కరాచీలో తీరంలో సంక్షోభం

సుమారు ఏభై ఏళ్ల క్రిందటి మాట. ఈ రచయిత వాణిజ్య నౌకలపై మెరైన్ ఇంజినీరుగా పదిహేనేళ్లపాటు సముద్రయానం చేశారు. ఎన్నో దేశాలు, ప్రదేశాలు చూశారు. తన ప్రత్యక్ష అనుభవాలను, కొద్ది మార్పులతో, ‘ఉప్పుగాలి కబుర్లు’ శీర్షికలో అందజేస్తున్నారు. ఇవి కాలక్రమానుసారంగా వెల్లడించిన సంఘటనలు కాదుగానీ, పాఠకులకు ఆసక్తి కలిగించగల నిజజీవిత ఘటనలు; ఆనాటి ప్రపంచాన్ని ఆవిష్కరించే కథలు.

కాండ్లా రేవులో ఉండగా కరాచీ వెళ్తున్నాం అని తెలిసింది. చాలా దేశాలు తిరిగినప్పటికీ, పొరుగునే ఉన్న పాకిస్తాన్ వెళ్లడం అదే తొలిసారి. అది ఏప్రిల్, 1980. మాది బాగా డొక్కు ఓడ; పాతబడ్డ ఆయిల్ టేంకర్. మా కార్గో డీజెల్ ఆయిల్. కాండ్లాలో నింపుకొని, కరాచీలో డిస్చార్జి చెయ్యాలన్నమాట. పెద్ద దూరం లేదు.

అప్పుడు మాకు దాని ప్రాముఖ్యత తెలియదుగానీ, ఆ మధ్యాహ్నం పూట, కరాచీరేవుకి చేరుకొనే దారిలో తిన్నగా వెళ్లి, అణుశక్తితో నడిచే అమెరికా యుద్ధ నౌక, బ్రహ్మాండమైన ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్, యూ.ఎస్.ఎస్. ‘నిమిట్జ్’ కాళ్లల్లో పడ్డాం. సరిగ్గా అప్పుడే మా ఇంజిన్ చెడిపోయింది.

ఛీఫ్ ఇంజినీరుగా, కేప్టెన్‌కి పరిస్థితిని వివరించడానికని, బాయిలర్ సూట్‌లోనే నేవిగేషన్ బ్రిడ్జి మీదకి వెళ్లాను. అతగాడు, మిగతా డెక్ ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారని అర్థం అయింది. ఎదురుగా భూతంలాగా యుద్ధనౌక ‘నిమిట్జ్’! ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్ ఒంటరిగా ఎన్నడూ సముద్రంలోకి ప్రవేశించదు. దాని చుట్టూతా డిస్ట్రాయర్లు, అమెరికన్ నేవీకి చెందిన అనేకానేక చిన్నా చితకా యుద్ధనౌకలు, గస్తీ నౌకలు, హెలికాప్టర్లు. సరిగ్గా ‘నిమిట్జ్‌’కి ఎదురుగా మా డొక్కు టాంకర్. ఇంజిన్ ఆగిపోయి నీళ్లల్లో తేలుతూ, కెరటాలు, గాలి ఎటు నెట్టితే అటు కదులుతూ తచ్చాడుతున్నాం.

మా కేప్టెన్ పాపం బెంబేలెత్తిపోతున్నా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. “ఇంకా ఎంతసేపు రిపేర్లు? ఇంజిన్ వెంటనే స్టార్ట్ చెయ్యాలి, కొంపలంటుకున్నాయి,” అన్నాడు, కోపంగా. అతని మానసిక స్థితి అర్థం అయింది గనుక,

“ఇంకో ఇరవై నిముషాలు, కేప్టెన్! అన్నాను.

“మీ ఇంజినీర్లు ఇరవై నిమిషాలు అంటే, ఇరవై గంటలు కూడా పట్టవచ్చు,” అనేశాడు.

ఇంతలో ‘నిమిట్జ్’ ఎస్కార్ట్‌గా ఉన్న నౌక మమ్మల్ని, వీ.ఎచ్.ఎఫ్. (వెరీ హై ఫ్రీక్వెన్సీ) రేడియోలో కాంటాక్ట్ చేసింది. వాళ్లు అప్పటికే చాలా సార్లు ప్రయత్నించారని నాకు అర్థం అయింది.

“ఆయిల్ టేంకర్, మీ ఓడ పేరు, మీ జాతీయ జెండాని వెంటనే తెలియపరచండి. ఇప్పటికే చాలా సార్లు అడిగాం. మీరెందుకు సమాధానం ఇవ్వడం లేదు?”

మా వైపు నుండి నిశ్శబ్దం.

“ఆయిల్ టేంకర్, సమాధానం ఇవ్వకపోతే మరో ఐదు నిమిషాల్లో మా కమాండొ టీంని మీ ఓడ మీదకి పంపుతున్నాం.”

ఇక లాభం లేదని మా కేప్టెన్ స్వయంగా రేడియోలో సంభాషించాడు.

“మాది ఇండియన్ ఫ్లాగ్,” అని చల్లగా చెప్పాడు.

దాంతో యుఎస్ నేవీ అధికారులు మరింత కంగారుపడ్డారు. ఆరోజుల్లో మనదేశానికి సోవియట్ యూనియన్, సోవియట్ నేవీలతో బాగా దోస్తీ ఉండేది కదా!

“ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీకేం పని ఇక్కడ? మీ ఓడ మీద ఎవరెవరున్నారు? పూర్తి క్రూ లిస్ట్ కావాలి. భారతీయులు కానివారెవరైనా ఉన్నారా?…” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

“తప్పుడు సమాచారం ఇస్తే మీమీద చర్య తీసుకుంటాం. అంతర్జాతీయ జలాల్లో ఉన్నామని గుర్తుచేసుకోండి,” అంటూ హెచ్చరించారు.

1979నాటి ఎన్నికలలో గెలిచి, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. 1971 యుద్ధంలో ఆనాటి ఇందిర ప్రభుత్వం, సోవియట్ నేవీ సహకారంతో, అమెరికన్ నేవీకి చెందిన ఏడవ నౌకాదళాన్ని నిలువరించిన ఙ్ఞాపకాలు అందరి మెదళ్లలోనూ ఇంకా తాజాగా ఉన్నవి. పాక్, అమెరికన్ ప్రభుత్వాలకు, ముఖ్యంగా నౌకా దళాలకు, అవి చేదు ఙ్ఞాపకాలు. 1971 యుద్ధంలో కరాచీ రేవుమీద ఇండియన్ నేవీ చేసిన మెరుపు దాడి, సోవియట్ నౌకాదళ నిపుణులను సైతం అబ్బుర పరచిందని అందరికీ తెలుసు. ఆ ఉదంతం గురించి మరో తడవ ప్రస్తావిస్తాను.

మా ఓడ కరాచీ వెళ్తోంది అని తెలియగానే, నౌకల మధ్య అంతర్గత సంభాషణలు ఊపందుకున్నాయి. తరువాత వీ.ఎచ్.ఎఫ్. ఛానెల్-16లో పూర్తి  రేడియో సైలెన్స్.

“వాళ్ల స్వంత ఛానెల్స్‌లోకి మారిపోయి ఉంటారు; మనకి వినిపించకుండా ఉండేందుకు,” అన్నాడు కేప్టెన్.

బైనాక్యులర్స్‌తో చూస్తూ, “బహుశా కమాండోలని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు,” అనేశాడు.

బ్రిడ్జ్ మీద ఉన్న ఆఫీసర్లు నలుగురం; ఏం చెప్పడానికీ, చెయ్యడానికీ తోచలేదు.

“వొస్తేరానీ, తనిఖీ చేస్తారు, అంతే కదా?  మన దగ్గర ఏమున్నాయి? తుపాకులా, ఫిరంగులా?” అన్నాడు, తాపీగా.

అది మాకు ధైర్యం చెప్పడానికే అని అర్థం అయిందిగానీ, నా నాలుక పిడచ కట్టుకుపోయింది. సీనియర్ కేడెట్‌ని అడిగితే తాగేందుకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు.

“ఛీఫ్, ఇంజిన్‌రూమ్‌కి ఫోన్‌చేసి, పరిస్థితి కనుక్కో!” అన్నాడు కేప్టెన్ నన్ను ఉద్దేశించి.

కేప్టెన్ చాలా కూల్‌గా ఉన్నాడు; బూతులు దొర్లకుండా అందరితోనూ మర్యాదగా వ్యవహరిస్తున్నాడు. పది నిమిషాలు గడిచిపోయాయి.

అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న ఛానెల్-16 మళ్లీ చిటపటలాడుతూ ప్రాణం పోసుకుంది

“కేప్టెన్‌తో మాట్లాడాలి, ఇండియన్ టేంకర్!” అని ధ్వనించింది.

“నేనే, కేప్టెన్‌ని మాట్లాడుతున్నాను.”

అందరం ఊపిరి బిగపట్టుకొని ఆతృతగా వింటున్నాం.

“మీ ఓడకి ఏడమవైపు నుండి నల్లటి ద్రవం వెలువడుతున్నది. ఏమవుతోంది? ఏం చేస్తున్నారు? వెంటనే తెలియజెయ్యండి.”

మా నెత్తిమీద రెండు హెలికాప్టర్లు తిరుగుతున్నాయి.

నేను పరుగెత్తుకుంటూ వెళ్లి, పోర్ట్‌సైడ్ వింగ్ మీదనుండి చూశాను. నిజమే, నల్లటి ఆయిల్‌తో కూడిన ద్రవం సముద్రంలోకి డిస్చార్జ్ అవుతోంది.

ఇంజిన్‌ రూమ్‌కి ఫోన్‌చేసి, థర్డ్ ఇంజినీర్ మీద అరిచాను. మధ్యాహ్న భోజనాలు కూడా లేకుండా, ఇంజినీర్లంతా రిపేర్ పనిలో ఉండగా, ఆయిల్‌మేన్ ఒకడు బిల్జెస్ (ఇంజిన్‌రూంలో అడుగున చేరే లీకైన సముద్రం నీళ్లు, ఆయిల్స్) పంప్-ఔట్‌ చేస్తున్నాడనీ, వెంటనే ఆపుచేయించాననీ సెకండ్ ఇంజినీర్ తెలిపాడు. అది చట్టరీత్యా నేరం కూడాను. కాలుష్యం కేసవుతుంది. సందట్లో సడేమియా అంటే ఇదే మరి.

“రిపేర్ పరిస్థితి తెలుసుకొని ఫోన్‌చేస్తాను, కేప్టెన్‌సాబ్!” అని క్రిందికి పరుగుతీశాను.

మరో పది నిమిషాలలో ఇంజిన్ స్టార్ట్ చేశాం.  అప్పటికి ఆ సంక్షోభం ముగిసింది.

కరాచీ పోర్ట్‌లోకి వెళ్లాక మాకు ఏజెంట్ ద్వారా తెలిసింది.

కరాచీ నేవల్ బేస్‌నీ, పోర్ట్ యాజమాన్యాన్నీ వైర్‌లెస్ ద్వారా సంప్రదించి, మా పేరుగల ఇండియన్ టేంకర్ నిజంగానే ఆ రేవులోకి రాబోతున్నదని నిర్థారించుకున్నాక, అమెరికన్ నేవీ అధికారులు చల్లబడ్డారట. చిన్న పాతకాలపు ఆయిల్ టేంకర్ విషయమై, అంత పెద్ద యూ ఎస్ నేవీ ఎందుకలా కంగారు పడ్డారో మాకు అప్పటికింకా తెలియలేదు.

కరాచీ రేవు బయట ఒక పూట వేచి ఉండాలనీ, పాకిస్తాన్ నేవల్ అధికారులు తనిఖీ నిర్వహిస్తారనీ అధికారులు తెలిపారు. లంగరు దించి ఎదురుచూశాం.

డిన్నర్ అయ్యాక నా కేబిన్‌లో కూర్చొని టీవీ ఆన్ చేశాను. కరాచీ టీవీ – బ్లాక్ అండ్ వైట్ ప్రసారాలు చూస్తున్నాను. పాక్ టీవీ కూడా ఆనాటి దూర్‌దర్శన్ లాగానే అమాయకంగా, సంసారపక్షంగా ఉంది; సాంకేతికపరంగా వెనుకబడ్డా, సాంస్కృతిక పరంగా అద్భుతంగా ఉన్నాయి వారి కార్యక్రమాలు, దూర్‌దర్శన్ లాగానే. అప్పుడే మొట్టమొదటిసారిగా, గులాం ఆలి స్టుడియోలో పాడిన ‘చుప్కే చుప్కే రాత్ దిన్, ఆసూ బహానా యాద్ హై’ పాట విన్నాను. ‘ఏమిటీ పాట, ఇంత గొప్పగా ఉంది?’ అని తబ్బిబ్బైపోయాను. ఆ తరువాత ఆ పాట చాలా సార్లు, చాలా సందర్భాలలో విన్నప్పటికీ, ఆనాటి తొలి అనుభవం, అలానే నా మదిలో నిలిచిపోయింది.

ఇంతలో కేప్టెన్ నా కేబిన్‌కి వచ్చి, “ఇన్స్‌పెక్షన్ టీమ్ వచ్చారు, పద! ఇంజిన్ రూమ్ చూస్తామంటే నువ్వే చూపించాలి,” అన్నాడు.

వచ్చినవాళ్లు ముగ్గురూ పంజాబీలు. మా కేప్టెన్, ఛీఫ్ ఆఫీసర్ – ఇద్దరూ పంజాబీలే. వాళ్ల భాషలో కబుర్లు చెప్పుకుంటూ, జోకులు పేలుస్తూ, నవ్వుకుంటూ, మధ్యమధ్యలో నాతో ఉర్దూలో మాట్లాడుతూ, కేబిన్‌లోనే తనిఖీ తంతు ముగించారు. సంతకాలు పెట్టి వెళ్లిపోయారు.

కరాచీరేవులోకి ప్రవేశిస్తూంటే అది కొంచెం విశాఖపట్నంలాగానే ఉన్నట్లు తోచింది. అందుకు కారణం, రేవుని ఆనుకొని ఉన్న కొండ – యారాడ కొండ మాదిరిగా. కొండమీద ఒక గుడి ఉంది; గోపురం మీద కాషాయి జెండా ఎగురుతున్నది. ఆశ్చర్యంతో బాటు, కుతూహలం కలిగింది. ఛార్టులో చూశాను. ‘హిందూ టెంపుల్’ అని స్పష్టంగా ఉంది. అనేకానేక కలయకలకూ, ఎడబాట్లకు అదొక కొండగుర్తు అనిపించింది. మా ఊళ్లో యారాడకొండ మీదనున్న పురాతనమైన దర్గా, బ్రిటిష్ కాలం నాటి మేరీ మాత చర్చి, ఛానెల్ ప్రక్కనే వెలసిన వెంకటేశ్వరుడి గుడి – ఇవన్నీగుర్తుకొచ్చాయి. ఎన్ని దేశాలు తిరిగినా స్వంత ఊరి మీది మమకారం ఎప్పటికీ పోదేమో!

***

అయితే ఆనాడు అణుశక్తితో నడిచే యుద్ధనౌక ‘నిమిట్జ్,’ మందీమార్బలంతో, అంత ఆర్భాటంగా కరాచీ రేవుకి సమీపంలో సంచరించడానికి అసలు కారణం, నిత్యం బీబీసీ వినే అలవాటు ఉన్న మా రేడియో ఆఫీసర్ చెప్పాకనే మాకు తెలిసింది.

కరాచీ రేవుకి సమీపంగా నడి సముద్రంలో ఇంజిను చెడిపోయి, మా ఓడ ఆ అణుయుద్ధ నౌకకు అడ్డంపడిన నాటికి ఒకటి రెండు రోజుల ముందు ఒక ప్రముఖ సంఘటన జరిగింది. జిమ్మీ కార్టర్ నాయకత్వంలోని అమెరికన్ ప్రభుత్వం, ఇరాన్ రాజధాని టెహరాన్‌లో బందీలుగా ఉన్న తమ రాయబార కార్యాలయ సిబ్బందిని విడిపించుకొనేందుకు చేసిన కమాండో దాడి ప్రయత్నం ఘోరంగా విఫలమైంది.

ఆ కమాండో చర్య పేరు ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ (ఆపరేషన్ ‘డెసెర్ట్ వన్’ అని కూడా అంటారు). ఆ ప్రయత్నంలో పాల్గొన్న హెలికాప్టర్లు ‘నిమిట్జ్’ నుండే బయలుదేరాయి. వాటిల్లో రెండు ఇసుక తుఫాను మూలంగా ఒకదానినొకటి గుద్దుకొని కుప్పకూలాయి. ఎనిమిది మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఆపరేషన్ రద్దయింది. 1980నాటి అధ్యక్ష ఎన్నికల్లో జిమ్మీ కార్టర్ ఓడిపోవడానికి ఈ వైఫల్యం ఒక ప్రధాన కారణం.

సోవియట్ యూనియన్ సహకారంతో, ఇరాన్ ఎదురుదాడికి దిగుతుందేమో అని అమెరికన్ నేవీ చాలా అప్రమత్తంగా ఉన్న సమయంలో మేము ‘నిమిట్జ్’కి అడ్డుతగిలాం. అమెరికాకి దోస్తులైన పాక్ ప్రభుత్వ సహకారంతో అమెరికన్ నేవీ ఓడలు అక్కడ సంచరిస్తున్నాయి. కరాచీ రేవుకూడా అప్రమత్తంగా ఉంది. తత్ఫలితంగా మా ఓడలోని వారెవరికీ ఊళ్లోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మా ఓడమీద సాయుధులైన పాక్ పారా మిలిటరీ గార్డులు కాపలాగా ఉన్నారు. వాళ్లుకూడా మాతోబాటు, చపాతీలు, పులావులు తినేవారు; అలాగే వీ.సీ.ఆర్.లో హిందీ సినీమా వీడియోలు చూసేవారు – తుపాకులు పక్కన పెట్టి.

మొత్తం మీద, కరాచీ ఊరుచూసే అవకాశం లేకుండా పోయింది. కానీ మరి కొన్నేళ్లకు, మరో ఓడలో అది సాధ్యపడింది. అది మరో కథ.

మిట్జ్’ డెక్‌పై కమాండో దాడికి సిద్ధమవుతూన్న హెలికాప్టర్లు Source: Wikipedia

*

 

 

ఉణుదుర్తి సుధాకర్

3 comments

Leave a Reply to GN Nagesh Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది సార్, ఏదో సినిమా చూస్తున్నట్లు, కళ్ళకు కట్టినట్లు వర్ణించారు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు