో సప్పుడైంది)

నేనిప్పుడు నైట్ డ్యూటీలున్నా, మళ్ళ జేస్త ఆగు”, అని కాల్ కట్ చేసిండు. టిఫిన్ బాక్స్ పెక్కనెట్టి తన లాఠీ పట్టుకొని సప్పుడు వచ్చిన దిక్కు మెల్లిగా పరిగెత్తాడు.

యార్డులోని చివరి గోదాం వెనక్కి వెళ్లేసరికి, కొంత మంది ఒకరి భుజం మీద మరొకరు ఎక్కి, గోడ పొడువునా నిలబడి ఎంతో పైనున్న వెంటిలేషన్ నుండి గోదాం లోకి దూరడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడ్డారు!

“ఏయ్…రేయ్…ఎవర్రా మీరంతా” అని నరేష్ అరుపు వినగానే దబ్బున అందరు కిందపడి చెరో దిక్కు పరిగెత్తారు. ఎవరి దిక్కు పరిగెత్తాల్నో తోచక ఉన్న కాడనే లాఠిని నేలకేసి కొడ్తుంటే చీకట్లో అందరూ మాయమైపోయారు.

రెండు నిమిషాలు అక్కడక్కడే తిరుగుతుంటే ఆ గోదాం వెంటిలేషన్ లోంచి దారంతో చుట్టేసిన ఓ సంచుల బస్తా దబ్ మని కింద పడింది. నరేష్ భయపడ్డి అటు వైపు తిరిగాడు. తర్వాత ఇంకొన్ని సంచులు కలిపి ముడేసి ఇంకో బస్తా పడింది. తర్వాత మెల్లిగా వెంటిలేషన్ నుండి ఓ వ్యక్తి తల బయటకు పెట్టి ఒళ్లు వంచుతూ కూర్చొని కింద తన మనుషులు కోసం చూస్తున్నాడు. అందరు పారిపోగా…కానిస్టేబుల్ నరేష్ ను చూసి ఒక్క సారిగా భయపడ్డి, దూకకుండా మళ్లీ లోపలికే వెళ్దామని చూసాడు.

“రేయ్…దిగురా, కిందికి దిగి.ఏం జేస్తున్నవ్ ఆడ” నరేష్ గట్టిగా అరిచాడు.

ఆ వ్యక్తి భయపడి మళ్లీ గోదాంలోకి దిగుతుంటే గుర్తొచ్చింది, ఎటు దిగిన కూడా పోలీసులు లోపలికి వచ్చి మరీ పట్టుకుంటారని.  పోనీ ఇటు దూకితే కానిస్టేబుల్ చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోవచ్చని అనుకొని కిందకి చూసాడు…గోదాం గోడ ఎత్తు ఎక్కువగా ఉంది.! అన్ని రకాలుగా చుట్టేసిన భయం. దెబ్బకు కదలకుండా ఆ గోడ మీదనే కూర్చున్నాడు.

నరేష్ కింది పడ్డ ఆ సంచులను తీస్కొని,

“రేయ్, నిన్నేరరేయ్, కిందికి దిగ్రా.

మర్యాదగా కిందికి దిగు.

నువ్వు గనక కిందికి రాకపోతే బిడ్డా, మిగితా పోలీసులు కూడా పిలుస్తా. ఆళ్ళందరచ్చి రౌండప్ చేసిండ్రనుకో, నువ్వు కిందికి దిగేలోపే సస్తవ్. ఛల్ మూసుకొని కిందికి దిగు” నరేష్ లాఠీతో బెదిరిస్తూ.

“సార్సార్సార్…ప్లీజ్ సార్. ఏదో తెల్వక చేసిన సార్. ఇడ్సిపెట్టుండ్రి సార్. మస్తు ఉడకపోస్తుంది గదా గోదాం లోపల సల్లగుంటదేమో, నీళ్ళు దొరుకుతాయి అని ఇట్ల లోపలికొచ్చిన సార్” గొంతు వణుకుతున్న కూడా గట్టిగానే బ్రతిమాలాడు.

“ఏంద్రా నాటకాల. నడు కిందికి దిగు ముందు. ఛల్ దిగు బే. ముందే చెప్పిన కదా మిగితా పోలీసులను కూడా పిలుస్తా అని. అక్కడి దాకా తెచ్చుకోకు చెప్తున్నా”

వెంటిలేషన్ దగ్గరే కూర్చుని ఆ వ్యక్తి ఏడ్వడం మొదలెట్టాడు ‘దిగను’ అని.

నరేష్ సీరియస్ గా “నీ అవ్వా, చెప్తే అర్థమైతలేద్రా, ఆగురా మా వాళ్ళకి ఫోన్ జేస్తున్నా. కిందికి దించినంక నీకుంటదిరా…” అని జేబులో నుండి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ కొట్టగానే “అద్దద్దు సార్…నీ కాళ్ళు మొక్త…అత్తున్న…దిగుతున్న” అని కిందికి చూసి మళ్లీ ఆగాడు. నరేష్ ఫోన్లో ‘హలో సార్…‘ అని ఎవరితోనో మాట్లాడుతుంటే, అదే అదనుగా కండ్లు మూసుకొని దబ్బున కిందకి దూకాడు.

పడడంతోనే పారిపోదామని చూసిన, కాళ్లు బెనికి నడవరాలేదు. నరేష్ అతని జుట్టు పట్టి లాఠీ ఎత్తగానే “అద్దు సార్, అద్దు సార్ నీ కాల్మొక్కుతా సార్” అని గట్టిగా ఏడ్వబోయాడు.

నరేష్ కోపంగా “ఏ ఛుప్” అనగానే సైలెంట్ అయ్యాడు.

అతన్ని పక్కకు లాకెళ్లి ఒక బెంచ్ కి కట్టేసి కింద కూర్చొ బెట్టి వివరాలు అడిగాడు.

అతని పేరు గంగరాజు అని, ఇదే ఊర్లో ఇదే మార్కెట్ యార్డులో చిన్నాచితకా పనులు చేస్కుంటూ ఉండే కూలి అని చెప్పాడు.

“నాకున్న డౌట్ ఏందంటే నువ్వు ఈడనే పని జేస్కుంటా ఏ గోదాంలో ఏమేమి ఉన్నాయో అన్ని తెల్సుకొని మరీ, కేవలం సంచుల కోసం మాత్రమే గోదాంలోకి పోయినవ్రా. అదేందుకో నాకు తెల్వాలే. నిన్ను స్టేషన్ పట్టుకుని పోయేంత సీన్ కూడా లేదనిపిస్తుంది. నిజం చెప్పినవ్ అనుకో, ఇడిసేస్తా”, నరేష్

గంగరాజు కి ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా ఉన్నాడు. నరేష్ తాను ఇంతకు ముందు తిందామని తెరిచిన టిఫిన్ డబ్బా మూయబోతు ‘తింటవా’ అనడగ్గానే,

గంగరాజు మొదట వద్దన్నట్టు తలూపి తర్వాత కాస్త మొహమాటం పెట్టగానే కావాలన్నాడు. ఒక చెయ్యికి మాత్రమే కట్టు విప్పి, బాక్స్ మూతలో అన్నం పెట్టిస్తే గబగబ తింటున్నాడు.

“చెప్పు, దొంగతనం చేయాల్సిన అవసరం ఏంది?” ఆ మాటకి నోట్లో బుక్క సరందప్పి కండ్లల్లో నీళ్లు తేలాయి. భయపడ్తూనే కాస్త ధైర్యం చేసి

“చెప్త సార్, చేతిల అన్నం పెట్టినోడికి అబద్ధం చెప్పొద్దని మా అమ్మ శెప్పేది. నిజంగా నాఇచ్చట నేనైతే దొంగతనానికి రాలేదు సార్. మా సేటు చెప్తే చేస్తున్నాం! ఈ మార్కెట్ల సుట్టున్న మిల్లుల ఓనర్లు, దళారులు, వ్యాపారులు, అధికారులు అందరు రైతుల మీదనే సార్ బతికేది. కానీ కొన్నేళ్లుగా అంతా ఒకే చేతికి కట్టేసి వేలాడుతున్నా తోలుబొమ్మలు లెక్క అయ్యిండ్రు. ఆ చెయ్యి ఎట్ల తిప్పితే అట్ల ఆడుతరు సారు. ఆ చెయ్యి ఓ ‘కంపెనీ’ది.

ఆ కంపెనీయే ఈడ ధర నిర్ణయిస్తుంది. ఆ ధరకే ఆ కంపెనీ కొనుకుంటుంది. చివరికి ఆ కంపెనీయే బయట వేరే ధరకు అమ్ముకుంటుంది. ఇదంతా అందరికీ తెల్సిందే, కాని ఈ మధ్యలో వాళ్ళ కండ్లు సంచుల్లో ఏముందనే కాకుండా తెచ్చిన ఆ సంచుల మీద కూడా పడ్డాయి సారు”

గంగరాజు చెప్తుంటే చెవులు పెద్దగా చేసాడు నరేష్.

“ఆ మూడు గోదాంలల్లో సంచులు ఉండబట్టి పదమూడేండ్లు అయ్తుంది సార్. కలెక్టర్ సాబ్ లాంటోళ్ళే సంచికి 25 రూపాయలు చొప్పున ఇయ్యుండ్రి అని ఆర్డర్ పంపినా సుతం ఇనకుండా…ఈ తోలుబొమ్మలన్ని కల్సి మార్కెట్ మూయించిండ్రు. రైతులు ఎన్ని ధర్నాలు చేసిన మూయని మార్కెటు, గీ మూడ్రోజులుగా ఎందుకు మూసేసిండ్రు…ఇందుకే!

ఏమైనా గానీ వాళ్లకి లాభం రెండింతలు రాన్దే సంచుల ధరలు ఈ మార్కెట్లో అయితే పెరగవ్ సార్”

నరేష్ కి కాస్త చిరాకొచ్చి, “ఎవడు చెప్పిండ్రా గిదంతా. ప్రతోడు కంపెనీలను అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఓ కంపెనీ ఒక వస్తువును కొనాలంటే దాంట్ల లాభనష్టాలు చూస్కొని అడుగుపెడ్తరు. సప్లై-డిమాండ్, బిజినెస్ లాజిక్స్, మార్కెటింగ్ స్కిల్స్ అంటూ ఎన్నో ఉంటాయి ఆళ్లకి. మనకవేవి తెల్వకుండా ఎవడేది శెప్తే అది వినుడే! ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ కి వచ్చి మరీ రైతులను మోసం చేయాల్సిన అవసరం కంపెనీ కేంది? అది అంత ఈజీనా. అయినా సంచుల సంగతి సూసుకునేది కార్పరేషన్ లేక సివిల్ సప్లయ్స్ వోళ్లు, మరీ నడుమిట్ల కంపెనీకీ సంబంధమేందిరా! ఇదంతా పక్కనబెట్టు…ఇంతకీ నువ్వెందుకు దొంగతనానికి అచ్చినవ్? అది జెప్పు”

“ఆగుండ్రి సార్, అక్కడికే అత్తున్నా. పదమూడేళ్ళుగా సంచులని ఈ మార్కెట్లనే దాస్తుండ్రు ఇని శెప్తుంటే మీకో డౌట్ ఒస్తలేదా, మూడే గోదాములు ఎట్ల సరిపోతున్నాయని?! ఎందుకంటే ఎప్పటికప్పుడు సంచులను మాయం జేత్తుర్రు. ఎలుకలు కొరికినయ్ అని, పురుగులు ఫంగస్లు పట్టినై అని, సలికి గోనే సంచులన్ని పాడైతున్నయ్ అని ఏదోటి సెప్పి లాగేసుకున్నరు. ఈ విషయంలో తోలుబొమ్మలు తిరగబడ్డాయి సార్. తిరగబడ్డాయి అంటే అదేదో రైతులు సంచులు నష్టపోతారని కాద్సార్, తమకి వాటా సరిగ్గా రాట్లేదని. అందుకే ఈ సారి మార్కెట్ మూయించి మరీ కంపెనీ వోడు రాజీ పడేలా జేస్తుండ్రు. కానీ వాడు దిగి వస్తాడో రాడో తెల్వక భయపడి ముందే మనం దొంగతనం చేసింది నయమని తోలుబొమ్మల్లో ఒక ముఠా మమ్మల్ని ఒప్పించి మరీ దొంగతనాలకు పంపిండ్రు సార్!” గంగరాజు తినడం ఆపేసి.

“ఎవడో చెప్పిన కథలన్ని నమ్మి మీరు దొంగతనానికి రావడమేందిరా. మీరెక్కడ కంపెనీ దిక్కు పోతారేమోనని, మీ ఓనర్లు వాళ్ల మీద కోపం పెంచుకునేలా అల్లిన కథలు ఇవన్నీ. దొంగతనాలు చేయించుకుంటా బయట సంచులు అమ్ముకుంటునరు. నువ్వు అనుకునే గా తోలుబొమ్మలు కలిసి కంపెనీ వొడికి సంచికి 30 రూపాయల చొప్పున అమ్ముతాంది. కానీ రైతుల దగ్గర 16కే కొంటుండ్రు. గిప్పుడు బయటున్న ధర 40కి అమ్ముతే లాభాలు ఎక్కువస్తున్నాయని కంపెనీ వాడిని సుతం పక్కకు బెట్టి బయటే యాపారం జేస్తుండ్రు. ఇక్కడ అసలు తోలుబొమ్మల్లో నీలాంటోల్లేరా. ఈడ అసలు నష్టం అంతా రైతులు, ఆళ్ళతో పాటు మార్కెట్కి సుతం.! సంచులతోనే నిండిన గోదాములు చేయాల్సిన యాపారం చేయలేక పదమూడేళ్లుగా ఎన్ని కోట్ల నష్టమో తెల్సునా? దాదాపు 20 కోట్లురా!”, నరేష్.

గంగరాజు నోటికాడి ముద్ద లోపలికి దిగకుండ మళ్లీ కుత్కెవడ్డది. నరేష్ నీళ్లు అందించాడు.

“ఏంది కోట్లే! అంటే ఇప్పుడు నేనే పిసోడినా సారు?! నువ్వు అన్నం ఒకటే పెట్టలేదు సారు బుద్ధి గడ్డి తిన్నదనీ కూడా తెలిసేలా జేసినవ్. సారు మీరు ఏమి అనుకోక పోతే ఇప్పుడు రైతులకు కంపెనీకి ఎట్లాగో తెల్వదుగా…

మరి మిమ్నల్వి నమ్మి విషయం బయట పెట్టిన కాబట్టి…

మీరు పట్టించుకోనట్టు ఉంటే ఇంకొన్ని దొంగతనాలు జేసి మా ఓనర్ని నిలదీసి మరీ మనిద్దరికీ మంచి వాటా అడుగుతా సారు…ప్లీజ్ సారు…మీరు ఒప్పేసుకోండ్రి సారు, సాఫ్ గా పనైపోతది” అసలు విషయం చెప్తూ బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు.

నరేష్ ఆ మాటకి ఒక్కసారిగా షాకై, మెల్లిగా ఆలోచనల్లో పడ్డాడు. ఇంత సేపు కొట్టకుండా ఊరుకున్నందుకు సిగ్గుపడి, విప్పిన చేతిని మళ్లీ కట్టి, లాఠీ అందుకొని గంగరాజును కుక్కను కొట్టినట్టు కొడ్తూ

“అన్నం పెట్టినందుకు రుణపడి నిజం చెప్పినవ్…మరి అదే అన్నంని పండించినోడిని మాత్రం మళ్ళీ మోసం చేయాలని ఎట్ల అన్పిస్తుంది రా…” కొడ్తూనే ఉన్నాడు.

“పైగా మూడు రోజులు బంద్ పెట్టినందుకు మార్కెట్లోకి రైతులు చొరబడి, గోదాంల మీద దాడి చేసి సంచులను దినుసులను ఎత్తుకెళ్తారనీ నాలాంటి పోలీసోడిని కాపలా పెట్టారు చూడు…నోట్లోకి ముద్ద దిగట్లేద్రా”, కొడ్తూ కొడ్తూ ఆయాసంతో లాఠీ కిందకి విసిరేసాడు.

గంగరాజు నొప్పులతో మూల్గుతునే, “మీరేదో రైతుల పై తెగ జాలి సూపేసి, ఆళ్ళకు నష్టం ఒస్తుందని బాధపడుతున్నారు గానీ రైతులకు ఇవేం కొత్తకాదు! ఎవడి బిజినెస్ ఆడు సుసుకోవాల్నాయే. పైగా ఈ సంచులను ఎవడు సార్ పట్టించుకునేది?! నా మాటిని కాసేపు మీరు కండ్లు మూస్కొండ్రి సార్, మొత్తం గోదాం ఖాళీ చేద్దాం. అసలే మా సేటు లేటయితే తిడ్తడు సార్. ఇవాళ నన్ను, రేపు ఇంకొంతమందిని పట్టుకుంటారేమో గానీ తర్వాత మరో ముఠా డ్రోన్లతో కూడా సంచులను ఎత్తుకుపోడానికి రెఢీ అయితాంది. ఎట్లాపుతరు సారు…” గంగరాజు మాటలకి నరేష్ ఈసారీ సంచులకు ఓ దారం తీసి మెడకి సుట్టి బాడీని ఓ సంచులో తీస్కెళ్లి పడేయాలి అనేంత కోపం వచ్చింది. మళ్ళీ లాఠీ పట్టాడు “ ఏంది సార్, మాకు రూల్స్ తెల్సు, ఇట్ల కట్టేసి కొట్టడం కరెక్ట్ కాదు. ఏదో మొత్తం నేనే జేసినట్టు, నన్ను ఒక్కోడ్ని కొడితే సరిపోతుందా”.

నరేష్ ఫోన్ మోగింది. పెట్టిన స్విగ్గీ ఇన్స్టామార్ట్ సామాన్లు పట్టుకొని డెలివరీ బాయ్ మార్కెట్ గేట్ దగ్గరికి వచ్చాడని తెలియగానే, వెళ్లి తీస్కొని లోపల సామాన్లు చూస్కున్నాడు.

‘5 కేజీల సామానికి, కేజీకి 9 రూపాయల చొప్పున క్యారీ బ్యాగ్ ధర 45 రూపాయిలా! పైగా ప్లాస్టిక్ కాకుండా ఈ జ్యాట్ బ్యాగ్ వాడుదాం అని పెద్దగా రాసుంది. ఆలోచన మంచిదే కానీ ఎంత ధరకు?! ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లో 25కేజీల అదే గోనే సంచికి 16…16…16’ నరేష్ కి బుర్ర గిర్రుమంది.

వచ్చే సరికి గంగరాజు కనబడలేదు. చెమట పాదాలతో పడిన అచ్చుల వైపు పరిగెత్తాడు. ఈ లోపు చివరి వరసలోని రెండో గోదాంలోకి మరో గ్యాంగ్ సంచులను ఎత్తుకెళ్లడానికి గుట్టుగా చొరబడినట్టు నరేష్ కి తెలేదు!

కానీ ఆ గోదాంలో ఎలుకల కంటే ఎక్కువగా చెదలు పట్టి అన్ని సంచులకు సగం సగం తినేసాయని ఆ గ్యాంగ్ కి లోపలికెళ్లే దాకా తెలీలేదు!!

కావాల్సినన్ని సంచులు తీస్కొని మిగితావి సీకుటం బట్టి కొరికినవే ఉండడంతో లెక్క తప్పించడానికి పొయ్యే ముందు ఆ గ్యాంగ్లో ఒకడు ఓ అగ్గిపుల్ల గీకేసి వెళ్లిపోయాడు. గోదాం లోని సంచులన్ని భగ్గుమని అంటుకున్నాయి.

తెల్లారేసరికి,

మంటలంటుకున్న ముచ్చట ఊరంతా పొగలా పాకింది.

ఫైర్ ఇంజన్ కంటే ముందుగానే గేటు బయటున్న రైతులే ధైర్యంగా గోదాం లోపలికి వెళ్ళి మరీ మంటలు ఆర్పారని తెలిసింది.

రాత్రే వచ్చిన మిగితా పోలీసులు కలిసి గంగరాజును పట్టుకున్నారు, అతను చెప్పినదంతా రికార్డ్ చేసిన ఆడియో ఫైల్ నరేష్ ఇచ్చేసి డ్యూటీ దిగాడు. సంచుల ధర నిర్ణయించలేదు కానీ మిగితా మార్కెట్ అమ్మకాలు మొదలయ్యాయి. బయట మాత్రం సంచుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి, ఇప్పుడు ఒక్కోటి 100 రూపాయలు!

నరేష్ బయటికి వస్తూంటే అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ల నాన్న అంజయ్య లాగానే కనపడ్తున్నారు. దాదాపు ఆరు సంవత్సరాలు అయ్యింది అంజయ్య మార్కెట్ కి రాక. డైరెక్టుగా ఆటోనో లేక పెద్ద బండేసికొని వీధి వీధి తిరుగుకుంటూ అమ్ముకోవడం మొదలెట్టాడు. లాభాలు వస్తున్నాయి అనే సంబరం కంటే నష్టం మాత్రం రాట్లేదనే సంబరం ఎక్కువైంది. నరేషే డ్యూటీ లేనప్పుడు బండి నడిపుతూ తండ్రికి సాయపడ్తుంటాడు. కానీ తండ్రి రోడ్డు మీద అలా అమ్ముతుంటే మాత్రం ఎందుకో కండ్లల్ల నీళ్ళు తిరిగేవి.

‘ఏంది బిడ్డ ఏడుస్తున్నవా?’ అని అడిగితే మాత్రం

‘లేదే, మిర్చి ఘాటు కండ్లల్లో పడింద’నే అబద్ధం నాన్న నుండి నేర్చుకున్నదే మళ్లీ వాళ్ల నాన్నకే చెప్పేవాడు.

*

మన్ ప్రీతం

8 comments

Leave a Reply to V Abhiram Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • I’m a fan of ur father and now for u even. U people write stories like an responsibility. Thank u for writing this brother 😍

    – Abhiram

  • చాలా మంచి కథ. Monopoly capitalism పెరిగిన పరిస్థితులు survival struggles ని కార్పోరేట్ పోషిస్తున్న విధానం కథలో చక్కగా చూపారు.ముఖ్యంగా ఎవరు పట్టించుకోలేని సంచులను వస్తువుగా తీసికోవడం బాగుంది కానీ control, profit లాంటివి నిజానికి ఎవరికీ పోతుందనేది ఎవరికీ తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది మీరు గమనించాలి.

    • మీరు అన్నది పూర్తిగా నిజమయితే కాదు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఎవరు profit gain అవుతున్నారని కాదండి, ఎవరు నష్టపోతున్నారు! ఎవరి నోరు నొక్కి మరీ దోచుకుంటున్నారు అనేది. Personally నేను ఈ కథ మొదలు పెట్టుకున్నదే బాధితులు ఎవరో అర్థమై 😊.

  • కథ చాలా బాగుంది… కొత్త కథా వస్తువు, శిల్పం…మనం కిరాణా షాపుల్లో పదో, ఇరవయ్యో పెట్టీ కొనే గోనెసంచి చుట్టూ ఇంతటి భయంకరమైన కథ ఉంటుందని ఎవరూ ఊహించలేరు… narration కూడా బాగుంది… మంచి కథ రాశారు… అభినందనలు…❤️💐💐😇👏👏👏

  • ఓ తుమ్ము తో కథ స్టార్ట్ చేసిన విధానంతోనే పట్టింపులను బ్రేక్ చేయడం నచ్చింది. ఇక కథ అంటావా రైతుల మీద జాలి కురిపిస్తున్న కథ అన్నట్టు స్టార్టయ్యి, ఇదేదో నేను నిజంగా కనెక్ట్ అవుతానో లేదో అనుకునే లోపే పోలీస్ – దొంగ వచ్చిన తర్వాత ట్రాక్ మార్చి సబ్జెక్ట్ డైవర్ట్ కాకుండా మళ్ళీ లీనం చేసావు. నిజంగా పోలీస్ కి అంత కన్సర్న్ ఉంటుందా అని చివరి వరకు అనుకుంటున్నా, లాస్ట్ లో ట్విస్ట్ అర్ధమయ్యాకా కన్విన్స్ అయ్యాను. మస్తు మంచిగా రాసినవ్ ప్రీతం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు