లోపలి చీకట్ల రహస్యాన్వేషణ ‘కుందాపన’

జీవితాంతం తిరగరాసినా పురిపడని పద్యాలతో కవి కుస్తీ పడుతుంటాడు.

వి వీరెల్లి. ఖండాల కవతల ఉన్నా నిరంతరం కవిత్వం కలగంటున్న వ్యక్తి.

ఆయన భాషలోనే చెప్పాలంటే రవికి…

”కలమంటే కవిత్వం/ కాగితమంటే కవిత్వం/ నిద్రను కరిగించే వెచ్చని రాత్రంటే కవిత్వం”.

కాబట్టే తన ”కుందాపన”ను నలభై ఎనిమిది పొద్దుపొడుపులతో పోతపోశారు.

మనం నిరంతరం శ్వాసిస్తున్నది చీకట్లోనా? వెలుగులోనా?

శరీరపు దరులొరుసుకుంటూ అంతుచిక్కని చిక్కు ప్రశ్నలు. గుప్పిట్లో పిగిలిపోయే ఆలోచనలు. ఎప్పుడో రాలే ఆ ఒక్క చుక్క కోసం ఎదురుచూపు. తనువంతా ఒక రక్తపుచుక్కై రాలిపడే కొసమెరుపు కోసం కవిత్వం దారపుకొసన తలకిందులుగా వేళ్లాడుతూ-

”వెలుగులోకి నడిచినంత ధైర్యంగా

చీకట్లోకి చొచ్చుకుపోలేం కదా!” (కొసమెరుపు) అంటారు. అంతలోనే శరీరం స్పృహభరితమవుతుంది. ‘వెలుగు’భ్రమలు తొలగిపోతూ

”అనుకుంటాం గానీ

చీకట్లోకి నడిచినంత తేలిగ్గా వెలుగులోకి వెళ్లలేం… నగ్నంగా” అంటారు.

ఎన్నుకున్న వస్తువు ఏదైనాగానీ, దాన్ని తన కళ్లలోకీ మనసులోకీ పిండుకోవడంలోనే ఈ కవి తన శక్తియుక్తుల్ని ఫణంగా పెడతాడు. తనదైన చూపుతో, సరికొత్త భాషతో కవితను నిర్మిస్తాడు. ఈ సంపుటిలోని ఏ కవితా దీనికి మినహాయింపు కాదు.

”అంతరంగాన్ని అతలాకుతలం చేసే

నీ ఉద్వేగపు తాకిడి లేనప్పుడు/ అక్షరాలు

ప్రేమగా అలాయ్‌ బలాయ్‌ ఇచ్చుకోవు” (మొదటి వాక్యం) అని తన సృజనమూలాలను గుర్తెరిగిన కవి మాత్రమే అనగలడు. కాబట్టే అతని మొదటి వాక్యానికి రెండో వాక్యం రక్తం పంచి ఇస్తుంది. రెండో వాక్యానికి మూడో వాక్యం గొంతునిస్తుంది.

కంటిపాత్ర ఓ వెలితికుండ. ఊరించే ఋతువు ఓ వెలితికుండ. ఆకురాల్చు కాలం ఓ వెలితికుండ. ఒక ఆకుపచ్చ శూన్య రహస్యాన్ని కవి బట్టబయలు చేస్తాడు ఇలా…

”కన్నూ.. కాలమూ..

ఎప్పుడూ వెలితికుండలే

కవిత్వంలా” (వెలితికుండ).

మోహం గురించి ఎంతని చెప్పగలం! దాని లోలోతుల్లో ప్రజ్వలించే కాంక్షాజ్వాలల గురించి ఏమని చెప్పగలం! రవి చెబుతాడు. ”ఒకే ఆకాశాన్ని/ ఏకకాలంలో రమిస్తున్న/ ఏడు సముద్రాలు” (మోహం) అంటాడు.

ఈ కవిత చదవగానే కనీసం ఒక్క సముద్రమైనా ఉప్పొంగి, మనలోని మోహం నిటారుగా లేచి నుంచుంటుంది. కావలిచ్చుకు పడుకున్న కొండల మీదగా, పంటపొలాల్లో గాలికన్యల వాహ్యాళి మీదగా, ఆకుచాటు అందాల్ని ఆరబోసే మంచుబిందువుల మీదగా, భూమిని చిలుకుతున్న చంద్రుడి మీదగా వివశత్వాన్ని మోహపారవశ్యంతో అక్షరీకరిస్తాడు. ”కంటికౌగిట్లో నగ్నంగా కులకడానికి/ పేజీ ముడులను ఒక్కొక్కటే విప్పుకుంటూ/ పుస్తకం” అంటూ తన అసాధారణ మోహపు ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తాడు.

సాధారణ అంశాన్ని అసాధారణ భావగాఢతతో కవిత్వంగా మలచడం ఎలాగో ”భూమి నుదుట తడిముద్దు పెట్టి” మరీ చెబుతాడు…

”అనంతమైన ఆకాశాన్ని సాగు చేసి

చుక్కల మొక్కలు నాటిన చంద్రుడు

చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి

అలల తలలను దువ్వుతాడు” (గ్రావిటీ).

సంపుటిలో ‘సకినం’ మీద ఓ కవిత ఉంది. నిజానికి ఈ శీర్షిక చూడగానే నేను నొసలు చిట్లించాను. భృకుటి ముడివేశాను. కళ్లకు ఆశ్చర్యార్థకాన్ని వేలాడదీసుకున్నాను. కానీ కవిత చదవడం పూర్తయ్యేసరికి అపురూపమైన అనుభూతిలో మునకలేశాను.

‘సున్నా’తో మొదలయ్యే ఈ కవిత… పసిపాప ముద్దులా ముందుకుసాగి, జపమాలలా మహిమాన్వితమై, లేగదూడలా ఛెంగుఛెంగున గెంతుకుంటూ పరుగులు తీస్తుంది. ఆఖరికి కమ్మటి వాసనతో రుచికరమైన ‘కవితా సకినం’ మన హృదయం మీద చుట్ట చుట్టుకు పడుకుంటుంది.

”చేతివేళ్లలో తడి ముఖ్యం సుమా!

కవిత్వం రాయడానికైనా

సకినం చుట్టడానికైనా” అని, కవితో మనం ఏకగ్రీవంగా ఏకీభవిస్తాం.

‘కుటుంబం’ గురించి ఎన్నో కవితలు వచ్చాయి. కానీ, రవి చూపు మరింత బలమైన కవితకు ప్రాణం పోసింది. అమ్మ సేవల్ని సముద్రంతో పోల్చి, ఆ తర్వాత ”పొంగినా పొర్లినా/ ఆఖరికి హద్దుమీరినా/ అన్నీ మరిచి హత్తుకునే తీరం/ మా అమ్మ వొడి” అంటాడు. నాన్న చర్యల్ని ఉరుములు, మెరుపులతో పోల్చి ”వర్షంలా దిగొచ్చి/ ఒళ్లంతా ప్రేమగా తడిమే ఆకాశం/ మా నాన్న” అంటాడు.

”ఏ కొస ముట్టిస్తే పద్యం వెలుగుతుందో అతనికి తెలుసు” అంటారు ప్రముఖ కవి శివారెడ్డి తన ముందుమాటలో.

ప్రేమనే కాదు, బాధను వ్యక్తీకరించడంలోనూ రవి కలం కదం తొక్కుతుంది. ”పెయిన్‌” శీర్షికన ఓ అద్భుత కవిత రాశాడు. ”సముద్రపు గుండెనొప్పిని/ ఏమాత్రం పట్టించుకోకుండా/ నిద్దరోతున్న ఆకాశం” అంటాడు. ”గాయాల్ని కుట్టేందుకు/ గాజుపెంకుల్ని నూరి దారం నేస్తున్నారెవరో” అంటాడు. గుండెలు పిండేసే వాక్యసముదాయం.

రవికి కాలస్పృహ అపరిమితం. నిరంతరం క్షణాల వెంట పరుగులు తీస్తుంటాడు. రంగులు మారే, మార్చే, ఏమార్చే కాలబిలంలో మునకలేస్తుంటాడు. ”చీకటి వెలుగుల్ని వొడుకుతున్న కాలం చేతుల్లో” (దిగులు పువ్వు) బందీ అవుతుంటాడు. ”ఎప్పట్లాగే/ గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చా”లంటే ఆ వ్యక్తి గుండెల్లో సూర్యుడు జ్వలిస్తూ ఉండాలి. ”ఇక/ ఈ రాత్రి కొమ్మకు పూసిన/ దిగులు పువ్వు/ ఇప్పుడప్పుడే రాలిపోయేట్టు లేదు”… ఇక్కడే కవి కఠినసుందరంగా పాఠకుడి మనసును ముట్టిస్తాడు. చివరి వాక్యాల్ని నిప్పుల్లా విసిరి తీవ్ర అశాంతికి గురి చేస్తాడు.

పడిగాపులు ఎన్నాళ్లు? ఎదురుచూపులు ఎన్నాళ్లు? ‘బయల్దేరాలిక’. ”కాలం కోనేట్లోకి/ పాత జ్ఞాపకంగా మిగిలిన రూపాయిబిళ్లను గిరాటేసి”… ”తోలుబుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని”… ‘భావాలనొప్పిని పుక్కిలిస్తూ’నైనా… ఇక్కడ ఆగిపోతాం. మనసుకాళ్లకు సంకెళ్లు పడతాయి.

నిత్యం మనలో రేగే గాయాల తుపాన్లను కవిత్వీకరించడమెలాగో తెలియటమే తపస్సు. ఆ తపస్సు తాలూకు రహస్యాల్ని ఒడుపుగా ఒడిసిపట్టుకున్నాడు వీరెల్లి.

ఇంటివైపు గాలి మళ్లకపోతే ఆ కవి హృదయాన్ని స్కానింగ్‌ తీయాల్సిందే. అది ఏ లోపంతో కునారిల్లుతోందో ఆరా తీయాల్సిందే. ”అమ్మా/ నా కేరింతలు మోసిన మనూరి గాలి వొళ్లో/ మళ్లీ సేద దీరాలని ఉందే” (తిరుగు ప్రయాణం లేని ప్రయాణం) అనగలిగిన ఈ కవికి అలాంటి పరీక్షలు అక్కర్లేదు.

నేలతో గాలితో ఊరితో ఆ గాఢ పరిష్వంగం కారణంగానే గిలక, బొక్కెన, కొబ్బరిచెట్టు, ఊరపిచ్చుక, బిందెను మోసే కొత్త కోడలు, గంగబావి… ఇవేవీ మర్చిపోడు. ఖండాలు దాటేటప్పుడు కూడా ”ఊరి దేహాన్నంతా తనే మోస్తున్నట్టు/ కందెనేసిన నిండు బండిలా…” వీటన్నిటినీ భద్రంగా మోసుకెళ్లి ఉంటాడు. కాబట్టే ప్రతి జ్ఞాపకమూ ‘తెరుచుకున్న పద్యమై’ పురుడు పోసుకుంటుంది.

చీకటి దేనికి సంకేతం? కష్టం, నష్టం, బాధ, కోపం, దు:ఖం, అపనమ్మకం, అపశకునం, అసమ్మతి, అపశ్రుతి… చీకటి మాట వినగానే వీటిలో ఏదో ఒక భావన పొడపాములా మన మనసుతలం మీద పాకుతుంది. రవి వీరెల్లి మాత్రం వీటన్నిటికీ మించిన మరేదో రహస్యాన్ని ఆకళింపు చేసుకున్నాడు. అందుకే, తన కవిత్వం పొడవునా చీకటిని నిరంతరాయంగా పునర్నిర్వచించుకుంటూ పోతాడు.

”చీకటికేం/ అంచులను చురకత్తుల్లా చేసి/ రంపపు కోత కోస్తుంది” (రాత్రికి లోకువై).

నిజానికి, చీకటివెలుగులు పక్కపక్కనే ఉంటాయి. కరచాలనం చేసుకునే సంధికాలాన్ని కలగంటూ ఉంటాయి. కళ్లతో మాట్లాడుకుంటున్నట్లు, కౌగిలిలో ఒదిగిపోతున్నట్లు, కష్టసుఖాలు కలబోసుకుంటున్నట్లు కనబడతాయి. కానీ కలవవు. ”ఎంతైనా/ ఒంటరితనాన్ని మోస్తున్నవాళ్లంటే/ రాత్రికి తెగ లోకువ”.

చీకటి ఎన్నెన్ని పాయలుగా జీవితంతో పెనవేసుకుపోయి ఉంటుందో, అది ఎక్కడెక్కడ ఎలా విరిగిపడి వెలుతురుగా విచ్చుకుంటుందో రవికి బాగా తెలుసు. వెలుగుజాడ లేని చీకటినీ, చీకటి వెన్నెముక లేని వెలుగునీ ఆయన ఊహించలేడు. ”ఆత్రంగా చుట్టేసుకునే/ చీకటికి/ చివరిముద్దు/ పొద్దుపొడుపు” (గమ్యం) అని తీర్మానిస్తాడు. ”తెలియనితనం”లోని నిప్పుగుండాలు, మంచులోయలు, చీకటి అగాథాలను ”యుగాల చీకటిమట్టిని పెల్లగించుకుని” కవితానేత్రంతో దర్శించగలడు.

”ప్రభూ/ ఈ మునిమాపు మూలమలుపులో మాత్రం

వెలుగునొక్కదాన్నే నీ వెంట తీసికెళ్లి

అదిగదిగో ఆ చీకటి రహస్యం తెలుసుకో అంటున్నావు” (నీ అడుగులో…)

దౌర్జన్యమో, అణచివేతో, బలనిరూపణో… అది ఏదైనా కావచ్చు. దాన్ని కూడా చీకటితో ముడిపెట్టి, కవిత్వంలో ఒక వినూత్న గొంతుకను ఎలా వినిపిస్తాడంటే…

”పూతకొచ్చిన చీకటి/ వెన్నెల ముసుగేసుకుని

ఊరు మీద పడుతుంది” (పూతకొచ్చిన చీకటి).

‘ఆమె’ జీవితంలోని నిత్యచీకటిని అద్భుత నైపుణ్యంతో వర్ణించిన నిప్పుకణిక ”చీకటి వంతెన చివర”.

”రెప్పల పిడికిట్లో చూర్ణం అయిన రంగులన్నీ

చీకటి ప్రవాహంలో కలిసిపోతుంటాయి

ఒంటిమీద కంటి పడవలన్నీ తెరచాపలెత్తి

కలల అలల్లో తునిగిపోతుంటాయి”.

అట్లాగే ‘రవి’కి సూర్యుడు కూడా దగ్గరి బంధువై ఉంటాడు. లేకుంటే ఈయన కవిత్వంలో ఆ మార్తాండుడు అంత ప్రచండంగా వెలిగే అవకాశం లేదు. ”సూర్యుడు గోడ దూకి ఇంట్లోకి రాగానే/ చీకటి చీర విప్పి లోకం మీద పరిచింది” (చిలిపి చినుకులు) అనగలిగే ఆస్కారమే లేదు.

”ప్రతిరోజూ తీసే తెరను ఆరోజు ఉతకడానికన్నట్టు, ఆదివారం పొద్దున్నే చెరువొడ్డు చేరతాడు సూర్యుడు” (ఎర వేయని గాలం!) అంటూ సూర్యుడికి శుభోదయం పలికిన రవి ”టై లూజ్‌ చేసుకుంటూ ఊపిరితిత్తుల నిండా వెలుగునంతా పీల్చుకుని పడమటికి ప్రయాణమైపోతాడు సూర్యుడు” అంటూ అంతే కవిత్వోష్ణోగ్రతతో వీడ్కోలు పలుకుతాడు. ఇంకా సూర్యుణ్ని చాలా రకాలుగా కవిత్వీకరిస్తాడు…

”పుట మారుస్తూ/ మళ్ళీ/ పొలిమేరల్లో సూర్యుడు” (నదితో నాలుగడుగులు).

”సూర్యుడు/ నాకు బతుకు నేర్పిన గురువే కావొచ్చు” (భరోసా),

”నిజాలనీడలెక్కడ నిద్ర లేస్తాయోనని/ సూర్యుడు కళ్లు తెరవని రోజు-” (ఈ రోజు నీ పేరు మీదే!)

జీవితాంతం తిరగరాసినా పురిపడని పద్యాలతో కవి కుస్తీ పడుతుంటాడు.

”శబ్దాలన్నీ వాటి వాటి గూళ్లలో ముడుచుకున్నాక

దేహ కమండలంలో కాసిన్ని నిశ్శబ్దపు నీళ్లు నింపుకుని…” (హోంకమింగ్‌).

కండ గలిగిన కవిత్వానికి ఇంతకన్నా ప్రబల ఉదాహరణలు అక్కర్లేదు.

నిరంతరం ఆంగ్లంలో మునిగితేలే రవి మాతృభాషకు ఎడంగా జరక్కపోవడం మాట అటుంచి, వర్ణమాలపై గట్టి పట్టు సాధించడం విశేషం. జ్ఞాపకాల కొక్కెం, నవ్వు రవ్వ, చీకటి కంట్లో, పుప్పొడిపైట, ముద్రవేలు, కంటికిటికీ, గాలిపల్లకి, ఊపిరితిత్తుల లోయ, కళ్లబుట్ట, చీకటిమట్టి… ఇలా ఎన్నో ప్రయోగాలు సంపుటిలో ముత్యాల్లా మెరుస్తాయి.

ఎంత చిక్కగా, లోతుగా, గంభీరంగా; అవసరమైతే సంక్లిష్టంగానూ కవిత్వర రాయగలడో… అంతే తేలిగ్గా అలతి పదాల అల్లికతో అద్భుత అక్షరధార కురిపించగలడు కవి. సంపుటిలో ఎన్నో అద్భుత వాక్యాలు ఈ మేరకు హామీపత్రాలు సమర్పిస్తాయి…

”దిక్కుల మగ్గంపై/ చీకటిచీర నేసి

వెన్నెల పోగుల్ని దులిపి/ లోకంపై పరుస్తుంది” (రాత్రంతా నా కళ్లలోనే…)

”అట్ట మీదున్న అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌

తను గీసుకున్న గీతల ఉచ్చులో తనే పడ్డట్టు..” (మొదటి వాక్యం)

”గుండె/ అమ్మ లేని ఇల్లవుతది” (మొదటి వాక్యం)

”జీవితం జల్లెట్లో మిగిలిన ఈ కొన్ని క్షణాల్ని

కండ్లకద్దుకుని జేబులో వేసుకున్నా” (నీ అడుగులో…)

”నీ మౌనం విస్తీర్ణం కొలవడానికే అనుకుంటా

విశ్వంలోని గ్రహాలన్నీ

ఇంకా అలా హడావిడిగా తిరుగుతూనే ఉన్నాయి” (నేనిలాగే)

”చినుకును ముట్టుకుంటే

ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నట్టే” (దేహకాంతి)

”నాతో పుట్టి/ నాలోనే పెరిగిన శత్రువొకరు

ఇక ఇక్కడ్నుంచి/ నా బరువు తనే మోస్తానంటాడు” (అఖరి అడుగు)

”పూలకోసం తుమ్మెదలు గాల్లో పద్యాలు రాస్తున్నప్పుడో

గాలీ గడ్డిపరక ఉప్పుబస్తాట ఆడుకున్నప్పుడో

కిరణాల తోకలమీద నీటిరంగులు పురి విప్పినప్పుడో

నువ్వే గుర్తొస్తావ్‌” (కుందాపన).

రవి వీరెల్లి తనను తాను కవిగా నిలబెట్టుకోవడానికి ”ఎప్పుడూ/ కళ్ల నిండా కలల వత్తులేసుకుని/ ఆలోచనకీ అక్షరానికీ మధ్య” తచ్చాడుతుంటాడు. కాబట్టే ఆయన కవిత్వం మనల్ని ”ఆకులా/ పువ్వులా/ చినుకులా/ అలను తాకే వెన్నెలలా” హత్తుకోవడమే కాదు; ”చీకటిలా/ రంపంలా/ దు:ఖంలా/ నిట్టూర్పుల జ్వాలలా” రూపెత్తి, గాయపరుస్తుంది; గాయం తాలూకు రహస్యాల అన్వేషణకు పురిగొల్పుతుంది. దేన్నయినా అన్వేషించాలన్న కుందాపనే కవిత్వం.

*

 

 

ఎమ్వీ రామిరెడ్డి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బహుశా నేను ఈ పుస్తకం పై చదివిన మంచి విశ్లేషణ ఇదేనేమో..చాలా ఆసక్తికరమైన దిగా…వెంటనే చదవాలని అనిపించేలా ఉంది..కుందాపన… అసలీ పేరే ముచ్చటగా కూడా ఉంది..

  • చాలా ఉంది సర్….
    మీ కవిత్వం చదవాలి….
    💐💐💐👏👏👏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు