వెయ్యి పాటల హోరు రామన్న!

రామారావు జీవితం మొత్తం తెలుగునేలపై ప్రజా సాంస్కృతికోద్యమం తో ముడివడి ఉంది. ప్రజా కళలతో ముడివడి ఉంది.

రామన్న ఎటూ పోలేదు – పాటై మన మధ్య నిరంతరం ప్రతిధ్వనిస్తున్నాడు.

బహుశా ఇది మీరు చదివేటప్పటికి అంబర్  పేట్ శ్మశాన వాటికలో ఎర్రటి మంటల్లో ఆ ప్రజాగాయకుని భౌతిక కాయం  దగ్ధమవుతూ ఉంటుంది.

మేఘాలకు రాపిడి కలిగించి  విద్యుత్తు మెరుపులు  పుట్టించే ఆయన అద్భుత కంఠస్వరం ఆయనకే నివాళి పలుకుతూ ‘అన్న అమరుడురా’ అని దిగ్దిగంతాలు ప్రతిధ్వనించేటట్టు మోగుతూ ఉంటుంది.

అంబర్ పేట మీదుగా, ఎన్నెన్నో ఉద్యమ సభలకు నెలవైన రాణా ప్రతాప్ హాల్ మీదుగా,  రామ్ నగర్ చౌరస్తా మీదుగా,  ఊరేగింపులకు ఉద్యమాలకు నిలయమైన ఇందిరాపార్కు మీదుగా, అనేకానేక  పోరాట ఉద్రేకాలను యాది చేస్తూ ఆయన పాట హైదరాబాదు గల్లీ గల్లీ నా మార్మోగుతూ ఉంటుంది.

రామారావు ఇంక లేరు. తను స్థాపించిన సంస్థ పేరే తన ఇంటిపేరైంది. తన అసలు పేరు సత్యం అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఘంటసాల నే అచ్చెరువొందించిన అద్భుత కంఠస్వరం తనదని అందరికీ తెలుసు. మద్రాసు పోయి సినిమాల్లో చేరి ఉంటే ఆయన పరిస్తితి ఎట్లా ఉండేదో కానీ, నలుగురికీ తన పాట ఉపయోగపడాలి అని తాను నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం, యాభై యేండ్లకు పైగా ఉద్యమానికే అంకితమైన రామన్నది అత్యంత అరుదైన వ్యక్తిత్వం. వెనుకడుగు వేయకుండా, స్వంత ఆస్తి అంటూ చిల్లిగవ్వ సంపాదించుకోకుండా తానూ, సహచరి బీడీ కార్మిక నాయకురాలు అరుణక్కా నిబద్ధతతో గడిపిన జీవితం,  సమాజనికి అంకితమైన జీవితం, భవిష్యత్తరాలకు వెలుగు చూపిన జీవితం.

1955 లో కర్నూల్ లో నిరుపేద దళిత కుటుంబం లో పుట్టిన సత్యం అరుణోదయ రామారావుగా మారిన చరిత్ర చాలా గొప్పది. ఆయన అద్భుతమైన కంఠస్వరం,  ప్రజలపట్ల పీడిత ప్రజల పట్ల అమితమైన ప్రేమ, వారి జీవితాలు బాగుపడేందుకు పోరాటమే మార్గమన్న సిద్ధాంతం పట్ల  ఆయనకున్న అచంచల విశ్వాసం ఆయనను యాభై యేండ్లకు పైగా ఉద్యమాలకే అంకితం చేసినయి. ఆయన నమ్ముకుని భాగమైన విప్లవోద్యమాల్లో అనేక చీలికలైనా,  చివరి ఊపిరి వరకూ ఏదో ఒక ప్రజా ఉద్యమ పార్టీ లో కొనసాగాడు. తన వాదనలు వినిపించాడు. తన ఆకాంక్షలను ఆచరణగా మార్చి చూపాడు. తన దళిత అస్తిత్వాన్ని గుర్తించేందుకు విప్లవోద్యమాల్లో తనదైన పద్దతిలో పోరాటం చేశాడు.

రామారావు జీవితం మొత్తం తెలుగునేలపై ప్రజా సాంస్కృతికోద్యమం తో ముడివడి ఉంది. ప్రజా కళలతో ముడివడి ఉంది. ప్రజా సాంస్కృతికోద్యమం లో నాజర్ బుర్రకథ ను ముందుకు తీసికెళ్లి తెలుగునాట నలు మూలలా బుర్రకథ చెప్పినా, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల నేపథ్యం లో పాటను ప్రజల్లోకి తీసికెళ్లినా, ఒక ప్రజా సాంస్కృతిక సంస్థ ఆవశ్యకతను గుర్తించి కానూరి లాంటి వారి సాహచర్యం లో 1970 ల్లో  అరుణోదయ స్థాపించినా రామారావు ప్రజాకళలకే జీవితాన్ని అంకితం చేశాడు. ‘ఓ అమర కళా వేత్తలరా ఓ సమరరంగ నేతలారా’ అంటూ అమరులు గరికపాటి రాజారావు సుబ్బారావు పాణిగ్రాహిల కోసం ఆయన ఎలుగెత్తిన గొంతు యేనాడూ అలుపెరుగలేదు విశ్రాంతి కోరలేదు.

మొన్న మే డే సభల్లో భాగంగా రామగుండం సభలో పాల్గొని వచ్చి, తీవ్రమైన ఎండ దెబ్బ తగిలి, అది గుండెపోటుగా, కిడ్నీ సమస్యగా పరిణమించి చివరికి దుర్గాబాయి దేశముఖ్ దవాఖానా లోనే, ఇక కేర్ కు తరలిద్దాం అనుకునే లోపలే, మరోసారి తీవ్రంగా గుండె పోటు తో ఆ శరీరం శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది.

‘అద్దాలపెట్టెలో నిద్రలో ఉన్న నిలువెత్తు పాటలాగున్నాడు రామన్న’ అని ఆర్కే అన్నాడు. అవును ఎప్పుడు పలకరించినా పాటగా మారే రామన్న శాశ్వతంగా పాడడనీ, ఆయన గొంతు శాశ్వతంగా మూగపోతుందనీ ఎవరికైనా ఊహించడం అసాధ్యం. బహుశా ఆ రామ్ నగర్ గుండు చౌరస్తా దగ్గరో, రాణాప్రతాప్ హాల్ లోనో, ఎస్ పీ హాల్ లోనో, ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గరో, బండమైసమ్మ బీడీ కార్మిక బస్తీ లోనో, టాంక్ బండ్ చౌరస్తా దగ్గర తనకు అమితంగా ఇష్టమైన అంబేడ్కర్ చూపుడు వేలు పైనో ఆయన మహోత్తుంగ తరంగ కంఠస్వరం అలలలలుగా ఘోషిస్తూ ఉంటుంది. గాలి కన్నా దట్టంగా వ్యాపిస్తుంది. రామారావు ఎన్నడూ అలసిపోడు, ఆయన కంఠస్వరం ఎన్నడూ మూగపోదు. అది కంచులా మోగే గంభీర సముద్ర కెరటాల ఘోష. ప్రజల ఆకాంక్షలను పోరాటాలను నిరంతరం ప్రతిధ్వనించిన నల్లమబ్బుల మెరుపుల జడివానల నీటిధారల హోరు.

1982 లో కామ్రేడ్ నాగభూషణ్ పట్నాయక్ ఉరిశిక్ష రద్దైనప్పుడు, టాగోర్ ఆడిటోరియమ్ లో పీ డీ యే స్యూ యేర్పాటు చేసిన సభలో మొదటి సారి విన్నానాయన స్వరం ‘ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూలదొయ్యాల’ అంటూ అద్భుతంగా ధ్వనిస్తూ.  మొత్తం ఆడిటోరియమ్ అంతా నిశ్శబ్దం లో మునిగి ఆయన పాటలో తడిసిముద్దైంది. జె ఎన్ టీ యూ లో రెండవ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ ఆ సభకెళ్ళిన నన్ను  ఉద్యమం లోకి వెళ్లడానికి అమితంగా ప్రభావితం చేసిన వాటిలో రామన్న పాట కూడా ఒకటి. సభ ఐనాక బయటికొచ్చి మమ్మల్ని కలిసి కరచాలనం చేసిన ఆయన వెచ్చని కరస్పర్శ మొన్న ‘నడిసొచ్చిన తొవ్వ’  ఆవిష్కరణ లో ఆయన పలికిన ఆత్మీయ వాక్కుల వరకూ, ఇచ్చిన గాఢమైన కౌగలింత దాకా కొనసాగింది.

కలిసి ఎన్నో సభలకు పోయినం, ఎన్నో ఊర్లు తిరిగినం, తెలుగునాట అన్నీ మూలలే కాక ఢిల్లీ దాకా వెళ్ళినం. ‘మూవ్ మెంట్ అగైన్స్ట్ రెప్రెశ్షన్’ లో భాగంగా ఢిల్లీ లో ఆయన పాటా నా అనువాదాలు జె యెన్ యూ లో సభలూ ఒక్కటొక్కటే జ్ఞాపకాల సందుకలోంచి బయటికొచ్చి గుండె బరువెక్కుతున్నది. కండ్లు ధారాపాతంగా వర్షిస్తున్నయి.

1984 నవంబర్ 14 నాడు హైదరబాదు టాంక్ బండు దగ్గర బుద్ధపూర్ణిమ వద్ద జరిగిన చండ్ర పుల్లారెడ్డి సంస్మరణ సభలో,  అంతకు ముందు ఊరేగింపులో నేను ఉట్టి రాతలుగా రాసిన వాక్యాలకు అద్భుతమైన బాణీ కట్టి, ‘అడవి యేడ్చింది’ అంటూ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మారుమోగే పాటగా మార్చిన ఘనత రామరావుదే. ఆయన కున్న గొప్ప లక్షణాల్లో అదొకటి. ఎటువంటి కవితా వాక్యాలకైనా నిమిషాల్లో అద్భుతమైన బాణీ కట్టే వాడు. వసంత మేఘగర్జన లాంటి తన కంఠస్వరం లో పాడి, దానిలో ఎన్నెన్నో ఉద్వేగాలను పలికించి ఊపేసి, తడిపేసి, వింటున్న ప్రేక్షకులను ముద్ద చేసే వాడు. చివరికి అది శివరంజని రాగమనో , భీమ్ప్లాస్ అనో చెవిలో చెప్పేవాడు తనకు శాస్త్రీయ సంగీతం పెద్దగా తెలవదంటూనే.

ప్రజల విప్లవ సంగీతానికి, పాటలకూ రామారావు కొత్త వ్యక్తీకరణ నిచ్చాడు. కొత్త డైమెన్షన్ ను ఇచ్చాడు. కొత్త ఏస్తేటిక్స్ ను కూర్చాడు. ప్రజల బాణీలే, ప్రజల భాషనే, మళ్ళీ గద్దర్ లా ధ్వనించదు. గద్దర్ గొంతు అప్పుడు బలంగా వీస్తున్న రోజులు. గద్దర్ లా పాడితే అది ఇమిటేషన్ అవుతుంది. అందుకే రామారావు ప్రజల పాటకు ఒక కొత్త రూపునిచ్చాడు. అది నాజర్ బుర్రకథ సంప్రదాయం. అది పద్య నాటక సంప్రదాయం. తెలుగు నాట ముఖ్యంగా రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో బలంగా ఉన్న పద్య నాటక సంప్రదాయం లో శాస్త్రీయ సంగీతం లా ధ్వనించే రాగాలతో, గుండెల్ని పిండి, ఎన్నెన్నో ఉద్వేగాలను పలికించి, తడిసి ముద్ద చేసే అద్భుత రాగమాలికలతో ప్రజల పాటలకు బాణీలు కట్టాడు. నభూతో నభవిష్యతి అనే విధంగా తన గొంతులో పలికించాడు. ‘అన్న అమరుడురా’, ‘ఓ అమర కళా వేత్తలరా’, ‘శ్రీకాకుళం  రా వీర శ్రీకాకుళం రా’, ‘వీర గాథల పాడరా విప్లవ ధీరచరితల పాడరా’ , ‘ఉయ్యాలో జంపాల ఈ దోపిడి కూలదొయ్యాలా’, ‘అయ్యలారా ఆలకించుడయ్య’ ‘ఉందర్రా మాల పేట ఊరిచివర కష్టాలున్న చోట’, ‘ఓ అరుణపతకమా’ , ‘అరుణారుణబాటలో అరుణబావుట నీడలో’, ‘జనసేన కదిలిందిరా ప్రజాసేన కదిలిందిరా’, ‘అమ్మా నను కన్నందుకు విప్లవభివందనాలు’, ‘మేరిమి కొండల్లో మెరిసింది మేఘం’  – ఇట్లా ఒకటేమిటి వందలాది పాటలు ఆయన గొంతులో అజరామరమైనవి. చిరస్మరణీమైనవి. తెలుగు నేల నాలుగు చెరగులా ప్రతిధ్వనించినవి’.

‘ఈ పాటలు నువ్వు ఒక్కక్కడివే పాడగలవు మరి వీటిని ప్రజలు అందుకునేదెట్ల?’ అంటే దానికి సమాధానంగా వందలాది కళాకారులను, గాయకులను తయారు చేసి చూపించాడు. తెలుగు నాట అన్నీ జిల్లాలల్లో, ఎన్నో శిక్షణ తరగతులను నిర్వహించాడు. ఎందరో ప్రజా కళాకారులను తయారు చేశాడు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంస్థ నే తన ఊపిరి గా జీవించాడు. ఒక క్షణం కూడా తీరిక లేక ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణం చేశాడు.

రామారావు ది నిష్కల్మషమైన మనసు. కపటం లేని నిండైన పలకరింపు. రాజకీయ వివాదాలను, సిద్ధాంత విభేదాలను, తగాదాలను ఎప్పుడూ మనసులో పెట్టుకునేటోడు కాదు. నిండుగా పలకరించి, వెచ్చగా చేతిలో చేయి వేసి ఆత్మీయంగా కౌగలించుకునే వాడు. ఆయనతో గడిపిన క్షణాలు అపురూపం. ఒక రెండు నిమిషాలు పాటగా మారకుండా ప్రవహించకుండా మాట్లాడేటోడు కాదు. చేతివేళ్ళను నిరంతరం కదిలించే వాడు. ఎందుకన్న అట్లా అంటే ఇది హార్మోనియం వాయించిన అలవాటు అనేటోడు. అంటూ పాటను ఎత్తుకునే వాడు. తనకు దొరికిన దాని మీద డప్పు దరువు వేసేటోడు.

ఫోన్ చేసి పలకరిస్తే ముందు హరిశ్చంద్ర పద్యమై పలకరించేవాడు. కాటి సీను పద్యాలతో పాటు,  ‘యేనాడు నడచినావు ఈ ఎడారి దారుల వెంట’ అంటూ గొప్ప ఆర్తి తో ఎన్నో పద్యాలు పాడేవాడు. ‘ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి’ అంటూ తానూ యేడ్చి యేడిపించే వాడు.

తను యే పాట విన్నా, యే కవిత విన్నా మనసుకు నచ్చితే నిర్మొహమాటంగా, నిష్కల్మషంగా, అది ఎవరిదైనా సరే మనసారా మెచ్చుకునేటోడు, దానికి తనదైన పద్దతి లో బాణీ కట్టెటోడు. అందరికీ పాడి వినిపించి దానికి ఊపిరి పోసేటోడు. బహుశా తన దళిత నేపథ్యం తన సామాజిక జీవనం, ప్రజల ఉద్యమాల్లో మమేకమైన తన జీవనానుభవం  అందుకు తప్పకుండా కారణమై ఉంటుంది.

విప్లవోద్యమం లో కులసమస్య గురించి చర్చ మొదలైనంక తానూ బాగా కదిలిపోయాడు. అధ్యయనం తీవ్రతరం చేశాడు. నిక్కచ్చిగానే లోపలా,  బయట తన అభిప్రాయాలూ చెప్పాడు. అంబేడ్కర్ ఆలోచనను, మార్క్స్ సిద్ధాంతాన్ని కలపాలని. కుల వర్గ పోరాటాలు జమిలిగా చేయాలనే అవగాహనకు వచ్చాడు. చాలాసార్లు ఆనంద్ తేల్టుంబ్డే రచనలు, మార్క్సు, అంబేడ్కర్ లు మా సంభాషణల్లో వచ్చేవాళ్లు. విప్లవోద్యమం కొత్త పంథాలో సాగాలని భారతదేశం లో దళిత బహుజన మైనారిటీల విముక్తి లేకుండా విప్లవం సాధ్యం కాదనీ, బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు ముమ్మరం చేయాలని మనసా వాచా కర్మణా నమ్మాడు.

ఇప్పుడు రామన్న లేదంటే నమ్మశక్యంగా లేదు. ఆదివారం మా ఉదయాన్నే మిత్రుడు ప్రకాష్ చెప్తే నమ్మలేక పోయిన. కిరణ్ తో మాట్లాడుతుంటే గుండెలు పగిలిపోయినాయి.  సిరిసిల్ల శ్రీను వీడియొ కాల్ లో చూసి కళ్ళు చిట్లి కన్నీరు అవధులు దాటింది. మంచుపెట్టెలో నిద్రిస్తున్న తనని చూసి దుఃఖం కొరడా లా   చెల్లున చరచింది.

రామన్న ఎటూ పోలేదు. ఆయన పాటా ఎక్కడికీ పోలేదు. సముద్ర కెరటాల ఘోషలైన ఆయన పాట,  జలపాతాల హోరైన ఆయన పాట,  మేఘాల విద్యున్మాలికల మెరుపులైన ఆయన పాట, కొత్త సమాజపు ఆకాంక్షల పూల హారమైన ఆయన పాట మనమధ్యే  ఉంటుంది. మన గుండెల్ని కదిలిస్తుంది. మన చెవుల్లో గుసగుసలు చెప్తుంది. మనల్ని నిలబదనీయదు, కూర్చోనీయదు, వెన్నంటి వెంటాడుతుంది మునుముందుకే నడిపిస్తుంది.

ఆయన పాట మనకు కొత్తగా కలలు కనడం నేర్పుతుంది. యెల్లెడలా నిరాశే  సర్వవ్యాప్తమైన ఈ చీకటి రోజుల్లో ఆయన పాట మనని తన చిటికెనవేలు పట్టి నడిపిస్తుంది.  కొత్త వెలుతురు ప్రసరించి కొత్తప్రపంచాల్ని చూపిస్తుంది.  కొత్త తీరాలకు తీసుకుపోతుంది.

ఆ పాట మనలో, మన హృదయాల్లో,  సమస్తం ప్రజానీకం హృదయాల్లో శాశ్వతంగా వెలుగుతూ ఉంటుంది.

అరుణోదయ రామారావు అమర్ రహే! రామన్నకు సజాలాశ్రునయనాల జోహార్లతో వీడ్కోలు.

*

 

ఫోటో: భరత్ భూషణ్ (వేణుగోపాల్ సహకారంతో)

 

నారాయణ స్వామి వెంకట యోగి

32 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గ్రేట్ ట్రిబ్యూట్ తమ్ముడూ. రామన్న సారాంశాన్ని బాగా పట్టుకున్నావ్.నువు తప్ప వేరెవరూ ఇలా రాయలేరు. I have often felt very bad that he mostly remained as an unsung hero.

    • అన్నా నెనర్లు. రామారావు అన్న లేడంటే ఇంకా నమ్మబుద్దైత లేదు. చాల దుఃఖంగా ఉంది. ఆ దుఃఖం లోంచే ఈ నాలుగు మాటలు .

  • బాగా రాశారు గురూజీ. జె.ఎన్.యు లో నేనూ విన్నా. మీరు చెప్పినట్టు”యెల్లెడలా నిరాశే సర్వవ్యాప్తమైన ఈ చీకటి రోజుల్లో ఆయన పాట మనని తన చిటికెనవేలు పట్టి నడిపిస్తుంది. కొత్త వెలుతురు ప్రసరించి కొత్తప్రపంచాల్ని చూపిస్తుంది. కొత్త తీరాలకు తీసుకుపోతుంది.

    ఆ పాట మనలో, మన హృదయాల్లో, సమస్తం ప్రజానీకం హృదయాల్లో శాశ్వతంగా వెలుగుతూ ఉంటుంది.

    అరుణోదయ రామారావు అమర్ రహే! రామన్నకు సజాలాశ్రునయనాల జోహార్లతో వీడ్కోలు.

    • అవును గురూజీ. రామారావు అన్న తో 1982 లో మొదలైన ప్రయాణం నేను అమెరికా కు వచ్నినంక కూడా సన్నిహితంగా కొనసాగింది. జీవితాంతం వెంటాడే పాట ఆయనది.

  • Sir
    Meeru parichayam chesina raamanna vyaasam ee tharaaniki cheruvaindi.
    Raamanna pasta nenu koodaa osmania auditorium lo vinnaanu. Appudu maa uncle osmania lo vundevaaru.
    Thank you sir and Saaranga team

    • Thank you thammudoo! మీరు రాసిన కవిత కూడా బాగుంది.

  • అమరమైన పాటను..అమరుడైన రామారావును అక్షరాక్షరం ఆవిష్కరించావు స్వామీ

    • అన్నా నెనర్లు. నిరంతర పాటల శ్రామికుడు రామన్న కు విశ్రాంతి లేదు ఆయన పాటకు మరణం లేదు.

  • నేనొక గొప్ప పాట గురించి తెలుసుకున్నా.
    థ్యాంక్యూ నారాయణస్వామి గారూ!

  • ఎంత గొప్పగా రాసావు మిత్రమా, రామారావు పాటలు విన్నయాది గుండెను రాపాడుతున్నది. తనను ఈ మధ్యనే కలిసాను. నన్నంత గుర్తుంచుకున్నాడో లేదో కాని, నాకు తనగొంతులో పలికే అనితరసాధ్యమైన పాట ఎన్నడూ మరువలేను. నిబద్ధతతో బతికాడు. గొప్పపాటగా బతికిపోయాడు…చెమ్మగిల్లిన కండ్లతోనే…

  • ఎంత గొప్పగా రాసావు మిత్రమా, రామారావు పాటలు విన్నయాది గుండెను రాపాడుతున్నది.
    తనను ఈ మధ్యనే కలిసాను. నన్నంత గుర్తుంచుకున్నాడో లేదో కాని, నాకు తనగొంతులో పలికే అనితరసాధ్యమైన పాట ఎన్నడూ మరువలేను. నిబద్ధతతో బతికాడు.
    గొప్పపాటగా బతికిపోయాడు…చెమ్మగిల్లిన కండ్లతోనే…

    • అన్నా నెనర్లు. రామారావు అన్న నిబద్ధతకు మారుపేరు. నిరంతర శ్రామికుడు సైనికుడూ. తెలంగాణ ఉద్యమం లో సాంస్కృతిక యోధునిగా కీలక పాత్ర నిర్వహించిండు. ఎన్నో ప్రలోభాలు చుట్టుముట్టినా లొంగ లేదు. నేను 37 ఏండ్ల కింద చూసినప్పుడు ఎట్లుండెనో మొన్న చూసినప్పుడు కూడా అట్లే ఉండే.

  • అమరుడు రామారావుతో సన్నిహితంగా పనిచేసిన వారందరి ఆవేదన, ఆయనతో కొద్దికాలం పరిచయమున్న వారి ఆవేదన ఒకటిగానే ఉంది. ఆయనొక అధ్యయనశీలి అని నా మిత్రుడు విద్యాసాగర్ చెప్పిన విషయం మీరు కూడా ప్రస్తావించారు. అది కళాకారుల్లో అరుదయిన విషయం. నేను విన్న దాని ప్రకారం అయన విప్లవ ఆశావాది. నేను మొదటిసారి 1980 లో ఆంధ్ర యూనివర్సిటీ లోవిన్న అయన గొంతు గుర్తొస్తూనే ఉంటుంది.

    • అవును రామానాయుడు గారూ. కళాకారులు, ముఖ్యన్గా సామజిక మార్పు కోసం నిబద్ధమై నిమగ్నమైన కళాకారులు అధ్యయనం చేయాలి అని తెలుసుకుని సామాజిక మార్పులు సునిశితంగా పరిశీలించాలి అనే అవగాహనా తో రామారావు అన్న తన సాంస్కృతిక ప్రయాణం కొనసాగించిండు. కొత్త ఆలోచనలు చేసిండు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా తప్పకుండ తన గొంతు వినిపించే ఉంటాడు కూడా.

  • వారికి, నివాళి!వారిగురించి, మీవల్ల, తెలిసింది. సర్!😢వెయ్యి పాటల హోరు రామన్నా, అమర్ రహే!

    • మేడం నెనర్లు. మీ సున్నిత హృదయానికి వందనాలు.

  • హృదయం ద్రవించి రాసారు… 💚❤💙

    • నెనర్లు సుధాకర్. రామన్న నన్ను ఎన్నడూ వీడలేడు, వీడిపోడు..

  • Rich tributes to unforgettable voice of masses. It can be enriched by adding a few words on his contribution to Telangana movement, despite of his seema origin..

    • అన్నా నెనర్లు. నిజమే అన్నా – దుఃఖమాపుకోలేని పరిస్థితిలో ఇట్లా నాలుగు వాక్యాలు రాసి నా వగపోతకు రూపమిచ్చిన. ఆ తొందరలో తెలంగాణ ఉద్యమంలో రామన్న పాత్ర, అయన తన పాటతో, తన సంస్థ తో చేసిన కృషి, తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షకు నిబద్దత తో ఆయన తెలిపిన మద్దతు ప్రస్తావించాలి. నాదే పొరపాటు. బహుశా ఆయన తన రాజకీయాలు, నిబద్దత నేపథ్యం లోనే కాక అస్తిత్వ నేపథ్యం లో కూడా తెలంగాణా ఉదయమాన్ని సమర్థించిండు అనుకుంటా

  • బాగా రాశావు స్వామీ. ..
    అరుణోదయ రామారావు ఇక లేడని ఎలా నమ్మడం, ఎలా అనుకోవడం..

    షెల్లీ రాశాడు కదా,
    Music, when soft voices die,
    Vibrates in the memory—
    Odours, when sweet violets sicken,
    Live within the sense they quicken.

    Rose leaves, when the rose is dead,
    Are heaped for the belovèd’s bed;
    And so thy thoughts, when thou art gone,
    Love itself shall slumber on.

    రామారావు అలా వెళ్లిపోతుంటే, ఆ ధీర గంభీర స్వరం నీరవ నిశ్శబ్దంలో అలా విశ్రాంతి తీసుకుంటుంటే, తనకి ఇష్టమైన శివరంజని రాగమే అలా విషాదమై ఆలాపిస్తున్నట్లు..
    జోహార్లు అరుణోదయ రామారావుకి

    • అవును కిరణ్ ఈ బాధ మనిద్దరిదీ ఈ దుఃఖం మనందరిదీ

  • అన్నా నెనర్లు. రామారావు అన్న లేడంటే ఇంకా నమ్మబుద్దైత లేదు. చాల దుఃఖంగా ఉంది. ఆ దుఃఖం లోంచే ఈ నాలుగు మాటలు .

  • మనసంతా బాధబాధ అయితుంది అన్న.తనతో మీకున్న అనుబంధం,తనకు ప్రజలతో ఉన్న అనుబంధం,తన పాటలోని బుర్రకథ సంప్రదాయం ఇవన్ని మీరు మాత్రమే రాయగలరనిపించింది.అరుణోదయ రామారావు సార్ కు కన్నీటి జోహార్లు.

    • నెనర్లు తమ్ముడూ – రామన్న జీవితం పాటతో ప్రజాకళలతో పీడిత ప్రజలతో అంతగా ముడివేసుకుని పోయింది.

  • ఒక్క సారి వెనక్కితీసుకెళ్ళి మహోన్నత దృశ్యాలను తిప్పి చూపించావు. రామారావు గొంతు ఎప్పటికీ గుండె పొరల్లో డప్పు ప్రకంపనల్ని సృష్టిస్తుంది!

    • నెనర్లు కృష్ణుడూ – ఇది మనందరి సామూహిక అనుభవమూ, వేదనా

  • The memorial article on Arunodaya Ramarao is very touching.I could visualise multi dimensional talented Ramarao in this write up.

  • అద్బుతమైన నివాళి అన్న. రామారావు అన్న జీవితాన్ని నువ్వు అతి దగ్గర నుంచి చూచావని అర్థం అయిపోతుంది ఈ వ్యాసంతో..అలాగే ఒక.నిజమైన నివాళి పొగడ్తగా గాక మృతుడి జీవన ప్రయాణాన్ని చర్చించడం ద్వారా ఇలా ఇవ్వవచ్చని అర్థమైంది. జోహార్ రామన్న.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు