సంచార జాతుల జీవిత పోరాటం ‘లచ్చి’

తెలంగాణ తనను తాను శోధించుకుంటూ నేలమాళిగను తవ్వుకుంటూ పోతున్నా కొద్దీ ఎన్నో అనర్ఘ సాహితీ రత్నాలు బయట పడుతున్నాయి. మానేరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డా. పత్తిపాక మోహన్ కృషి వల్ల అట్లా బయటపడిన మట్టిలో మాణిక్యం, తెలంగాణ తొలితరం కథా రచయిత గూడూరి సీతారాం (1936-2011). 1950-1965 మధ్య సుమారు 85 కథలు, ‘పాతకొత్తలు’తో పాటు మరో నవలికను రాశారు. డా. సి. నారాయణరెడ్డి స్వగ్రామమైన సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజిపేటలో పుట్టిన సీతారాం విద్యార్థి దశలోనే గోరా, లవణం ప్రభావంతో ‘ఎథీస్ట్ బాయ్స్ క్లబ్’ను మిత్రులతో కలిసి స్థాపించారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలోనే ‘విద్యోదయ’ అనే రాత పత్రికను నడిపారు. అలాగే ‘నారయ ఆంధ్ర భాషా నిలయం’ను పునరుద్ధరించి కొన్నెండ్లు నడిపారు.

1953లో ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే ‘స్త్రీ స్వాతంత్ర్యం’ అనే కథను రాశారు. 1956లో సిరిసిల్లలో పదవ తరగతి చదువుతున్నప్పుడే ‘తరంగిణి’ అనే పత్రికను నడిపారు. దాశరథి కృష్ణమాచార్యులు అధ్యక్షులుగా, డా. సి. నారాయణరెడ్డి కార్యదర్శిగా స్థాపించబడిన ‘తెలంగాణ రచయితల సంఘం’కు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడే ‘నినాదం’ అనే పత్రికను నడపటంతో పాటు ‘చిరుగజ్జెలు’ అనే పుస్తకాన్ని ప్రచురించారు.

అంతేగాక కొన్ని కథలు, కవితలతో ‘మల్లెమొగ్గలు’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ‘తెలుగుదేశం’ పత్రికలో ‘లేఖావళి’ పేరుతో కొన్ని రోజులు కాలమ్ రాశారు. గ్రామాల్లో తిరిగి ఎన్నో జానపద గేయాలు సేకరించారు. వీటిలో కొన్నింటిని ఆచార్య బిరుదురాజు రామరాజు ప్రచురించారు. కాళోజీ నారాయణరావు ‘నా గొడవ’ తొలి ప్రచురణకు ప్రూఫులు చూడడంతోపాటు డా.సి. నారాయణరెడ్డి  సిద్ధాంత గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు-ప్రయోగములు’ శుద్ధప్రతిని రాసి పెట్టారు. చనిపోయే వరకు ‘మానేరు రచయితల సంఘం’ అధ్యక్షులుగా ఉన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ‘నెల్లూరి కేశవ స్వామి ఉత్తమ కథలు’తో పాటు ఎన్నో పుస్తకాలకు సంపాదకులుగా ఉన్నారు. ఇంత సాహిత్య నేపథ్యం ఉన్నా 2004లో మానేరు రచయితల సంఘం లభ్యమైన 14 కథలతో జూకంటి జగన్నాథం విలువైన ముందు మాటతో ‘గూడూరి సీతారాం కథలు’ ప్రచురించేదాక సీతారాం విస్మృత కథకుడే.

ప్రధాన స్రవంతి కథా సాహిత్యం బ్రాహ్మణీయ, అగ్రహారిక ఇతివృత్తాలతో సాగిపోతున్న కాలంలోనే సీతారాం బహుజన జీవితాలను ఇతివృత్తంగా స్వీకరించి గురజాడ కన్నా ఎక్కువ కథలు రాసి తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు. ఈయన రాసిన కథల్లో సంచార జాతులు అల్లే ‘ఈత చాప’లాంటి కథ ‘లచ్చి’. ఈ కథ మొదట 1957లో స్రవంతి మాస పత్రికలో ప్రచురింపబడింది. తరువాత అనేక సంకలనాల్లో చోటు సంపాదించుకుంది.

‘మనిషి సంఘజీవి’ అని అరిస్టాటిల్ లాంటి వారు మనిషి స్థిర జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పినా నిజానికి మనిషి సంచార జీవి. ఆదిమ కాలంలో ఆహారం కోసం, తరువాత పోడు వ్యవసాయం కోసం, స్థిర నివాసం కోసం, ఉపాధి కోసం, వివిధ అవసరాల కోసం మనిషి పుట్టినప్పటి నుండి చచ్చే దాకా ఒక దగ్గర కాలు నిలవక ఏవో వలయాల్లో తనను తాను బంధించుకోవడానికి సంచరిస్తూనే ఉంటాడు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస పోతూనే ఉంటాడు. వలస తప్పు కాదు కాని దాని స్వభావమేమిటనేదే ప్రశ్న. ఆధిపత్యం కోసమా? అవసరం కోసమా? పొట్ట కూటి కోసమా? నూటికి తొంభై శాతం మంది పొట్ట కూటి కోసం, ఉపాధి కోసం పల్లెల నుండి పట్టణాలకు వలస పోతున్నారు. ఒకటి రెండు శాతం బిలియనీర్లు ఇప్పుడిప్పుడు పల్లెలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారు. మిగిలిన వాళ్ళు ఆధిపత్యం కోసం, పెట్టుబడిదారులుగా వ్యాపారం కోసం, రాజకీయ ప్రయోజనాలను ఆశించి వలస పోతున్నారు.

ఒక ఊరంటూ లేకుండా పిడికెడు మెతుకుల కోసం నిత్యం ఊళ్ళు పట్టుకొని సంచరించే బిచ్చగాళ్ల జీవితం ఆలోచిస్తేనే కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఏ ఊరికి వెళ్ళినా ముందు అక్కడి పోలీస్ స్టేషన్ లో పేరు నమోదు చేయించుకొని పోలీసుల పర్మిషన్ తో ఊళ్ళో బిచ్చం ఎత్తుకోవాలి. పొరపాటున ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగితే ముందుగా అనుమానించేది ఈ సంచార జాతులనే. దొంగతనం జరగగానే నిర్ధాక్షిణ్యంగా వీళ్ళను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే. ఈ కథలో కూడా కొత్తగా పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టి ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్న తరుణంలోనే ఊళ్ళో దొంగతనం జరిగిందని రంగడనే పిచ్చకుంట్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఒళ్ళు సున్నం సున్నం చేస్తారు.     ఈ విషయం తెలిసిన అతని భార్య లచ్చికి పై ప్రాణాలు పైనే పోతాయి. ఏం చేయాలో అర్థం కాదు. రంగడిని ఎలా విడిపించాలో కూడా తెలియదు. మూన్నాలుగు రోజులకు పోలీసులే వదిలేస్తారు. చేయని దొంగతనానికి ఊళ్ళో అందరూ దొంగ దొంగ అంటారు. అవమానం భరించలేక రంగడు ఊరు వదిలేసి పట్టణం పోతాడు. అక్కడ జీవితం మరింత సంక్లిష్టం. ఇక్కడ ఎవరింటికి బిచ్చానికి పోయినా పైసలు వేస్తారు కానీ అన్నం పెట్టరు. మెల్లగా లచ్చి ఇంట్లో వంట వండటం షురువు చేస్తుంది. రంగడికి ఈ బిచ్చమెత్తడం నచ్చక డబ్బులన్నీ కూడేసి ఒక రిక్షా కొంటాడు. ఇదే రంగది జీవితాన్ని మరింత శిథిలం చేస్తుంది. లచ్చి కూడా నాలుగు ఇండ్లల్లో పనికి కుదురుకుంటుంది.

ఓ సారి రిక్షాకు లైట్ లేదని పోలీసులు పట్టుకొని సంపాదించినదంతా లాక్కుంటారు. క్రమంగా రిక్షా, నగరం, స్నేహితులు రంగడిని ఎంతో మార్చుతారు. సిగరెట్లు, మందు, పాన్లు, చాయెలు, సినిమాలు అలవాటు అవుతాయి. రాత్రుళ్లు బాగా తాగి వచ్చి లచ్చిని కొట్టడం మొదలు పెడుతాడు. మరో రోజు తన ఇంట్లో నుండి వేరే మగాడు బయటకు రావడం చూసి లచ్చిని అనుమానించి అలిసి పోయేదాకా కొడుతాడు. భర్త ఎందుకు ఇలా మారి పోతున్నాడో లచ్చికి అసలు అర్థం కాదు. ఇంకో రోజు రంగడికి యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో పడుతాడు. అప్పుడు లచ్చి సకల సేవలు చేసి రంగడిని దక్కించుకుంటుంది.

ఆసుపత్రిలో రంగడికి జ్ఞానోదయమై లచ్చిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఇదంతా రిక్షా తెచ్చిన చిచ్చు అని గ్రహించి రంగడు ఈ జీవితం వద్దు మళ్ళీ పాత జీవితం మొదలు పెడుదామని అంటాడు. రంగడు మారినందుకు లచ్చి కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుతాయి.

భారతీయ సమాజంలో ఇంకా విముక్తి లభించని జాతులు, జీవులున్నారు. తెలంగాణలో సంచార జాతులకు చెందిన వడ్డెరలు ఇండ్ల పునాదులు, కాలువలు తవ్వుతూ బండలు కొడుతూ బతుకు కొనసాగిస్తుండగా అడవులపై ఆధారపడి బుట్టలు అల్లడం, పందిర్లు వేస్తున్న మేదరులు, ఎద్దుల ఆటలతో గంగిరెద్దుల వారు, వాగుల్లో, వంకల్లో చేపలు పడుతూ పొట్టపోసుకుంటున్న బెస్తలు, జాలరులు, తీరైన వేషధారణతో ఇంటింటికి వచ్చి పిల్లా పాపలను అలరించే బహురూపులు, పాముల ఆటతో పాములోళ్లు, సర్కస్ విన్యాసాలతో దొమ్మర్లు, జంగంవాళ్లు, కాటికాపర్లు, కొరడాలతో ఎల్లమ్మలవాళ్లు, పెద్దమ్మలవాళ్లు, రోడ్లపక్కన మూలికా వైద్యం చేసే మందుల వాళ్లు, వెంట్రుకలను సేకరించే బండ, మండి వాళ్లు, స్ర్తిల అలంకార వస్తువులు, చిన్నచితకా సామగ్రి అమ్మే పూసలవాళ్ళు, వాల్మీకి, బోయ, రాజనాల, గోత్రాలు, ఫకీర్, అత్తరు సాయిబు, జింక సాయిబు, కృష్ణబలిజ, కూనపులి, ఫతర్ ఫోడా, ఆరె మరాఠి, బొమ్మా, తలయారీ, చంద్రు కంజర భట్ట, కెంపు మారె, పరి ముగ్గుల, జోగి, వీరభద్రీయ, వీరముష్టి మొదలైన విముక్తి సంచార జాతుల వాళ్ళున్నారు.

వీరికి స్థిర నివాసం లేక పోవడం వలన వీళ్ళ పిల్లలకు కూడా చదువుకు దూరమౌతున్నారు. కొంత మంది ఊరి చివర పాకలు వేసుకొని ఆధ్యాత్మిక ప్రచారం, సంస్కృతిని వ్యాప్తి చేస్తూ ఉన్న ఊళ్లలోనే కాందీశీకులుగా అనాగరిక వాతావరణంలో బతుకులీడుస్తున్నారు. ఈ జాతుల్లో కొన్ని కులాలు యాచన చేస్తుంటే ఇంకొన్ని సంస్కృతి సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నాయి. మరికొన్ని కులాలు సంచార జీవనం సాగిస్తున్నాయి. ఈ సంచార జాతుల సమూహాన్ని వారి పరిభాషలో పరదేశీ అంటారు. నేరమయ జీవితం, బానిస బతుకుల ముద్ర పడిన వీరి స్థితిగతులపై స్వాతంత్ర్యం పూర్వం, అనంతరం అనేక కమిటీలు అధ్యయనం చేశాయి. ఫలితంగా 1952 ఆగస్టు 31న కేంద్రం సంచార జాతులను విముక్తి జాతులుగా డీ నోటిఫైడ్ చేసింది. అంటే ఏళ్లుగా జైళ్లల్లో ఉండి, సంచార, బానిస బతుకులు గడుపుతున్న దుస్థితి నుండి విముక్తి చేసినట్టు ప్రకటించిన రోజు.

అయినా వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విముక్తి లభించలేదు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా బ్రిటిష్ కాలం నాటి చట్టాలే కొనసాగుతూ సంచార జాతివారిపై నేరగాళ్ల ముద్ర వేస్తూనే ఉంది. చేయని తప్పులకు బలిచేసే సంప్రదాయం కొనసాగుతుండడం అవమానకరం. ప్రభుత్వాలు వీరిని పట్టించుకోకపోవడానికి కారణం వీరికి స్థిర నివాసాలు లేవు. ముఖ్యంగా వీరు ఓటు బ్యాంకులుగా లేరు. కులాల ప్రాతిపదికన ఎక్కువ సంఖ్యలో వీరు బీసీ-(ఏ)లో ఉన్నప్పటికీ ఏ న్యాయం జరుగలేదు. సంచార జాతుల్లోని దాదాపు 50కి పైగా కులాల్లో కనీస విద్య లేదు. 70కి పైగా కులాల్లోని వారికి పక్కా ఇళ్లు లేవు. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు లేవు. అంతెందుకు ఇప్పటికీ దాదాపు 25 కులాలకు కనీసం కుల ధ్రువీకరణ పత్రాలు జారీ కాలేదు. బిచ్చగాళ్లుగా, బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో దొంగలుగా సంచార జాతులను అభివర్ణిస్తూ అంటరానివారిగా చూస్తున్నారు. ‘లచ్చి’ కథ ఈ దృశ్యాలనన్నింటినీ మన కళ్ళకు కట్టేలా చూపిస్తుంది.

సీతారాం కథలన్నీ మౌఖిక కథలుగా కనిపిస్తాయి. శైలీ, శిల్పాలు, భాష చాలా ఆకట్టుకుంటాయి. భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి దశకంలో కలం పట్టిన సీతారాం సోకాల్డ్ ప్రామాణిక భాషలో కాకుండా కథలన్నీ హాయిగా తెలంగాణ మండలికంలోనే రాయడం గమనార్హం. ఇక్కడి జీవితాన్ని ఇక్కడి భాషలోనే రాయడం కనిపిస్తుంది. సీతారాం రాసిన చాలా కథల్లో రంగడే కథానాయకుడు. బహుశా కథలు వేరైనా చెప్పే జీవితం ఒకటే కావడం వల్ల కథకుడు ఆయా పాత్రలకు ఇలా ఒకే పేరును పెట్టి ఉండవచ్చు. లచ్చి ఒక దశలో అటు తల్లిదండ్రుల ఆదరణ కరువై, ఇటు భర్త ఆదరణ కరువై నలిగిపోతుంది. జీవితంలో ఏదో వెలుగును ప్రసరిస్తుందనుకున్న నగరం మరింత చీకట్లోకి నెట్టేస్తుంది. కథకుడు చూపించిన మళ్ళీ పాత జీవితమనేది పరిష్కారం కాకపోయినా కరోనా నేపథ్యంలో కొన్ని వేల మంది వలస జీవులు/సంచార జీవులు చిట్లిన పాదాలతో, రోడ్లను రక్తంతో స్పర్శిస్తూ తమ స్వగ్రామాలకు చేరుకుంటున్న సందర్భంలో ఈ కథ ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. సంచార జీవులు ఉన్నన్ని రోజులు ఈ కథ సజీవంగా ఉంటుంది.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

12 comments

Leave a Reply to సంకేపల్లి నాగేంద్ర శర్మ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాలాంటి చాలా మందికి తెలియని తొలి తరం తెలంగాణ రచయిత కీ.శే. గూడూరి సీతారాం గారిని ఈ శీర్షిక ద్వారా పరిచయం చేసిన శ్రీ శ్రీధర్ గారికి ధన్యవాదాలు. సంచార జాతుల గురించి అరవై సంవత్సరాల క్రితమే రాయబడిన కథ “లచ్చి” ని చదివాక ఆవేదనతో పాటు ఆశ్చర్యమూ కలిగింది. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది సంచార జీవుల జీవితాల్లో కష్టాలు కడతేరనేలేదు. ప్రస్తుతం కరోనా వల్ల దయనీయంగా మారిన వలస కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ కథపై శ్రీ శ్రీధర్ గారి విపుల విశ్లేషణ ఆలోచనలను రేకెత్తించేదిగా ఉంది.

  • మా తరానికి ఇలాంటి కథ పరిచయం చేసి , మంచి విశ్లేషణ ఇచ్చినందుకు కృతఙ్ఞతలు..

  • సీతారాం గారి గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది. కధ విశ్లేషణ నచ్చింది.

    గురజాడ చనిపోయింది 1910 వ సంవత్సరంలో, సీతారాం గారు పుట్టింది 1936 లో, అంటే మధ్యలో రెండున్నర దశాబ్ధాల కాలం ఉంది. కచ్చితంగా ఎంతో కొంత సామాజిక మార్పు ఉండే ఉంటుంది. గురజాడ గారికి సీతారాం గారు సమకాలీకులు కుడా కాదు, అయినప్పటికి ఈ క్రింది పోలిక అగత్యం / అంతరార్ధం అర్ధం కాలేదు.

    ప్రధాన స్రవంతి కథా సాహిత్యం బ్రాహ్మణీయ, అగ్రహారిక ఇతివృత్తాలతో సాగిపోతున్న కాలంలోనే సీతారాం బహుజన జీవితాలను ఇతివృత్తంగా స్వీకరించి గురజాడ కన్నా ఎక్కువ కథలు రాసి తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు.

  • కథా విశ్లేషణ బాగుంది. చాలా విషయాలు తెలసుకోగలిగాను.
    అభినందనలు 💐💐💐🙏

  • చక్కని విశ్లేషణ శ్రీధర్ గారు…

  • అనేక ఆవిష్కరణ లు చోటుచేసుకున్నా మారని మాయని మనుషుల మౌన వేదన ఆనాటి సమాజంలోని సంచార జీవుల వెతలను కథలలో యధార్థ జీవన వర్ణన రచయిత కథలు చాలబాగా ఉంటాయి మీరు వ్రాసిన సమీక్ష ఆలోచనాత్మకంగా
    ఉంది చాల వరకు సంచార జాతుల వారు తమ జీవన భద్రత లేక బతుకు దుర్భరమై కష్టాల తో బతుకు పోరాటం చేస్తున్న విజయం బాధాకరం
    మంచి విశ్లేషణ

  • సంచార జాతుల.విశ్లేషణ, అట్టడుగు రేఖ కింద ఉన్న నాటి పిచ్చకుంట్ల వారి జీవన విధానాన్ని బాగా నొక్కి చెప్పారు.గూడూరిని తొలి తరం కథా రచయితగా ఆవిష్కరింప బడిన తీరును చక్కగా చెప్పారు. సీతారాం గారు ఒక మాస్టర్ వీవర్, వేములవాడ ఆలయ ధర్మకర్త, కాం గ్రెస్ నాయకులు, వేములవాడ బ్లాక్ మేనేజర్..ఇలా ఆయన జీవితంలో విభిన్న కోణాలు ఉన్నాయి.పైగా ఆయన సహృదయతే ఆయనకు చక్కటి పేరును తెచ్చింది. మీరు అన్నట్లు pattipaka కథలు సేకరించి వేయకుంటే, ఇలా మనం చర్చించు కొనే వాళ్ళం కాము. మీ ఉభయులకి శరణార్థి.

    సంకేపల్లి నాగేంద్ర శర్మ,రచయిత,కరీంనగర్, 80748 26371

  • సీతారాం కథలన్నీ మౌఖిక కథలుగా కనిపిస్తాయి. శైలీ, శిల్పాలు, భాష చాలా ఆకట్టుకుంటాయి. భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి దశకంలో కలం పట్టిన సీతారాం సోకాల్డ్ ప్రామాణిక భాషలో కాకుండా కథలన్నీ హాయిగా తెలంగాణ మండలికంలోనే రాయడం గమనార్హం. ఇక్కడి జీవితాన్ని ఇక్కడి భాషలోనే రాయడం కనిపిస్తుంది.
    ———-/////////////////————————-
    గూడూరు సీతారాం పై మీరు వెలుబుచ్చిన
    పై అభిప్రాయం అర్థవంతంగా వుంది సార్ !అభినందనలు!👌👌

  • సంచార జాతుల మీద మంచి విశ్లేషణ. సంచార జాతుల సమస్యల మీద మరిన్ని కథలు రావాల్సిన అవసరం ఉంది.

  • శ్రీధర్ గారూ సీతారాం గారి లచ్చి కథపై మీ విశ్లేషణ బాగుంది.నేటి తరానికి ఆనాటి మరియు నేటి రోజులలో సంచార జాతుల బతుకులను కళ్ళకు కట్టినట్లు తెలియపరచిన సీతారాంగారు మరచిపోలేని మనిషి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు