సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్

అంబేద్కర్ దృష్టి కోణంలో మనం చూడకపోతే క్వియర్ కమ్యూనిటీ పట్ల తరతరాలుగా సమాజం చూపిన వివక్షను, హింసను విచ్ఛిన్నం చేయటం చాలా కష్టం.

‘తరతరాలుగా క్వియర్ సముదాయాల మీద పాతుకుపోయిన వివక్ష, అస్పృశ్యత, అవహేళన సిస్ జెండర్ సముదాయాలు నిర్మించినవే. వీటిని కూలదోయడానికి జరిపే యుద్ధంలో క్వియర్ వ్యక్తుల శక్తులు, సమయం మాత్రమే సరిపోవు, కాబట్టి కచ్చితంగా సిస్ జెండర్ వ్యక్తులు ఇందులో పాల్గొనాలి,’ అని నీలి మేఘాలు 30 వసంతాల వార్షికోత్సవంలో మహిళా రచయితలు, యాక్టివిస్టులు అందరూ ఉన్నప్పుడు చెప్పాను. ఆ తర్వాత కూడా ఎందరో నాన్- క్వియర్ వాళ్ళు క్వియర్ కథలను రాశారు. అలానే క్వియర్ వ్యక్తులు రాసిన కథలు కూడా ప్రచురించారు. ఇది రాబోయే అభివృద్ధిని సూచించే పరిణామం.

స్వతహాగా క్వియర్ కమ్యూనిటీ వాళ్లు చిన్నప్పటినుంచి వివక్ష ఎదుర్కొంటారు. ఎప్పుడైతే వాళ్లు అస్తిత్వాన్ని ప్రకటిస్తారో(come out) అవుతారో అప్పటి నుంచే mainstream సమాజానికి చాలా దూరంగా నెట్టివేయబడతారు. తద్వారా వారి జీవన విధానాలు వేరేగా మారిపోతాయి. ఉదాహరణకి ట్రాన్స్ వాళ్లు అయితే భిక్షాటన, సెక్స్ వర్క్ ద్వారా బ్రతకగలుగుతారు. కాబట్టి, ఏ రోజయితే వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబాలకి దూరమవుతారో, ఆ రోజు నుండి ఒంటరిగా బతుకుతూ, ప్రతిరోజును ఒక సమరంగా పోరాడి జీవితాన్ని వెళ్ళదీయవలసి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో విద్య అందరి అందుబాటులోకి రాదు. రాసే వెసులుబాటు, సమయం కూడా ఎక్కువగా దొరకదు. కాబట్టి సిస్ జెండర్ వ్యక్తులు క్వియర్ జీవితాల గురించి రచనలు చేయాలి. ఇటువంటి రచనలు వస్తే, మా జీవితాలలో సాగే విషయాలు గురించి అందరి మధ్యా కనీసం చర్చలైన జరుగుతాయి అని ఒక చిన్న ఆశ.

ఈ సంకలనంలోని కథలు నాకు ప్రత్యేకంగా అనిపించాయి. మొట్టమొదటి సారిగా, సిస్ జెండర్ రచయితలు తమ అనుభవ పరిధిలోని భాషను ఉపయోగించి, తమ దృష్టికోణం ద్వారా- క్వియర్ కమ్యూనిటీకి సంబంధించి ఒక కల్పిత దృశ్యాన్ని, ఒక visionary euphoriaని- వ్యక్తీకరించారు. వారు క్వియర్ వ్యక్తుల మధ్య సంబంధాలను తాము చూస్తున్న కోణంలో ఊహించి, ఆ విషయాన్ని చాతుర్యంగా, ఆర్ద్రతతో, అభివ్యక్తి సౌందర్యంతో రచించారు. వారి భాషాప్రయోగం, ఆ భావవ్యక్తీకరణ, నా అంచనాలను మించిపోయాయి.

నేను ఇక్కడ ఏ ఒక్క కథనూ ప్రత్యేకంగా ప్రస్తావించడంలేదు. ఎందుకంటే, ముందుమాటలో కంటే, కథలను నేరుగా చదివినప్పుడు పాఠకులకు మరింత ఆసక్తి, అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ సంకలనాన్ని తప్పక చదవాలి. ఈ కథలు చదివేటప్పుడు పాఠకులు వాటిలో లీనమైపోతారు. “ఇలా కూడా ఉంటుందా?” అని ఆశ్చర్యం కలగవచ్చు- ముఖ్యంగా మా సముదాయంపై అంతగా అవగాహనలేని వారికి ఇది ఒక కొత్త లోకాన్ని చూపుతుంది. అదే సమయంలో, క్వియర్ సమాజాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్నవారిలో ఈ కథలు ఓ గాఢమైన ఆసక్తిని రేకెత్తించగలవు.

సిస్ జెండర్ వ్యక్తుల మధ్య ప్రేమలు ఎలా ఉన్నాయో అలానే క్వియర్ వాళ్ళ ప్రేమలు ఉండొచ్చు కదా అని ఎక్కువమంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సిస్ జెండర్ వాళ్ళ ప్రేమకు- స్వతంత్రమైన వాతావరణంలో, సమానత్వమైన దిశగా, త్వరగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. దీనికి మెజారిటీరియన్ సమూహాల ఆలంబన కూడా ఉంటుంది. కానీ క్వియర్ ప్రేమకు ఆ స్వతంత్రం గానీ, ఆ సమానత్వం గాని లేవు. మొత్తం సమాజంలోనే majoritarian వ్యక్తులతో పోరాడి, కొన్ని సందర్భాల్లో సామాజిక నిర్మాణాలు అయిన కులము, మతము, జాతి, క్లాస్- ఇవన్నీటితో పోరాడి గెలవవలసిన ప్రేమ అది. అందుకే ప్రేమని సాధించుకొని చిరస్థాయిగా నిలిచిపోయిన క్వియర్ వ్యక్తుల ప్రేమ కథలు చాలా కొద్దిగా మాత్రమే దొరుకుతాయి. మిగిలినవి కాలగమనంలో తెలియకుండానే కలిసిపోయి ఉంటాయి.

అయినా సరే, ఇలాంటి ఒక బంధాన్ని మాటల్లో పొందుపరిచిన ఈ రచయితలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ సందర్భంలో మనం క్వియర్ ఉద్యమాలు వాటి ద్వారా సాధించిన హక్కులు- వీటి ప్రస్తావన అవసరం – ట్రాన్స్జెండర్ హక్కులపై 2014 భారత సుప్రీం కోర్టు NALSA తీర్పు, ఆర్టికల్ 377 డిక్రిమినలైజేషన్కు సంబంధించిన 2018 నవతేజ్ జోహార్ తీర్పు, అలాగే సెక్స్ వర్కర్ల హక్కులపై 2022 బుద్ధదేవ్ కర్మస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ తీర్పు – ఇవన్నీ ప్రైవసీ జడ్జిమెంట్(పుట్టస్వామి కేసు)తో సంబంధం ఉన్న ముఖ్యమైన కేసులు. ఇలాంటి జడ్జిమెంట్లు రాకముందు క్వియర్ వ్యక్తులు, వాళ్లకి సంబంధించిన వాళ్లూ – పేరెంట్స్ గాని, వాళ్ళ పార్టనర్స్ గాని- అందరూ కూడా భయం నీడలో గడిపేవారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఉనికి unconstitutional. అంటే రాజ్యాంగపరంగా వాళ్ళు అందరు క్రిమినల్స్గా పరిగణించబడ్డారు. ఇప్పుడు జడ్జిమెంట్లు వచ్చాక వెంటనే అనుకూలమైన వాతావరణం వస్తుందని మనం ఆశించలేము. ఎందుకంటే కొన్ని తరాలుగా సమాజంలో పేరుకున్న సంస్థాగతమైన వివక్ష, హేళన, హింస- కొన్ని జడ్జిమెంట్ల ద్వారా ఒక్కసారిగా పోతుందని నేను అనుకోను. కానీ సమాజంలో మార్పు రావడానికి, మా పోరాటాలని బలోపేతం చేయడానికి సాహిత్య ఉద్యమం చాలా అవసరం.

ఇటువంటి రచనలు, సమాజంలో గాఢంగా పాతుకుపోయిన బైనరీ భావన—అంటే ‘జెండర్’, ‘సెక్స్’, ‘సెక్సువాలిటీ’ అన్నీ కేవలం “ఆడ – మగ” అనే వ్యవస్థలోనే పరిమితమై ఉంటాయన్న ఆలోచనలను సవాలు చేస్తాయి . సమానత్వం, స్వేచ్ఛ అనే విలువలు కేవలం ఆ రెండు లింగాలకే కాకుండా, మిగిలిన సముదాయాలకూ వర్తించాలి అనే స్పష్టమైన సందేశాన్ని ఈ రచనలు ఇస్తాయి. క్వియర్ వ్యక్తుల జీవితాలపై ఆధారపడి రచించబడిన కథలు, ఆటోబయోగ్రఫీలు, ప్రేమకథలు, కవిత్వం వంటి వచనాలు- all these contribute to cultivating a liberated way of thinking. ఇవి వ్యక్తిగతమైన విముక్తిని మాత్రమే కాక, సామూహికంగా సమాజాన్ని తిరిగి ఆలోచింపజేసే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి క్వియర్ కమ్యూనిటీలో వాళ్లే కాకుండా నాన్ క్వియర్ వాళ్లు కూడా క్వియర్ రచనలు చేయాలి. ఆ రచనల ద్వారా ఎల్జిబిటి ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని కూడా ఒక ఆశ ఉంది.

చివరిగా బాబాసాహెబ్ చెప్పినట్టు కుల అణిచివేతను, జెండర్ అణిచివేతను- ఈ రెండిటిని కలిపి చూడకపోతే సమాజశ్రేయస్సు మనం ఆశించలేము. వర్ణ వివక్ష, జెండర్ వివక్ష- ఆడవారి పట్ల ఆధిపత్య భావజాలాన్ని institutionalize చేస్తుందని బాబా సాహెబ్ చెప్పారు. ఆ తరవాత వరుసలోనే ఉన్న క్వియర్ సముదాయాల పట్ల కూడా జెండర్కి సంబంధించి, సెక్సువాలిటీకి సంబంధించి, సెక్స్కి సంబంధించిన అదే వర్ణ, జెండర్ వివక్షను, బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టి కోణంలో మనం చూడకపోతే క్వియర్ కమ్యూనిటీ పట్ల తరతరాలుగా సమాజం చూపిన వివక్షను, హింసను విచ్ఛిన్నం చేయటం చాలా కష్టం. ఇది కేవలం పేదరికానికి తోడ్పడే వ్యవస్థ మాత్రమే కాదు, జీవనావకాశాల నుంచీ విద్య, ఉద్యోగాలకు దూరంగా నెట్టివేసే నిర్మాణమైపోయింది. ఈ విచక్షణను కేవలం రచనల ద్వారానే మనం సమాజంలో తీసుకురాగలము.

అందుకే, సమాజంలో మార్పు తీసుకురావడానికి సాహిత్యం కీలకం. ఇది ఓ “పొలిటికల్ యాక్ట్”. క్వియర్ వ్యక్తులకే కాకుండా- వారిని అర్థం చేసుకునే, వారితో కలిసి ఉన్న సిస్ జెండర్ వ్యక్తులు కూడా ఈ బాధ్యతను భుజాన వేసుకోవాలి.

ఈ సంకలనం ఆ మార్పు వైపు ఒక గొప్ప అడుగు. ఈ రచయితలందరికీ ధన్యవాదాలు.

*

రచన ముద్రబోయిన

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మన సమాజం క్వియర్ కమ్యూనిటీపై చూపే వివక్షను చాలా స్పష్టంగా చెప్పారు.
    సిస్ జెండర్ రచయితలు క్వియర్ అనుభవాలను బాధ్యతతో రాయటం ఎంతో అవసరం,
    చట్టాలు మారినా మనస్తత్వాలు మారడానికి ఇలాంటి రచనలు చాలా ముఖ్యం.
    ఈ సంకలనాన్ని చదవాలనే ఆసక్తి పెరిగింది. రచయితకు అభినందనలు.

  • సాహిత్యంలో మరో ఖాళీని కొద్దిగానైనా పూరించగల సంకలనం. మంచి ప్రయత్నం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు