ఎరుకల బతుకుల గురించి కొత్త ఎరుక

రాయలసీమ ప్రాంతంలోనే కాక తెలుగు కథకులు ఎరుకల జీవితాన్ని సాహిత్యకారులు అక్కడక్కడ రాసి ఉండవచ్చేమో కానీ ప్రత్యేకంగా సంపుటిగా రావడం, ఎరుకల బతుకుల గూర్చి మాట్లాడటం ఇదే. ఎరుకల జీవితాలకు సంబంధించి ఎరుకల పేరుతో మాస పత్రిక ప్రచురించినట్లు కవిత్వము, పాటలు, పద్యాలు, జోల పాటలు, ఎరుకల ప్రశంస వచ్చినట్లు బాలాజీ ఈ సంపుటిలో చాయా చిత్రాలుగా పెట్టుకున్నారు.

తెలుగు సాహిత్య వికాసానికి రాయలసీమ ప్రాంతం అందించిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంతా కాదు. ఈ శీర్షికలో ఆ విషయాలను చర్చిస్తున్న సంగతి తెలిసిందే. వైవిద్యమైన సాహిత్య సంగతులతో లోతైన చర్చ ఈ శీర్షికలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు రచయితలు పట్టుకోని, రాయని జీవితాలు ఎరుకల జీవితాలు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన కవి, కథకులు పలమనేరు బాలాజీ ఎరుకల జీవితాలను గూర్చి మాట్లాడాడు. ఎరుకల కథల సంపుటి తీసుకువచ్చి రాయలసీమ ప్రాంతం నుండి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అధ్యాయాన్ని లిఖించారు పలమనేరు బాలాజీ.
ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు పేరుతో వెలువడిన ఈ సంపుటి షెడ్యూల్డ్ తెగల జాబితాలో వున్న ఎరుకల జీవితాలకు సంబంధించిన కథలు. ఈ కథలన్నీ ఎరుకల బతుకులకు ప్రాణ ప్రతిష్ట చేశాయి. రాయలసీమ పల్లెల్లో ఎంతో దయనీయమైన స్థితిలో జీవించే ఎరుకల జీవితాలను బాలాజీ 18 కథలు రాశారు. బహుశా  తెలుగు సాహిత్యంలో ఇది మొదటి ఎరుకల కథా సంపుటి. రాయలసీమలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎరుకల జీవితాలపై వచ్చిన సంపుటి ఇది. ఇది  చిన్న ప్రయత్నం అని చెప్పలేం..ఈ ప్రయత్నం  సాహిత్య చరిత్రలో సంచలనం అయింది. ఇవన్నీ చదివినప్పుడు ఇంకా ఇంకా ఎరుకల జీవితాలపై సమగ్రత రావాలేమో అనిపిస్తుంది.
ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలోనే ఎరుకల ప్రజల సమస్యలు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలోనే కాక తెలుగు కథకులు ఎరుకల జీవితాన్ని సాహిత్యకారులు అక్కడక్కడ రాసి ఉండవచ్చేమో కానీ ప్రత్యేకంగా సంపుటిగా రావడం, ఎరుకల బతుకుల గూర్చి మాట్లాడటం ఇదే. ఎరుకల జీవితాలకు సంబంధించి ఎరుకల పేరుతో మాస పత్రిక ప్రచురించినట్లు కవిత్వము, పాటలు, పద్యాలు, జోల పాటలు, ఎరుకల ప్రశంస వచ్చినట్లు బాలాజీ ఈ సంపుటిలో చాయా చిత్రాలుగా పెట్టుకున్నారు.
అంటే దాదాపుగా ఏడెనిమిది దశాబ్దాల క్రితమే ఎరుకల జీవితాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎరుకల ప్రజలు గిరిజన తెగల జాబితాలో ఉన్నప్పటికీ అటవీ ప్రాంతంలో జీవించరు. ఊళ్ళల్లోనే జీవిస్తారు. రాయలసీమ ప్రాంతంలోని ఎరుకలు అడవికి వెళ్లి ఈతమట్టలు తీసుకొచ్చి వాటిని శుభ్రపరచి, పొరకలు(చీపుర్లు) బుట్టలు, గంపలు ఊళ్ళల్లో తిరిగి తిరిగి  జీవనం సాగిస్తారు. అలాగే పందుల పెంపకం కూడా వీరి జీవనంలో భాగం. వీరిని సమాజం వివక్షగానే చూస్తుంది. దళితుల వలె వీరి వీధులు ఊరు చివరనే ఉంటాయి. వీరి పట్ల కూడా ఈ ఆధునిక సమాజం ఇప్పటికీ వివక్ష చూపిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎరుకల కుటుంబాల్లో సాంస్కృతిక జీవన వైవిధ్యాన్ని స్త్రీపురుష సంబంధాలను ఆవిష్కరించిన అరుణ ఎల్లి, నీలి అనే నవలలు వచ్చాయని ప్రముఖ విమర్శకులు ఏకే ప్రభాకర్ ఏకలవ్య కాలనీ ముందుమాటలో చెబుతారు.
అయితే రాయలసీమ ప్రాంతం నుండి మాత్రం ఎరుకల జీవితాలపై నవల మాత్రం వచ్చింది లేదనీ అనేక పరిశోధనల వల్ల అర్థం అవుతుంది. అణచివేయబడ్డ,  అణగారిన ప్రజల జీవితాన్ని చిత్రించాలంటే ఆ జీవితంలో భాగమైన వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ ఇతరులు రాసినా అది సానుభూతిగానే మిగిలిపోతుంది. ఎరుకలకు ఎరుకల భాష ఉంది. అది లిపిలేని భాష. 2014 -19 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న గిరిజన భాషలపై గొప్ప ప్రయోగం చేసింది.
ఈ విషయం తెలుగు సాహిత్యకారుల దృష్టిలోనికి రానిది. లిపి లేని అనేక గిరిజన భాషలైన ఆదివాసి, సుగాలి భాషలపై పాఠ్యపుస్తకాలను తయారు చేసింది. లిపి లేకుండా పాఠ్యపుస్తకాలు ఎలా  చేసిందని సందేహం రావచ్చు. సదరు భాషల ఉచ్చారణ ఆధారంగా తెలుగు రాత రాసి ఆ భాషలోనే ఉచ్చారణ తెలుగులో రాసి ప్రచురించింది. ఇది గొప్ప ప్రయోగం. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం తదితర కొండ జాతి భాషల పాఠ్యపుస్తకాలు ఒకటి రెండవ తరగతులకు ముద్రించి ఒక విద్యా సంవత్సరం మొత్తం అమలు చేసింది. ఆయా భాషలపై జిల్లాలను ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టులుగా ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని ఆ మండలం మొత్తం సదరు భాషలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి విద్యను బోధించే ప్రయత్నం చేసింది.
రాయలసీమలోని కర్నూలు అనంతపురం ప్రాంతంలో సుగాలి పాఠ్యపుస్తకాలు తయారయ్యాయి. సుగాలి భాషకు లిపి లేకపోయినా సుగాలి భాష ఉచ్చారణతో తెలుగులో పాఠ్యపుస్తకాలను ముద్రించింది. విద్యాశాఖ ఒక ఏడాది పాటు అమలు చేసి ఆపేసింది. ఈ క్రమంలో ఎరుకల భాష పై కూడా కొంత ప్రయత్నం చేసి ఉంటే ఒక దశాబ్ద కాలం క్రితమే ఎరుకల జీవితాలు సమాజానికి తెలిసేవి. ఇలా రాయలసీమ ప్రాంతం సాహిత్యంలో అనేక ప్రయోగాల శాలగా మారుతున్నది. ఏది ఏమైనా పలమనేరు బాలాజీ రాసిన ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు తెలుగు సాహిత్యంలో  ఎరుకల జీవితాలకు సంబంధించిన తొలి కథా సంపుటి చెప్పడంలో సందేహం లేదు.
*

కెంగార మోహన్

1 comment

Leave a Reply to Vankireddi Reddappa Reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాలాజీ గారు ఊరిని తనపేరులో బాగంగా చేసుకున్నారు. బాలాజీ అంటే సాహిత్య ప్రపంచంలో ఎవరికీ తెలీదు. అదే పలమనేరు బాలాజీ అంటే తెలియని వాళ్ళు అరుదు. ఏకలవ్య కాలనీ బాలాజీగా కొత్త పేరుతో పరిచయమై పోయారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు