అన్ని దారుల్నీ వద్దనుకొని
నవ్వే కళ్ళతో చేతులు చాచిన నిన్ను కలిశాకనే,
ఈ యుగాల బీడుభూమి
క్షణాల్లో పరవశాన విరబూసింది!
మన చేతుల మీదుగా
ఋతువులు ఎంత వేగంగా తిరిగాయనీ!
ఓ రాత్రి ఆకాశం కింద
నువ్వు చెప్పే కథ వింటూ కలలోకి జారిన గుర్తు!
ఆ సూర్యోదయాన కళ్ళు తెరిచినప్పుడు
రాత్రి వరకూ నడిచిన దారి
ఒక్కసారిగా మూసుకుపోయి
సాగుతూ ఉన్న పాట ఆగిపోయి
వెలుగుతూ ఉన్న దీపం ఆరిపోయి
వెన్నెల మీద మబ్బులు కమ్మి
మైదానం మీద తుఫాను మొదలయ్యి
తెలుసా నీకు,
ఇదంతా నీ మౌనం వల్ల అని?
ఎటు కదిలితే ఏది కూలిపోతుందోనని
లోలోపల మరణిస్తూ, మళ్ళీమళ్ళీ పుడుతూ,
కూకటి వేళ్ళతో విరిగిపడి తిరిగి చిగురిస్తూ
ఇప్పటికీ ఇదే అడవి మలుపులో ముక్కలుగా,
తెలుసా ఇదంతా నువ్వు విసిరేసిన
గాజుబొమ్మ తాలూకు గాయాలని?
మనసు తట్టుకుందేమో,
ఉన్నదీ లేనిదీ కూడా తానే అయిన
ఆకాశం మీద నమ్మకంతో,
కానీ, ఒక్కో ఎముక లోలోన విరిగి
కలిసి నడిచిన కూడళ్ళలో రక్తం గూడుకట్టడం
నీకు ఇప్పటికీ తెలియదుగా!
పోన్లే
విరామం ఎలా ఉంది!?
అనంతమైన అవ్యాజమైన
జీవన సాఫల్యపు అధ్యాయం నుంచి
హడావిడిగా దిగి వెళ్ళావుగా?
ఇక్కడ ఊపిరాడలేదనీ,
ఈ ప్రేమలు చెరసాలలని!
అరణ్యాన చిత్రను విడిచి
అర్జునుడు సాగిపోయినట్టు!
నిద్రలో పసివాడి నవ్వు సైతం
సిద్ధార్థుడిని ఆపలేనట్టు!
నేరమూ కాదు, నిందా లేదు
ఒకటైన హృదయాలు రెండు ప్రాణాలయ్యాయి
ఇప్పుడు,
త్రాసులో ఒకరి స్వేచ్ఛా – ఒకరి శిక్షా
సమానంగా తూగాయి చూడు!
*
🙏🏻🙏🏻 అద్భుతం