” హా… దిగాలి .. దిగాలి.. పదవ నంబర్ మైలురాయి” అన్నాడు కండక్టర్.
అతను టిక్కెట్లు కొట్టే దానితో బస్సులోని గుండ్రని ఇనుము రాడ్డుపై ‘ట్రింగ్ డిడ్డింగ్ మని’ లయబద్దమైన శబ్దం వొచ్చింది.
ఆ ఆ శబ్దానికి డ్రైవరు బస్సాపేడు.
అయినా సరే మళ్ళీ ‘ ఆపాపు .. ‘ అన్నాడు గట్టిగా.
‘ రై..రై..’ అన్నాడు చివరగా.
ఏదో డిటెక్టివ్ కథల్లో టైటిల్ లా వుంది మన ఊరి పేరు అనుకుంటూ దిగాడు జగపతి.
నవంబర్ చలికాలం, పొద్దుటి పదింటి కాడ ఎండ హాయిగా వుంది.
బస్సులోంచి ఆదరా బాదరా ఇద్దరూ దిగారు.
ఆ బస్సు వెళ్ళిపోయాక చూస్తే రోడ్డంతా ఖాళీ.
రోడ్డు కూడా ఇంత అందంగా ఉంటుందా అటు ఇటు తాటిచెట్లతో అనుకున్నాడు. జగపతికి పద్నాలుగేళ్ళు.
అతను ఇందాక కండక్టర్ అరచిన పదవ మైలు రాయి ఎక్కడుందా అని చూసాడు, అది రోడ్డుకు దిగువగా, కిందకు కుంగి పోయి వుంది. దాని చుట్టూ టచ్ మి నాట్ మొక్కలు.
పరిగెత్తుకు వెళ్లి వాటితో ఆడటం మొదలు పెట్టాడు. ‘ అబ్బా.. ఆహా ‘ అనుకుంటా.
‘ బాబూ.. జగపతి ..వెళ్దాం రావయ్యా నాయనా ‘ అని సున్నాలేసేవోడు కేకేశాడు.
అతను జగపతితో పాటు బస్సు దిగాడు. చేతిలో ప్లాస్టిక్ బకెట్టు, దానిలో సున్నాలేసే ఒక చీపురు, సున్నం ప్యాకెట్టు వున్నాయి.
అతనికి ముప్పై ఐదేళ్లు పైనే ఉంటాయి, పసుపుగళ్ల పాత చొక్కా, సున్నాల చుక్కలు ఉన్న ఊదా రంగు పేంటు వేసుకున్నాడు. కాళ్లకు హవాయి చెప్పులు.
ఇద్దరూ మట్టిబాటమ్మట కాలనీలోకి నడుస్తున్నారు. వాళ్ళ చుట్టూ పొడుగాటి తాటిచెట్లు, వాటికి అక్కడక్కడా చెట్టు పైన చిన్ని బొక్కలు.. అందులోంచి రామచిలుకలు బయటకు వొచ్చి పెద్దగా గోల చేస్తున్నాయి.
ఒక చెట్టు మీద గూటి లోంచి పాము ఒకటి బయటకు వొచ్చి తాటిచెట్టు మీద నుంచి కింద పడిపోయింది. దాంతో రామచిలుకల, కొండ పిచ్చికల గోలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.
జగపతి సున్నాలేసేవాడ్ని తీసుకొని ఆ కాలనీలో కొత్తగా కడుతున్న వాళ్ళ ఇంటి వైపు నడుస్తున్నాడు.
గెడ్డ వార మట్టి రోడ్డు మీద నడుస్తున్న వాళ్లకు గెడ్డలో నీళ్లు చాలా తేటగా కనపడ్డాయి. వాటిలో చుక్కల చిన్ని చేపలు ఈదుకుంటా పోతున్నాయి. కింద కొన్ని మట్టగడసలు బద్దకంగా తొంగున్నాయి.
జగపతి చేపల వంక చూసుకొని పోతుంటే సున్నాలేసే ఆసామి ‘ రావయ్యా మగాడా నాకు ఆలస్యమైపోతుంది, ఒక్కరోజులో ఇల్లంతా సున్నం వేయడం అంటే మాటలు కాదు ‘ అని వేగంగా నడవసాగాడు.
రోడ్డుమీద వున్న కొండ పిచ్చుకల గుంపు జగపతి విసిరిన రాయికి లయబద్దంగా ఎగిరిపోయింది.
* * *
వైజాగ్ టవున్లో కప్పరాడ జంక్షను దగ్గర బస్సు ఎక్కి పదవ నంబరు మైలురాయి అనే కృష్ణరాయపురం దగ్గర బస్సు దిగారు.
కుడి వైపు రోడ్డులో కొండవైపు నడుస్తూ వెళ్తున్నారు.
నడుస్తున్న వాళ్లకు కుడి వైపు సేనాతి వాని పాలెం, దానికి ఎదురుగా కృష్ణరాయపురం పాత వూరు.
ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాలనీలోకి వెళ్ళడానికి రెండు రోడ్లు వున్నాయి.
జగపతి నాన్న అక్కడ మూడువందల గజాల స్థలం తీసుకున్నాడు.

ఒక సంవత్సరం పునాదులు, మరో ఆరునెలలు గోడలు, కొంత కాలం మరోటి, ఆర్నెల్లు పోయాక ఇంకో పని, ఇలా నెలలూ, సంవత్సరాలుగా ఆ ఇల్లు సాగుతోంది.
ఇలా కడుతున్నపుడు జగపతి.. వాళ్ళ నాన్నతో ఆదివారం పూట ఆ ఇల్లు చూడటానికి వొచ్చేవాడు.
ఒక్కోసారి కుటుంబమంతా వొచ్చి తలాకొంత పనిచేసి అక్కడే అన్నాలు తిని వెళ్ళిపోయేవారు.
పట్నం కంటే ఇక్కడ చాలా బాగుంది, ఎటువంటి గొడవలూ లేవు, ఎటు విన్నా పక్షుల అరుపులు.
దాంతో జగపతికి ఆ కొత్త వూరు బాగా నచ్చేసింది.
ఆ స్థలంలో వాళ్ళు కట్టేది పెద్ద ఇల్లనుకుంటే పొరపాటు.
అంత పెద్ద చోట రైల్వే భోగీలాగా వరస గదులు కట్టించాడు వాళ్ళ నాన్న.
పక్కన కూడా అన్నే గదులు కట్టుకునేంత ఖాళీ స్థలం వొదిలేశారు.
ఇంకా చెక్క తలుపులు, కిటికీలు బిగించని ఆ ఇంటిలో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు కలతిరగొచ్చు.
మెల్లగా కొంచెం కొంచెంగా కడుతోన్న ఆ ఇంటికి ఒకసారి సున్నాలు ఏయించారు.
అయితే సున్నాలేసాక రెండు రోజులు వాటరింగు చేయమని పురమాయిస్తే ఆ పనిచేసిన సేనాతి వాని పాలెం సన్యాసి నాయిడు నూతిలో నీళ్లు తోడటానికి బద్దకించి వెనకాల వెళ్తోన్న గెడ్డ నీళ్ల తో కానిచ్చేశాడు.
అప్పటికి బానే వున్నా తెల్లగా ఉండాల్సిన సున్నం గోడ కాస్తా మట్టిరంగులో కనపడసాగింది. అంటే రెండు మూడురోజులు తడిపిన ఆ గెడ్డ నీళ్లలో మట్టి కలిసిపోయి గోడలన్నీ మట్టి రంగులో కనపడసాగాయి.
* * *
అది చూసి చిరాకు పడిన జగపతి వాళ్ళ నాన్న ‘ ఈ సారి శుభ్రంగా తెల్ల సున్నం వేయిద్దాం, వాటరింగు మాత్రం నూతిలో నీళ్లతో చేయిద్దాము, నాకివ్వాళ ట్రేడ్ యూనియను పనుంది, నేను రాలేను ‘ అని చెప్పి సున్నాలోడితో కలిపి
కప్పరాడ జంక్షన్లో 28ఎ నంబర్ బస్సెక్కించేసాడు.
అదిగో అలా ఆ మట్టిరోడ్డు మీద నడుస్తున్న వాళ్లకు ఎదురుగా సేనాతివాని పాలెం సన్యాసినాయుడు వొస్తున్నాడు.
సన్నగా ఆరిపోయినట్లు ఉంటాడు నాయుడు, కాళ్లకు కిర్రు చెప్పులు, నిక్కరు, షర్టుపై తువ్వాలు అదీ నాయిడి ఆహార్యం.
‘ ఏం బాబూ, మళ్లొచ్చినారు .. మల్లోపాలి సున్నా లేయిస్తన్నారా’ అన్నాడు. నవ్వులో కొద్దిగా ఎటకారం వుంది.
‘ ఆ.. అవును. పోయిన సారి వేయించిన సున్నం యెర్ర రంగు వొచ్చేసిందని మళ్ళీ వేయించామన్నారు మా నాన్న’ అన్నాడు జగపతి.
‘ ఆ వేయించండి.. వేయించండి.. వాటరింగు చేసేపని మాత్రం నాకే ఒప్పజెప్పండి ‘ అన్నాడు.
‘ మొన్న సారి నువ్వు చేసిన పనికే గోడలలాగా ఎర్రగా అయిపోయాయి..అందుకే మళ్ళీ సున్నాలేస్తున్నాము, నువ్వు గెడ్డ లో నీళ్లతో వాటరింగు చేసావంట కదా ‘ అన్నాడు.
‘ బాబూ.. అవి తూరుపు కనుమల్లో నీళ్లు బాబూ.. ఆ నీళ్ళకేం బాబూ అవి స్వచ్ఛం బాబూ.. స్వచ్ఛం’ అన్నాడు సన్యాసి.
‘అవి స్వచ్ఛమే .. కానీ మన గెడ్డనుంచి తోడేటప్పటికీ మట్టి కూడా వాటితో వొస్తుంది కదా… అని’ గొణిగాడు జగపతి. ఇంకా ఎక్కువ మాటాడితే ఆలస్యమైపోతుందని ముందుకు నడవసాగాడు.
అప్పటికే సున్నాలేసేవోడు ముందుకు వెళ్ళిపోయాడు.
‘ ఒక ఇరవై రూపాయలుంటే ఇవ్వండి.. రేపు పనిచేసేటప్పుడు మినహాయించుకుందురు ‘ అన్నాడు నాయుడు.
నాయుడు దగ్గర గాఢమైన మందు వోసన.
జగపతి ఏం మాట్లాడలేదు.
ఇదిగో ఈ గరువులన్నీ మావే .. ఆ వుడా వాళ్ళు లే అవుటు వేసినవి.. ఆ కొండ కింద గరువులు.. ఈ మిరప, టమోటా పండుతున్న పొలాలు అన్నీ మావే. అయితే ఇప్పుడు కాదనుకో ఒకప్పుడు. మామేం చేసామంటే టవును నుంచి వొచ్చిన బ్రామ్మలకి.. రాజమండ్రి నుంచి వొచ్చిన రెడ్లకి.. గుంటూరు కమ్మోళ్లకి ..కోళ్ల ఫారాలు పెట్టుకుంటానంటే అనాకీ కాణీకి అమ్మి పారీనాము’ అని చెప్పుకుపోతున్నాడు.
ఇంక ఈ గుంటడి దగ్గర డబ్బులు రాలవు అని అర్ధమైందేమో, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ, చిన్నగా ఊగుతూ, టైరుతో చేసినట్లున్న ఆ పెద్ద చెప్పులతో ఆ మట్టి బాటపై ముందుకెళ్ళిపోయాడు.
* * *
ఇద్దరూ గెడ్డ మీద నుంచి గెంతీసి జగపతి వాళ్ళ ఇంటికి చేరారు .
ఆవల ఉన్న మట్టి రోడ్డు మీద రావడం వల్ల వాళ్ళు ఇంటికి వెనకనుంచి చేరారు.
అది ప్రహరీ లేని ఇల్లు కాబట్టి ఎటునుంచైనా వెళ్లొచ్చు.
సున్నాలేసే వోడు సామాను ఇంటి బయట పెట్టి అగ్గి ముట్టించు కున్నాడు.
అతను జగపతి వైపు తిరిగి నీదే ఆలస్యం నేను పని మొదలుపెట్టాలి అన్నట్టు చూసాడు.
జగపతి వాళ్ళ కొత్త ఇంటి ఎదురుగా వాడబలిజీలైన తారకేశ్వరరావు గారి ఇల్లు వుంది, ఆయనకు ఇంటి వెనక బావి వుంది
జగపతి తిన్నగా తారకేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాడు.
ఒక బకెట్టుతో నీళ్లు అడిగి , వాళ్ళు తెచ్చేలోగా ఈలోగా అక్కడున్న న్యూస్పేపరు చదూతున్నాడు.
‘ శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస భారత శాంతి సేనలను ఆహ్వానించాడు.’ ఆహా మనదేశానికి పక్క దేశాల గొడవలంటే ఎంత ఇష్టం అనుకున్నాడు.
‘ దేశమంతా ఎల్టీటీయి మెరుపుదాడులు. ఇరవై మంది సైనికుల మృతి.’ చదివి అయ్యో ప్రాణాలెవరివైనా ప్రాణాలేగా అనుకున్నాడు.
‘ఇండియాలో కంప్యూటర్లు తెస్తా-రాజీవ్ గాంధీ’ వావ్.. నేనుకూడా పెద్దయ్యాక కంప్యూటర్ నేర్చేసుకోవాలి.
‘పెరిగిన పెట్రోల్ ధరలపై కంచరపాలెం లో కమ్యూనిస్టుల నిరసన’ ఆహా.. మా నాన్న కూడా నిన్న ఇక్కడకు వెళ్ళుంటాడు అనుకుని పేపర్లో ఆయన పేరుందేమో అని వెతికాడు.
ఎల్లైసీలో పనిచేసే శర్మ గారి ఆధ్వర్యాన ఈ నిరసన కార్యక్రమం జరిగినట్లు గా వొచ్చింది. అది చదివి నిరాశ చెందాడు.
‘ నాలాంటి బొక్కా గాడి పేరు రోజూ పేపర్లో రావాలంటే ఏం చేయాలో ‘ అని గొణుక్కుంటూ గోడలవార వెళుతున్న కండ చీమల వంక చూసాడు. అతనికి క్రమశిక్షణతో వెళ్తున్న వాటి లైనుని చెదరగొట్టాలి అనిపించింది.
మూలనున్న చీపురులోంచి ఒక ఈనుపుల్ల తీసి వాటికి అడ్డు పెట్టాడు. అవి చెదిరిపోయాయి.
ఇప్పుడు.. హమ్మయ్య అనుకున్నాడు.
జగపతికి క్రమశిక్షణ అంటే నచ్చదు. ఇప్పుడతనికి సుఖంగా వుంది.
ఇంతలో తారకేశ్వర రావుగారి భార్య జయమ్మ ‘నీళ్లు తీసుకో ‘ అంది. బకెట్టు గచ్చు మీద పెట్టి.
ఈ లోగా సున్నాలేసేవోడు.. ‘ ఓ.. బాబూ తొందరగా ఇటురా .. తొందరగా ‘ అని గావుకేక పెట్టాడు.
బకెట్టు అక్కడే వొదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్లిన జగపతి అక్కడ వున్న దృశ్యం చూసి అలా ఉండి పోయాడు.
పరిగెత్తుకెళ్లిన అతనికి తలుపులూ గుమ్మాలు లేని ఆ మూడుగడుల ఇంటిలోంచి ఒక పెంపుడు కుక్క ఎదురైంది.
అది నిర్వికారంగా వాళ్ళని చూసి ‘ఎవర్రా మీరు? మీకేటిక్కడ పని’ అన్నట్టు చూసుకొని పోయింది.
.. అక్కడ.. .. అక్కడ.. ఆ మూడు గదుల ఆ వరాస ఇంటిలో మొదటి గదిలో గదంతా పూర్తిగా నింపిన ఎండు గడ్డి.
రెండో గదిలో రెండు గేదెలు వున్నాయి.
ఒకటి చక్కగా కూర్చొని ఉంది. మరోటి నుంచొని పేడ వేస్తుంది.
మనుషుల్ని చూసిన ఆనంద ప్రకటనతో గది గోడమీద దాని మూత్రం చిమ్మింది.
కొంచెం ఉంటే అది వీళ్ళ షర్టుల మీద పడేది.
ఇంకా గచ్చులు చేయని ఆ కిందంతా పేడ పేడ గా ఉంది. గోడలకు కూడా అక్కడక్కడా పేడ మరకలు.
గేదెలు మాత్రం బలంగా, నల్లగా, అందంగా వున్నాయి.
అవి ఎటూ పోకుండా గచ్చులు ఇంకా వేయని ఆ ఇంటిలో వాటికి కర్రా తాడూ కూడా బిగించారు.
చక్కగా ఎండుగడ్డి నములుతూ అవి ఆనందంగా వున్నాయి.
ఇంతలో ఆఖరి గదిలో నుంచి ‘ లక్ష్మీ.. గౌరీ ..’ అని పిలుస్తూ ఎవరో మాట్లాడుతున్నారు.
లోపలికి వెళ్లి చూస్తే అక్కడ శారదాంబ గారు కనపడ్డారు.
‘ వొంట్లో ఎలా ఉంది తల్లీ, ఇప్పుడు బాగుందా ? నీళ్లు తాగావా ?’ అని మూడో గేదెను దానికి పుట్టిన దూడను పలకరిస్తూ ఆవిడ వాటి వీపు మీద నిమురుతుంది.
ఆవిడ జగపతి నాన్న పనిచేస్తున్న నేవల్ అర్మెంటు డిపో లో మేనేజరు గారి భార్య.
వాళ్ళు అక్కడకు దగ్గర్లోనే నలుగురు పిల్లలతో తమ మేడింట్లో హాయిగా వుంటారు. వాళ్ళ ఇంటిముందు చిన్న పాక వేసి గేదెలు పెంచుతుంటారు.
ఆవిడ ఇక్కడ వుందేంట్రా బాబూ అని ఆలోచిస్తున్న జగపతికి మతి పోతోంది.
ఆవిడొక్కసారి వీళ్ళవైపు చూసి తిరిగి తన గేదెలతో, దూడతో మాట్లాడుకోసాగింది.
ఆవిడ జంతు ప్రేమకు ఆనందించాలో ,లేదా సున్నాలేయించాల్సిన ఇల్లు అలా ఎందుకుందో అర్ధం కాక బిర్ర బిగుసుకు పోయిన జగపతి వెనక్కి తిరిగి చూస్తే..
సున్నాలేసేవోడు హాయిగా మరో ఛార్మ్స్ సిగరెట్టు కాల్చుకుంటూ వున్నాడు.
గేదెలన్నీ ఒక్కసారిగా ‘అంబా’… అని అరవడం మొదలు పెట్టాయి ( శారదాంబా అనా?)
ముందీ పేడ కంపులోంచి బయటపడదాం అనుకొని వాటిని దాటుకొని వొస్తున్న జగపతిని గేదొకటి ఎడం కాలితో తన్నింది.
జగపతి తూలి సున్నాలోడి మీద పడ్డాడు.
అతను వెళ్లి సున్నం బకెట్టు మీద పడ్డాడు. బకెట్టులో ఉన్న పొడి సున్నం గాల్లో చేరి కొంత జగపతి మీద మరికొంత గేదెల మీద పడ్డాయి.
గేదెలిప్పుడు తెల్లగా వున్నాయి.
అవి ఆనందంతో ‘అంబా.. అంబా’ మరోసారి పెద్దగా, గట్టిగా అరిచాయి.
దూరంగా ఇందాక వెళ్లిన కుక్కనుకుంటా ‘ బొయ్యో ‘ మని అరవసాగింది.
*
Add comment