మరో స్వేచ్ఛ

“నీక్కాబోయేవాడు ఎలా ఉండాలే?” అరకిలోమీటరు జాగ్ వల్ల కలిగిన ఆయాసంతో బరువుగా ఊపిరి పీలుస్తూ అడిగింది సుజాత.

మూడు కిలోమీటర్ల దూరాన్నిసునాయాసంగా పరిగెత్తి, సుజాత అలసట వల్ల ఆగిన స్వేచ్ఛ, దానికి బదులిస్తూ, “నావి చాలా చిన్న కోర్కెలే..అతడు బయట ప్రపంచానికి కాన్ఫిడెంట్, ఆర్టిక్యులేట్, మెచ్యూర్ పర్సనాలిటీని, నా ఎదుట మాత్రం ఒక చిన్న పిల్లాడి లాగా నా ఒడిలో ఒదిగిపోయే మెంటాలిటీ కలిగి ఉండాలి”

“ఊ..ఇంకా?”

“పదునైన సెన్స్ ఆఫ్ హ్యుమర్, కంట తడి చూపించటానికి భయపడని నైజం, ఒక మంచి సోషల్ సర్కిల్, నా కంటే ఈ ప్రపంచంలో తనకెవ్వరూ ఎక్కువ కాదన్నట్లుండే స్వభావం, ఆర్ట్స్ అంటే ఆసక్తి, కావాలనిపించినప్పుడల్లా నాకు ఆసరా ఇచ్చే భుజం… ఇలా ఏవో చిన్న చిన్న లక్షణాలుంటే చాలే! మిగిలినవాటితో నేను సర్దుకు పోతా..” అంటూ ఒక చిలిపి నవ్వుతో ముగించేసింది స్వేచ్ఛ.

“నీకు చిన్నప్పుడు మీ అనాధశరణాలయంలో ఏమి నేర్పించారో కానీ..బాగానే ఎక్కింది…పిచ్చి! నీకు కావాల్సిన ఈ లక్షణాలు ఒకడిలో ఉన్నాయంటే..వాడికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్నమాటే!” తేల్చేసింది సుజాత.

కొంచెం సీరియస్ గానే, “నేను పెరిగిన చిన్నప్పటి వాతావరణం వల్లే కావచ్చు…నాకు అందరి ఆడపిల్లల లాగా ఆలోచించటం రాదే…నాలో ఎందుకో, ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ ఏర్పర్చిన రూల్స్ అన్నీ చెరిపేసి, ఒక మగాడి కున్న స్వాతంత్ర్యాన్నీ, బాధ్యతలేనితనాన్నీ అనుభవించెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. కరణేషు, భోజ్యేషు, శయనేషు, నా బొందేషు అంటూ స్త్రీల నించి రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళనించి, ఆ మాత్రం లక్షణాలు ఆశించడం తప్పుకాదనుకుంటాను?” సంధించింది, స్వేచ్ఛ.

“ఆశించటం తప్పు కాదు కానీ..ఆచరించటం నీ వల్ల కాదే. నీకు రాసిపెట్టి ఉన్నవాడు ఎదురైనప్పుడు, లక్షణాలు లెక్కెట్టటానికి నీ మెదడు పని చేయదు..మనసు మాత్రమే పని కట్టుకొని నిన్ను పడేస్తుంది…అతడి ప్రేమలో”

“అదీ చూద్దాం…ఆఫీసుకి టైం అవుతోంది. ఈ రోజు మన బ్యాంక్ లో ఎవరో కొత్త ఎంప్లాయీ జాయిన్ అవుతున్నాడు.. ఇన్వెస్ట్మెంట్స్ సెక్టర్ లీడ్ కాబట్టి, అతడిని నేనే రిసీవ్ చేసుకోవాలన్నాడు..బాస్.” జాగ్ చేసుకుంటూ తన అపార్ట్మెంట్ వైపు మళ్ళింది స్వేచ్ఛ.

………………………..

“సూర్య..”

“స్వేచ్ఛ..”

“చాలా అందమైన పేరు…”

“పేరొక్కటేనా?”

“ఇప్పుడే కదా కలిసింది…ఇంకా ఏమేం నచ్చాయో అప్పుడే చెప్పేస్తే బాగోదేమో నని….”

“నాట్ బ్యాడ్.. కొత్తగా జాయిన్ అవుతున్నారంటే, ఎవరో ఫ్రెషర్, ర్యాగింగ్ చెయ్యచ్చనుకున్నాను.. కాన్ఫరెన్స్ రూమ్, దిజ్ వే”

…….

“మొదటి రోజు కాబట్టి, ఈ రోజు మీ లంచ్ కి కుడా, నేను పే చేస్తున్నాను”

“ధాంక్ యూ…ఇందాక ట్రైనింగ్ లో, మన బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి…మీతో క్లియర్ చేసుకోవాలి.”

“సారీ సూర్యా..లంచ్ టైంలో వర్క్ విషయాలు అస్సలు మాట్లాడను..”

“వెరీ గుడ్..పర్సనల్ విషయాలు మాట్లాడుకొని ఒకరి నొకరు తెలుసుకోవచ్చన్న మాట.”

“పరిచయాలు పెంచుకోవాలని చాలా తొందరగా ఉన్నట్టుందే..మన వర్క్ మ్యాటర్ చాలా కాన్ఫిడెన్షియల్..ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు అని.”

“ఆ.. ఒకే.. సేఫ్ సైడ్ కి పర్సనల్ మ్యాటర్సే బెటర్…. నేను ఇంజనీరింగ్ వరంగల్ లో చేసాను. యం.బి.ఎ, ఐ.ఐ.యం అహ్మదాబాద్ లో..మా నాన్నగారు……”

సూర్య చెప్పిన దంతా విని,  స్వేచ్ఛ, “మీకు కళలంటే ఆసక్తి ఉందా?”

“మీరు మళ్ళీ ర్యాగింగ్ మొదలెట్టేశారు….”

“లేదు..సీరియస్ గానే అడుగుతున్నాను…సాహిత్యం, సంగీతం, నాట్యం…ఇలాంటివి”, చిరునవ్వును, పంటితో బిగిస్తూ.

“నాకు అంత పాండిత్యం లేదు…రహమాన్, సీతారామ శాస్త్రి, ప్రభు దేవా నా ఫేవరెట్స్. నవలలు ఎక్కువ ఇంగ్లీష్ వే చదువుతాను.”

“అర్ధం అయ్యింది..ఇక వెళ్దామా?”, తన లంచ్ ట్రే తీసుకొని లేచింది, స్వేచ్ఛ.

“అయ్యో..నా గురించి అంతా చెప్పను కాని…మీ గురించి తెలుసుకోటానికి టైం సరిపోలేదు”

“ఫర్లేదు..ముందు ముందు చాలా టైం ఉంటుంది. ఒకే డివిజన్ లో ఉన్నాం కదా…”

…………….

“బై స్వేచ్ఛ..” అంటూ పార్కింగ్ వైపు నడుస్తున్న సుర్యాని చూసింది, సుజాత.

“వావ్…చాలా హ్యాండ్సం గా ఉన్నాడే, మీ కొత్త కుర్రాడు.”

“నాట్ బ్యాడ్..వెరీ షార్ప్ ఫెలో”

“మరింకేం…ఇంక కౌంటింగ్ మొదలెట్టు, నీక్కావల్సిన లక్షణాలు..”

“నువ్వే చెప్పావు కదా…మెదడు ఆగిపోతుంది..అది, ఇదీ అని…అంత సీన్ ఉన్నప్పుడు చూద్దాం”

…….

“మనం కలిసిన ఈ నాలుగు నెలల్లో, వర్కులోను, బయటా నీతో స్పెండ్ చేసినంత టైం ఇప్పటి వరకూ ఏ అమ్మాయితోనూ చెయ్యలేదు తెల్సా!” సినిమా హాల్లో, పక్కనే కూర్చొన్న స్వేచ్ఛతో అనేశాడు, సూర్య.

“నిన్ను ఇంత కాలం భరించిన అమ్మాయి ఎవరూ లేరంటావ్..అంతేనా?” కొంటెగా బదులిచ్చింది,   స్వేచ్ఛ.

“జోకద్దు. ఎన్నో విషయాలు పంచుకొన్నాం. నేనెప్పుడూ చెప్పకపోయినా, నువ్వంటే నాకు పిచ్చ, పిచ్చ, ఇష్టం అని నీకు తెలిసే ఉంటుంది. నువ్వే నా గురించి ఏమనుకుంటున్నావో, నాకు క్లారిటీ రావట్లే!” సీరియస్ గానే అడిగేశాడు, సూర్య.

“నీ పైన ఇష్టాన్ని నేను చెప్తే గానీ తెలుసుకోలేనంటావ్? నీతో పాటు సినిమాలు, షికార్లు లాంటివి చేసినా నీకు అనుమానమే నంటావ్? అందుకే నువ్వు నాకు చాలా, చాలా నచ్చావ్!”, తేరుకొనే లోగా, ఒక్క సారి సూర్య పెదాలను తన పెదాలతో లిప్త పాటు తడి చేసింది స్వేచ్ఛ. సినిమా మొదలయ్యింది.

………….

“మనవాళ్ళు ఎప్పటికీ మారరు. ఇద్దరు హీరోయిన్లకీ ఆ తోడ కొట్టే హీరోనే కావాలి. వాళ్ళకంటూ వ్యక్తిత్వాలు ఉండవు. వాళ్ళ జీవితాశయం ఆ హీరోని పెళ్లిచేసుకోవటమే. నాన్ సెన్స్”, పరమ చిరాగ్గా ఉంది స్వేచ్ఛకి.

“టేక్ ఇట్ ఈజీ..అది ప్రతి ఒక్కడి మేల్ ఫ్యాంటసీ! నిజ జీవితంలో సాధ్యపడదు కనక, అలా సినిమాలో చూసుకొని ధ్రిల్ అవ్వటమే. మనం సినిమాకి వచ్చేది, మన బోరు కొట్టిన జీవితాలను మర్చిపోయి కాస్సేపు అల్లా ఊహా ప్రపంచంలో తిరిగొద్దామనేకదా?”

“అదే ఊహా ప్రపంచంలో హీరోయిన్ కి ఇద్దరు హీరోలను పెట్టి, ఒక పాట పెట్టి, ఆ హీరోయిన్ ని ఇద్దరి చేతా డాన్స్ చేయించరెందుకని?”

“చాలా చీప్ గా ఉంటుంది కాబట్టి. స్త్రీ జాతినే అవమానించినట్లవుతుంది. మన సంస్కృతిలో స్త్రీ ఒక ప్రేమమయీ, కరుణామూర్తీ, సహనశీలి….” ఆవేశంతో అరిచేశాడు, సూర్య.

“మరి మగాడు అవేవి కాదా? ఈ ముళ్ళ కిరీటాలూ, బందాలు అన్నీ మాకేనా? మగాడి చేసే తప్పుని, క్షమించో లేక చూసి చూడనట్లు పోయే ఈ సమాజం, ఆడది అదే తప్పు చేస్తే, అంతే క్షమ చూపించకలిగినప్పుడే అసలైన సమానత్వం.”

“అయ్య బాబోయ్! నీకు వైన్ ఎక్కువైనట్లుంది. నిన్ను త్వరగా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యకపోతే, నువ్వు, నీ పిచ్చి ధియరీతో నాకు పిచ్చెక్కించేస్తావ్!”, హడావిడిగా లేచాడు, సూర్య.

“అఖ్ఖర్లేదు, నేను ఆటో లో వెళ్ళగలను..”, “ఈ టైం లోనా?” అని అడుగుతున్న సూర్యాని పట్టించుకోకుండా బయటకు నడచింది స్వేచ్ఛ.

…………………………….

“నేను కోరినవన్నీ ఉన్నాయా అంటే… లేవనే చెప్పాలి. నిజంగానే అన్నీ కావాలా అని ఆలోచింఛి నిర్ణయం తీసుకోవటానికి  ఇంత సమయం పట్టింది”, సంజాయిషీ ఇస్తున్నట్లుగా, సుజాత తో అన్నది స్వేచ్ఛ.

“అదేదో పెద్ద తప్పైనట్లు అలా నానుస్తూ చెప్తావెందుకు? వెరీ హ్యాపీ ఫర్ యు!” అంటూ గట్టిగా హగ్ చేసింది సుజాత.

“ఎంత వరకూ వెళ్ళారేంటి? హద్దులు దాటేశారా?”, బిగించిన హగ్ ని విడుస్తూ, క్యాజువల్ గా అడిగేసింది సుజాత.

“లేదే.. అతను ఆ విషయాల్లో కొద్దిగా స్లోనే. ఆఫీసులో కలిసి ఉన్నా, ఎప్పుడూ పని మీద ధ్యాసే. వర్క్ లో అన్నీ వెంటనే నేర్చేసుకోవాలని తెగ తొందరపడిపోతూ ఉంటాడు. బయట మాత్రం, రొమాంటిక్ గానే మాట్లాడతాడు కానీ, ముద్దుకు మించి, ముందుకెళ్ళడు, అదీ చొరవ చేసి, నేను మొదలెట్టిన తరవాతే..”  అంటూ నిజాయితీగా బదులిచ్చింది స్వేచ్ఛ.

“మరీ మంచాడి లా ఉన్నాడే…నీకు సూట్ అవ్వడేమో” అంటూ ఒక నవ్వు నవ్వేసి, స్వేచ్ఛ ఉత్తుత్తి ఆగ్రహాన్ని పట్టించుకోకుండా, తన ఆఫీసు వైపు మళ్ళింది సుజాత.

…………………

“కమాన్ సూర్యా..ఇంత హటాత్తుగా జాబ్ మారాల్సిన అవసరం ఏముంది?” కొంత చిరాగ్గానే అడిగింది స్వేచ్ఛ.

“వాళ్ళ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్ కి లీడ్ రోల్ ఆఫర్ చేశారు. ఇంకొక బాడ్ న్యూస్ కూడా…”, నెమ్మదిగా నసిగాడు సూర్య.

“ఏంటి? నిన్ను అండమాన్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వమన్నారా? శుభం. రోజూ ఫేస్బుక్ లో చాట్ చేస్తూ ఏడాదికొకసారి కలుస్తూ ఉండచ్చు.”

“ప్లీజ్ .. మరీ అంత కోపమా.. అండమాన్ కాదు కానీ ఒక మూడు నెలలు అమెరికా వెళ్ళమన్నారు, ట్రైనింగ్ కోసం. రోజూ కాల్స్, చాటింగ్..ఇట్టే గడిచిపోతాయి.” అంటూ తన చేతులను స్వేచ్ఛ చుట్టూ వేసి, ఆమెను ముద్దులతో ముంచేత్తేశాడు సూర్య. వాళ్ళ అందమైన ఏకాంతాన్ని భగ్నం చెయ్యటానికా అన్నట్లు, సూర్య సెల్ ఫోను మ్రోగటం మొదలెట్టింది. కాలర్ ఐ.డి. “తేజ” అని చూపిస్తోంది.

“తీస్కో…మీ ఫ్రెండు ఎప్పుడూ మంచి టైం చూసి కాల్ చేస్తూ ఉంటాడు”, అని చురకేసి లోపలి కెళ్ళింది స్వేచ్ఛ. కాసేపాగి బయటకు వచ్చిన స్వేచ్ఛకి సూర్య ఎదో పరధ్యానంగా కనపడ్డాడు. తేజ, సూర్యా చిన్నప్పటినిండీ మంచి స్నేహితులు. వారానికొకసారైనా మాట్లాడుకోందే వీళ్ళకి తోచదని, స్వేచ్చకి తెలుసు.

“ఏమంటున్నాడు తేజ?”, అంటూ సూర్య పక్కన కూర్చోంది స్వేచ్ఛ.

“ఐ.టి సెక్యూరిటీ లీడ్ గా ఒక మల్టీ నేషనల్ లో హైదరాబాద్ లోనే జాబ్ వచ్చింది వీడికి. నెక్స్ట్ వీక్లో ఇక్కడికి వచ్చేస్తున్నాడు వాడు. కానీ నేను అమెరికా వెళ్ళాల్సింది కుడా అదే టైం లో. అదే ఏం చెయ్యలా అని ఆలోచిస్తున్నా.”

“అతడేం చిన్న పిల్లాడు కాదుగా, నువ్వు వర్రీ అవ్వటానికి. ముందు మన గురించి ఆలోచించు…” అంది స్వేచ్ఛ టాపిక్ డైవర్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తూ.

“అది కాదు రా. వాడికి ఊరు పెద్దగా తెలీదు. వాడిని నా అపార్ట్మెంట్ లోనే ఉండమంటాను. వాడికి కొంచెం సిటీ చూపించి సెటిల్ అవ్వటానికి నువ్వే సాయం చెయ్యాలి…” అంటూ అభ్యర్ధించాడు సూర్య.

“నీ గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు, నా ఫ్రెండ్ ని చూస్కో, అని అప్పగిస్తున్న నీ నమ్మకానికి జోహార్లు అర్పించాలో లేక నీ అమాయకత్వాన్ని తిట్టాలో, డిసైడ్ చేసుకోలేకపోతున్నాను…” రాని కోపం నటిస్తూ అడిగింది స్వేచ్ఛ.

………

“బై..స్వీట్ హార్ట్..” అంటూ పెదాల పై ఒక ముద్దిచ్చేసి సెక్యురిటీ వైపు నడిచాడు సూర్య.

“ఏంటీ..అంత డ్రై గా కిస్ చేసి వెళ్ళిపోయాడు…వాడికి మొహమాటం ఎక్కువనుకుంటా…” చాల క్యాజువల్ గా అడిగాడు తేజ.

కొద్దిగా ఎరుపెక్కిన చెక్కిళ్లతో, “నీకస్సలు సిగ్గు లేదన్న విషయం చెప్పాడు సూర్య…కానీ ఇంత లొడ లొడా వసపిట్ట లాగా వాగుతూనే ఉంటావన్న విషయం  మాత్రం దాచాడు. ఇంటి నించి ఎయిర్పోర్ట్ దాకా త్రోవ పొడవునా నాన్ స్టాప్ గా.. నీ కసలు అలసట రాదా?” సిగ్గు, విసుగు, కోపం అన్నీ మేళవించిన స్వరంతో అడిగింది స్వేచ్ఛ.

“నీకు కొంచెం కోపం ఎక్కువే అని చెప్పాడు సూర్య…కానీ ఆ కోపం లో నువ్వెంత అందంగా ఉంటావో చెప్పటం మాత్రం దాచాడు” తడుముకోకుండా తేజ.

జవాబు ఇవ్వకుండా పార్కింగ్ లాట్ లో కార్ వైపు దారి తీసింది స్వేచ్ఛ. కార్లో, పిచ్చ సీరియస్ గా మొహం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు తేజ. ఆ నిశ్శబ్ద వాతావరణం కలగజేసే ఇబ్బందిని తట్టుకోలేక, స్వేచ్ఛ రేడియో ఆన్ చేసింది. “కయీ బార్ యూహి దేఖా హై..యే జొ మన్ కి సీమ రేఖా హై..మన్ యూ బెహెక్నే లగ్తా హై” అంటూ ముఖేష్ తియ్యని గళంతో పాడుతున్నాడు. పాటను చక్కగా ఆస్వాదిస్తూ, స్టీరింగు వీల్ మీద వేళ్ళతో తాళం వేస్తూ డ్రైవ్ చేస్తున్న స్వేచ్ఛ, తరువాతి పాట “షీలా..షీలా కీ జవానీ” అని రావటం తో రేడియో ఆపేసింది.

“I’m too sexy for you, మై తేరే హాత్ నా ఆనీ…అంత మంచి పాట..ఎందుకు ఆపేశావ్?” నవ్వుతూ అడిగాడు తేజ.

“నీ టేస్టు కి తగ్గట్టే ఉంది ఆ పాట కూడా”

“నా టేస్టుకి చాలా పెద్ద రేంజ్. ఇంతకు ముందు నువ్వు అంతగా ఎంజాయ్ చేశావే, ఆ పాట గురించి తెలుసా నీకు?”

“మంచి పాట…ముఖేష్ పాట…అంత తెలిస్తే చాలు”

“ఆ పాట కి నేషనల్ అవార్డు వచ్చింది, ముఖేష్ కి. రజనీగంధ సినిమా లోది. సినిమాలో ఆ పాట నేపధ్యం గురించి తెలిస్తే ఇంకా ఎంజాయ్ చేసేదానివేమో!” వస్తున్న చిరునవ్వును పంటితో బిగిస్తూ అన్నాడు, తేజ.

“ఎందుకంట?” కొంచెం అనుమాదాస్పదం గా అడిగింది స్వేచ్ఛ.

“తన బాయ్ ఫ్రెండ్ వేరే ఊరికి వెళ్తే, తన పాత స్నేహితుడిని రిసీవ్ చేసుకొని, కారులో వెళ్తూ, ఆ స్నేహితుడి వైపు, ఆకర్షితురాలవుతున్న మనస్సుని ఉద్దేశింది పాడుకున్న పాట అది…” ఈ సారి, గట్టిగా నవ్వేస్తూ అనేశాడు, తేజ.

స్వేచ్ఛ కుడా అతడి నవ్వులో శ్రుతి కలిపింది.

“నువ్వు అందరి అమ్మాయిలతో కలవంగానే ఇలాగే ఫ్లర్ట్ చేస్తావా?”

“అందరితో కాదు. అందమైన, నేను అందుకోలేని, అమ్మాయిలతో మాత్రమే… నువ్వు నా ఫ్రెండు తో ఆల్రెడీ బుక్ అయిపోయావు కాబట్టి, మనిద్దరి మధ్య ఎలాంటి ఛాన్స్ లేదు కాబట్టి..నీతో డైరెక్ట్ ఫ్లర్టింగ్ అన్నమాట.. ఒక వేళ నేను ఎవరైనా అమ్మాయిని పటాయించాలంటే మాత్రం నా నైజాన్ని దాచి, బుద్ధిగా ప్రవర్తించే వాడిని,” వివరించి చెప్పాడు, తేజ.

“నీ నిజాయితీ…నీ పొజిషన్ మీద నీకున్న అవగాహన, నీలో నాకు నచ్చేసిన అంశాలు. నాతో బుద్ధిగా కాకుండా, కావలసినంత ఫ్లర్టింగ్ చేసుకో ” అంటూ నవ్వేసింది, స్వేచ్ఛ.

“నువ్వదే మాట మీదుండు… రేపు సాయంత్రం డేట్ కి వెళ్దామా?”, తన అపార్ట్ మెంట్ దగ్గర కారు దిగిన తరవాత అన్నాడు, తేజ.

“నో..ధ్యాంక్ యూ. నిన్ను రోజూ భరించాలంటే కొంచెం కష్టమే”

“అదీ చూద్దాం…రేపు నాతో ఎలా రాకుండా ఉండగలవో. నీ విల్ పవర్ కి టెస్ట్ అన్నమాట”, కవ్విస్తూ అన్నాడు తేజ.

“నీకు అంత సీన్ లేదు…” అంటూ విండో రోల్ చేసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్లి పోయింది, స్వేచ్ఛ.

……….

“నేను రానని చెప్పను కదా.. నాకు చాలా పనులున్నాయి. నా ఆఫీస్ కి వచ్చి చాలా టైం వేస్ట్ చేసుకొన్నావు” మందలింపు ధోరణి లో చెప్పింది స్వేచ్ఛ.

“ఓకే..నా దగ్గరో ఎక్స్ ట్రా టికెట్ ఉంది, ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కి. ఏం చేస్తాం మరి…ముఖ్యమైన పనులున్నప్పుడు వదులుకోలేం కదా..” అంటూ తన దగ్గర ఉన్న టికెట్ ను చూపించాడు, తేజ.

బాలమురళీకృష్ణ, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా జుగల్బందీ. “యూ…ఈవిల్, ఈవిల్ మాన్.. ఒక్క టూ మినిట్స్ లో వచ్చేస్తాను” అని చెప్పి లోపలి పరిగెత్తింది, స్వేచ్ఛ.

హిందుస్తానీ, కర్నాటక రాగాలలో తేజ పరిజ్ఞానాన్ని చూసి చకితురాలయ్యింది స్వేచ్ఛ. సాహిత్యంలో కుడా విశ్వనాధుడి నించీ నేటి తరం రచయితల వరకూ అతడి విశ్లేషణాత్మక అభిప్రాయాలు, అతడి అభిరుచులు కూడా ఒకింత ఆకట్టుకున్నాయి స్వేచ్ఛని. వీకెండ్ సాయంత్రాలన్నీ ఇలాంటి డేట్స్ తోను, తదనంతరం డిన్నర్స్, కొన్ని సార్లు రాత్రి మొత్తం కొనసాగిపోయే చర్చల తోను రెండు నెలలు ఇట్టే గడచిపోయాయి.

…….

“చలాన్ని ఈ సమాజం అర్థం చేసుకోలేదు. ఎప్పటికీ!” నిర్లిప్తతతో అన్నాడు, తేజ, “మైదానం” చదువుతున్న స్వేచ్ఛతో.

“అర్థం చేసుకోవాలని ఆయన వ్రాయలేదోమో? తన చుట్టూ ఉన్న సమాజంలోని స్త్రీల అణచివేతను, యాంత్రిక సంసారాలు కొనసాగిస్తున్న జీవితాలలోని ప్రేమ రాహిత్యాన్నీ, వీటినన్నిటినీ చూసి కోపం వచ్చి, ఆవేశంతో వ్రాసేడేమో అనిపిస్తుంది, నాకైతే.”

“ఏమో, నాకు రాజేశ్వరి పాత్ర చాలా ఇష్టం. భలే స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటుంది.”

“ఇంటరెస్టింగ్! నాకైతే చలం తాను ద్వేషించే పితృస్వామ్య భావజాలం నించి తానే బయటపడలేక, స్త్రీ స్వేచ్ఛ ని కూడా పురుష కోణం నించే చూశాడనిపిస్తుంది. రాజేశ్వరి మొదట మొగుడికి, తర్వాత  ప్రియుడికి బానిసగా ఉండిపోతుంది. ఆ రాజేశ్వరే నీకు నిజ జీవితంలో ఎదురుపడితే ఏం చేస్తావు, తేజా?”

“నేను అందరి లాగా ఆలోచించను. నేను రాజేశ్వరి బోల్డ్నెస్ ని ఇష్టపడతాను. తనే కాదు, చలం సృష్టించిన స్త్రీ లందరినీ ఆరాధిస్తాను”

“మన చర్చ రాత్రంతా కూర్చొన్నా తేలదు. లేట్ అయిపోయింది. నువ్వలా సోఫా మీద పడుకో ఈ రాత్రికి. ప్రొద్దున మాట్లాడుకుందాం” అంటూ తన బెడ్ రూమ్ వైపుకు నడిచింది స్వేచ్ఛ.

***************************

“నువ్వేం చేస్తున్నావో నీ కేమైనా తెలుస్తోందా?” సీరియస్ గా అడిగింది సుజాత.

“నువ్వనుకుంటున్నలాంటిదేమి లేదు… తేజాకి, నాకు అభిరుచులు బాగా కలిశాయి. అతనితో ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుందో అస్సలు తెలీదు. అతని తో మాట్లాడకపోతే మాత్రం ఎదో వెలితి గా ఉంటుంది” అంటూ సిన్సియర్ గా సమాధానం ఇచ్చింది స్వేచ్ఛ.

“రోజూ మాట్లాడుతున్న నీకు తెలియకపోవచ్చేమో గానీ…మాకు మాత్రం అతని కళ్ళల్లో నీతో మాట్లాడుతున్నప్పుడు కనపడే మెరుపు, ఆత్మీయత, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, స్నేహం కంటే ప్రేమే ఎక్కువగా కనపడుతోంది”

“నీకు అతని గురించి తెలియదు… మా ఇద్దరికీ, మా రిలేషన్ గురించి మంచి క్లారిటీ ఉంది”

“ఐ హాప్ సో! మేము కన్విన్స్ కాకపోయినా నష్టం లేదు…మిమ్మల్ని మీరు వంచించుకోకపోతే చాలు” అంటూ తన పని అయిపోయినట్లుగా లేచి, ఆలోచనలోకి నెట్టిన స్వేచ్చను వదిలేసి, క్యాంటీన్ బయటకు నడచింది సుజాత.

……

సాయంత్రం డాన్స్ ప్రోగ్రాం ముగిసిన తరువాత, స్వేచ్ఛ అపార్ట్ మెంట్ కి చేరుకున్నారు, ఇద్దరూ. స్వేచ్ఛ, ఇద్దరికీ వైన్ ఇచ్చి, ఒక్క అరగంటలో డిన్నర్ సిద్ధం చేస్తానంటూ కిచెన్ లోపలికి వెళ్ళింది. సోఫా మీద వదిలేసిన స్వేచ్ఛ ఆఫీస్ ల్యాప్టాప్, తీసుకొని, కీబోర్డ్ మీద టకటకా టైప్ చెయ్యటం ప్రారంభించాడు తేజ.

“ఔను తేజ… ఈ మధ్య ఏమిటి నాతో ఫ్లర్టింగ్ తగ్గించేసావు…ఐ యాం మిస్సింగ్ మై ఓల్డ్ తేజా..” అంటూ కిచెన్ నించే ప్రశ్నించింది స్వేచ్ఛ.

“నాకు నిజంగానే అలా చెయ్యాలనిపించట్లేదు…ఎందుకో అనిపించట్లేదో తెలుసుకోవాలంటే కుడా భయమేస్తోంది.”

మాటలలోని తీవ్రతని పసిగట్టినా, ముఖకవళికలని గమనించే అవకాశం లేకపోవటం వల్ల, ఒక్క క్షణం గుగుర్పాటు చెందిన గుండెను సంభాలించుకొని, స్వేచ్ఛ “జోక్ చెయ్యద్దు…తేజా..నీ మనసులో ఏముందో చెప్పు..” అన్నది. తేజ నెమ్మదిగా నడచివచ్చి, ఆమె చెయ్యి పట్టుకొని, లివింగ్ రూమ్ లో ఉన్న సోఫా దగ్గరకి తీసుకొచ్చాడు. ఆమె ల్యాప్టాప్ తెరచి చూపించాడు. హార్ట్ షేప్ లో బెలూన్స్ ఎగురుతున్నాయి. “స్వేచ్ఛ.. I love your name.. I love your confidence.. I love your presence… I love everything about you..కానీ నీకు ఐ లవ్ యూ అని చెప్పటానికి మాత్రం భయపడుతున్నాను. కొన్ని సార్లు కొన్ని భావాలు వ్యక్త పరచటానికి  ఒక జీవిత కాలం పడుతుందేమో కదా?”

ఊహించని ఈ సంఘటనతో ఒక్క సారిగా ఆశ్చర్యపడింది స్వేచ్ఛ. ప్రతిస్పందనకి తావివ్వకుండా, స్వేచ్చని తన బాహువులలో బంధించాడు తేజ. స్వేచ్ఛ పెదవులపై తన పెదవులతో ముద్ర వేశాడు. మొదట ప్రతిఘటించినా ఆమె పెదవులూ విడిపోయి అతనికి పూర్తి సహకారాన్ని అందించాయి. స్వేచ్ఛ మొబైల్ రింగు తో మళ్ళీ మామూలు ప్రపంచం లోకి వచ్చారిద్దరూ. సూర్య నించి కాల్.

సూర్య ఎంతో ఉత్సాహం గా “గుడ్ న్యూస్… నేను అనుకున్నదాని కంటే ముందుగా పని ముగించుకొని వచ్చేస్తున్నాను. రేపే ల్యాండ్ అవుతున్నాను.”

“లేదు, సూర్యా…ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది! రేపు కలుద్దాం” అని చెప్పి స్వేచ్ఛ ఫోన్ కట్ చేసింది.

……………

స్వేచ్ఛ, సూర్య, తేజ, ముగ్గురూ, గుడిలో కలుసుకున్నారు. స్వేచ్ఛ ముందర మాట్లాడటం మొదలెట్టింది.

“మీ ఇద్దరిలో ఎవ్వరినీ నేను తప్పు పట్టటం లేదు. ఇద్దరికీ చేరువై నేనే ఈ పరిస్థితి కి బాధ్యురాలిని. మీరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవటం నాకస్సలు ఇష్టం లేదు. అలా అని మీ ఇద్దరిలో నేను ఎవ్వరినీ వదలుకోలేను. దానికి ఒక్కటే మార్గం…”

“ఏమిటది?” అన్న ప్రశ్నార్ధకమైన చూపుతో ఇద్దరూ స్వేచ్ఛ వైపు చూశారు.

“మన మధ్య ఈ “ప్రేమ” అనే జంజాటాన్ని తీసేస్తే, మన ముగ్గురం మంచి స్నేహితుల్లాగా ఉండిపోవచ్చు.”

“ఫ్యూచర్ సంగతేమిటి?” అంటూ సూర్య ప్రశ్నిస్తే, “ఇది మరీ తొక్కలో తెలుగు సినిమాలా ఉంది” అంటూ తేజ తనదైన శైలిలో స్పందించాడు.

“మనకి జోడైన వాళ్ళు మనకు తగలక పోరు. ప్రేమ ఒక్కసారే కలగదు అనటానికి వేరే ఋజువులఖ్ఖర్లేదనుకుంటాను?” ఒక రకమైన నిర్లిప్తతతో పలికింది స్వేచ్ఛ.

“తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. గుళ్ళోకెళ్ళి దర్శనం చేసుకొని, వీకెండ్ అంతా ప్రశాంతంగా ఆలోచించుకొని ఒక నిర్ణయాని కొద్దాం” అని ప్రపోజ్ చేసాడు సూర్య.

శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, అలమేలు మంగా సమేతుడై కొలువున్న ఆలయంలో స్వేచ్ఛ ప్రసాదం తీసుకొంటూ, భక్తి శ్రద్ధలతో మ్రొక్కుతున్న సూర్యా, తేజాలను గమనించసాగింది.

***************************

“ఎవరో ఒకరిని ఎంచుకుంటావనుకుంటే, ఇలా జరిగిందేంటే?”, బాధపడుతూ అడిగింది సుజాత.

“అలా జరగటమే రైట్ అనిపించింది నాకు, నో రిగ్రెట్స్!”

“ఏం జరిగిందో చెప్పవే? నువ్వంటే పడిచచ్చే ఆ ఇద్దరూ అంత హటాత్తుగా నువ్వద్దనుకొని ఎందుకు బ్రేక్ అప్ చేసుకున్నారు?”

“చాలా సింపుల్.  ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి, ఈ సమాజం ఏర్పరిచిన రూల్స్ అన్ని చెరిపేసుకొని, ముగ్గురం కలిసుండి, మన రూల్స్ మనమే రాసుకుందాం అని ప్రపోజ్ చేశాను!”

“నీ కేమైనా మతి పోయిందా?”
“కరెక్ట్, ఇదే ప్రశ్న అడిగారిద్దరూ. సూర్య, నాకేసి  ఆ సమయంలో చూసిన ఆ లుక్ నేనెప్పటికీ మర్చిపోలేను. నేను తనను ప్రేమించి, మోసం చేసి, తన ఫ్రెండు తోనే మళ్ళీ ప్రేమలో పడటాన్ని కూడా పెద్ద హృదయం తో క్షమించగలిగాడు గానీ, నా ఈ దిగజారుడుతనాన్ని మటుకూ సహించలేననేశాడు.”

“మరి, నీ ప్రపోజల్ విని మురిసిపోయి ముద్దెడతాడనుకున్నావా?”

“మరీ అంత అమాయకురాలిని కాను. చలాన్ని దేవుడిలా భావించే తేజ అయినా, నేను చెప్పింది విని, కొంచెంసేపైనా ఆలోచించి తిరస్కరిస్తాడనుకున్నాను. ఏ మాత్రం సమయం వృధా చెయ్యలేదు. తనకు ఒకే నే గానీ, తన కుటుంబం మాత్రం సామూహికంగా గంగలో దూకి చచ్చిపోతారని, నేను అనాథని కాబట్టే, నేను ఇలా బరితెగించి ఆలోచిస్తున్నాడని అనేశాడు.”

“ఆసలు నువ్వు ఏ పరిణామం ఊహించి ఈ ప్రశ్న అడిగావు? తప్పంతా నీలో పెట్టుకొని, నువ్వే వంచింపబడ్డదానిలా మాట్లాడుతున్నావే?”

“నువ్వే చెప్పావు, ప్రేమ ఎంత బలమైనదో. ఆ ఇద్దరితో ప్రేమలో పడి నేను తప్పు చేసానని అనుకోవటం లేదు. నేనిలాంటి ప్రపోజల్ పెడితే ఇద్దరూ నన్ను వదిలేస్తారని తెలిసే అడిగాను. కానీ ఏ మూలనో ఒక్క రవ్వంత ఆశ ఉండింది. తేజ, నేను ఎంత మానసికక్షోభ అనుభవించిన తరువాత ఈ మాట అడిగుంటానో అని ఆలోచించి, సూర్య తిరస్కరించిన తరువాతైనా నన్ను దగ్గరకి తీసుకుంటాడేమోనని. అతడూ అందరి లాంటి మగాడే అనిపించుకున్నాడు.”

“మన సమాజం ఇంత లోతుగా నీ మానసికస్థితిని విశ్లేషించి నిన్ను అర్థం చేసుకుంటుందనుకోవటం నీ మూర్ఖత్వం. అందుకు మగాళ్ళ నెందుకు తిడతావు? ఏ ఆడదీ కూడా నీ పట్ల సానుభూతిని చూపించదు. ఇంతకూ ఇప్పుడు ఏమి చేద్దామనుకుంటున్నావు?”

“ఎవ్వరి ప్రేమకూ నోచుకోకుండా పెరిగిన నేను, జీవితం లో నిజంగా నేను ఎవ్వరినీ ప్రేమించలేనేమో అన్న భయం తో పెరిగాను. అలాంటిది, ఇద్దరితో ప్రేమలో పడ్డాను. ప్రేమించగలను అని నేర్చుకున్నాను. నాకిక భయం లేదు. సమాజం గురించి కూడా ఎంతో విలువైన పాఠం నేర్చుకున్నాను. దానికి ఎదురీత నేను చెయ్యను. నాకవసరం లేదు. ఆ అమాయకపు స్వేచ్ఛను కనికరం లేకుండా గొంతు నొక్కి చంపేస్తాను. అందరూ అమోదించగల స్వేచ్ఛ గానే మారి ఎవరితో నైనా సెటిల్ అయ్యి, బుద్ధిగా నా జీవితం గడిపేస్తాను.” అంటూ ఇక చెప్పడానికి ఏమీ లేదనట్లుగా, అలసిపోయి అస్తమిస్తున్న సూర్యుణ్ణి కళ్ళార్పకుండా చూస్తూ, తన చెంపలపై ధారాళంగా ప్రవహిస్తున్న కన్నీరుని తుడుచుకొనే ప్రయత్నం కూడా చెయ్యకుండా కూర్చుండి  పోయింది స్వేచ్ఛ.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

యాజి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు