అప్పటివరకు రద్దీగా వున్న టీకొట్టు అప్పుడే కాస్త ఖాళీ అయ్యింది. ఊరును కప్పి ఉంచిన మంచు దుప్పటిని అప్పటికే సూరీడు తీసేయడంతో ఊర్లో వాళ్ళు ఎవరి పనులకు వాళ్ళు బయలుదేరుతున్నారు. టీ కొట్టుకు కాస్త దగ్గర్లో ఆరిపోయిన చలిమంటను ఆనుకోని ఓ కుక్క ముడుచుకు పడుకుంది. టీకొట్లో గ్యాస్ స్టవ్ పై పాత్రలో మరుగుతున్న ‘టీ’ను చెంచాతో కలుపుతుంటే వాసన చుట్టుపక్కలకు వెచ్చగా పాకుతుంది. చలికి చీర కొంగును తలపై పూర్తిగా కప్పుకున్న అచ్చప్ప మరుగుతున్న టీ కోసమై స్టీల్ గ్లాస్ పట్టుకొని ఎదురుచూస్తుంది.
“అయ్యా… ఇంకవ్వనిదేటిరా టీ” అప్పటివరకు ఓపికగా నిల్చున్నదాయి అడిగింది.
“మరగొద్దెటే…ఏటి తొందర… బాగా మరగకపోతే రేపొచ్చి టీ బాలేదంతావు మళ్ళా నువ్వే” టీ ని కలుపుతూ బదులిచ్చాడు టీ కొట్టు యజమాని సత్యం.
“అది కాదురా అయ్యా… కళ్ళానికెళ్ళాలిరా”అంది.
ఆమె మాట్లాడినప్పుడు నోటిలోంచి తెల్లని పొగలాగ రావడంతో పాటు ముక్కు కమ్మి లయబద్దంగా ఊగుతుంది. అంతలో అక్కడికి పొడవాటి వెదురు కర్ర సాయంతో నడుచుకుంటూ ఓ ముసలాడు వచ్చాడు. వస్తూనే…
“అయ్యా… టీ ఇయ్యరా”అన్నాడు.
“అలా కూర్సో… ఇత్తాను”అని చెబుతూ. అచ్చప్ప గ్లాసులో టీ పోసి పంపించాడు సత్యం.
“ఏమి ఆలస్యమైపోనావు”అడిగాడు సత్యం. ముసలోడికి సరిగా వినబడలేదేమో బదులివ్వలేదు. అక్కడున్న బెంచిపై కూర్చున్నాడు. చేతికర్రను కాళ్ళ మధ్యలోంచి భుజానికి ఆనించి నిలబెట్టాడు.
“ఆ కర్ర గోడకు సేరబెట్టొచ్చు కదా… నడుసుకుంటూ కర్ర ఎటైనా ఎల్లిపోతాదేటి?” అంటూ ముసలాడి దగ్గరున్న కర్రను ఇసురుగా లాక్కుని టీ ని చేతికందిస్తూ కర్రను గోడకు చేరబెట్టాడు సత్యం. ముసలాడు ఊదుకుంటూ టీ తాగడం మొదలెట్టాడు.
అప్పటికే వేరే బెంచీపై కూర్చున్న ఓ ఇద్దరు కుర్రాళ్ళు పేపర్ చదువుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకడు “రెండు టీ లు ఇవ్వు చిన్నాన్న”అంటూనే ‘పందెంలో… నూటఏబై మోమో లు తిని అస్వస్థతకు గురై చనిపోయిన యువకుడు’ మనసులో చదువుకుంటున్నట్టే పేపర్లో వార్తను బయటికి చదివాడు.
“మోమో లు అంటే” అడిగాడు పక్కనున్న వాడు.
“మోమో లు అంటే చికెన్ తో తయారుచేసిన ఓ రకమైన తినుబండారం”
“అయ్యో… పాపం”అన్నాడు సత్యం.
“మొన్నీ మధ్య మా ఫ్రెండాల్ల ఫ్రెండ్ కూడా ఇలాగే బైక్ రేస్ లో ఏక్సిడెంట్ అయ్యి సచ్చిపోయాడు”అన్నాడు మరో కుర్రాడు.
“మనూర్లో కూడా ఓ గుంటడు కూడా ఇలాగే పందేలు కాసి సివరికి అప్పలపాలయిపోయి సచ్చిపోడానికి ట్రై చేసాడు ఆ మధ్య…అదృష్టం బాగుండి బతికిపోనాడు”అన్నాడు సత్యం ఇద్దరు కుర్రాళ్ళ చేతికి టీ అందిస్తూ.
“ఆడా…ఆడు పేరు మురళి…ఆడు ఆన్లైన్ పందేలు ఆడీవోడు చిన్నాన్న అందుకే అలా చేశాడు” అన్నాడు ఇద్దరి కుర్రాళ్ళో ఒకడు.
పందెం అన్న మాట వినగానే టీ తాగి వెళ్లిపోవాల్సిన ముసలాడు అలాగే కూర్చుండిపోయి “ఏటి … పందెమా?”అన్నాడు.
“ఓరి నాయినో.. ఈడికి ఇనబడిపోయిందేటిరా!… పందెం అంటే ఇక వదలడు బుర్రలు తినెత్తాడు సూడండి “అన్నాడు సత్యం.
“ఏమైంది చిన్నాన్న”అన్నారు కుర్రాళ్ళిద్దరూ.
“ముసలోడు సెబుతాడు వినండి”అన్నాడు. కుర్రాళ్ళిద్దరూ ఆసక్తిగా వినడం మొదలెట్టారు.
ఇంతలో అక్కడికి “మీరు ఇక్కడున్నారేటిరా?” అంటూ పతివాడ మురళి వచ్చి కూర్చున్నాడు. “ఈడికో టీ ఇవ్వు చిన్నాన్న” అని అన్నాడు ఆ ఇద్దరి కుర్రాళ్ళో ఒకడు. సత్యం ‘టీ’ ని కుర్రాడి కందిస్తూ ఆడి చేతి మణికట్టును చూశాడు. మణికట్టుపై గాయం తాలూక గుర్తు ఇంకా పచ్చిగా వుంది. ” నువ్వు పతివాడ అప్పలస్వామి మనవడివి కదా!” అడిగాడు సత్యం. అవునన్నట్టు తలూపాడు టీ తాగుతూ మురళి.
“ఇప్పుడేమి పందేలరా… మేము వయసులో వున్నప్పుడు సూడాలి”అంటూ కమీజు జేబులో వున్న చుట్టను బయటికి తీసి దాని చివరను మునిపంటితో కొరికి వెలిగించాడు. గట్టిగా పొగను లోపలికి పీల్చి గాలిలోకి వదిలాడు. ఆ పొగ మంచుతెరలా గాలిలో తేలియాడుతూ పైకి పోతుంది. అక్కడున్నవారు వింటున్నారా! లేదా అనేదానితో సంబంధం లేకుండా ఇదే అదుననుకొని చెప్పడం ఆరంభించాడు ముసలాడు.
“ఆ రోజుల్లో ఈ టీ కబ్బు ఇలాగుండేదా?…పొద్దల్లా పొయ్య మండుతూ ఉండేది. పొయ్యపైన కేటలీ ఆవిర్లు కక్కేది. ఎప్పుడూ జనాలతో కళ కళలాడేది. ఊరు ఊసులు… రాజకీయాలు…మా ఇంటి పేరోడు అది సేయగలడు అంటే … మా ఇంటి పేరు గలోడు ఇది సేయగలడు అంటూ వాదులాటలు నిత్యం జరిగేవి. అవి ఎంతవరకూ ఎల్లేవంటే ఒకోసారి అవి పందేలు అయిపోయేవి. కబ్బులో ఏడేడి ఇడ్లీ ఎవరెక్కువ తింతారు. ఊరవతల మర్రిచెట్టు తొర్రలో దాచిన ఇచ్చు రుపాయిను అర్దరాత్రి ఒంటిగెళ్ళి ఎవరు చెప్తారు?. సంగడిరాళ్ళు… కోడిపందాలు…అబ్బో ఒకటేటి.
ఓసారి ఇలాగే యడ్లోల్లకి …పతాడోళ్ళకి మధ్య ఈ కబ్బులో మాటా… మాటా పెరిగింది. అప్పుడే పొయ్య దిగిన ఏడేడి ఇడ్లీ ఎవరెక్కువ తింటారన్నది పందెం. నేను తినడం మొదలెట్టాను. నాకు పోటీగా ‘పతాడ అప్పలస్వామి’ తినడం మొదలెట్టాడు. నేను తినలేకపోయాను గాని అప్పలస్వామి మాత్రం మొత్తం వాయి తినేసాడు. ఎత్తు మనిషి.. మోటుగా ఉంతాడు కదా. ఇక సూడాలి పతాడోళ్ళు మీసాలు మెలేసి తొడలు కొట్టడం మొదలెట్టారు. తప్పదు… ఓడిపోనాం కాబట్టి మాఇంటి పేరోళ్ళం తలలు దించుకున్నాం”.
మధ్యలో కల్పించుకొని “పతాడ అప్పలస్వామి అంతే…ఈ మురళీ గాడి తాతేనర్రా” అన్నాడు సత్యం. అప్పటివరకు చెబుతున్న ముసలాడు చెప్పడం ఆపి మురళీ కళ్ళల్లోకి చూశాడు. మురళీ కూడా ముసలాడి వైపు ఏదో అర్థమయినోడికి మల్లే చూశాడు. ఇద్దరి కళ్ళు కాసేపు కలుసుకున్నాయి. నోటిలోంచి చుట్ట తీసి తుప్పున ఉమ్ము ఊసి మరలా చెప్పడం మొదలెట్టాడు ముసలాడు.
“మల్లోసారి ఇలాగే మాటా… మాటా పెరిగింది. ఇడ్లీలు ఎవరైనా తింతారు. దమ్ముంటే మిరపగాయులు తినండని మావోడొకడు వాళ్లకి సవాలు ఇసిరాడు. మళ్లీ అప్పలస్వామికి … నాకే పోటీ పడింది. ఈసారి మాము గెలిసాం. తొడలుగొట్టాం… మీసాలు మెలేసాం”
ముసలాడు మాటలకు అడ్డుపడుతూ “ఈ పందేలలో పెద్ద గొప్పేముంది” అన్నాడు ఓ కుర్రాడు. అవునన్నట్టు పక్కనున్నోళ్ళు ముఖం పెట్టారు.
నోట్లోంచి చుట్టను మరలా తీసి ఖాండ్రించి బయటికి ఉమ్మి ఆరిపోయిన చుట్టను ముట్టించి ముసలోడు మరలా చెప్పడం మొదలెట్టాడు.
“అది… ఏసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. సెరువులు ఎండిపోతున్నాయి. జనాలకు పొలాల్లో పెద్దగా పనులు లేవు. ఇళ్లల్లో అందరూ ఉక్కిపోతుంటే. ఊసుపోనోళ్లందరూ టీ కబ్బులో కూర్చున్నారు. ఊరు మొత్తం ఒకటే వార్త… పులి…”
“పులా!?”అంటూ నోరెళ్లబెట్టారు కుర్రాళ్ళు.
“అవును పులే… చింతలపేట కొండమీద పులి తిరుగుతుంది. రాత్రుళ్ళు ఊరి బయలకి వచ్చి దొడ్లో వున్న ఏ మేకనో… గొర్రెనో వొట్టికెళ్ళిపోతుంది. సాయంత్రమైతే ఊరు దాటి బయలకెళ్ళడానికి జనాలు భయపడ్డారు. సాయంత్రమే కాదు…. పట్ట పగలు కూడా పశువులు మేపడానికి ఎల్లినోళ్ళు…. నెల్లిమర్ల జూటు మిల్లి కెళ్ళినోళ్ళు ఇబ్బంది పడ్డారు. పొయ్యమీద మరుగుతున్న టీ కంటే ఈ పులి గురుంచిన వార్తే వేడిగా తిరిగింది ఊర్లో.
‘ఒరేయ్… ఇడ్లీలు తినడం… మిరక్కాయలు నమలడం కాదురా… ఇప్పుడు ఈ పులి మీద కాసుకోండిరా పందేలు’అంటూ అక్కడున్న వాళ్లందరికీ సవాలు ఇసిరాడు సూరితాత.
‘అవునురా దమ్ముంతే ఆ పులిని కొట్టండిరా?’అంటూ ఓ ముసలాడు వంత పాడాడు సూరితాతకి.
‘అప్పుడుదాకా.. ఈ సొల్లు కబుర్లు ఆపి ఆ పులిని కొట్టే పనేదో సూడండి’అని మరొకడన్నాడు.
‘మా యడ్లోళ్లు అంత పోటుగాళ్ళు… మా పతాడోళ్ళు ఇంత పోటుగాళ్ళు అని తెగ కోతలు కోస్తారు కదా.. మరి ఈ పులి సంగతి ఆళ్లనే సూడమనండి’కాసింత ఎగతాళిగా అన్నాడు క్రిష్ణ.
‘అవునురా.. ఆ పనేదో సూడండిరా’అంటూ అక్కడున్నోళ్ళందరూ బయటికి కదిలారు.
ఆరోజు నుండి కత్తవ బొరుగులు వొట్టుకొని అందరూ గుంపులు గుంపులుగా పులిని ఎతకడం మొదలెట్టారు. పనిగట్టుకొని పట్టుకుంటానంటే పిల్లే దొరకదు. ఇక పులి దొరుకుతదా? పులి దొరకలేదు సరికదా… ఊరిచివర పులి తిని వదిలేసిన మేక ఆస్థిపంజరం ఒకరోజు దొరికింది. మరోరోజు మేకల కాస్తున్న అమ్మయ్య కంటికి పులి అవుపడింది. ఇంకోరోజు పొద్దున్నే మిల్లుకు ఎలుతున్న మనుషులను చెరువు గట్టు మీద అటకాయించింది. పులిని కొట్టడానికి బయలుదేరిన వీరులు కంటే దాని గురుంచిన వార్తే ఊరిలో ఎక్కువుగా తిరిగింది.
ఇషయం తెలుసుకొని పోలీసులొచ్చారు. తరువాత ఫారెస్టోళ్లు వచ్చారు. పులి అడుగు ముద్రల కొల తీసుకున్నారు. పులిని పట్టుకోడానికి బోను ఎడతామన్నారు. పులితో జాగ్రత్తగుండండి. ఒంటిగా ఎవ్వరూ ఎక్కడికెళ్ళొద్దు…తొందర్లోనే పట్టేత్తాం అని సెప్పి ఎళ్లిపోయారు.
ఓరోజు సాయంత్రం ఊర సెరువులో నీరింకిపోయిన బురద గుమ్మిలో పట్టిన మట్టగుడిసెలను వొట్టుకొచ్చి వండమని తన పెళ్ళానికిచ్చాడు అప్పలస్వామి. చేపల పులుసు వండేసరికి కాస్త సారా సుక్కేసుకొచ్చాడు. పెళ్ళాం అన్నం వడ్డించింది. అప్పలస్వామి మంచి నిషాలో వున్నాడు. పులుసు మంచి ఏడి మీద గుమ గుమలాడుతుంది. పులిని కొట్టి ఊరోళ్లందరితో శభాష్ అనిపించుకుందామంటే పగలు పులి పికర లేదు. రాత్రులు పులిని పట్టుకొనే సేన్సు మనుషులకు లేదు. పులి దొరకటనేదన్న కోపంతో పులుసు కలుపుకొని అన్నం బుక్కుతునే పులిని బూతులు తిట్టడం మొదలెట్టాడు అప్పలస్వామి. ఒకవైపు తింతండు… మరోవైపు బూతులు తిడతండు. తిండం అయిపోయాక. ఇంట్లో వోళ్ళు వద్దన్నా ఇనకుండా ‘రానియండే ఈ రోజు ఆదో… నేనో తేలిపోవాలా’అంటూ మత్తులో పేలుతూ బయట వరండాలో మంచమేసుకోని తొంగున్నాడు అప్పలస్వామి. కింద ఇత్తడి సెంబుతో నీళ్ళున్నాయి. పక్కన కత్తవ బొరుగు మంచానికి సేరేసి వుంది.
ఏసవికాలమైనా ఉక్కతో ఇళ్లల్లోనే తొంగున్నారు కానీ పులి భయంతో బయట ఎవ్వరూ తొంగోనేదు. దచ్చినం కొండ నుండి నీలగిరి సెట్లు గాలి సల్లగా ఊరి మీదకొస్తుంది. ఊరంతా మంచి నిద్రలో నిశ్శబ్దంగా తొంగుంది. నిశ్శబ్దాన్ని బద్దలు సేత్తూ పక్కీదిలో కుక్క అరుత్తుంది. ఇంతలో సప్పుడయింది. కళ్ళు తెరిసాడు అప్పలస్వామి. చేపల పులుసు ఇబ్బందెట్టింది. కడుపులో ఏదో తేడాగుంది. సుట్టూ సూసాడు. ఎవ్వరూ నేరు. ఇంట్లోవోళ్లను ఇప్పుడెందుకు లేపడంలే అనుకున్నాడు. మంచం కింద ముంతతో నీళ్ళున్నాయి. సెరువులో నీళ్లుండవు. సాలలో గోలెంలో కూడా నీళ్లు వుంతాయో! వుండవో! సెప్పలేము అని మనసలనుకొని…తప్పదని ఇత్తడి ముంతతో నీళ్ళొట్టుకొని ఊరి సివరనున్న సాల వైపు నడిసాడు.
పులి భయంతో కళ్లాలు దగ్గర ఎవ్వరూ తొంగోనేదు. ఊరందరూ బక్కలని సాలలో కట్టేసి ఉంచారు. సాల పక్కనున్న మడిలోకి దిగి మోకాళ్ళ మీద కూర్సొని పని కానిచ్చేత్తుండు. ఎక్కడా అలికిడి నేదు. సుట్టూ సూసాడు. అంతా సీకటి. అప్పటికే పులి తిరుగుతుందన్న భయం అప్పలస్వామి గుండెల్లోకి సొరబడింది. కానీ తన కాడ కత్తవ బోరుగుందనే ధైర్యముంది. సుట్ట తీసి ముట్టించాడు. ఆ ఎలుగులో నీళ్లతో వున్న ఇత్తడి సెంబు జిగేలుమని మెరిసింది. అగ్గిపుల్ల ఆరిపోయిన తరువాత మళ్ళా తన సుట్టూ సీకటి కమ్మేసింది. పక్క సాలలో ఆవు ఎంచేతనో బెదురుగా అరిసింది. అప్పలస్వామి మనసెందుకో కీడు సంకించింది. పని కానిచ్చేసి కడుక్కుంతుండు. తన ఎనుక ఓ ఎండుపుల్ల విరిగిన సప్పుడయింది. కడుక్కుంతున్నోడు ఒక్కసారిగా ఆగిపొండు. కుడిచేతిలో ఇత్తడి సెంబుంది. ఎడమసేయి రెండు కాళ్ళ మధ్య వుంది. ఎదురుగా కత్తవ బొరుగుంది. మనిషి మొత్తం తిరక్కుండా తలొక్కటే నెమ్మదిగా ఎనక్కి తిప్పి సూసాడు. ఇంకేముంది.. అంత సీకటిలోనూ… ఓ రెండు కళ్ళు మెరుత్తూ తనమీదకి వచ్చెత్తున్నాయి. అర్ధమయిపోయింది అప్పలస్వామికి. కత్తవ బొరుగు అందుకోడానికి కూడా ఈలు కుదరనేదు తనకు. ఉన్నసోటనే వుండి… కుడి సేతిలో వున్న ఇత్తడి సెంబును బలంగొట్టుకొని సీకట్లో మెరుస్తూ తనమీదకి దూకుతున్న రెండు కళ్ళ మద్దిన భయంతో కొట్టాడంతే….
ఆ రాత్రే ఊరంతా నిద్ర నేసిపోయింది. తెల్లారేసరికి పులి సచ్చిపోయిందన్న వార్త ఆ ఊరే కాదు… సుట్టుపక్కల ఊరులన్నీ పాకిపోయింది. సచ్చిన పులిని సూడడానికి చుట్టుపక్కల ఊళ్ళనుండి జనాలు తండోపు తండాలుగా దిగబడిపోయారు. అప్పలస్వామి అందరి దృష్టిలో పెద్ద హీరో అయిపోనాడు. పులిని… అప్పలస్వామిని ఎద్దులబండిపై ఊరుమొత్తం ఊరేగించారు. ఈ ఇషయం తెలుసుకొని పోలీసులు అప్పలస్వామిపై కేసు బుక్ సేశారు. ఆ కేసు వాయిదాలకు ఎళ్ళినప్పుడు కూడా బోరవిరుచుకొనే ఎళ్ళాడు కానీ నామోషీగా ఫీలవ్వనేదు అప్పలస్వామి. ఇక సూడు ‘ మావోడు పులిని కొట్టాడు’ అని ఊరిలో పతాడోళ్ళు గొప్పలు సెప్పుకోవడం మొదలెట్టారు.
“ఇప్పుడు ఆ తాత బతికున్నాడా!”అడిగారు కుర్రాళ్ళు ఆసక్తిగా.
“లేదు… సచ్చిపోనాడు”అన్నాడు తాత
“ఎలాగా?”
ఆరిపోయిన చుట్టను కమీజు జేబులో పెట్టుకొని గోడకు చేరబెట్టిన కర్రను తన రెండుకాళ్ల మధ్య నుంచి భుజంపై ఉంచుకొని ఆ కర్ర మీద రెండు చేతులను సుఖంగా ఆనించి మరలా చెప్పడం మొదలెట్టాడు ముసలాడు. భేరం లేదు కదాని స్టవ్ కట్టేసి తాతలనాటి తన టీ కొట్టుకు ఇంత చరిత్ర ఉందా అని నోరెళ్ళబెట్టి సత్యం కూడా ఆసక్తిగా వింటున్నాడు.
“అది… వానాకాలం. కాస్త తెరిపిత్తే దమ్ములెట్టుకోవచ్చని అందరూ సూస్తున్నారు. టీకబ్బులో అందరం కూర్సున్నాం. పందెం ఊసు వత్తే సాలు. ‘ఇక ఊరుకొండిరా… మా పతాడోడు పులిని కొట్టిన తరువాత కూడాఇక పందాలంటారేటిరా’ అని అందరి నోళ్లను మూసేత్తనర్రు కొందరు. మిగతా కుటమానానికి తల కొట్టేసినట్టు అయ్యింది. యడ్లోల కుటుంబం అయితే అస్సలు ఉండనేకపోయింది.
బయట వాన టీ పాక నుండి ధారలు కట్టెత్తుంది. ఆకాశంలో కనబడని సూరీడు బొగ్గుల పొయ్యకి కెటిలికీ అడుగున అంటుకొని నున్నాడు. రైలింజన్ లోంచి వత్తున్నట్టుగా కెటిలి మూతులోంచి ఆవిరి బయటికి తన్నుకొత్తంది.
‘ఒరేయ్… అదును సిక్కితే పులిని ఎవడైనా కొడతాడు. మీ పతాడోళ్ళకు దమ్ముంతే కాకమీదున్న ఆ కెటిలి అరసేతిలో ఎట్టుకొని ఓ అయిదు నిమిషాలు ఉంచండి సూద్దాం’ అని సవాలు ఇసిరాడు యడ్ల పాపారావు.
‘అదిరా పందెమంటే… దమ్ముంటే ఇప్పుడు మాట్లాడండిరా’అని అన్నాడు మరో యువకుడు.
‘ఒరే చాలు లెండిరో… మీరింకా మాతో పందేలు కాయడమేమిటి?’మరోకుడు అన్నాడు.
‘సేత కాకపొతే ఇలాంటి కబుర్లే ఆడుతామురా!’ ఎటకరించాడు ఒకడు.
అప్పుడు దాకా టీ తాగిన అప్పలస్వామి గ్లాసును పక్కనెట్టి ‘పందెమెంత’అన్నాడు.
‘వంద’అన్నాడు పాపారావు.
మిగతావాళ్ళు వద్దన్నావ ఇనకుండా ఒక్క ఊపులో అక్కడనుండి లేసెళ్లి ఆవిర్లు కక్కుతున్న కెటిలిని అమాంతం అరచసేతిలో ఎట్టేసుకున్నాడు”. అని చెప్పడం పూర్తి చేసి కర్రను ఆసరాగా చేసుకొని అక్కడనుండి లేచి నెమ్మదిగా ముందుకు కదిలాడు ముసలాడు.
“ఆ తరువాత ఏమయ్యింది”అడిగారు కుర్రాళ్ళిద్దరూ ఆసక్తిగా.
“ఇంకేమవుద్ది… ఆ తరువాత అప్పలస్వామి అరసేయి కుళ్లిపోయి మంచాన పడి సచ్చిపొండు”అన్నాడు సత్యం.
“ఇంతకీ ఆరోజు పందెమేసిన యడ్ల పాపారావు ఎవులు?”అడిగారు కుర్రాళ్ళిద్దరూ.
“ఇంకెవరు… ఆ ముసలోడే” అని టీ కొట్టు నుండి నడిచి వెళ్లిపోతున్న ముసలోడిని చూపించాడు సత్యం.
“ఆ ముసలోడి పేరు పందేలోడు కదా”అన్నారు ఇద్దరూ ఒక్కసారే.
“ఈ ముసలాడి అసలు పేరు పాపారావు. వయసులున్నప్పుడు మాటాడితే ‘పందెం’అని అనేవోడట… మాటకి ముందో పందెం… మాటకి తరువాత ఓ పందెం. సివరికి ‘యడ్ల పాపారావు’పేరు కాత్తా ‘పందేలోడు’గా మారిపోయింది”అని చెబుతూ టీ కొట్టు కట్టేయడానికి సిద్దపడ్డాడు సత్యం. ఇంతవరకు తన తాత పతివాడ అప్పలస్వామి గూర్చి విన్న పతివాడ మురళి చేతి మణికట్టుపై వున్న పాత గాయం తాలూకు మచ్చను తడుముకుంటూ ఆలోచనలో పడ్డాడు.
*








Add comment