సమకాలీన కథ రాస్తున్నాననే భ్రమ నాకెప్పుడూ లేదు

ఎందరికో ఎంతో ఇష్టమైన వచన రచయిత శ్రీరమణ! ఇవాళ ఆయన లేరన్న వార్త వినిపించింది. అది నిజం కాదేమో అని ఎవరైనా చెప్తే బాగుణ్ణు ! కొద్ది కాలం కిందట శ్రీరమణ గారు అమెరికా వచ్చినప్పుడు ప్రముఖ కథకులు నారాయణ స్వామి సంభాషణ ఇది! మళ్ళీ మీకు అందిస్తున్నాం!

‘మిథునం’ శ్రీరమణగారు అమెరికా పర్యటిస్తూ మా వూళ్ళో (డెట్రాయిట్) కూడా నాలుగు రోజులున్నారు. మూడు పూటల పాటు ఆయనతో గడిపి తీరిగ్గా సంభాషించే అవకాశం చిక్కింది. ఎలాగూ మాట్లాడుకుంటారు కదా, ఆ మాట్లాడుకున్నదాన్ని ‘సారంగ’కి రాసివ్వమని అఫ్సర్ గారి ఆదేశం. రాస్తామన్న స్పృహ మనసులో ఉన్నా, జరిగింది సంభాషణే కానీ ఇంటర్వ్యూ కాదు. శ్రీరమణ గారిని ఎవరూ ఇంటర్వ్యూ చెయ్యలేరు.

ఎందుకంటే ఆయన నడిచే అనుభవాల, జ్ఞాపకాల పుట్ట. ఏదో యథాలాపంగా అడిగిన ప్రశ్నకి ఆయన మొదలు పెట్టిన జవాబు అరగంట తరవాత ఎక్కడో తేలుతుంది. శ్రీరమణగారితో కాస్త తీరిగ్గా సంభాషించిన వారికెవరికైనా ఇది అనుభవమే. ఇంతకీ ఇంత సుదీర్ఘమైన ముందు మాట ఎందుకంటే ముందస్తుగానే కొన్ని షరాలు చెప్పుకుంటే మంచిదని.

అంచెలంచెలుగా సాగిన తీరిక సంభాషణని పత్రిక కోసమని ఇంటర్వ్యూ రూపంలోకి కుదిస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఆయన మాటల్ని తిరిగి రాయడమే తప్ప మొదలంటా మార్చకుండ ఉండడానికి నా యథాశక్తి ప్రయత్నించాను. ఓపిగ్గా నాతో మాట్లాడినందుకు శ్రీరమణగారికీ, ఈ ఎసైన్మెంటు నా నెత్తికెత్తినందుకు అఫ్సర్‌కీ ధన్యవాదాలు.

1970లలోనే ఆంధ్ర జ్యోతిలో ఫీచర్లతో బాగా పేరు తెచ్చుకున్నారు, పుస్తకాలు కూడా వేశారు కదా, ఒక కథ బయటికి రావడానికి ఇంత సమయం పట్టిందేం?

ఫీచర్లు రాయడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఆలోచనలు, చమక్కులు, భాష – ఇలా రచనకి అవసరమైన శక్తులన్నీ కూడా ఆ ఫీచర్ల మీదనే కేంద్రీకృతమై ఉండేవి. ఆ తరవాత పది పదిహేనేళ్ళు సినిమాల్లో మునిగి తేలాను. ఒక సినిమాకి రాయడమంటే ఒక యాభయ్యో వందో కథలకి కావలసిన సృజన శక్తి ఖర్చవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఇంక కథలు రాయడానికి కుదిరేది కాదు. తీరిక చిక్కలేదు అనడం కంటే, ఆ రాసే శక్తి మిగిలేది కాదు. సినిమాల్లో పని చేస్తున్నప్పుడు కూడా ఫీచర్ ‘కాలం’ రాస్తూనే ఉండేవాణ్ణి. రంగుల రాట్నం (అంధ్రజ్యోతిలో రాసిన వ్యంగ్య రచనల శీర్షిక, పుస్తకంగా వచ్చింది) చూస్తే, అందులో ఒక్కో రచనా ఒక్కో కథ కావచ్చు. కథగా రాస్తే పది పన్నెండు పేజీలు వచ్చే మెటీరియల్ ని ఒకట్రెండు పేజీల కాలంలోకి కుదిస్తున్నామంటే ఒక విధంగా ఆ కథని sacrifice చెయ్యడమే. కానీ ఆ పేరిట ‘కాలమ్’కి మంచి పేరొచ్చింది. తరవాత ఎప్పుడైనా ఆ పాయింటు ఒకటి తీసుకుని కథగా రాస్తే, చూడు, తన కథనే మళ్ళీ రీసైకిల్ చేస్తున్నాడు అంటారు.

అలా కథ అనే రూపంలో రాయడానికి వీల్లేకుండా పోయిందన్న మాట. మరి ఈ కథలు ఎలా రూపు దిద్దుకున్నాయి?

అంటే, 90లలో కొద్దిగా గేప్ వచ్చింది. అలా మొదట బంగారు మురుగు రాశాను. ఆ రోజుల్లో ఇండియాటుడే తెలుగు పత్రిక వాళ్ళు సక్రమంగా తెలుగు కథల్ని ప్రచురిస్తూ ఉండేవారు. వాళ్ళు అడగడం మీదట, ఆ వొరవడిలో ఈ అయిదారు కథలు రాశాను. ఎప్పుడైనా, ఎవరన్నా అడిగితేనే రాయడం.

అదీ కాకుండా, నా కథలని గురించి నాకో దృష్టి ఉంది. అవేవీ కొద్ది రోజుల ఇతివృత్తాలతో నడిచేవి కాదు. బంగారు మురుగు ఉందంటే ఆ అబ్బాయి పుటకల నించీ అతని పెళ్ళిదాకా అంటే పాతిక ముప్పయ్యేళ్ళ కథ. మిథునం అయితే సుమారు అరవయ్యేళ్ళ కథ. కథలో దృశ్యం చిన్నదే అయినా, అక్కడ బుచ్చిలక్ష్మీ దాసు, వాళ్ళ పెళ్ళిలో పల్లకీలో ఊరేగడం గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇక్కడ రచయితగా నేను ఆ కాలంలోకి వెళ్ళిపోవాలి. ఆ రోజుల్లో పల్లకీ ఊరేగింపు అంటే అక్కడ ఏమేం ఉండేవి, ఎలా ఉండేది వాతావరణం అంతా .. అది జాగ్రత్తగా పట్టుకోలేక పోతే, ఇంత కథా ఒక లిటరరీ జోకై కూర్చుంటుంది. పైగా, పత్రికలో ఉద్యోగం రీత్యా వందలకొద్దీ కథలు చదివే వాళ్ళం కాబట్టీ, ఆ రోజుల్లో రావిశాస్త్రి, కాళీపట్నం లాంటి మహామహులు రాస్తూండేవారు కాబట్టీ, మనం కూడా కథ అంటూ రాస్తే అది ఒక స్థాయికి తగ్గ కూడదు. నిలబడేలా ఉండాలి, పేరు నిలబెట్టేలా ఉండాలి అని ఒక పట్టుదల. కథ ఎత్తుగడ కానీ, పాత్ర చిత్రణ కానీ, భాష కానీ సజీవంగా ఉండాలి. ఇదిగో ఇలాంటి పట్టుదల వల్ల మునుపు రాయలేదు. ఇప్పుడైనా రాసింది ఆ గుప్పెడే కథలు.

బాగా పేరు తెచ్చుకున్న మీ కథలన్నీ – మిథునం, ధనలక్ష్మి, బంగారు మురుగు – అన్నీ గతాన్ని ఆధారంగా చేసుకున్నవే. ఎందుకలాగ?

నేనేదో కాంటెంపరరీ కథని, ఈ నాటి, ఈ కాలపు కథని రాస్తున్నాననే భ్రమ నాకెప్పుడూ లేదు. నేను నా చిన్నప్పటి విషయాలే, అంటే యాభయ్యేళ్ళ కిందటి విషయాలే రాస్తున్నాననే విషయం నాకు బాగా తెలుసు. అంటే, ఆ కాలంలోనే బతకమనీ కాదు, అది గొప్పది – ఇది చెడ్డది అని కాదు. అప్పట్లో ఉన్న జీవితం కనుమరుగై పోయింది. ఆ రోజుల్లో ప్రసిద్ధంగా రాసిన రచయితలు ఈ విషయాల్ని పట్టించుకోలేదు. వాళ్ళు వేరే ఇతివృత్తాలతో రాశారు. నేను దగ్గరగా చూసి అనుభవించిన జీవితాన్ని వాళ్ళెవరూ రాయలేదు. ఐతే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జీవనవిధానం, అప్పటి పరిస్థితులూ, అలాంటి మనుషులూ – ఇప్పుడు మాయమై పోయినాయి గనక వాటిని తలుచుకోవడం, రికార్డు చేసుకోవడం ముఖ్యమని నాకు తోచింది. ఆ తలుచుకోవడమే ప్రయోజనం. కొన్నేళ్ళ కిందట జీవితం ఇలా ఉండేది, మనుషులు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పుకోవడమే ప్రయోజనం. అది జరిగితే చాలు.

కాసేపు ప్రత్యేకంగా మిథునం గురించి మాట్లాడుకుందాం.

తెలుగు కథల్లో కనీ వినీ ఎరుగని ప్రజాదరణ పొందింది కదా ఈ కథ. ఐతే దీని మీద వ్యాఖ్యానాలు, విమర్శలు కూడా చాలానే వచ్చాయి. ఏముంది ఇందులో తిండియావ ఉన్న ఒక బ్రాహ్మడి కథ అన్నారు, బ్రాహ్మినిక్ కల్చర్ని గ్లోరిఫై చేస్తోంది అన్నారు. దానితో కొంత ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళేమో ఇది మన అమ్మానాన్నల, లేదా తాతా బామ్మల ప్రేమ కథ అనుకున్నారు. మీ దృష్టిలో, ఈ కథలో ఈ పై పై విషయాలని దాటి లోతైన తాత్త్విక విషయం ఏమన్నా ఉన్నదా?

తప్పకుండా ఉన్నది. బ్రాహ్మడి కథ, బ్రాహ్మినిక్ కల్చర్ అంటే, మరి నేను ఎరిగిన వాతావరణం అది. ఏ రచయిత అయినా వాళ్ళకి గాఢంగా తెలిసిన విషయాన్ని రాయాలి తప్ప, తెలిసీ తెలియని విషయాన్ని రాయబూనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది. నాకు గాఢంగా లోతుగా అనుభవమైనదే నేనా కథలో రాశాను. ఇక తాత్త్విక చింతన అంటే .. మన సాంప్రదాయంలో దాంపత్యాన్ని గురించిన ఒక కామెంటరీ. మన దాంపత్యమనే కాదు, చాలా కాలం జంటగా ఉన్న ఏ దంపతులైనా .. వయసులో ఉన్నప్పుడు ఒక ఆకర్షణ, మోహం, అటుపైన సంసార బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ తీరిపోయాక ఒక స్నేహం, ఒక ఆప్యాయత, ఒక కంపేనియన్షిప్ మిగులుతాయి. ప్రధానంగా చెప్పాలనుకున్నది ఇది.

ఈ కథ ఎన్నో భారతీయ భాషల్లోకీ కొన్ని పాశ్చాత్య భాషల్లోకీ అనువదించబడింది. అలా ఢిల్లో జరిగిన ఒక సదస్సులో ఒక జర్మనీ ఆయనతో సంభాషిస్తుంటే ఆయనన్నాడూ – ఆ దంపతుల చేష్టలు, రహస్యాలు అన్నీ రాశారు కదా, వారి సెక్స్ లైఫుని గురించి కూడా రాయవలసిందీ అని. అంటే నేనన్నానూ – మా సాంప్రదాయంలో అదసలు మర్యాద కాదు. అదలా ఉండగా ఇక్కడా కథలో అసలు విషయం వారిద్దరి మధ్యనా మిగిలింది ఆ స్నేహం అని చెప్పడమే. ఆ స్నేహానికి పునాది వారు గడిపిన యాభై అరవయ్యేళ్ళ జీవితం. అంతేకానీ వేరే కోరికలేమీ లేవు.

అంటే, ఒక విధంగా చూస్తే, పెళ్ళిలో చేసే ప్రమాణాలు .. ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతి చరామి; సఖా సప్తపదీ భవ – ఇలా పరస్పరం చేసుకున్న ప్రమాణలని చివరిదాకా పాటించడం.

కరక్ట్. వాళ్ళ మధ్యలో నడిచే వ్యవహారం అంతా .. పోట్లాడుకోవడం ఒక టైం పాస్. పాత విషయాలని గురించి దెప్పి పొడుచుకోవడం ఆ పాత విషయాల్ని గుర్తు చేసుకోవడం. అలా షేర్ చేసుకుంటున్నారు, మళ్ళీ కాసేపు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అలాగే ఇదంతా చూస్తున్న ఆ మేనల్లుడూ పిల్లవాడు – వాడో పది పన్నెండేళ్ళ పిల్లవాడు. అంటే వయసులో చూస్తే అప్పాదాసు మనవళ్ళ తోటివాడు. ఆ పిల్లవాడు వీళ్ళిద్దరి జీవితాన్నీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అంటే .. దీనికి సూచనలు కూడా కథలో స్పష్టంగా ఉన్నై .. వాడూ ఆవు పాలు ఇవ్వడానికని రెండు పూటలా వాళ్ళింటికి వస్తూ ఉన్నాడు, అప్పాదాసు వాణ్ణి పట్టుకుని ఏరా నేను మా లేడీసుకి జడేశానని నువ్వు ఊళ్ళో చెబుతున్నావా అని గద్దిస్తాడు – ఇవన్నీ ఆ పిల్లవాడు చూస్తున్నాడు. అంటే రేపు వాడూ పెద్దవాడయ్యాక, ఆహా, దాంపత్యమంటే ఇలాగ కూడా ఉంటుందని వాడు తెలుసుకుంటున్నాడు అని నా ఉద్దేశం.

ఈ కథని కొంత అకస్మాత్తుగా ముగించేశారు అని మరో విమర్శ విన్నాను. అప్పాదాసు పోతే బుచ్చి లక్ష్మికి దిక్కేవిటి ఇప్పుడు?

ఈ కథని చదివిన చాలా మంది పాఠకులు బహుశ ఆ దంపతుల పిల్లల వయసు వారై ఉంటారు. ఎక్కడో నేటివ్ ప్లేసులో వృద్ధురాలైన తల్లి ఉండిపోయింది అనే ఆలోచన చాలా బాధ కలిగిస్తుంది విడవకుండా.

నిజానికి బుచ్చిలక్ష్మిని గురించి వర్రీ అవాల్సిందేమీ లేదు. ఆమే చెబుతుంది కదా చివర్లో, నాక్కావలసిన వన్నీ మామయ్య నేర్పే వెళ్ళాడురా అని. అదీ కాక కథలో తోటకి ఒక ముఖ్య పాత్ర ఉన్నది. కని పెంచి పెద్ద చేసి సమాజంలోకి పంపేసిన పిల్లలు కాక, ఆ దంపతులిద్దరూ కలిసి సృష్టించిన మరో అద్భుతమైన సృష్టి ఆ తోట. అది వాళ్ళిద్దరి కలిసిన జీవితాల తీపి జ్ఞాపకాలతో నిండి ఉన్నది.

బాగా లోతుకి వెళ్లి చూడాలంటే, వాళ్ళిద్దరూ వేరు వేరుగా కనిపిస్తున్న రూపాలే తప్ప నిజానికి వాళ్ళిద్దరూ ఒకటే ప్రాణం అనే అద్వైత దృష్టి దీనికి ప్రాణం. నాకు స్వతహాగా ఆ అద్వైతం అంటే చాలా ఇష్టం. అదే ఇక్కడ ఈ రూపంలో దర్శనమిచ్చింది. ఐతే, మన తెలుగు కథల్లో అట్లాంటి బరువైన తాత్త్విక చర్చలూ అవీ ఇమడవు. అక్కడ మనం ఆత్మ పరమాత్మ లాంటి చర్చల్లోకి వెళ్తే కథ పండదు సరిగదా ఏవిటీ చెత్త అని పాఠకుడు పక్కన పెట్టేస్తాడు. ఐతే ఇవన్నీ కాదు. నామట్టుకి నాకు బాగా తృప్తినిచ్చేదేవిటంటే .. ఆ పల్లె జీవితంలో, ఆ రైతు జీవితం నేపథ్యంలో .. నేను రైతు కుటుంబం నించే వచ్చాను. ఆమె పేరంటానికి వెళ్ళి శనగలు పట్టుకొస్తే, ఒక గుప్పెడు శనగలు ఆవుకి తినిపిస్తాడు చేత్తో. తినేసిన ఆవు అతని చేతిని నాకితే ఆ యజమానికి ఎంత తృప్తిగా ఉంటుందో, అతను దాని గంగడోలు దువ్వితే ఆ ఆవుకి ఎంత పరవశంగా ఉంటుందో .. ఇలా నేను నా చిన్నతనంలో చూసి అనుభవించిన విషయాలు రాశాను కథలో. ఆ రాసే సమయానికి నాకీ సంఘటనలు, దృశ్యాలు గుర్తుకొచ్చి, అవి కథలో రాయగలిగానని .. అది నాకు చాలా తృప్తినిచ్చే విషయం. ఇలా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలున్నై. అవన్నీ వదిలేసి .. ఇది కేవలం తిండి గురించే అంటే .. (నవ్వేశారు)

ఈ కథలో నేను అని కథ చెబుతున్న కుర్రవాడు బహుశా పది పన్నెండేళ్ళ వాడు. ఇంకా జంఝప్పోగు పళ్ళేదేవిరా అని అప్పదాసు వాణ్ణి గదమాయిస్తాడు. కానీ కథని నేరేట్ చేస్తున్న గొంతు పసి గొంతు కాదు.

అవును. ఆ పిల్లవాడు పెద్దయినాక ఫ్లేష్ బేక్ గా చెబుతున్నాడు అనుకోవచ్చు. ఐతే, కథలో ఉన్నంత మట్టుకు ఆ పిల్లవాడు పిల్లాడిగానే ఉంటాడు తప్ప ఆరిందాగా ఉండడు. అదీ కాక ప్రతి రచయితకీ రచనలో ఒక ఆల్టర్ ఈగో ఉంటుంది. నేను మిత్రులతో వాదిస్తూ ఉంటాను, వాల్మీకి రామాయణంలో వాల్మీకికి ఆల్టర్ ఈగో సీతలో ఉన్నది. ఒక్కోచోట సీత మాట్లాడినప్పుడల్లా, అదిగో వాల్మీకి మాట్లాడిస్తున్నాడూ అనిపిస్తుంది. అలాగే కన్యాశుల్కంలో అప్పారావుగారి ఆల్టర్ ఈగో మధురవాణిలో ఉన్నది. వేయిపడగలులో ధర్మారావు విశ్వనాథవారే.

 మిథునం కథ ఎందుకింత ప్రాచుర్యం పొందింది అనుకుంటున్నారు?

ఎవరికైనా పోగొట్టుకున్న దానిమీద మోజెక్కువ కదండీ. ఆ కథలో చూపించిన జీవితం ఐపోయింది, ఇప్పుడు లేదు, దొరకదు అనే విషయం గ్రహింపుకొచ్చింది.

పెళ్ళి అనే కథలో చాలా గాఢమైన సెటైరు రాశారు. ఆ తరవాత నాయుడిగారి పాలనలోనూ, రెడ్డిగారి పాలనలోనూ, ఏతన్మధ్య తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలోనూ సెటైరుకి చాలా అవకాశాలే ఉండి ఉండాలి. మరో సెటైరు కథ రాలేదేమి?

మళ్ళీ  ఆ సమయానికి కాలమ్స్ రాస్తూ  వచ్చాను. ఒకే వ్యవధిలో రెండు మూడు పత్రికలకి కాలమ్స్  రాసిన పరిస్థితికూడా కొన్నాళ్ళు నడిచింది. అందుకని అప్పటి రాజకీయ పరిస్థితుల ముచ్చట్లన్నీ ఆ కాలమ్స్ రాయడంలో ఖర్చయిపోయేయి. ఆయా కాలమ్స్ కి రెగ్యులర్ గా ఫాలో అయిన పాఠకులుండేవారు. వార్తాపత్రికలో పని చెయ్యడం వల్ల అదొక ఎడ్వాంటేజ్ ఉండేది. ఆ న్యూస్ ఐటంకి సంబంధించిన సమాచారం అంతా వార్తా విభాగంలో ఉండేది, ఫొటోలతో సహా. అది తరవాత కాలంకి ముడిసరుకయ్యేది. సంఘటన జరిగిన మరునాడే దాని మీద సెటైరుగా కాలం వచ్చేది. పాఠకులు కూడా అప్పుడే టీవీలో చూసి, పేపర్లో చదివి ఉంటారు కదా .. వెంటనే కాలం రావడంతో త్వరగా దానిలోని వ్యంగ్యంతో కనక్ట్ అవుతుండేవారు. ఆ రోజుల్లో పురాణం గారు (పురాణం సుబ్రహ్మణ్య శర్మ) ఇల్లాలి ముచ్చట్లని కాలం రాశారు, పురాణం సీత పేరుతో. దానికోసమని ఒక ప్రత్యేకంగా ఒక గొంతుని రూపొందించుకుని .. ఇంకా ఫెమినిజం అని సాహిత్య ధోరణిగా రాని రోజుల్లోనే కొన్ని ఫెమినిస్టు ఐడియాలు అక్కడ పరిచయం చేశారు. న్యూసులో ఏదో అమెరికాలో ఎగిరే పళ్ళేలు (ఫ్లయింగ్ సాసర్లు, UFO) అని వచ్చింది. మర్నాడు ఈయన ఎగిరే పెళ్ళాలు అనే పేరిట కాలం రాశారు. ఆ పంచ్‌కీ, సమయస్ఫూర్తికి పాఠకులు సంతోషిస్తారు.

ఆ రోజుల్లో బెజవాడకి ఏదో సర్కసు వచ్చింది. వెంటనే సర్కసు డేరా అని రాశారు. అందులో సర్కసులో కనబడే జంతువులన్నీ ఇంట్లో మనుషులని .. పిల్లలు కోతులనీ, మామగారు సింహమనీ .. ఇలాగు అందర్నీ చెప్పుకొచ్చి, చివరికి నీటియేనుగు (హిప్పోపోటమస్) ఎవరంటే చెప్పనంటుంది – అంటే మొగుడన్న మాట (నవ్వారు). ఇలాగు ఆ సమయానికి పండే కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డులని ఉన్నాయి. ఎవరిద్దరు కలుసుకున్నా తెచ్చుకున్నారా? ఎంత సేపు పట్టింది, ఎంత ఖర్చయింది – ఇవే కబుర్లు. మళ్ళి వాటి చుట్టుతా కొన్ని రూమర్లు. అలాగే ఇప్పుడూ సమ్మర్లో పవర్ కట్. ఇలాంటి విషయాల్లో ఏదైనా ఒక కొత్త పాయింటుని పట్టుకుని రాస్తే .. విషయం అప్పటికే మనుషుల్లో చర్చలో ఉంది కదా అందుకని ఎక్కు పెట్టి ఉన్న విల్లులాగా .. బాణం తగిలించి వదలడమే మనం చెయ్యాల్సింది.

ఇంకోటేవిటంటే హాస్యానికి ఒక లక్షణం ఉన్నది. అంతకు మునుపు నవ్వు అనేది లేని చోట రచయిత నవ్వు పుట్టిస్తాడు. కన్యాశుల్కంతోటే తెలుగు వాళ్ళకి నవ్వడం తెలిసిందన్నారొక పెద్దాయన. అలాగే ఈ వ్యంగ్య రచన, కాలం రాసేటప్పుడు, సాధారణ వ్యవహారాలనించి రచయిత నవ్వు పుట్టిస్తున్నాడు. విసుగు కలిగించే విషయమే, కాలం రూపంలో పాఠకుడికి నవ్వు పుట్టిస్తున్నది. దాంతో పాటే పాఠకుడి అంచనాలు కూడా పెరుగుతాయి. వచ్చే వారం కాలం దీనికంటే బావుంటుందని ఆశిస్తాడు. ఆ అంచనా అందుకో లేకపోతే, ఏవిటి రమణగారూ ఇది వరకు బాగా రాసేవారు అనేస్తాడు. ఒక ఇరవై వారాలు వరసగా రాశాక, అదే స్థాయి మేంటేన్ చెయ్యడం సాధ్యం కాదు.

90లలో తెలుగు కథల వేదిక మీద రాజ్యమేలింది ప్రధానంగా మూడు విషయాలు – సరళ ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ, అస్తిత్వ వాదాలు. మీరు కథ అంటూ రాసిందే 90ల మధ్యలో మొదలు పెట్టి అసలు ఈ మూడు విషయాలనీ ఏ మాత్రం లక్ష్య పెట్టలేదు. ఏవిటి దీనర్ధం?

ఈ విషయంలో నాకో కంప్లెయింట్ ఉన్నది. ఉదాహరణకి మిథునాన్నే తీసుకుందాం. ఏవిటి దీనిలో ఉన్న సామాజిక స్పృహ, మెసేజి ఏవిటి అన్నారు. మెసేజి అంటే ఏవిటి, ఆర్ధిక సూత్రాలు చెబితేనో, లేక స్లోగన్లు చెబితేనేనో మెసేజి అవుతుందా? దాంపత్యం అంటే ఇలా ఉండాలి, జీవితాన్ని హాయిగా, ఆనందంగా గడపాలి, ఇలా జీవించవచ్చు అని చెబితే అది మెసేజి కాదా? ఒక boy meets girl ఒక sweet lover story ఎందుకు రాయకూడదు? ఇలా విరసం కానీ, ఇంకో సంఘం కానీ, ఇదే సాహిత్యం, ఇటువంటిదే కథ అని సంకుచితమైన నిర్వచనాలు పెడుతున్నారు. ఎందుకా సంకుచితత్వం?  కాళీపట్నం రామారావుగారు సంకల్పం అనే కథ రాస్తే వీళ్ళంతా చొక్కాలు చించుకున్నారు. ఎందుకుట? అందులో ఒక పాత్ర కాశీకి పోయి గంగలో స్నానం చేసి .. ఇలాంటి తతంగమేదో జరుగుతుంది. రామారావు గారేవిటి, ఇల్లాంటి కథ రాయడమేవిటి అని ఇక్కడ వీరంగాలు. ఆయనేమి పోనీ ఇలా చెయ్యాలని దాన్ని ఎండోర్సు చెయ్యడం కానీ ఏం చెప్పలేదే. కథలో ఒక పాత్ర అలా చేసిందని రాశారు. దానికి పెద్ద అలజడి. వీళ్ళ బుర్రలు తీసుకెళ్ళి చిలక్కొయ్యకి తగిలించేసి, ఎవడో నొక్కే రిమోట్ కంట్రోలుతో కదుల్తూ ఇదే కథ, ఇదే సాహిత్యమని వంత పాడ్డం.

పాఠకుల్ని రీచవ్వాలి, టచ్ చెయ్యాలి. నా మట్టుకి నాకు అది ముఖ్యమైన క్రైటీరియానే. ఏ రూపంగా అయినా కానీ, మిథునం కథ మూడులక్షల ఇరవై వేల కాపీలు సర్క్యులేట్ అయింది. సినిమాగా తీస్తే, మెచ్చుకోడానికి మెచ్చుకున్నారు, డబ్బు కూడా నష్టపోకుండా కొద్దిగా లాభమే వచ్చింది. దాందేవుంది, గడ్డం గీసుకునే బ్లేడు కూడా లక్షల్లో అమ్ముడు పోతుంది, అదొక గొప్పనా అంటారు. తెలుగు సాహిత్యం అచ్చవడం మొదలెట్టాక గయోపాఖ్యానం పద్యనాటకం లక్షకాపీలు అమ్ముడు పోయింది. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ఉదయశ్రీ ఇప్పుడు యాభై నాలుగో ఎడిషను నడుస్తోంది. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా. ఇదే గొప్పది, అది గొప్పది కాదు అనడానికి మనమెవరం? రాయగలిగిన వాడు రాస్తాడు. అది బాగా అమ్ముడు పోతుందో పోదో ముందు రాస్తే గదా? ఇట్లాంటివి రాయకూడదు అంటే . .. ఐదొందల కాపీలు మాత్రమే అమ్ముడుపోయిన చాలా గొప్ప రచనలు ఉన్నాయి. వేలల్లో అమ్ముడు పోయినవీ ఉన్నాయి.

రచయితగా తరవాతి అడుగు ఏవిటి మీకు?

రాసినవి పుస్తకాలుగా రావలసిన మెటీరియల్ చాలా ఉంది. ఆ పని కొంత జరుగుతోంది. సి.పి. బ్రౌన్ ఎకాడమీ తరపున కొన్ని మంచి పుస్తకాలు, అనువాదాలు వేశాము. సరే, కథలు రాస్తూనే ఉంటాను. ఉద్యోగపు తొలి రోజుల్లో నండూరి, పురాణం వంటి గొప్ప పాత్రికేయులతో, అటుపైన సినిమాల్లో బాపు రమణలతో కలిసి, సన్నిహితంగా పనిచేసిన అనుభవం. అదీ అదృష్టమంతే. నా జీవితంలో గుర్తు పెట్టుకోదగినది, చెప్పుకోదగినదీ ఏమన్నా ఉందీ అంటే, ఇదే చెప్పుకుంటాను నేను.

*

ఎస్. నారాయణస్వామి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రశ్నలాధారిత వ్యాసం బాగుంది. తెలిసిన విషయాలనే కథావస్తువులుగా తీసుకొంటే మంచి కథలు వస్తాయన్న సంగతి స్పష్ఠంగా ఉంది. రచయిత ఎప్పుడు రమణ గారిని వాళ్ళ ఊర్లో కలిసారో టైమ్ రెఫరెన్స్ ఇస్తే బాగుండేది కదా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు