ఓరుగల్లు తలచుకుంటే గుండె జల్లు!

విజయవాడ నుంచి ప్రమోషన్ పై వరంగల్లు ఆకాశవాణిలో1999 జనవరి పదకొండున చేరాను.ఇంతకుముందు చెప్పినట్లు ఎనభైల్లో  దేశవ్యాప్తంగా టెలివిజన్, రేడియో మాధ్యమాల విస్తరణ జరిగింది. దూరదర్శన్ కు low power & high power ట్రాన్స్మిటర్ లు వచ్చి చేరాయి.. రేడియోకి జిల్లాస్థాయిలో స్థానిక రేడియో స్టేషన్లు ఏర్పాటు చేశారు

1989,90,91సంవత్సరాలలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగూడెం, వరంగల్లు, నిజామాబాద్, కర్నూలు, అనంతపురం, తిరుపతి, మార్కాపురం పట్టణాల్లో ఆకాశవాణి కేంద్రాలొచ్చాయి.వీటి ప్రధాన లక్ష్యం స్థానిక జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయటం.దీనితోపాటు స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్నిస్తూ వారికి చేయూతగా నిలవటం..

అప్పటివరకు మీడియం వేవ్ పై వినిపించే ప్రసారాలు, ఎఫ్.ఎమ్.(frequency modulus) పద్ధతిలో వినిపించటం మొదలైంది.ఇందుకోసం రేడియో తయారుచేసే కంపెనీలు ఎఫ్.ఎమ్. బ్యాండ్ అదనంగా కలిగుండటం మొదలయింది.

అలా వరంగల్ స్టేషన్ 1990ఫిబ్రవరిలో ప్రసారాలు ప్రారంభించింది.

వరంగల్లు నగరానికే ఒక ప్రత్యేకత ఉంది.కాకతీయుల రాజధానిగా ఏకశిలా నగరమై విలసిల్లింది. వేయిస్థంభాల గుడి, వరంగల్ కోట, కాకతీయ తోరణం.. ఇవన్నీ అప్పటి సంస్కృతి చిహ్నాల ఆనవాళ్ళు.

వరంగల్ నగరం ..వరంగల్, హనుమకొండ, కాజీపేట ఇలా మూడు నగరాల మేళవింపు..ఒక సరళరేఖలా మూడు పట్టణాలు కలిసుంటాయి. పాతికేళ్ళ అనంతరం ఇప్పుడు రూపురేఖలు మరింతగా మారిపోయాయనుకోండి..

ఆకాశవాణి వరంగల్ కేంద్రం కాకతీయ విశ్వవిద్యాలయం కేంపస్ లో కొలువై ఉంది.ఆకాశవాణి పక్కనే SDLCE ఉంది.అది దూరవిద్యా కేంద్రం.వరంగల్ స్టేషన్ కరీంనగర్ హైవే మార్గంలో ఉంది.వరంగల్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అదే కాజీపేట అయితే కొంచెం తక్కువగా అంతే దూరం లో వుంటుంది.హనుమకొండ చౌరాస్తాకు నాలుగైదు కిలోమీటర్ల దూరం..

వరంగల్ ఆకాశవాణి మొదటినుంచీ శ్రోతలకు చేరువగా ఉంది.ఆ మాట కొస్తే స్థానిక రేడియో స్టేషన్లను అక్కడి ప్రజలు own చేసుకున్నట్లు పెద్ద స్టేషన్లను own చేసుకోలేదు.ఇప్పటికీ హైదరాబాద్ ఆకాశవాణి ఎక్కడుందో జంటనగరవాసులకు అంతగా తెలీదు.ఆటోవాళ్ళని అడిగితే రామంతపూరా అంటారు..అక్కడ దూరదర్శన్ కేంద్రం ఉంది.(ఇప్పుడు ola, Uber apps వచ్చాక ఆ అవసరం కూడా లేకుండా పోయిందనుకోండి)

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఎక్కువమంది ఇక్కడ పోస్టింగ్ కోరుకునే వారు.పొద్దున్న కృష్ణా ఎక్స్ప్రెస్ లో వస్తే మళ్ళీ సాయంత్రం అదే కృష్ణా ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోవచ్చు.ఎక్కువమంది ఆ పని చేస్తుండేవారు.ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి శాటిలైట్ స్టేషన్ అని చమత్కరిస్తుండేవారు.

ఆకాశవాణి వరంగల్ కెంద్రానికి సారధ్యం వహించిన డైరెక్టర్ లు కూడా స్టేషన్ పాపులారిటీ పెంచటానికి కృషి చేసినవారే.

 పి.ఆర్.రెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు(తరువాతి కాలంలో ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు), పాలకుర్తి మధుసూదనరావులు అప్పటికే స్టేషన్ కు మంచిపేరు తెచ్చిపెట్టారు..నేను 1999 లో చేరినప్పుడు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు స్టేషన్ డెరైక్టర్..ఆయన రేడియో ప్రచార సభ అన్న కాన్సెప్ట్ తో వరంగల్ రేడియో కేంద్రానికి మరింత వన్నె తెచ్చారు.

ఇంకోసారి దాని గురించి వివరంగా చెబుతాను..

హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో ఉన్నట్లు స్థానిక కేంద్రాల్లో స్టూడియోలు ఎక్కువ ఉండవు.ఒకటే స్టూడియో ఉంటుంది.దాన్నే మల్టీ పర్పస్ స్టూడియో అంటారు.అదే పెద్ద స్టేషన్లలో డ్రామా, మ్యూజిక్, టాక్స్ అని వేర్వేరు స్టూడియోలు ఉంటాయి.పెద్ద స్టేషన్లలో కొన్నిచోట్ల ప్రాంతీయ వార్తా విభాగాలుంటాయి.(మళ్ళీ దానికోసం న్యూస్ స్టూడియో ఉంటుంది.అది లేనప్పుడు talks  స్టూడియోని వాళ్ళకి ధారాదత్తం చేయాల్సి ఉంటుంది..)

ఇక సాధారణంగా ఉండే స్థానిక రేడియో స్టేషన్లో ఒకటే స్టూడియో. నేను వరంగల్ ఆకాశవాణి కేంద్రం లో చేరినప్పుడు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు స్టేషన్ డైరెక్టర్.. కథకుడు ఎస్.జయపాల్ రెడ్డి 

ప్రోగ్రాం ఆఫీసర్, మరో ప్రోగ్రాం ఆఫీసర్ ఎల్.వ్యాస్ కుమార్ ఉండే వారు..సభానిర్వహణలో తనదైన ముద్ర వేసిన మడిపల్లి దక్షిణామూర్తి, విమర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న రచయిత డా.వి వి.రామారావు లు అనౌన్సర్లుగా ఉండేవారు.. లైబ్రేరియన్ గా మిత్రుడు కె.శ్రీహరి ఉండేవాడు.మొత్తం ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి తల్లో నాలుకలా ఉండే స్టెనో ఏ.వి.అనిల్ ప్రసాద్ 

ఇలా అనేకమంది మిత్రులు.. వీరు కాక ఇంకా ఇంజనీరింగ్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండేవారు.ఆకాశవాణి స్టూడియో కాంప్లెక్స్ పక్కనే సిబ్బంది గృహ సముదాయం ఉండేది.మిడ్ అకడెమిక్ ఇయర్ లో రావటం వలన మొదటి మూడు నెలలు నేనొక్కడినే ఉన్నాను..విశాలమైన స్టేషన్ డెరైక్టర్ క్వార్టర్ నాకు అలాట్ చేశారు.. స్టేషన్ డెరైక్టర్ గారు ఆ క్వార్టర్ ఉపయోగించుకోపోవటంవలన అనుకోండి..

వరంగల్ గొప్ప సాహిత్య సాంస్కృతిక కేంద్రం.. వరంగల్ అనగానే గుర్తుకొచ్చేది ప్రజాకవి కాళోజీ.. అంపశయ్య నవీన్.. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి గా పనిచేసిన పేర్వారం జగన్నాధం, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని మధించిన కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య.. చిందు యక్షగానానికి ప్రసిద్ధి చెందిన గడ్డం సమ్మయ్య..విప్లవ కవిగా పేరుగాంచిన వరవరరావు.. సహృదయ సంస్థ ద్వారా వరంగల్ నగరవాసులకు సాహితీ సేవ చేస్తున్న సహృదయ సాహిత్య సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డా.కె.ఎల్.వి.ప్రసాద్, గిరిజా మనోహర్ బాబు ఇంకా అనేకమంది కవులు.. కళాకారులతో వరంగల్ ఒక గొప్ప శోభతో వర్ధిల్లుతూ ఉండేది..

నేను చేరిన మూడోనెల అంటే మార్చి నెలలో హోళీ రోజున కాలింగ్ బెల్ మోగింది..నేనిక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు..ఎవరై ఉంటారని తలుపు తెరిచాను..అంతే..అప్పుడేమయిందంటే 

*

"రేడియో" రాంబాబు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ వరంగల్ ఉద్యోగప్రయాణంలో నావంటి వారిని గుర్తు చేసుకోవడం చాలా గొప్పగా అనిపించింది.
    మీ అభిమానానికి కృతజ్ఞతలు.మీ కాలం లో వరంగల్ రేడియో కేంద్రం గొప్ప పేరు తెచ్చుకుంది.అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు.మీ కథనం చదువుతుంటే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చి మనసు పులకించింది.మీ జ్ఞాపకాలకు అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు