ఈ ఓటమే నాకు ప్రియాతి ప్రియం!

క హీరో, ఇద్దరు హీరోయిన్లు – నా చిన్నప్పటి నుంచీ నేను చూసిన ఎన్నో సినిమాలలో ఉన్న సాధారణ విషయం. శ్రీరాముడిని మినహాయించి దేవుళ్ళందరికీ కూడా ఇద్దరికి తక్కువ కాకుండా దేవతామూర్తులైన భార్యలు. ద్రౌపదికి తప్ప సాహిత్యంలో కానీ, సినిమాలలో కానీ ఒకే సమయంలో ఒక్కరికి మించి ప్రియులు ఉన్నట్లు నాకు తారసపడలేదు. అక్కడక్కడా అలాంటి కథలు ఎదురైనా అవి “సక్రమ” సంబంధాలుగా చిత్రీకరింపబడలేదు. ఇది ఇలానే ఎందుకు? కనీసం కల్పనలోనైనా ఈ నైతిక నిబంధనలని ఉల్లంఘించటానికి ఎందుకు సాహసించట్లేదు అని ఒక ప్రశ్న మిగిలిపోయింది.

కొంత వయసు వచ్చిన తరవాత స్త్రీ వాదంతో, ఆ వాద సాహిత్యంతోనూ పరిచయం అయ్యింది. స్త్రీలకి, సామజికంగా, ఆర్థికంగా పురుషలతో సమాన స్థాయిని కల్పించాలన్న సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకోవటానికి, మద్దతు చూపించటానికీ పెద్ద ఆలోచన చెయ్యలేదు. శతాబ్దాలుగా వేళ్ళూనిన పితృస్వామ్య సమాజంలో, దీనిని సాధించటానికి జరుగుతున్న పోరాటం మరి కొన్ని దశాబ్దాల పాటైనా జరుగుతూనే ఉంటుందనటంలో సందేహం లేదు. కానీ (అది సాధించేశామనుకొని) ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఆలొచన పుట్టింది.

“మగాడి చేసే తప్పుని, క్షమించో లేక చూసి చూడనట్లు పోయే ఈ సమాజం, ఆడది అదే తప్పు చేస్తే, అంతే క్షమ చూపించకలిగినప్పుడే అసలైన సమానత్వం.”

ఈ ఆలోచనా బీజం లోంచి పుట్టినదే “స్వేచ్ఛ” అనే కథ. ఇది 2013లో  సారంగ పత్రికలోనే తొలి సారిగా ప్రచురితమైంది. దాదాపు అన్ని పేరున్న పత్రికలూ దీనిని తిరస్కరించిన తరువాత, సంపాదకులైన కల్పన గారే కొద్ది నెలల పాటు ఆగి ప్రచురించారు. ఆ కథలోని స్వేచ్ఛ, తాను ప్రేమించిన ఇద్దరితోనూ వేరే ప్రపంచం లోనికి ఎగిరి పోతుంది. అది ప్రచురితమవ్వంగానే స్పందన ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువ మోతాదు లోనే వచ్చింది. స్వేచ్ఛకీ, తనని సృష్టించిన నాకూ కూడా, చాలా అక్షింతలు పడ్డాయి. “నా పెళ్ళి రోజున కూడా ఇన్ని అక్షింతలు పడలేదు” అని సరదాగా కొట్టివేసినప్పటికీ, ఇది నేను ముందస్తుగా ఊహించని విషయం కాదు. ఆ  కథని ఈ రోజుకి కూడా ఛీత్కరించుకొనే మితృలెందరో ఉన్నారు.

ఆ “స్వేచ్ఛ” లోని దూకుడుతనాన్ని కొంత తగ్గించి, తన ఫిలాసఫీని మరి కొంత విశదీకరిస్తూ, అలాగే, తన కథకి కూడా సమాజానికి ఎంతో కొంత ఆమోదయోగ్యమైన ముగింపునిస్తే పుట్టిందే, ఈ    “మరో స్వేచ్ఛ”. ఒక రకంగా, స్వేచ్ఛ తన కథకి  ఎలా పాఠకులు ఎలా స్పందిస్తారో ముందే ఊహించి, తనని తాను మలుచుకుందన్నమాట. ఇలా ఎందుకంటున్నానంటే, సారంగలో ప్రచురణకి వచ్చే సమయానికి “మరో స్వేచ్ఛ” సిద్ధమైపోయింది. కానీ ప్రచురణలోనికి రావటానికి మరొక నాలుగేళ్ళు పట్టింది. వాసిరెడ్డి నవీన్ గారికి నచ్చి, 2017 తానా సావెనీర్ లో ప్రచురించారు.

నేను ఈ “మరో స్వేచ్ఛ” నే ఎందుకు “నాకు ఇష్టమైన కథ” గా ఎందుకు ఎంచుకున్నానో చెప్పాలంటే, “యాజి” అన్న కలం పేరుతో గత పదేళ్ళలో పది కథలు మాత్రమే రాసిన నా గురించి కొద్దిగా చెప్పుకోవాలి. నేను కథా రచయితగా తెలిసిన వారికి గుర్తుకొచ్చే కథలు – “పగడమల్లెలు”, “ప్రవల్లిక నిర్ణయం”. మొదటిది శిల్ప విన్యాసం చేసి  నడిపిన కథైతే, రెండోవది, వస్తు ప్రాధాన్యత తో నడిపిన  ఒక “టాపికల్” కథ. ఒక పాత్రని చిత్రించటంలో, ఎక్కువగా కష్టపడింది మాత్రం స్వేచ్ఛ గురించే. కథ రాసే ముందు నుంచే దిగులు, ఎవ్వరూ అర్థం చేసుకోక అసహ్యించుకుంటారేమోనని. అనుభవ రాహిత్యం వలన, కొంత క్రైమ్ యాంగిల్ ని కథలో గుప్పించి, తన 1.0 వర్షన్ కి నేనే అన్యాయం చేశా.

ఎంతో మధనపడి నేనే మళ్ళీ “మరో స్వేచ్ఛ” ని సృష్టించి, కొంతైనా అర్థం చేసుకుంటారని ఆశించా. ఈ కథ చివరి పేరాలో నేనే స్వేచ్ఛ లోకి పరకాయ ప్రవేశం చేసి, నా బాధని బయట పెట్టా. ఆశించినది జరగలేదు. “మరో స్వేచ్ఛ” రచయితగా నా అతి పెద్ద పరాజయం. కానీ నేను సాధించిన అతి కొద్ది విజయాలకన్నా, ఈ ఓటమే నాకు ప్రియాతి ప్రియం.

*

 

యాజి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు