ఎర్ర చీర

ట్టల అల్మారా నుండి వాసన మొదలైంది. ఈ వానాకాలంలో బట్టలు సరిగ్గా ఎండవు. అలానే మడతలు వేసి లోపల పెట్టేస్తే వాసన వచ్చేస్తాయి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఏంటని కొడుకుని, భర్తని తిట్టుకుంది. ఇవన్నీ తీసి, ఎండ బెట్టి తిరిగి మడతలు వెయ్యాలి. ఇలాంటి ఎక్స్‌ట్రా పనులకి తనకు వీకెండ్‌లో తప్ప మిగతా రోజుల్లో తీరిక దొరకదు. ‘నాకు టైమ్‌ లేదు’ అని భర్త అంటాడు. తనకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది టైము. తనూ ఉద్యోగే.

ఉదయం పదకొండు గంటలకి షిఫ్ట్‌. హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో ఈదుకుంటూ హైటెక్‌ సిటీకి వెళ్లాలంటే పదిగంటలకే బయలుదేరాలి. రాత్రి ఎనిమిది వరకూ డ్యూటీ తప్పదు. ఇంటికి వచ్చే సరికి తొమ్మిది. నాలుగు మెతుకులు ఉడకేసి, పిల్లాడి హోమ్‌ వర్క్, అమెరికా టీంతో మిగతా కాల్స్‌ మాట్లాడే సరికి పదకొండున్నర. ఈ ఒత్తిడి ఇలా ఉంటే ఇల్లు మారాక కొత్తగా వచ్చిన పనావిడ ఎనిమిదిన్నర వరకూ రాకపోవడం ఇంకో గోల. ఆమె వచ్చి పనులు చక్కబెట్టి వెళ్ళే వరకు ఇల్లు కదలడానికి లేదు. వదిలేసి వెళదాం అంటే కొత్తచోటు, కొత్త పనావిడ. పాతింట్లో అయితే పక్కింటి ఆంటీకి చెప్పేసి, తాళం ఇచ్చేసి వెళ్లిపోయేది. ఇక్కడ అలా కాదు, ఇంకా నమ్మకం కుదరలేదు తనకి.

‘ఈమె చేస్తుందమ్మా’ అని కింద పోర్షన్లో పని చేసే ఆమె తెచ్చిపెట్టింది తనఫ్రెండ్‌ అని. ఇద్దరూ కలిసి ఏదో బ్యూటీప్రొడక్ట్స్‌ షాప్‌లో హౌస్‌ కీపింగ్‌ చేస్తారు. షాపు పదకొండింటికి తెరుస్తారు. ఈలోపు ఒక రెండు గంటలు ఇళ్ళ పనులు చేసి కొద్దో గొప్పో సంపాదించుకుందాం అని తపన. త్రీ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ తనది. కొత్తగా వచ్చినావిడ ఇల్లంతా డస్టింగ్, స్వీపింగ్, మాపింగ్‌ చేసి, గిన్నెలు కడిగి, వాషింగ్‌ మెషీన్‌లో ఉన్న బట్టలు తీగ మీద వేసి, చెత్తబుట్ట తీసుకెళ్లి గేటు దగ్గర పెట్టేసరికి పదీ ఇరవై దాటుతుంది. ఆమె వెళ్ళాక తలుపులు అన్నీ వేసుకుని, కారు బయటకు తీసేసరికి పదిన్నర.

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ దగ్గర ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది రోజూ. బంపర్‌ టు బంపర్‌ టాఫిక్‌లో డ్రైవ్‌ చేయాలంటే నరకం. అప్పుడే కొడుకు సాయంత్రం డిన్నర్‌లోకి చేయమన్న పన్నీర్‌ కూర గుర్తుకొస్తుంది. భర్త మరుసటి రోజు ఆఫీస్‌ టూర్‌కు చేయవలసిన ఏర్పాటు గుర్తుకు వస్తుంది. లేకపోతే బాస్‌ కాల్‌ చేసి డ్రైవింగ్‌లో ఉందని తెలిసీ తల తింటాడు. మరీ ఎక్కువ ట్రాఫిక్‌ ఉంటే ఉదయం పదకొండుంబావుకు జరిగే స్టేటస్‌ కాల్ కారులో నుండే తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రశాంతత దొరకదా? రోజూ ఇంతేనా అనిపిస్తుంది. ఎంత తెల్లవారుజామున లేచినా ఈ పరుగులేంటి?

అల్మారా నుండి రోజురోజుకి వాసన ఎక్కువవుతోంది. ఆ వీకెండ్‌ పిల్లాడి బట్టలు అన్నీ బయటకి తీసి బెడ్‌ పైన పెట్టింది. వాసన తగ్గలేదు. పై అరలో ఉన్న తన చీరలు తీసి చూసింది. వెనక ఒక చిన్న ఎలుక చచ్చి పడుంది. ఇది ఎలా వచ్చింది ఇక్కడకి? కొడుకును పిలిచింది.

“చూడు.. తీసిన వెంటనే అల్మారా డోర్‌ వేయకపోతే ఏమవుతుందో” అని తిట్టింది. వాడు విన్నట్టుగానో, విననట్టుగానో చూసి వెళ్లిపోయాడు.

పనావిడతో క్లీన్ చేయించి అల్మారా నిండా స్ప్రే కొట్టి, ఓ ప్యాకెట్‌ కలరా ఉండలు వేసి నాలుగు రోజులు డోర్‌ తెరిచి ఉంచితే వాసన పోతుందని వదిలేసింది. కొడుకు బట్టలు, తన చీరలు బెడ్‌ మీద ఉంచి, పైన ఒక పాత దుప్పటి కప్పింది. ఎలాగూ ఇది వాడని రూమ్‌ కాబట్టి పర్లేదనుకుంది. వారం తర్వాత ఆ బట్టలు, చీరలు అన్నీ అల్మారాలో సర్దటానికి కూర్చుంది.

ఉన్న కాస్త చోటులో ఒక చీర పెడితే ఇంకోటి కిందకి పడిపోతూ ఉంది. భర్త వచ్చి చూశాడు. “ఏంటి.. చీరలు ఎక్కువయ్యాయా? పాతవి ఎవరికైనా ఇచ్చేయరాదా? మొన్న కరోనా టైంలో అదేదో మారుమూల పల్లెటూరులో ఆడవారికి కనీసం కట్టుకోవడానికి సరిగ్గా బట్టలేదని చాలామంది డొనేషన్స్‌ కలెక్ట్‌ చేశారు. అలాంటి వారికి ఉపయోగం కదా” అన్నాడు.

“కరోనా సరే. ఇంత ఖరీదైన చీరలు ఎవరైనా డొనేషన్‌ ఇస్తారా?”

“అవసరం ఉన్న వారికి ఇస్తేనే కదా నీకు పాతవి వెళ్ళిపోయి కొత్తవి వచ్చేది? అది ప్రకృతి ధర్మం కదూ? పైగా ఇక్కడ పనికి రాకుండా పడుండే కన్నా అక్కడ అవసరమున్న వారికి ఉపయోగం కదా?”

“చాల్లే ఊరుకోండి. ఇంత రేటుపెట్టి కొని ఇచ్చేయమంటే ఎలా? ఇది పెళ్లప్పుడు మేనత్త వాళ్ళుపెట్టారు. ఇది మొదటిసారి టూర్‌ వెళ్లినప్పుడు మైసూర్‌లో కొన్నాను. ఇది మీరు మేరేజ్‌ డేకు కొనిచ్చింది” అని ప్రతి చీరకి ఒక జ్ఞాపకం చెప్పుకొచ్చింది.

మెల్లగా పనావిడ అలవాటు అవ్వడం, ఆమెని కాస్త ముందు రమ్మనడం, వీలున్నప్పుడు చాయ్, టిఫిన్‌ ఇవ్వడం లాంటివి చేసింది. ఎంత ఆవురావురమంటూ తినేదో. పొట్టిగా ఉంటుంది. డొక్క ఎండి పోయినట్టు లోపలికి నొక్కుకుని ఉంటుంది. అయినా సరే, బొట్టు కింద బొట్టు, శుక్రవారం గంధం రాసుకుని భలే కళగా ఉండేది మొహం. ఒక్కోరోజు తను పదిగంటలకే బయల్దేరి వెళ్లిపోయేంత నమ్మకం సంపాదించింది. ఆమె పని ఆమె చేసుకుని, చెత్త పడేసి, డోర్‌ ఆటో లాక్చేసి వెళ్లిపోయేది.

ఎప్పుడైనా అయిదు నిమిషాలు దొరికితే ఆమె కష్టాలు చెప్పుకునేది.

“నా మొగుడి పెయింటింగ్‌ పనిలో పెద్దగా ఆదాయం లేదమ్మా. ఇద్దరు ఆడపిల్లలు ఎదుగుతున్నారు. చదివించి పెళ్ళిళ్లు చేయాలా, వద్దా? పట్టనట్టుగా ఉంటాడు. చిన్నతనంలోనే పెళ్లి చేసేయడం వల్ల నా రాత ఇట్లా ఉంది. పిల్లల్ని మాత్రం బాగా చదివించి, ఘనంగా పెళ్ళి చేయాలనుంది” అని చెప్పేది.

తనకి ఇవ్వన్నీ పెద్దగా పట్టేవి కావు.

“ఇందులో ఏముంది? పిల్లల కోసం కాకపోతే ఇంకెవరి కోసం? ఇది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేదేగా. ఇందులో కొత్తేముంది?” అనుకునేది.

ఇదే మాట భర్తతో అంటే, “అదేంటలా అంటావ్‌? మనం చేంజ్‌ కోసమో లేక టైం లేకనో బిర్యానీ ఆర్డర్ చేసినట్టు వాళ్ళు చేయగలరా? ఒకపూట అలా తినగలిగితే అదే పెద్ద పండగ వాళ్లకి. ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు అంటే ఎంత పెద్ద బాధ్యత? ఆవిడ కష్టం మనమలా తీసి పడేయకూడదు” అన్నాడు.

మూడు నెలలు గడిచాయి. కజిన్‌ పెళ్లి వచ్చింది. సంగీత్‌ పార్టీకి రెడ్‌ కలర్‌ కోడ్‌ పెట్టారు. ఉప్పాడలో కొన్న పండు మిరపరంగు చీర, దానికి కుట్టించిన డిజైనర్‌ బ్లౌజ్‌ గుర్తుకొచ్చింది. అది కట్టడం చుట్టాల్లో ఎవరూ చూడలేదు. ఒకసారి ఇస్త్రీకి ఇచ్చి రెడీగా పెట్టుకుందామని అల్మారా తెరిచింది. ఎంత వెతికినా చీర కనపడలేదు. వేరే షెల్ఫ్‌లో ఏమైనా ఉందేమో అని ఇల్లంతా చూసింది. తల్లికి ఫోన్ చేసి నీకు ఏమైనా ఇచ్చానా అని అడిగింది. ఇలాంటప్పుడు ఆమె క్లాస్‌ పీకడం ఆనవాయితీ.

‘‘అప్పుడప్పుడన్నా చీరలు కడితే ఏ చీర ఎక్కడుందో లెక్క తెలుస్తుంది. కట్టుకోనప్పుడు అన్ని చీరలు ఎందుకుకొంటావసలు? చీరలనే కాదు, ఆ ఆన్‌లైన్‌ డెలివరీ కుర్రాడు ఇంటి చుట్టూ తిరిగినవాడు తిరిగినట్టే ఉంటాడు. అంతలా ఏం కొంటావు ఎప్పుడూ?’’ అని వేస్కుంది.

అన్ని చీరలూ తీసి చూసింది. పుట్టింటి వాళ్ళు తన సీమంతానికి పెట్టిన గులాబీ రంగు చీర కూడా కనపడలేదు. ఈ ఇంటికి వచ్చాక ఆ చీరలు తను కట్టలేదు. చివరిగా తీసింది అల్మారా ఖాళీ చేసినప్పుడే. వారం పాటు ఖరీదైన చీరలు బయట పెట్టి వెళ్ళినప్పుడు పనావిడ ఏమైనా తీసిందా అని చిన్న అనుమానం వచ్చింది. గట్టిగా అడుగుదామంటే ఏదోలా అనిపించింది. అన్నిట్లో జాగ్రత్తపడటం మొదలుపెట్టింది. మళ్ళీ ఆవిడ వెళ్లాకే తలుపులు వేసుకుని ఆఫీసుకి వెళ్లడం చేసింది.

“ముప్పైవేలు పోసి కొన్నావు. ఆ బ్లౌజ్‌కి ఐదువేలు తగలేసావు. ఇల్లు అప్పజెప్పి వెళ్లిపోవడం ఏంటని” తల్లి కుదిరినప్పుడల్లా ఎర్ర చీరను గుర్తు చేసి తిడుతూనే ఉంది. రేటు గురించి కాదు కానీ, అది మొదటిసారి కట్టుకున్నప్పుడు భర్త ఇచ్చిన  కాంప్లిమెంటు గుర్తొచ్చింది. నీ తెల్లటి స్కిన్‌ టోన్‌కి ఈ ఎరుపు భలే అందం తెచ్చి పెట్టింది అన్నాడు.

ఆర్నెల్ల తర్వాత జ్వరం అని ఒకరోజు డుమ్మా వేసింది పనావిడ. తర్వాత ఒకటి రెండు రోజులు వచ్చి మళ్ళీ జ్వరం. ఆ తర్వాత తగ్గలేదని మొత్తానికే డుమ్మా వేసింది. పదిరోజుల తర్వాత కింద పని చేసే ఆమె వార్త తీసుకొచ్చింది. ఆమెకి ఒక కిడ్నీపాడైయ్యిందని, డయాలిసిస్‌ చేయాలని, ఇప్పట్లో పనికి రావడం కుదరదు అని చెప్పింది. ఒకటో తారీఖు నుండి వేరే అమ్మాయిని పెట్టుకుంది. రెండేళ్లు గడిచాయి.

ఎప్పుడైనా పనామె డుమ్మా వేస్తే కింద పని చేసే ఆమె వచ్చి గిన్నెలు కడిగేసి వెళ్ళేది.

‘ఎలా ఉంది మీ ఫ్రెండ్‌’ అని అడిగినప్పుడల్లా అదే డయాలిసిస్‌ అని, మనిషి బాగా బక్కచిక్కి పోయిందని, ఇద్దరు కూతుళ్ళ పెళ్లి గురించి మనేద పెట్టుకుందని చెప్పేది. రెండు నెలలు తర్వాత ఓ ఆదివారం కూరగాయల బండివస్తే కిందకి వెళ్ళింది. కింద పని చేసే ఆమె ఓనర్‌ ఆంటీకి ఫోన్లో ఏవో ఫోటోలు చూపిస్తోంది.

తనని చూడగానే ఫోన్‌ తెచ్చి ఫోటోలు చూపించింది. తన దగ్గర చేసి మానేసినావిడ పెద్దకూతురు పెళ్లి అయ్యిందట. ముహూర్తానికి కట్టుకున్న చీర గురించి అందరు గొప్పగా చెప్పుకున్నారట.

అవన్నీ వింటూ ఉంటే తనచూపు ఒక ఫోటో మీద పడింది. ఈ రంగూ అనుకుంటూ ఫోటో జూమ్ చేసి చూసింది. ఒక్క నిమిషం తన మోహంలో రంగులు మారిపోయాయి. తర్వాత కోపంతో బుగ్గలు ఎర్రబడి, వేడెక్కాయి. మెల్లగా సముదాయించుకుంది. ఆలోచిస్తూ మెట్లు మీద కూర్చుంది.

‘‘తప్పు నాదేనా? అనవసరంగా ఆమెని నమ్మానా? ఇల్లు కన్నా ఉద్యోగం ముఖ్యమా? ఇన్నిన్ని చీరలు అనవసరంగా కొన్నానా? ఆమెని కేవలం పనావిడగా మాత్రమే చూసానా? నిజానికి ఒక మనిషిలా చూసుంటే ఆమె అవసరం ఏంటో, ఆవేదన ఏంటో తెలిసేది కాదా? అర్ధం చేసుకుని ఉంటే నెల నెలా కాస్త డబ్బు తీసి పక్కన పెట్టి ఆమె కూతురు పెళ్ళికో లేక చదువుకో సర్దుబాటు చేసేదాన్నికాదా? నిజానికి ఆమె అవసరం ఎలా ఉన్నా, తన కూతురు తనలా కాకూడదనే తపన ఆమెతో ఇంతపని చేయించింది.’’

తను కూర్చున్న మెట్లు దగ్గరకి ఎండిన ఆకులు గాలికి రాలి కింద పడ్డాయి. తలపైకెత్తి చూసింది. కొమ్మలకి చిన్నచిన్నగా చిగురు వస్తోంది. అప్పుడే భర్త మాటలు గుర్తొచ్చాయి.

‘పాతవి వెళ్ళిపోతేనే కదా కొత్తవి వచ్చేది? అది ప్రకృతిధర్మం.’

ఇంకేం ఆలోచించలేదు. లేచి, ఆమెకి తిరిగి ఫోన్‌ ఇస్తూ, ‘పండు మిరప రంగు ఉప్పాడ చీరలో పెళ్ళికూతురు చాలా బాగుంది’ అని నవ్వేసి వెళ్లిపోయింది.

*

స్ఫూర్తిదాయకమైన మనుషుల కథల్ని రాయాలని ఉంది

* హాయ్ ఊహా! మీ గురించి చెప్పండి.

మా అమ్మానాన్నలది విజయవాడ. నాన్న ఆంధ్రజ్యోతి పత్రికలో జర్నలిస్ట్‌‌గా పని చేసేవారు. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. కాబట్టి హైదరాబాదీ అనే చెప్పాలి. నా చదువంతా ఇక్కడే సాగింది. ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను.

* రాయాలన్న ఆసక్తి ఎలా మొదలైంది?

చిన్నప్పుడు పుస్తకాలు బాగా చదివేదాన్ని. యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి నవలలు చదివాను. ఆ టైంలోనే ఒకటి, రెండు కవితలు రాస్తే అవి ‘మిష’ అనే పత్రికలో అచ్చయ్యాయి. ఆ తర్వాత స్కూల్లో మ్యాగజైన్ ఎడిటర్‌గా పని చేశాను. చదవడం పట్ల ఎప్పుడూ ఆసక్తితో ఉన్నాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు మా నాన్న మహమ్మద్ ఖదీర్ బాబు గారి ‘దర్గామిట్ట కతలు’ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. సూటిగా, హత్తుకునేలా ఉన్న ఆ వాక్యాలు, కథలు తెగ నచ్చేశాయి. కథలు రాయాలన్న ఆలోచన అప్పుడే మొదలైంది.

* తొలి కథ ఎప్పుడు రాశారు?

స్కూల్ రోజుల్లో నాకు జరిగిన ఒక అనుభవాన్ని ‘ఆకుపచ్చ చీర’ పేరిట కథగా రాశాను. 2019లో Chai Biscuit పేజీలో అది ప్రచురితమైంది. ఇప్పటికి 15 దాకా కథలు రాశాను.

* మీ కథల్లో గుర్తింపు తెచ్చిన కథ?

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో పడ్డవారిని రక్షించే శివ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన జీవితాన్నే ‘శివ అంటే ఈడే’ పేరుతో కథగా రాశాను. అది చాలా గుర్తింపు తెచ్చింది. వేల మంది ఆ కథ చదివారు. మంత్రి కేటీఆర్ ఆ కథకు స్పందించారు. దాని గురించి చాలా చర్చ నడిచింది. నేను రాసిన ‘చిలకలు’ అనే కథ కూడా పేరు తెచ్చింది.

* మీ పేరు ఊహ కదా? మరి ‘శ్రీ’ అనే పేరు..?

నా పూర్తి పేరు శ్రీ ఊహ. కథలు రాసేటప్పుడు దాన్ని షార్ట్ చేసి ‘శ్రీ’ అన్న పేరుతో రాస్తాను. కాబట్టి అదేమీ కొత్త పేరు కాదు. నా పేరే!

* మీకు నచ్చిన రచయితలు? కథలు?

మహమ్మద్ ఖదీర్ బాబు గారు రాసిన కథలు ఇష్టం. మెహర్ గారు రాసిన ‘బాబీగాడు తప్పిపోయిన రోజు’, ‘చేదుపూలు’ లాంటి కథలు చాలా నచ్చాయి. తమిళ రచయిత వణ్ణ నిలవన్ రాసిన ‘ఎస్తర్’ నన్ను వెంటాడే కథ. చదివినప్పుడు చాలా విషాదంలో మునిగిపోయాను. శ్రీశ్రీ గారి రచనలు, పరమహంస యోగానంద గారి Autobiography of a Yogi నన్ను బాగా ప్రభావితం చేశాయి.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

మన చుట్టూ ఉండేవారిలో స్ఫూర్తిదాయకమైన మనుషుల కథల్ని రాయాలని ఉంది. సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతున్న అపసవ్యతల మీద కథలు రాయాలని ఉంది.

*

 

శ్రీ ఊహ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు