​ ఓటమికి లొంగని పాదముద్ర

కవిత వాచ్యం కాకుండా ఉండడానికి కవి హృదయంలోనే భావం రూపు దాల్చాలి. ఆ కవిత పాఠకుల హృదయాలను స్పందింపజేయగలగాలి.

మునపటి వ్యాసాల్లో మనం కవితా అభివ్యక్తి గురించీ, కవిత్వంలోని కొన్ని విశిష్టతల గురించీ మాట్లాడుకున్నాం. ఈసారి కవిత్వానికి సంబంధించిన కొన్ని పనిముట్ల గురించి, అంటే కవిత్వం రాయడానికి ఉపకరించే సాధనాల గురించి మాట్లాడుకుందాం. అందులో ప్రధానమైనవి కొన్ని ఇప్పుడు మనం ఇక్కడ చర్చకు తీసుకుందాం.

ఒక భావాన్ని దృశ్యమానం చేయడం ఎలా అనేది కవి ఆలోచించే ఒక విషయం. దీన్నే మనం ఇంకొంచెం సులభంగా ఆంగ్లంలో కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే ఇమేజరీ అంటాం. అక్షరాలతోటి, పదాలతోటి ఒక దృశ్యాన్ని చిత్రించడం అన్నమాట. ఇది కవిత్వానికి ఆయువు పట్టు.

​అలాగే కవిత్వం ఎప్పుడూ సరళంగా ఉండదు. సరళంగా ఉండే కవిత్వాలు కూడా ఉండవచ్చు కానీ కవిత్వం ముఖ్య ఉద్దేశ్యం కవి భావాన్ని చెప్పడం. కవి భావం అనగానే భావానికి భాషకు మధ్య ఒక అంతరం ఉంటుంది. భాష అందుకోలేని భావాలు కవి హృదయంలో కదలాడుతుంటాయి. అలాంటి భావాలని వ్యక్తపరచడానికి కవి ప్రతీకాత్మకంగా కవిత్వం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్నే సింబాలిజం అనవచ్చు. ఇక్కడ కవి తను అక్షరాల్లో రాసి కనపరిచిన భావాల కన్నా గాఢమైన భావాలు ఇంకా ఏవో కవిత్వంలో ఉంటాయి. వాటిని పాఠకులు పట్టుకొని ఆ కవితను చదివి అంచనా వేసే ప్రయత్నం చేస్తారు.

​అలాగే కవికి కవి కాలం లేదా కవి సమయం అని ఒకటి అంటూ ఉంటాం. ఈ కవి కాలం లేదా కవి సమయం అనేది కవి మూడ్‌ని ప్రతిబింబించేదిగా ఉంటుంది. ఈ కవి మూడ్ లేదా కవి ఆలోచన పాఠకుల ఆలోచనతో మమేకమైనప్పుడు కవిత్వం ఒక అద్భుతంగా మారుతుంది. దీనికి కవి చేయాల్సిందేమిటి అంటే తను చెప్పదలచుకున్న కవిత్వానికి సరైన మూడ్‌ని ఎన్నుకోవడం. ఇది ఆ కవిత్వ ఉద్దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక కవి ప్రేమ కవిత్వం చెప్పినప్పుడు ఆ ప్రేమకు సంబంధించిన సున్నితమైన అంశాలేమిటో ఆ కవితలో ఉండాలి. అలాగే బాధను గురించి చెప్పినప్పుడు పాఠకుల మదిలో తన బాధ రిసోనేట్ కావాలి. ఇలాంటి మూడ్ ఒకటి కవిత్వంలో ఉత్సుకతను క్రియేట్ చేయగలుగుతుంది.

​అలాగే కవిత్వం ఇంకా కొన్ని పనులు చేస్తుంది. అవేంటంటే కవి తన కవిత రాస్తున్నప్పుడు ప్రపంచంలో తను చూసింది, ప్రపంచంలో తను చూడాలనుకున్నది రెండు విషయాలను చెప్తారు. తను చూసిన విషయాలని ప్రతీకాత్మకంగా, భావాత్మకంగా కవి చెప్పినప్పటికీ తను చూడాలనుకుంటున్న విషయాలని, తను కలగంటున్న విషయాలని కూడా కవి ఆ కవిత్వంలో చెప్తారు. అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఒక  సూచన కూడా ఆ కవిత్వంలో ఉండవచ్చు. ఇలాంటి విషయాలని కవులు ఎలా చెప్తారు అనేది మనం కవితల్లో ఉదాహరణలుగా చూడవచ్చు. చాలా కవితలు అట్లాంటి ఉదాహరణలతోటి మనకు కనబడతాయి. కవితని ప్రతీకాత్మకంగా చెప్పడం అనే ఒక భావన ఆ కవితని తాదాత్మ్య స్థితికి తీసుకుపోయేదానికి ఉపకరిస్తుంది. ఆ కవి తాదాత్మ్యతను ఎలా సాధిస్తారు అనేది కవితలో తను ఎన్నుకున్న మూడ్‌ను బట్టి, కవితలోని విషయాన్ని బట్టి, కవి తను క్రియేట్ చేసుకుంటున్న దృశ్యాలను  బట్టి కూడా మారే అవకాశం ఉంటుంది. మనం ఉదాహరణకి ఈ క్రింది కవిత చూస్తే ఈ కవితలో కవి తను చూసిన ఒక దృశ్యాన్ని కవిత్వంలో చెప్పే వైనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కవి తన హృదయంలో కదలాడుతున్న భావాలను కూడా ఆ కవిత ద్వారా ఎలా చెప్పారో మనం చూడవచ్చు.

జాతర

సందర్భాలదేముంది?

చిలకల గుట్ట అడవి నుండి కుంకుమ భరిణెలా…వస్తాయి, పోతాయి

ఆచారంగానో,అధికారికంగానో ఆడంబరంగానో,నిరాడంబరంగానో

రాకపోకలన్నీ అప్రయత్నంగానే జరిగిపోతాయి

ఎవరో మంత్రించినట్టు కొన్ని రూపాలు

కాస్త పసుపు కాస్త కుంకుమ రంగులో మెరిసిపోతాయి

ఒకానొక కాలాన పగిడిద్దెరాజును బలిచ్చినట్టు జంపన్నను బలిచ్చినట్టు

సమ్మక్క,సారలమ్మను బలిచ్చినట్టు

తీరని కోర్కెల జలదరింపుల మధ్య  మూగజీవాల్ని ఎగరేసి బలిస్తారు

అమ్మలు ఆవహించి మైదానం పూనకమై ఊగిపోతుంది

అంతా ఐపోయాక

ఎవరికి వాళ్ళు మళ్ళీ పాత ముఖాలు ధరించి వెళ్ళిపోతారు

రాళ్ళ దెబ్బలకు సొమ్మసిల్లిన గద్దెలు

కూల్చేసిన స్మారక స్థూపాల్లా గాయాల్ని తడుముకుంటాయి

అంతా ఐపోయాక  పొగచూరిన ఊరు

కుళ్ళు కంపుతో అడవి  ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతుంది

(కవి:  విద్యాసాగర్ పొల్లా fb గోడ 28.01.2026)

“పై కవితలో కవి విద్యాసాగర్ సమ్మక్క సారలమ్మ జాతర గురించి వర్ణించేటప్పుడు జాతర దృశ్యాలను, జాతర పట్ల తన అనుభూతులను ఎలా చెప్పాడో మనం చూడవచ్చు. జాతరనూ జాతరలో జరిగే దృశ్యాలనూ తన అక్షరాలతో చిత్రిస్తూనే కవి జాతర అనంతర పర్యావరణ విధ్వంస విషాదాన్ని కళ్ళముందుంచారు. తను చూడాలనుకుంటున్న భవిష్యత్తును కూడా కవి తన భావాల రూపంలో వ్యక్త పరిచారు.  కవితలోని చివరి నాలుగు పాదాలతో కవి మనసులోని భావాలను యింకా విస్తృతంగా పాఠకులముందు ఉంచుతున్నారు.

కవిత్వంలో ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు, అనేక ప్రాంతాలలో అనేక రూపాల్లో కవిత్వానికి సంబంధించిన భావం దాదాపుగా ఇలాగే వ్యక్తమవుతూ ఉంటుంది. కవి విద్యాసాగర్ అనువాదం చేసిన ఈ క్రింది వెనిజులా కవితను ఒకసారి మనం చూద్దాం.

గాయపు గుర్తు

జ్ఞాపకాల చీకటి గుహలో శూన్యాన్ని ధిక్కరిస్తూ ఓటమికి లొంగని ఒక పాదముద్ర మొలిచింది

అది శీతాకాలపు తుఫానులచే దిక్సూచించిన కాంతి సింహాసనం!

 

అది గతం ఆనవాలు

అది స్వీయ మార్గాన్ని ఎంచుకుంది

ఆ తప్పులు ఒకప్పుడు తమ నీడల దారంతో గుండెల్ని చీల్చుకున్నాయి

అవిప్పుడు రక్తస్రావాన్ని ఆపేశాయి!

 

కాలం ఒక నిశ్శబ్ద శిల్పి

అది చర్మంపై   ప్రతిస్పందనను చెక్కింది

ఒకప్పటి ఆ గాయపు గుర్తు ఇప్పుడు కళంకం కాదు

అదిప్పుడు అగాధంలో వెలిగే  దీపం, భిన్నమైన పాద ముద్రలతో నిండిన భవిష్యత్ చిత్రపటం!

 

ఆ గాయపు గుర్తును మోసే రాయిలా కాదు, ఒక వంతెనలా చూద్దాం

నొప్పి జ్ఞానంగా మారే భాష అది,  జీవితాంతం చదవటం నేర్పే వర్ణమాల!

 

ఇంగ్లీష్ మూలం… సీజర్ అరిస్మెండి (వెనిజులా )

స్వేచ్ఛానువాదం…. విద్యాసాగర్ పొల్లా fb గోడ 20.01.2026)

​పై కవితలో విద్యాసాగర్ తను కవితా మకుటానికి పెట్టినట్టు ‘గాయపు గుర్తు’. ఈ గాయపు గుర్తు ఏమిటి? ఒక గాయం మనిషిని ఎలా ఒక భావుకుడిని చేస్తుంది? ఒక కవిని ఎలా ఒక భావుకుడిని చేస్తుంది? ఆ కవి తన బాధను తన ఆకాంక్షల్ని కవిత్వం రూపంలో ఎలా వ్యక్తీకరిస్తాడు అనేది మనం ఈ కవిత ద్వారా చూడవచ్చు. ఓటమికి లొంగని ఒక పాదముద్ర గాయపు గుర్తు ఏమి చెయ్యగలదో ఊహించిన వెనిజులా కవి “అదిప్పుడు అగాధంలో వెలిగే  దీపం, భిన్నమైన పాద ముద్రలతో నిండిన భవిష్యత్ చిత్రపటం” అంటూ ఒక ఆశావహ దృక్పథాన్ని ప్రకటిస్తున్నారు. నొప్పి జ్ఞానంగా మారే బాష అది” అంటూ అనుభవాలు ఇచ్చే జ్ఞానం భవిష్యత్తు దీపాన్ని వెలిగించే వైనం, ఆ దీపపు వెలుగులో గాయపడ్డ వారు నడుస్తారన్న ఆకాంక్ష కనబరుస్తారు. కవి బలంగా చెప్పిన ఈ అంశాన్ని అనువాదకుడైన కవికూడా చక్కగా తెనిగించారు.

పైన మనం ఉదహరించిన రెండు కవితలు కవి మూడ్‌ని, ఇమేజరీని, కవి భవిష్యత్ దర్శనాన్ని చిత్రించాయి అని చెప్పుకోవడానికి మనకు సందేహం అక్కర్లేదు.

కవిత వాచ్యం కాకుండా ఉండడానికి కవి హృదయంలోనే భావం రూపు దాల్చాలి. ఆ కవిత పాఠకుల హృదయాలను స్పందింపజేయగలగాలి.

*

చిత్రం: ముత్యాల రావు

చంద్రశేఖర్ కర్నూలు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు