ఖాళీ పేజీలు – 6

అవతలి వారి జీవితం, అదీ పదిమందికీ తెలియనిదయితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

[తల్లి అమెరికా వచ్చినప్పటినుండీ తనకి మనశ్శాంతి కరువైందని బాధ పడుతుంది దీప.

“మేరేజ్ ఈజ్ ఎ బిగ్ గాంబ్లింగ్!  పరిచయాలతో పనిలేదు దానికి. నష్టపోవడం దాని స్వరూపం,” అంటూ తనకీ, నీరజ్‌కీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో స్వరూప్‌కి చెబుతుంది దీప.

బిడియస్తుడూ, మితభాషీ అయిన నీరజ్ దీప ఫ్రెండుకి బంధువు.  ఆమె ద్వారానే నీరజ్ పరిచయం అవుతాడు దీపకి.

దీపకి చికెన్ పాక్స్ వస్తే తనింటికి తీసికెళతాడు నీరజ్. ఆ సందర్భంలో నీరజ్ వాళ్ళూ బాగా డబ్బున్న కుటుంబమని అర్థమవుతుంది దీపకి.

తన గురించి చెప్పడం మధ్యలో ఆపేస్తుంది దీప. నీరజ్, దీపా ఎందుకు విడిపోయారన్న ఆత్రుత మరింత పెరుగుతుంది స్వరూప్‌కి.]

 

ప్పుడూ సరదాగా నవ్వుతూ మాట్లాడే దీప వెనుక విషాదం పూర్తిగా తెలియనందుకు రెస్టారెంట్ వెయిటర్ని తిట్టుకున్నాడు.

ఆత్రుత ఆపుకోలేక ఒకటి రెండు సార్లు దీప రూమ్ వైపుగా వెళ్ళాడు.

దీప కనబడలేదు. మీటింగ్‌లో ఉందేమో అనుకున్నాడు.

ఆవతలి వారి జీవితం, అదీ పదిమందికీ తెలియనిదయితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

స్వరూప్ కాలుగాలిన పిల్లిలా దీపకోసం చూసాడు. ఆమె జాడ లేదు ఎక్కడా.

తన డెస్క్ దగ్గరకొచ్చి పనిచేస్తూండగా దేవవ్రత నుండి ఫోన్!

అర్జెంటుగా రూముకి రమ్మనమని. ఉన్న పళాన పరిగెత్తాడు.

దేవవ్రత కేసు ఇంకో రకం.

గత రెండు వారాలుగా తిండీ నిద్రా లేదు. ఆఫీసుక్కూడ వెళ్ళడం మానుకున్నాడు. హఠాత్తుగా రమ్మనమని అంటే ఏం కొంపలంటుకున్నాయో అనుకున్నాడు.

అనూ ఆచూకీ తెలియక కంగారు పడ్డాడు.

చిత్రం, అనూ తల్లి తండ్రుల కూడా ఆచూకీ లేదు.

దేవవ్రత నాన్న పెళ్ళిలో పరిచయం అయిన అనూ బంధువుల్ని అడిగి చూసాడు. ఎవరికీ తెలీదన్నారు.  అనూ వాళ్ళ నాన్న ఆఫీసుక్కూడా వెళ్ళాడట. ఆయన నెల్లాళ్ళు శలవు పెట్టాడట.

ఇంకా అనూ వాళ్ళ బాబయ్యలనీ వెళ్ళి కలిస్తే, ఎదో చుట్టపు చూపుగా పెళ్ళికొచ్చాం కానీ, వాళ్ళతో రాకపోకలు లేవనీ చెప్పారట.

అక్కడికీ దేవవ్రత వాళ్ళ నాన్న పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చాడట. ఇదంతా పెద్ద మిస్టరీలా ఉందని దేవవ్రత ఒకటే గోల.

ఇవన్నీ దేవవ్రత చెప్పుకొచ్చాడు.

 

వాడికి ఎంత మతి చెడిందంటే చెప్పినవే చెబుతున్నాడు.

ఒక పక్క ఏం చెయ్యాలో తెలీదు; అలా అని చూస్తూ ఉండలేడు.

దాదాపుగా కలిసినప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నాడు.

స్వరూప్‌కి ఆ ఏడవడం అవీ చూస్తే చికాకు వేసింది. ఒకటి రెండు సార్లు భరించాడు. ఆఖరికి తెగించి గట్టిగానే చెప్పాడు – ఎప్పుడు ఏడు మానేస్తే అప్ప్పుడే వస్తానని.

అందువల్ల గత వారం రోజులుగా దేవవ్రత అపార్ట్‌మెంట్ వైపే వెళ్ళ లేదు. కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. ఒక పక్క దేవవ్రత పరిస్థితి చూస్తే జాలీ, సింపతీ ఉన్నా, మరో పక్క అతని జవాబు దొరకని ప్రశ్నలతో సతాయింపూ చూసి అటుగా వెళ్ళడం తగ్గించాడు.

 

మొదట్లో స్వరూప్‌కి మాత్రమే తెలుసు. మెల్లగా మిగతా వాళ్ళకీ తెలిసింది.

ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య దేవవ్రత పెద్ద లాఫింగ్ స్టాక్.

 

ఒక్కోసారి ఏం చెప్పాలో తెలీదు.

చాలాసార్లు ఆడవాళ్ళు మోసపోవడం విన్నాడు. కానీ ఇలా పెళ్ళి చేసుకొని గాయబ్ అవ్వడం ఎప్పుడూ విన లేదు.

 

అనేక రకమైన ఆలోచన్లతో ఎందుకు దేవవ్రత అర్జంటుగా రమ్మన్నాడో అర్థం కాలేదు స్వరూప్‌కి. ఫోనులో దేవవ్రత గొంతు కూడా చాలా బలహీనంగా ఉంది.

బహుశా, జ్వరం వచ్చుండచ్చు అనుకున్నాడు.

 

కారు పార్క్ చేసి అపార్ట్‌మెంట్‌కి వెళ్ళి తలుపు తట్టాడు. ఓ రెండు నిమిషాలు అయ్యాక దేవవ్రత తలుపు తీసాడు.

అతన్ని చూసి ఆశ్చర్య పోయాడు.

గడ్డం బాగా పెరిగింది. కళ్ళు పీక్కు పోయున్నాయి.  మనిషి బాగా చిక్కి పోయాడు.

 

లోపలకి నడుస్తూ సోఫాలో కూలబడ్డాడు దేవవ్రత.

ఇల్లంతా పీకల్లోతు ఉంది. వస్తువులన్నీ చిందర వందరగా పడున్నాయి.

అన్నింటికీ మించి భరించ లేని దుర్గంధంగా ఉంది. క్రింద ఖాళీ సీసాలు పడున్నాయి. దేవవ్రత ఎప్పుడూ త్రాగడం చూళ్ళేదు తను.

“ఏమయ్యిందిరా…? అలా అయిపోయావు? ఒంట్లో బాగో లేదా? డాక్టర్ దగ్గరకి వెళ్ళావా…?” ఒకదాని వెంబడి మరో ప్రశ్న.

జవాబు లేదు; ఎప్పటిలాగే ఏడవడం మొదలు పెట్టాడు.

“ఒరేయ్! ముందు ఏడుపాపి ఏం జరిగిందో చెప్పు…”గట్టిగా అరిచాడు స్వరూప్.

ఓ నిమిషం ఆగి – “అపార్ట్‌మెంట్ వాడు ఖాళీ చెయ్యమని చెప్పాడురా…నా వల్ల న్యూసెన్స్ గా ఉందని నైబర్స్ కంప్లైంట్ ఇచ్చారట…” మెల్లగా అన్నాడు.

దేవవ్రత చాలా నెమ్మదస్తుడు. ఏమయ్యిందో అర్థం కాలేదు స్వరూప్‌కి.

“ఏం జరిగింది…? ఏడవకుండా చెప్పు…” అయోమయంగా చూస్తూ అన్నాడు.

“అనూ గురించి  ఏ న్యూసూ లేదురా. నాకు పిచ్చెక్కి పోయింది. ఇంటికి ఫోన్ చేస్తే మా వాళ్ళూ కంగారు పడుతున్నారు. ఏమయ్యిందో ఏవీ తెలీదు. మా చుట్టాలందరికీ తెలిసింది.

అమ్మ విపరీతంగా బాధపడింది. కళ్ళు తిరిగి పడిపోయిందట. హాస్పిటల్‌లో చేర్చారు. ఇవన్నీ చూసి నాకు పిచ్చెక్కింది. ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు. ఏమయ్యిందో కూడా తెలీదు.

విపరీతంగా తాగాను. ఈ బాధ భరించ లేక చచ్చి పోదామని ఆ సీలింగ్ ఫేనుకి ఉరి వేసుకుందామని ప్రయత్నించాను. నా బరువుకి అది కాస్తా తెగింది. క్రింద పడిపోయాను.

ఆ చప్పుడికి పక్క నైబర్స్ వచ్చి విండోలోంచి చూసి మేనేజర్‌కి కంప్లైంట్ చేసాడు. వాడొచ్చి, ఇదంతా చూసి ఏం జరిగిందని అడిగాడు. నా గురించి చెప్ప లేదు కానీ, ఫ్యాన్ దానంతట అదే పడిందని అబద్ధం చెప్పాను. వాడు నమ్మ లేదు. రూమంతా ఇలా ఉండడం చూసి వెకేట్ చెయ్యమని నోటీసిచ్చాడు…ఏం చెయ్యాలో తెలీక నీకు ఫోన్ చేసాను….” అంటూ ఏడుపు లంకించుకున్నాడు.

 

“ఏంట్రా ఇలా తయారయ్యావు…పోతే పోయిందా అమ్మాయి. పీడా విరగడైందని అనుకోవాలి. మరీ ఈ ఏడుపులూ, ఆత్మ హత్యలూ ఏవిట్రా, అధ్వాన్నంగా…ఎవరైనా వింటే నవ్వుతార్రా!

నా మాట విను. అపార్ట్‌మెంట్ మేనేజరుతో నేను మాట్లాడతాను…జరిగిందంతా చెబుదాము. ఈ ఒక్కసారికీ మన్నించమని అడుగుదాం. అసలు వర్కుకి వెళ్ళకుండా ఈ గోలేమిట్రా…ఏ ఫోనూ లేకపోతే, నువ్వు వర్కుకి వెళ్ళుంటావులే అనుకున్నాను…ఇలా…ఛీ…ముందు లేచి మొహకడుక్కో…” గట్టిగా చెప్పాడు స్వరూప్‌.

“అనూని…మర్చి…” దేవవ్రత ఏడవడం మొదలు పెట్టాడు.

“ఏడు…వెళ్ళి ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జి ఎక్కి దూకు. ఆ అనూ వస్తుంది…నీ ఏడుపు భరించలేకే రావడం మానుకున్నా…” అంటూ కోపంగా అన్నాడు.

దేవవ్రతకి భయమేసింది. మెల్లగా లేచి బాత్‌రూం వైపు వెళ్ళాడు.

“ముందా గెడ్డం తీసి, స్నానం చేసిరా. ఈలోగా నేను అపార్ట్‌మెంట్ మేనేజర్ని కలిసి మాట్లాడుతాను…” అని అన్నాడు.

“నేనూ వస్తూ…” అని దేవవ్రత అంటూండగానే – “అస్సలొద్దు. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు. నేను వెళ్ళి మాట్లాడతాను…అతను నాకూ బాగానే తెలుసు…” అన్నాడు.

దేవవ్రత మారు మాట్లాడకుండా బాత్రూం వైపు కదిలాడు.

ఇదంతా చూసి ఒక్కసారి తల తిరిగింది స్వరూప్‌కి.

నేహా తీరు చూస్తే రోజు రోజుకీ చికాకు పెరిగిపోతోంది శీనుకి.

దాదాపు సుధీర్ రూములోనే గడుపుతోంది.

ఎంతలా ఉందంటే తన ఇంట్లో వాళ్ళకి కూడా కాల్ చెయ్యడం లేదని, నేహ వాళ్ళ నాన్న శీనుకి కాల్ చేసి అడిగాడు – అంతా బానే ఉందా అని.

ఇద్దరం వర్కులో బిజీ అని సర్ది చెప్పాడు కానీ వాళ్ళు నమ్ముతారని అనుకోలేదు.

నేహాతో మాట్లాడాలని వాళ్ళమ్మ సతాయిస్తోందని మావగారు మెసేజ్.

నేహా ఇంటికొచ్చి రెండ్రోజులయ్యింది. తనూ వర్కు బిజీలో పట్టించుకోలేదు.

సుధీర్ రెడ్‌వుడ్ సిటీలో ఉంటాడు. నేహా ఒరకిల్‌లో పనిచేస్తుంది. అక్కణ్ణుండి వర్కుకి దగ్గరని అక్కడే ఉంటోందనుకున్నాడు శీను.

మావగారి మెసేజ్ చూసాక, నేహాకి టెక్స్ట్ మెసేజ్ పంపించాడు.

జవాబు లేదు. ఓ గంటసేపు ఆగి మరలా మెసేజ్ పెట్టాడు. దానికీ జవాబు లేకపోయేసరికి కాల్ చేసాడు. వాయిస్ మెయిల్‌కి వెళ్ళింది.

ఇంటికి రమ్మనమని, నేహ వాళ్ళమ్మ మాట్లాడాలని ఉందన్న కబురు మెసేజ్‌లో పెట్టాడు.

 

ఆ సాయంత్రం సుధీర్ కాల్ చేసాడు – నేహా, తనూ ఫ్లారిడాలో ఉన్నామని.

కనీసం వెళుతున్నానని కూడా చెప్పలేదని శీనుకి కోపం వచ్చింది.

నిజానికి నేహా విషయంలో తను ఎంతో సర్దుకొస్తున్నాడు. సహకరిస్తున్నాడు కూడా.

నేహాకి అదేమీ ఎక్కడం లేదు. ఈ సారి గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు.

సాయంత్రం ఫోన్ చేస్తుందని ఎదురు చూసాడు. ఫోన్ రాలేదు.

ఆ సాయంత్రం నీరుని కలిసినప్పుడు నేహా గురించి చెప్పాడు.

 

“నాకెందుకో మనం చేసేది బాగోలేదని పిస్తోంది నీరూ…” అని.

“ఇంత వరకూ దిగాక చేసేదేమీ లేదు…ఒక్క ఆర్నెల్లు ఓపిక పట్టు….” అని సర్ది చెప్పింది నీరు.

తనకంటే నిరుపమకి సహనం ఎక్కువ అనుకున్నాడు శీను.

ఆ మర్నాడు సాయంత్రం నేహా, సుధీర్ వచ్చారు. తను వర్కునుండి అప్పుడే వచ్చాడు.

 

ఏవో ముక్తసరి పలకరింపులు అయ్యాక బెడ్రూములోకి వెళ్ళింది నేహా. ఆమె వెంటే సుధీర్.

వెళుతూనే ధబేలని తలుపేసుకున్నారు. హాల్లోంచి అన్నీ గమనిస్తూనే ఉన్నాడు శీను.

చికాకేసింది. మెల్లగా తన గది వైపు వెళ్ళాడు.

 

సుధీర్, నేహా ఒకళ్ళనొకళ్ళు బల్లిలా అంటిపెట్టుకునే ఉంటారు. ఎక్కడున్నా అదే తంతు. నీరూ అలా కాదు. చాలా పాలిష్‌డ్ గా ఉంటుంది.

నేహాని, సుధీర్‌ని ఎవరైనా ఫ్రెండ్స్ చూసి వాళ్ళింట్లో చెబితే కొంపలంటుకుంటాయి.  ముఖ్యంగా నేహా వాళ్ళమ్మ తట్టుకోలేదు.

కనీసం ఆవిడ బ్రతికే వరకూ అయినా ఈ నాటకం తప్పదు. ఆవిడ మహా అయితే ఏడాది మించి బ్రతకదని చెప్పాడు డాక్టర్.

డబ్బూ, పలుకుబడీ ఉన్నాయి కనక, హాస్పటల్లోనే అన్నీ. ఇద్దరు పనివాళ్ళు ఉంటారు. సకల సౌకర్యాలూ అక్కడే.

 

నేహా వాళ్ళమ్మకి శీను అంటే చిన్నప్పట్నుండీ ఇష్టం. రెండు కుటుంబాలకీ ఎంతో స్నేహం. శీనూ తండ్రీ, నేహా తండ్రీ వ్యాపారాల్లో భాగ స్వాములు కూడా.

తల్లి కోసం నేహా బతిమిలాడితే తనూ ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు, అదీ ఒక షరతు మీదే. నేహా తల్లి బ్రతికున్నంత వరకే అని.

 

నేహా, సుధీర్ బయటకి వస్తే బై చెప్పి వెళదామని అనుకున్నాడు.

ఎంతకీ బయటకి రాలేదు. ఇంతలో నేహా తల్లి ఫోన్ కాల్ వచ్చింది.

తను మొదటి సారి ఎత్త లేదు. అలా రెండు మూడు సార్లు వస్తూనే ఉంది.

 

నాలుగో సారి ఫోన్ ఎత్తి మాట్లాడాడు. నేహా పడుక్కుందని చెప్పాడు.

అలాకాదు, ఒక్కసారి మాట్లాడాలని ఉందని నిద్ర లేపమని నేహ తండ్రి చెప్పాడు.

ఆయన మాటకి ఎదురు చెప్పే ధైర్యం లేక, మెల్లగా నేహా రూం వైపు వెళ్ళాడు.

తలుపు మీద కొట్టాడు. లాక్ చేసి ఉండక పోవడం వలన, తలుపు కొంతగా జరిగింది.

ఇద్దరూ బెడ్ మీద  పడుకున్నట్లుగా గమనించి తలుపు దగ్గరకి లాగి హాల్లోకి వచ్చాడు.

 

ఎప్పుడు చూసిందో తెలీదు – నేహా హాల్లోకి వచ్చింది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి.

 

“యూ డోంట్ హావ్ మేనర్స్!  తలుపు కొట్టి బయట నుంచోవాలని.  దర్టీ బిహేవియర్..! ఈడియట్…” అని కోపంతో గట్టిగా అంది.

 

ఒక్కసారి కంగు తిన్నాడు శీను.

 

“నాకేం మీ రొమాన్స్ చూడాలన్న ముచ్చట లేదు. నాలుగు రోజులుగా మీ అమ్మ ఫోన్ల మీద ఫోనులు. నన్ను చంపుతున్నారు…

మీ నాన్న ఫోన్! ముందు మాట్లాడు. ఆ తరువాత ఇద్దుగాని లెక్చర్లు!” అంటూ హాల్లోంచి బయటకి నడిచాడు.

 

“నీ డైరక్షన్స్ నాకేం అవసరం లేదు. ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు…అయినా నువ్వు ఏదో సర్ది చెప్పకుండా…రూములోకి వచ్చింది కాక…ఎదురు వాయిస్తున్నావే…” చికాగ్గా అంది నేహ.

 

శీనూ ఏం మాట్లాడలేదు. ఆమె కేసే చూడకుండా బయటకి నడిచాడు,  ఇదో చెత్త వ్యవహారం అనుకుంటూ.

 

ఎప్పుడు ఈ రొంపి నుండి బయట పడతానా అనుకుంటూ, నీరుకి ఫోన్ చేసాడు, తను వస్తున్నానని చెప్పడానికి.

ఆమె ఫోన్ రింగ్ అయ్యి మెసేజ్‌కి వెళ్ళింది.

 

బయటకి వస్తూండగా మెట్లెక్కుతూ నేహా కజిన్ అనిల్ మెట్లెక్కుతూ కనిపించాడు.

అతన్ని చూడగానే అమ్మో కొంప మునిగింది అనుకుంటూ, తనే ఎదురెళ్ళి హలో చెప్పాడు.

 

నేహా ఎలా వుందని అడుగుతూ, వాళ్ళమ్మ మాట్లాడాలని తనకి ఫోన్ చేసిందని చెప్పాడు.

 

తనకి ప్రోజెక్ట్ డెడ్‌లైన్ ఉండడవల్ల ఇంకా వర్కులోనే ఉందని అబద్ధం చెప్పాడు శీను.

 

“నేను వాళ్ళ ఆఫీసు నుండే వస్తున్నాను…మా ఫ్రెండునడిగితే ఇంటికెళిపోయిందని చెప్పాడు…” అన్నాడు.

 

“ఐ సీ…నాకూ మెసేజ్ లేదు. బహుశా వేరే క్యాంపస్‌కి వెళ్ళిందేమో…” అని సర్ది చెప్పాడు.

 

ఈ రాత్రికి మాట్లాడుతాం అని చెప్పి, స్టార్ బక్స్‌కి వెళదాం రా అంటూ పిలిచాడు.

 

అతనూ సరేనన్నాడు. హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు శీను.

ఎన్నాళ్ళు ఈ నాటకం సాగుతుందో తెలీదు.

నిజానికి ఈ నాటకాని ఒకే ఒక్క ప్రేక్షరాలు నేహా తల్లి.

ఆమె కోసమే ఇదంతా!

నేహా తీరు చూస్తే సగంలోనే తెర దించేసేట్లా ఉంది.

వాస్తవానికి ఇందులో నేహ తల్లి ప్రేక్షకురాలు కాదు.

ఆమే ఈ నాటకానికి స్ఫూర్తి.

కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు – సూత్రధారి కూడా.

*

ఖాళీ పేజీలు గత భాగాలు ఇక్కడ చదువుకోండి

ఖాళీ పేజీలు  -1

ఖాళీ పేజీలు  -2

ఖాళీ పేజీలు  -3

ఖాళీ పేజీలు  -4

ఖాళీ పేజీలు  -5

గొర్తి సాయి బ్రహ్మానందం

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు