కొసరాజు పాటలకు చంద్రహాస్ భాష్యం

చంద్రహాస్‌గారి ఈ వ్యాససంహిత చదవడానికి పుర్వం నాకు తెలియాల్సిన విషయాలు ఎన్ని తెలియదో ఇప్పుడు తెలిసింది. ఈ పుస్తకం కేవలం కొసరాజు పాటల విషయమే కాదు, ఇది చదివినవారికి ఈ రచయిత ఎంత శ్రమ పడినదీ కూడా తెలుస్తుంది. ఈయన పరిశోధన శ్రమతో కూడుకున్నది.

కొసరాజు రాఘవయ్య చౌదరి (1905-1986) అంటే ఎంతమంది గుర్తుపట్టగలరోగానీ కొసరాజు అంటే మాత్రం “రోజులు మారాయి” సినిమాలోని పాట “ఏరువాక సాగారో…” రాసిన సినీగేయకవిగా అందరూ గుర్తుపడతారు. అది ఆ కవి గొప్పతనం. కొసరాజు ఎక్కడివారు ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఏమేం రాశారు అన్న ప్రశ్నలకు సమాధానాలు సేకరించడం నిన్న మొన్నటి దాకా కష్టసాధ్యంగా ఉండేది. ప్రతి కవికీ ఒక అభిమాన పాఠకుడొకడుంటాడని అంటారు. శ్రీశ్రీకి చలసాని ప్రసాద్ లాగ కొసరాజుకి మద్దుకూరి విజయ చంద్రహాస్‌గారు ఉన్నారు. ఈ అభిమాన పాఠకులు నిజానికి ఎంతో శ్రమించే గుణం ఉన్నవారు. ఈ శ్రమే, ఈ Love’s labour, ఎంతో అరుదైనది, ఎంతో ఫలవంతమైనదీనూ. గౌరవాభిమానాలతో కష్టపడితే ఆ కష్టం తప్పక ఫలిస్తుంది. చంద్రహాస్‌గారు నాలుగేళ్ళు శ్రమించి కొసరాజు పాటలనన్నింటినీ తవ్వి తీసి వాటి వెనకున్న చరిత్రనూ సందర్భాలనూ వివరిస్తూ ఈ వ్యాససంహితను రాశారు.

కొసరాజు పనిగట్టుకొని సినీకవిగా స్థిరపడలేదు. సినీగీతాలకి ముందు ఆయన పద్య సంకలనాలు కొన్నిరాశారు. ఒకందుకు మద్రాసు వెళితే జీవితం మలుపు తిరిగి, సినీపరిశ్రమ పెద్దల ఆహ్వానం మేరకు కొన్ని పాటలు రాసి అవి విజయవంతమవడంతో సినీకవిగా స్థిరపడ్డారు. Serendip! అంతా మన మంచికే! ఇందులో చంద్రహాస్‌గారు తమ సునిశితమైన పరిశీలనతో, విశ్లేషణతో చెప్పిన సంగతులెన్నో ఉన్నాయి. కొసరాజు పాటలు ప్రధానంగా హాస్యం కోసమూ వ్యంగ్యం కోసమూ పెట్టుకొనేవారు నిర్మాతలూ దర్శకులూ. ఆయన పాటల్లో ముప్పాతిక మువ్వీసం సహాయ నటీ నటుల మీదనే చిత్రీకరించడం జరిగింది. సినిమా ప్రధాన కథకు sidelight అనదగ్గ విషయమే ఆ పాటల్లో ఉండేది. ఇందువల్ల ఆయన్ను చాలామంది కామెడీ కవిగానే చూసి ఉన్నందువల్ల ఆయనకు రాదగ్గ గుర్తింపు రాలేదని వాపోయారు రచయిత. అయితే, పాటలు విని అనుభూతి చెంది ఆలోచించే సహృదయులంతా ఆయన ప్రతిభను గుర్తించినవారే. ఇవాళ్టికీ ఆయన పాటలు మనకు ఎన్నో గుర్తున్నాయంటే, అది ఆ పాటల్లో విషయమూ, ఆ పాటలు  రాసిన పద్ధతి గొప్పవి కనుకనే. ఉదాహరణకు సంపూర్ణ రామాయణం సినిమాలో గుహుడి పాట “రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ”లోని ఆఖరి చరణం, “అందరినీ దరిజేర్చు మారాజువే/అద్దరినీ జేర్చమని అడుగుతుండావే/నువు దాటలేక కాదులే రామయ తండ్రీ/మము దయజూడగ వచ్చావు రామయతండ్రీ” అన్న వాక్యాల్లో లోతూ తత్త్వం ఎవర్నీ దాటి పోవు.

చంద్రహాస్‌గారి ఈ వ్యాససంహిత చదవడానికి పుర్వం నాకు తెలియాల్సిన విషయాలు ఎన్ని తెలియదో ఇప్పుడు తెలిసింది. ఈ పుస్తకం కేవలం కొసరాజు పాటల విషయమే కాదు, ఇది చదివినవారికి ఈ రచయిత ఎంత శ్రమ పడినదీ కూడా తెలుస్తుంది. ఈయన పరిశోధన శ్రమతో కూడుకున్నది. చంద్రహాస్‌గారి Research Methodology, అనుశీలన పాఠకులను అబ్బురపరచడమే కాక అవసరపడతాయి కూడా. ఉదాహరణకు పాతరోజుల్లో పాటకు సినిమా కథకూ సంబంధం ఎంతో కనిపించేది (ఇప్పుడైతే ఏ పాటనైనా ఏ సినిమాలోనైన ఎక్కడైనా copy & paste చేసి చూపించొచ్చు, అలా తయారయ్యాయి మన సినీగీతాలు), శకుంతల అన్న సినిమాలో కొసరాజు రాసిన పాటలో “ఏరు పోటు మీద ఉన్నది” అన్న వాక్యాన్ని శకుంతలకు రాబోయే కష్టాలను సూచిస్తోందని కనిపెట్టారు చంద్రహాస్. ఇంకోటి, “అప్పన తన మన” అన్న లైనుకు చక్కటి వివరణ ఇచ్చారు, చంద్రహాస్. చంద్రహాస్‌గారికి సాహిత్యం పట్లా, కవిత్వం పట్లా ఆసక్తీ అభినివేశమూ మెండుగా ఉండడం వల్ల ఈ పరిశోధన చక్కగా సాగింది. ఈ గ్రంథానికి లోతు చేకూరింది. ఈ పరిశోధన కొసరాజు సినీసాహితికే పరిమితం చేశారు చంద్రహాస్‌గారు. ఆయన ఇంకాస్త పూనుకొని కొసరాజు సమగ్ర లభ్య రచనలపై దృష్టి సారించి ఇంకో పుస్తకం రాయాలని ఆశిద్దాం, అభ్యర్థిద్దాం.

*

వాసు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు