1
పేగు కాలిన వాసన
అడుగున్నర దేహపు రోదన
లెక్కకువచ్చే అంగుళాల కాయపు వేదన
కనుచూపు మేర కానరాని కబళం
చీకటి డొక్కలో ముడుచుకున్న వేళ్ళు
దీర్ఘరాత్రికి చరమగీతమా…!
తెలతెలవారని తెరను చీల్చుకుంటూ
పక్షుల బారుల వెంబడి పరుగులు – మెతుకులాటలో
పిట్టో… పుట్టో…పురుగో… పరకో…ఓ రవ్వంత
లుమ్మచుట్టుకుపోయే చర్మపు ముడతలకి…
రోడ్డు వారగా పడుకున్న పేగు
నకనకల కుంపటిలో సలసల కాగుతోంది
చల్లార్చేందుకు కన్నీళ్ళు సరిపోవడం లేదు
పక్కన ఏ కుళాయీ లేదు!
చెత్త కుండీలు… పశువులు, జంతువులు
పోటీ పడలేని బేల కళ్ళు … కాళ్ళు…
నడిచే సత్రాల పొట్లాలాటలో
అన్నీ… బౌండరీలు దాటే సిక్స్ లే
ఉచిత పథకాల గేట్ల ముందు అడుగు స్థలం
బారికేడ్లతో బిగుసుకుంది
కంటిలోని ఉప్పటి ద్రవం నంజుకుంటూ
అమ్మ ముద్ద… నాన్న ముద్ద …నీ ముద్ద… నా ముద్ద…
గుటకలు పొడిపొడిగా … త్రేన్పులతో గొంతు..
ఖాళీ విస్తరాకులు – నింపుకున్న నేల చూపులు
వాగ్దానాల పాయసాల ఒక్క గరిట కోసం ఆత్రంగా
పక్కనే శిథిలమైన దేహాలు
ఉదరం నుండే వెన్ను పూసల్ని లెక్కబెడుతూ
ఒకటి…రెండు…మూడు…
ఎంత సులువు ఈ ఖండ యోగా …!
అక్కడ బాహాబాహీలు
గతి సూచీ అభివృద్ధి దిశగా
ఇక్కడ అంతర్ బాహీలు
మెతుకులు కతకని జీవితాలు
పేగులు కాలుతున్న వాసనతో…
బలహీనపడని ఉపరితల ఆవర్తనంలా !
2
శ్వాసిస్తున్న ఉనికి
కల్లోల కాశ్మీరం కలవరపెడుతోంది
నిశ్శబ్ద కన్యాకుమారి మౌనాన్ని ఆశ్రయించింది
నడి మధ్యలో ఓ ఏడుపు అదే పనిగా వినిపిస్తోంది
ఎవరిదీ ఆవేదనా రాగం
ఎందుకు విలపిస్తోందో
ఎన్నాళ్ళుగా వినిపిస్తోందో
నీకేం కొత్త కాకపోవచ్చు
కొంతకాలానికి నాకూ పాతబడొచ్చు
మరి ఎందుకు వెంటపడి వేధిస్తోంది
ఓ వెర్రి లోకపు జీవన నాదం
అతి లోతైన అగాధం నుండి
చెట్ల చేతులు నరికివేయబడతాయి
ఎత్తైన కంచెలుగా మలచబడతాయి
లోలోపలే వేకువైనా వేడుకైనా
అమాయకపు వెన్నెలలన్నీ
నిశిరాత్రి కౌగిలిలోకి చేరుతుంటే
మట్టి మట్టికొట్టుకుపోవడాన్ని అక్కడే చూశాను
లోయలన్నీ ఉష్.. గప్…చుప్… అని
నోటి మీద వేలు వేసుకున్నాయి
కాళరాత్రి కటిక చీకటిలో
పిట్టలన్నీ చెట్టుకోటి పుట్టకోటిగా
బిక్కుబిక్కుమంటూ
గింజలన్నీ ఎర్రని నేలల్లోకి
ఎండిన ఆకుల గొంతులు
పెరపెర మంటూ నలిగిపోతున్నాయి
భద్రంగా ఉంటాము అనే భ్రమలో
కాసేపు స్వేచ్ఛగా
ఊపిరి తీసుకుంటుంటే
కాలయముడు ఆ గొంతుల మీద
బలమైన పాదంతో
మరోసారి…మరోసారి…మరోసారి
అక్కడే
నరకబడ్డ చెట్టు చివరి వేరు
నెమ్మదిగా శ్వాసిస్తోంది.
చంద్రుడు చల్లగా నవ్వుతూ పలకరించాడు.
*
పాళీ పనిచేయని అవ్యక్తురాలిని…
మా స్వస్థలం అనకాపల్లి. పుట్టింది, పెరిగింది అంతా అనకాపల్లిలోనే. ప్రస్తుత నివాసం విజయవాడ. వివిధ మనుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో కమర్షియల్ విభాగంలో 2023 వరకు పనిచేశాను. సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది మాత్రం 2020 డిసెంబర్ నుండి. మనసును ఆలోచింపచేసే ఆలోచనలు వచ్చినప్పుడే కవిత్వాన్ని వ్యక్తీకరించగలను. అంతవరకూ సిరానిండి ఉండి, పాళీ పనిచేయని అవ్యక్తురాలిని. నా భావాలను గుర్తించి మొట్టమొదట ప్రోత్సహించిన వారు కవి, కథకులు కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు, కవయిత్రి సుధా మురళి గారు. వారి కవితల ప్రభావం నాపై చాలా ఉంది. ప్రస్తుతం హిందీలోకి వ్యాసాలు, కథలు అనువాదాలు చేయడం, తెలుగులో కథలు, కవితలు వ్రాయడం నా వ్యాపకం.
కవిత్వం ఎందుకు రాస్తున్నానంటే…
నా లోలోపల సంఘర్షణలకు, నా చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న ఆవేదనలకు కవిత్వమే నాకు సమాధానం అయింది. నేను ఏదైనా సంఘటనను చూసినా, చదివినా, విన్నా విపరీతమైన ఆవేదన పడేదాన్ని. ఆ ఆవేదనకు అక్షర రూపం ఇచ్చాకే నాకు స్వాంతన దొరికేది. ఒక కవిత రాసిన తరువాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నట్లు అనిపించేది. అలాగే ఇతరుల కవిత్వం చదివినప్పుడు కూడా నాకు ఓదార్పు కలిగినట్లు అనుభూతిచెందేదాన్ని. ఆ ఓదార్పు, స్వాంతనల నుంచి తేలికపడాడాన్ని గమనించిన నేను కవిత్వం రాస్తున్నాను… నాలాంటి అనుభూతులు ఉన్న ఒక్కరికైనా నా కవిత్వం ఆలంబన కావాలని.








Baavunnaayi kavithalu rendoo
Narakabadda chettu chivari veru nemmadigaa shwaasisthundi. Excellent