కథ చెప్పడం బిర్యానీ చెయ్యడం లాంటిది. బిర్యానీలో బియ్యం ఉంటాయి, నీళ్లు ఉంటాయి, అభిరుచిని అనుసరించి కాయగూరలు లేదా నాన్ వెజ్, మసాలా దినుసులు మొదలైనవి అన్నీ ఉంటాయి. బిర్యానీ చెయ్యడంలో చెయ్యి తిగిన ఒక బావర్చీ దగ్గరకు వెళ్లి అది నేర్పించమని అడిగితే ఆమె ఎలా చెప్తుంది? పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపు కలిపి అందులో ముక్కలు మారినేట్ చెయ్యాలి. కుక్కర్లో మసాలా దినుసులు వేయించి, ఆ తరువాత ఉల్లిపాయ ముక్కలు వేయించి… ఇలా చెప్పుకుంటూ వెళ్తుందనుకుందాం. ఆమె చెప్పినట్లే చేస్తే బిర్యానీ తయారౌతుందా? అవుతుంది. తినడానికి కూడా బాగానే ఉండచ్చు. కానీ అద్భుతంగా ఉండకపోవచ్చు. ఎందుకు? ఉల్లిపాయలు వేయించాలని ఆమె చెప్పింది – ఎంత సేపు? గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు. ఇది ఆమె చెప్పకపోయినా మీకు తెలిసే ఉండచ్చు. అసలు ఆ ఉల్లిపాయల్ని ఎలా తరగాలి? సన్న సన్న ముక్కలుగానా? చక్రాలుగానా? సన్నగా పొడుగ్గానా? సరే ఇదీ తెలుసనుకుందాం. ఎలాంటి ఉల్లిపాయలు తీసుకోవాలి? పెద్ద సైజులో ఉండేవా? చిన్న సైజులో ఉండేవా? పైన పొట్టు పర్పుల్ రంగులో ఉండేవా? తెల్ల పొట్టు ఉండేదా? ఒక వేళ మీరు హైదరాబాద్‌లో ఉంటే మోండా మార్కెట్‌కి వెళ్తే మంచి ఉల్లిపాయలు దొరుకుతాయా లేక ఎర్రగడ్డ రైతు బజార్ బెటారా? ఆ రైతు బజారులో కూడా ఏ షాప్‌కి వెళ్తే…
హలో మాస్టారు! ఏమిటీ ఛాదస్తం? మరీ జంధ్యాల సినిమాలో కమెడియన్‌లా తయారయ్యారు మీరు. ఇంత అవసరమా? మనం ఏమైనా ఫైవ్ స్టార్ హోటల్ నడుపుతున్నామా? చకచకా ఏదో ఒకటి చేసి ప్లేట్‌లో పెట్టకుండా ఉల్లిపాయ ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండాలి, లవంగం నాలుగు మిల్లీ మీటర్లు మించకూడదు అంటారేంటి?
మీకు కూడా ఇలా అనిపిస్తోందా? నిజమే. ఇదంతా కొంచెం ఛాదస్తంలాగే అనిపించచ్చు. కానీ మీ చుట్టుపక్కల ఉండే మిత్రుల్లో, బంధువుల్లో ఇలాంటి ఛాదస్తం ఉన్న వ్యక్తులు చాలా మందిని మీరు చూసే ఉంటారు. ఫలానా నెమలి మెడ మీద ఉండే బ్లూ రంగు చీర కావాలని ఇరవై ఆరు షాపులు తిరిగేవాళ్లు, నెయ్యి లేకుండా కారప్పొడి తింటే మహా పాపం అని నమ్మి, దానికోసం పదహారు కిలోమీటర్లు వెళ్లేవాళ్లు వగైరా వగైరా! కథలు రాసేవాళ్లు కూడా ఇలాగే ఆలోచించాలి. వాళ్లకి కూడా ఇలాంటి ఛాదస్తమే ఉండాలి. ఇదేమైనా ఫైవ్ స్టార్ హోటలా అనుకోకుండా, నేను పాఠకుడికి ఫైవ్ స్టార్ ట్రీట్‌మెంటే ఇస్తాను అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఏమౌతుంది?
ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగితేనే బిర్యానీ చేస్తాను లేకపోతే చెయ్యను అంటారు. ఫలానా రకం బాస్‌మతి బియ్యం ఉంటేనే బిర్యానీ, లేకపోతే దానికి ఇంకేదైనా పేరు పెట్టుకోండి అంటారు. ఇలా ఒక్క వస్తువులో కాదు, ఆ రెసిపీకి వాడే ప్రతి వస్తువులో అదే నాణ్యత కోరుకుంటారు.
సాహిత్య రచనని వంటతో పోల్చినందుకు మీకు ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. రెండు కారణాలు – సుళువుగా అర్థమయ్యేలా చెప్పడం కోసం. సాహిత్యం ఎంత ఉత్కృష్టమైన కళో, పాక శాస్త్రం కూడా అంతే ఉత్కృష్టమైన కళ అని నమ్మడం వల్ల.
ఇక అసలు విషయానికి వస్తాను –
గత కొన్ని రోజులుగా స్థల కాలాల గురించి చెప్తున్నాను. ఈ రెండింటిని కలపడం వల్ల ఒక సండర్భం ఏర్పడుతుందని, ఒక సెట్టింగ్ రూపొందుతుందని చెప్పాను. ఆ సెట్టింగ్‌ని సరిగ్గా నిర్వర్తిస్తే కథ సరైన రూప దారుఢ్యాన్ని పొందుతుందని చెప్పుకొచ్చాను. కానీ సందర్భం అంటే కేవలం స్థలకాలాలు మాత్రమే కాదు. మీరు చెప్తున్న కథ లేదా సంఘటన జరుగుతున్న పరిస్థితులు, అది జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వస్తువులు, పాత్రల మానసిక పరిస్థితి, అది ముఖంలో కనపడే విధానం, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వెలుగు లేదా నీడ ఇలా ఎన్నో విషయాలు ఆ కథలో ఉన్న సెట్టింగ్‌లో భాగంగా ఉంటాయి. అవన్నీ ఇందాక బిర్యానీలోకి వాడిన అనేక పదార్థాల లాంటివి. ఇవన్నీ సరైన పాళ్లలో ఉండాలి. అవి ఉన్నాయని పాఠకుడికి తెలియాలి. కానీ, ముఖాన కొట్టినట్లు చెప్పకూడదు. ఏ రుచి తగలాలో ఆ రుచే తగలాలి. ఎంత తగలాలో అంతే తగలాలి. ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉండకూడదు. అలా జరగాలంటే ఆ కథని వండుతున్న బావర్చీకి ఆ కథలో ఉండే ప్రతి సన్నివేశంలో ఏ ఏ పదార్థాలు ఉండాలో, అవి ఎలాంటి నాణ్యత కలిగి ఉండాలో, ఏ పాళ్లలో ఉండాలో స్పష్టంగా తెలిసుండాలి. అంతేకాదు తాము కోరుకుంటున్న నాణ్యత, కావాలనుకున్న లక్షణాలు కలిగిన పదార్థాలు దొరకకపోతే నేను కథ వండను అనే ఛాదస్తం కూడా ఉండాలి.
ఇంతకీ కథలో సన్నివేశాలను సరైన రీతిలో వండటానికి అవసరమైన పదార్థాలు ఏమిటి? వాటి నాణ్యతను ఎలా గుర్తించాలి? వాటి ఎలాంటప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో వాడాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వ్యాసంలో, మరో రెండు మూడు వ్యాసాలలో చేస్తాను.
ఫ్రెంచ్ థియేటర్ (నాటక) ప్రపంచంలో “మీజాన్‌సేన్” అనే ఒక మాట ఉంది. ‘మిజాన్-సెన్’ అంటే అర్థం “వేదికపైన ఉంచడం”. ఈ పదం నాటకం నుంచి వచ్చింది కాబట్టి, ఒక నాటకాన్ని ప్రదర్శించేటప్పుడు వేదిక మీద మనకు కనిపించే ప్రతి ఒక్క అంశాన్ని ఒక పద్ధతి ప్రకారం అమర్చడాన్నే మీజాన్‌సెన్ అంటారు. తదనంతరం ఇదే సిద్ధాంతాన్ని సినిమాలకు కూడా విస్తరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం కేవలం నటులే కాకుండా — నేపథ్యం (Setting), వస్తువులు (Props), వేషధారణ (Costume), లైటింగ్, ఫ్రేమ్/కెమెరా అమరిక (Composition), కదలికలు, శబ్దం, ప్రతీకలు (Symbols) ఇలాంటివి అన్నీ సరైన రీతిలో అమర్చడం ద్వారా ఆ నాటకం లేదా సినిమాలోని ఆ సన్నివేశం ప్రేక్షకులలో రచయిత/దర్శకుడు కోరుకున్న అనుభూతిని కలిగిస్తుంది. మాటలతో సంబంధం లేకుండా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి, ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించడానికి, కథలోని లోతైన అర్థాన్ని వివరించడానికి ఈ అంశాలన్నింటినీ చాలా జాగ్రత్తగా సమన్వయం చెయ్యాలని ఈ మీజాన్-సెన్ విధానం చెప్తుంది. థియేటర్‌లో, సినిమాల్లో, మిజాన్-సెన్ అనేది స్క్రిప్ట్‌ను ఒక సజీవ అనుభూతిగా మారుస్తుంది. ప్రేక్షకులు చూసే అంశాలు, వినే అంశాల ద్వారా పాత్రల మధ్య సంబంధాలను, భావోద్వేగాలను, కథా వస్తువును ఎలా అర్థం చేసుకోవాలో ఇది నిర్దేశిస్తుంది.
కథా రచనలో (Fiction writing) కూడా ఇదే సూత్రాన్ని వర్తింపజేయచ్చు. వర్ణనలు, సన్నివేశ చిత్రీకరణ ద్వారా ఇది సాధించవచ్చు. రచయితలు ప్రతీకాత్మకమైన వస్తువులను ఎంచుకోవడం, పాత్రల కదలికలను నిర్దేశించడం, వెలుగు, శబ్దం (ఒకోసారి నిశ్శబ్దం) లాంటి ఇంద్రియ అనుభవాలను వాడి కథలో మూడ్‌ను ప్రదర్శించచ్చు. ఒకరకంగా ఇది ఆ సన్నివేశానికి ‘దర్శకత్వం’ వహించడం లాంటిది. కేవలం ఏం జరుగుతుందో చెప్పడమే కాకుండా (Telling), మిజాన్-సెన్ ద్వారా పాఠకులు ఆ కథా ప్రపంచంలో మమేకమయ్యేలా చెయ్యచ్చు. దీనివల్ల ప్రతి చిన్న వివరమూ పాఠకుల ఊహల్లో ఒక ప్రదర్శనలా మారుతుంది. అలా ఇలాంటి “ప్రదర్శన” కథకి సంబంధించిన భావోద్వేగాన్ని పాఠకులలో కల్పించడానికి చాలా ప్రధాన అంశంగా మారుతుంది.
ఉదాహరణకి ఈ కథా భాగాన్ని పరిశీలించండి. ఇది చదివిన వెంటనే సందర్భం, సన్నివేశం, సంభాషణ మీకు అర్థమౌతాయి. ఆ తరువాత ఇదే సన్నివేశంలో ‘మీజాన్-సేన్’ వాడి ఎలాంటి మార్పులు చెయ్యచ్చో చూద్దాం.
<<నాటకం
కావేరి కోసం ఎదురుచూస్తున్న జస్వంత్ మనసు అస్సలు కుదురుగా లేదు. వారం క్రితం వాళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ తాలూకు జ్ఞాపకాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఏ ఆలోచనా అతనికి ప్రశాంతతనివ్వడం లేదు. ఆమెకు సారీ చెప్పాలని తెలుసు. కానీ ఎలా చెప్పాలా అని రకరకాల మాటలను మనసులోనే అనుకుంటున్నాడు. ఏదీ సరిగ్గా అనిపించడం లేదు. తను అనుకుంటున్న మాటలన్నీ ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునే ప్రయత్నం లానే అనిపిస్తున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ అతనిలో ఆందోళన పెరిగిపోతోంది. ఇద్దరి మధ్య ఏర్పడ్డ అగాధాన్ని పూడ్చాలని ఉన్నా, తన మాటలు ఎక్కడ పరిస్థితిని మరింత దెబ్బతీస్తాయో అన్న భయం అతడిని చికాకుపెడుతోంది.
కావేరి వచ్చింది. ఆమె ముఖం చాలా అలసిపోయినట్టుగా ఉంది. వాళ్లిద్దరి మధ్య ఇంకా తేలని ఆ గొడవ తాలూకు ఒత్తిడి ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ క్లుప్తంగా, ఏదో మొహమాటానికి పలకరించుకున్నారు. పెరిగిపోయిన ఆ దూరాన్ని ఎలా తగ్గించాలో ఇద్దరికీ అర్థం కావట్లేదు. కాసేపు అక్కడ నిశ్శబ్దం కాలం గడిపాక, జస్వంత్ మొదట మాట్లాడాడు. ఆ రోజు జరిగిన గొడవలో అన్న మాటలకు క్షమాపణ చెబుతూ, తను ప్రవర్తించిన తీరు సరైంది కాదని ఒప్పుకున్నాడు. కావేరి ఏమాత్రం అడ్డు చెప్పకుండా అతను చెప్పేదంతా వినింది. కానీ ఆమె మనసులో ఏమనుకుంటోందో ఆమె ముఖంలో కనపడనీయలేదు. అది అతడిని మరింత కలవరపెట్టింది. మరో రెండు నిముషాల మౌనం తరువాత ఆమె మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఆ గొంతు ప్రశాంతంగా ఉన్నా, అందులో స్పష్టత ఉందని అతనికి అర్థమైంది. వీటన్నింటి గురించి ఆలోచించడానికి తనకు మరికొంత సమయం కావాలని, ప్రస్తుతానికి తన మనసులో ఏముందో తాను కూడా తెలుసుకోలేకపోతున్నానని ఆమె చెప్పింది.
జస్వంత్ భారంగా తల ఊపాడు. ఆమె స్పందన అతడిని నిరాశపరిచినప్పటికీ, ఆమెకు కావాల్సిన సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. క్షమించాను అని చెప్తుందని, ఆమెను దగ్గరకు తీసుకుని ఒక ముద్దు పెట్టి మళ్లీ క్షమాపణ చెప్పాలని ఆశపడ్డ అతడికి నిరాశే మిగిలింది. అయినా ఆమె నిజాయితీని గౌరవించి, అంతకంటే ఎక్కువగా ఆమెను బలవంతం చేయలేదు. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చుండిపోయారు. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు. చివరికు కావేరి లేచి బై చెప్పి వెళ్లిపోతున్నప్పుడు, ఆమె లేకపోతే ఉండే వెలితి అతడిని కమ్మేసింది. ఈ సంభాషణతో సమస్య పూర్తిగా సర్దుమణగకపోయినా, ఏదో ఒక మార్పుకైతే పునాది పడిందని అతడికి అర్థమైంది — అది మళ్ళీ దగ్గరవ్వడమా లేక శాశ్వతంగా దూరమవ్వడమా అనేది కాలమే నిర్ణయించాలి.>>
మీరు ఇప్పుడు చదివినది భావోద్వేగపూరితమైన ఒక సన్నివేశం అని మీకు నేను చెప్పక్కర్లేదు. పైకి చాలా స్పష్టంగా, ఒక క్రమపద్ధతిలో రాసినట్లు కనిపిస్తోంది. కథ ఏమిటో, ఆ కథలో ఉన్న పాత్రల ఉద్దేశాలేమిటో కూడా పాఠకులకు బాగానే అర్థమౌతోంది. అంతటి సరిపోతుందా? సరిపోతుంది కదా అని మీకు అనిపి స్తే ఇదే కథలో వచ్చే తరువాత వాక్యం చదవండి –
<<కానిస్టేబుల్ వచ్చి “ములాఖాత్ టైమ్ అయిపోయింది” అని ప్రకటించేదాకా జస్వంత్ అలాగే కావేరి వెళ్లిన దారి వైపే చూస్తూ ఉండిపోయాడు. తరువాత లేచి అక్కడ్నుంచి కదిలాడు.>>
ఆశ్చర్యంగా అనిపించింది కదా? ఇదంతా జరిగింది జైల్లోనా అని అనుకున్నారా? ఎందుకు? ఎందుకంటే ఈ కథ చదువుతున్నప్పుడు బహుశా మీరు ఆ ఇద్దరినీ ఏదైనా ఒక రెస్టారెంట్‌లోనో, కాలేజీ క్యాంటీన్‌లోనో ఊహించుకోని ఉంటారు. లేదా లివింగ్ రూమ్‌లో సోఫాలో కూర్చుని మాట్లాడుతున్నారని అనుకుని ఉంటారు. ఇప్పుడు నేను ఇదంతా జరిగింది జైల్లో అనగానే పాఠకుడిగా మీకు కలిగిన ఆశ్చర్యాన్ని పక్కనపెట్టి దాంతోపాటు మీకు కలిగిన చిన్న అసౌకర్యాన్ని గుర్తించండి. మొదట మీరు ఊహించిన సెట్టింగ్ మనసులో నుంచి తుడిచేసి, కొత్త సెట్టింగ్‌లో అవే పాత్రలని, అదే సంభాషణని ఊహించుకోవాలి. దీని వల్ల ఒక్కోసారి పాఠకులకి ఆసక్తి పెరిగినా, చాలాసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది. నవల లాంటి ప్రక్రియలో (అందులో ఉండే నూట యాభై, రెండు వందల పేజీల జాగా వల్ల) ఇలాంటి నరేషన్ ఒక టెక్నిక్‌లా, పాఠకులలో ఆసక్తి పెంచడానికి బాగా పని చేస్తుంది. (కానీ అదే పుస్తకంలో ఇదే టెక్నిక్ తరచుగా వాడితే పాఠకులకి రచయిత మీద నమ్మకంపోయే ప్రమాదం కూడా ఉంది.) ఏది ఏమైనా, కథ లాంటి షార్ట్ ఫిక్షన్ ప్రక్రియలలో ఇలాంటి టెక్నిక్ వాడకపోవటమే మేలు. కాదని చేస్తే పాఠకులు దానిని రచయిత సామర్థ్యలోపంగా చూసే ప్రమాదం ఉంది. ఇప్పటిదాకా ఈ కథ జరిగింది జైల్లో తెలుసా అని చెప్పగానే “మోసం గురూ” అనే అవకాశం ఉంది. (Exceptions ఉంటాయి. అలాంటి revelation ని ట్విస్ట్‌గా వాడిన కథలు ఉన్నాయి. అలాంటి కథల్లో పాఠకులు “మోసం గురూ” అనకుండా “భలే మోసం చేశావ్ గురూ” అంటారు. ఉదాహరణకి అనిల్ ఎస్ రాయల్ రాసిన శిక్ష అనే కథ చదవండి)
చెప్పొచ్చేదేమిటంటే పాఠకులు ఊహించుకుంటున్న సన్నివేశాన్ని ఉన్నట్టుండి మార్చేసి, కొత్త సెట్టింగ్‌లోకి తీసుకెళ్తే, అది పాఠకుల పఠనానుభూతిని చెడగొట్టే ప్రమాదం ఉంది. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఇదే కథకి కొనసాగింపుగా వచ్చే మరో వాక్యం చూడండి.
<<కావేరి తన జైలు గదిలోకి అడుగుపెడుతూనే భోరున ఏడ్చేసింది. ఏడేళ్ల శిక్షలో ఎన్నిరోజులు గడిచాయో ఆమె లెక్కపెట్టడం మానేసి చాలా రోజులైంది. కానీ జస్వంత్‌తో గొడవ జరిగిన తరువాత గడిచిన ప్రతి క్షణాన్ని ఆమె లెక్కపెట్టుకుంటోంది.>>
సరే, మన టాపిక్ నుంచి కాస్త దారి తప్పాం. మళ్లీ మీజాన్-సెన్ దార్లోకి వద్దాం. ఈ కథలో పాత్రలు, వాళ్ల మధ్య జరిగిన సంభాషణ, సన్నివేశం అన్నీ బాగానే ఉన్నా, ఇందులో లోపించిన ముఖ్యమైన అంశం ‘స్టేజింగ్’ (Staging). ఇంతకు ముందు స్థలకాలాల విషయాలు చెప్తూ నేను చెప్పిన ఇంద్రియ అనుభవాన్ని ఇచ్చే అంశాలను ఒక పద్ధతి ప్రకారం చేర్చి, ఆ సన్నివేశాన్ని పాఠకులకు ఒక అనుభవంగా మార్చడం ఇక్కడ జరగలేదు. ఈ సన్నివేశాన్ని కేవలం ‘చెప్పడం’ (Telling) స్థాయిలోనే ఉండి, సరిగ్గా రచయిత అనుకున్నట్లుగా సన్నివేశాన్ని పాఠకులు తమ ఊహల్లో కల్పించుకునేలా ‘దర్శకత్వం’ (Direction) స్థాయికి చేరలేదు.
అలా పాఠకులని ప్రేక్షకులగా మార్చే మీజాన్-సెన్‌లోని పది అంశాలను తీసుకుని, మూడు భాగాలుగా వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం మనం. ఈ వ్యాసం మొదట్లో చెప్పిన బిర్యానీ ఉదాహరణలో ఒక్కొక్క igredient ఎలాంటి నాణ్యత కలిగి ఉండాలి, ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలుసుకోవడం లాంటిదే ఇది. మరి మొదలుపెడదామా?
- నేపథ్యాన్ని, అందులో ఉండే వస్తువులను వాడటం
పైన మీరు చదివిన కథలో అది ఎక్కడ జరుగుతోందో చెప్పలేదు. ఇది ఒక లోపమైతే, కొంతమంది రచయితలు తమ కథలలో కథ ఎక్కడ జరుగుతోందో చెప్తారు కానీ అక్కడ జరుగుతున్న అనుభూతిని ఇవ్వడంలో విఫలమౌతారు. ఉదాహరణకి –
<<స్కూల్ నుంచి వస్తూనే “అమ్మా” అని అరుస్తూ వంటింట్లోకి పరుగెత్తాడా పిల్లాడు.>>
ఇలా మొదలుపెట్టి ఆ పిల్లాడికి, వాళ్లమ్మకి జరిగే సంభాషణ రాసుకుంటూ వెళ్తారు. ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు అది వంటిల్లు అనిపించేలా అక్కడ ఉన్న వస్తువుల గురించి చెప్పరు. ఆ పాత్రలు ఆ వస్తువల్తో interact అవ్వడం లాంటివి చెయ్యరు. పిల్లాడు అమ్మతో మాట్లాడుతుంటే ఆ కిచెన్‌లో ఏమేమి జరగచ్చు?
<<“ఏంటి నాన్నా? ఈ రోజు క్లాస్ టెస్ట్ బాగా రాశావా?” అని అడిగింది అమ్మ పిండి కలుపుతూ. “రాశానమ్మా” అని స్కూల్ సంగతులన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. చెప్తున్నంతసేపు నిముషానికి ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి కేరెట్ ముక్కో, టమాటోనో తీసుకోని తినేస్తున్నాడు. వాడి కబుర్లు వింటూ, మధ్య మధ్యలో అవన్నీ తినద్దని మందలిస్తూనే చక్రాలు చేసేసింది అమ్మ.>>
కథ నడుస్తోంది కానీ అది ఎక్కడ జరుగుతోందో అక్కడ ఉండే వస్తువులను పాత్రలు వాడుతున్నాయి. పదే పదే వాళ్లు కిచెన్‌లో ఉన్నారు అనే విషయం ప్రకటించినట్లు కాకున్నా పాఠకుల మనసులో ముద్ర పడేలా కథ నడుస్తోంది. వాటన్నింటికన్నా ముఖ్యం ఆ కథ అత్యంత సహజంగా, కళ్ల ముందు నడుస్తున్నట్లే ఉంటుంది. ఇలాంటి కథనం వల్ల కలిగే రెండు ఉపయోగాలు చెప్తాను –
మొదటిది సంభాషణలు, ఏక్షన్ కలిసి నడుస్తాయి. కొన్ని కథల్లో కేవలం రెండు పాత్రల మధ్య సంభాషణ మాత్రమే నడుస్తుంటుంది. అది ఎలాంటి సంభాషణ అయినా, వాదన అయినా పాఠకులకి తోందరగా బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ సంభాషణ నడుపుతున్న పాత్రలు వాళ్లు ఉన్న సెట్టింగ్‌లో ఉన్న వస్తువులతో interact అవుతూ సంభాషణ జరిపితే ఆ సన్నివేశం బోర్ కొట్టదు.
<<“ఎన్నైనా చెప్పు. దేవుడు లేడు కాక లేడు ” ఇరానీ చాయ్ సాసర్లో ఒంపుకుంటూ అన్నాడు వైద్య. కేఫ్ అంతా గోల గోలగా ఉంది. అతని ఎదురుగా ఉన్న శ్రీను నవ్వి “నువ్వు ఉన్నాడంటే నీకు ఉంటాడు. లేడు అంటే నీకు లేడు” అన్నాడు. అతని పక్కనే ఉన్న రాజేష్ మాత్రం టేబుల్ మీద్ ఉన్న ఖాళీ స్టీల్ గ్లాస్‌ని గుండ్రంగా తిప్పుతున్నాడు. అతని లోపల కోపం కూడా అలాగే సుడులు తిరుగుతోంది.>>
పై సన్నివేశం చూశారా? ఇందులో నేను చెప్తానన్న రెండో ఉపయోగం కూడా ఉంది. ఆ సంఘటన జరుగుతున్న సెట్టింగ్‌లో ఉన్న వస్తువులను, వాటితో పాత్ర interactionని చూపించేటప్పుడు ఆ కథకి సంబంధించిన భావానికి connect చేసి మాట్లాడే అవకాశం వస్తుంది. అది ఒక శైలిలా మారి పాఠకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పైన ఇచ్చిన ఇరానీ కేఫ్ ఉదాహరణలో గ్లాస్ తిప్పడం – కోపం సుడులు తిరగటంతో పోల్చబడింది. ఇలాగే విడాకులు తీసుకోవాలనుకుంటున్న భార్య భర్త మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఎదురుగా పగుళ్లు ఇచ్చిన కప్పు ఉండచ్చు, వాడిపోయిన మొక్క ఉండచ్చు, గోడపైన పెళ్లి ఫోటో వంకరగా ఉండచ్చు. ఇవన్నీ ఆ సన్నివేశాన్ని దృశ్యంగా మారుస్తాయి. అదే సన్నివేశంలో ఒక పాత్ర వంకరగా ఉన్న ఫోటో ఫ్రేమ్‌ను సరి చెయ్యబోయి, మళ్లీ అలాగే వదిలేస్తే, ఆ పాత్ర మనసులో ఉన్న ఉద్దేశ్యమేమిటో పాఠకులకి అర్థమౌతుంది.
మీరు గమనించండి. చాలా హాలీవుడ్ సినిమాలలో ఏక్షన్ సన్నివేశాలలో, ముఖ్యంగా కార్ ఛేజ్ నడుస్తున్నప్పుడు పాత్రల మధ్య సంభాషణ నడుస్తుంటుంది. ఆ సంభాషణ కూడా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది కాకుండా సినిమాకి కీలకమైన ట్విస్ట్‌కి సంబంధించిన అంశమో, ఆ కార్లో హీరో హీరోయిన్ ఉంటే వాళ్ల మధ్య రొమాంటిక్ సంభాషణో జరుగుతుంది. ఎందుకు? ఒక సన్నివేశాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ సన్నివేశం కథకి కనీసం రెండు రకాలుగా ఉపయోగపడాలి అని సినిమా గ్రామర్ పండితులు చెప్తారు. ఇది చెయ్యాలంటే పాత్రలు మాట్లాడుతున్నది మాత్రమే చెప్తే సరిపోదు, పాత్రలు ఎక్కడ ఉన్నాయో, అక్కడ ఆ పాత్రలు ఏం చేస్తున్నాయో చెప్పడం చాలా అవసరం.
మరో తొమ్మిది అంశాలు మళ్లీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం…
*








చాలా బాగా వివరిస్తున్నారు , నోట్లో పెట్టుకోగానే కరిగిపోతోంది
మిగతా అంశాల కోసం ఎదురు చూస్తున్నాను .
చెప్పిన పద్ధతి బావుంది. నాటకీయం గా ఉంది. మేము నాటకాల్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం