‘సారంగ’లో ‘మొదటి కబుర్లు’ శీర్షికకు రాద్దామనుకోగానే… మొదట రాసిన కథా లేక మొదట అచ్చయిన కథా అన్న మీమాంసలో పడ్డాను. ఏమైనా… శంఖంలో నుండి పోస్తేనే తీర్థమన్నట్లు – అచ్చయిన కథనే చదువరులు కథగా ఆమోద ముద్ర వేసే వాతావరణం వుంది. అలా అచ్చయిన నా మొదటి కథ ‘కాపలా కుక్కలు’. ఇది 1989లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అచ్చయింది.
అనంతపురంలో ఒక గ్రూప్ థియేటర్స్ యజమాని ఆదేశాలను, పోలీసులు ‘జీ హుజూర్!’ అని పాటించిన సంఘటనపై రాసిన కథ అది. అనంతపురంలో అప్పుడే కట్టిన గ్రూప్ థియేటర్స్‌లో పేరున్న మాస్ హీరో సినిమా రిలీజ్ అయింది. సినిమా టికెట్లన్నీ యాజమాన్యం బ్లాక్ టికెట్‌దారులకే ఇచ్చి, కౌంటర్లో ఓ 20, 30 టికెట్లు అమ్మి కౌంటర్ మూసేసేవారు.
విశ్వప్రసాద్ మొదటి కథ ఇక్కడ చదవండి:
సినిమా రిలీజ్ అయిన మొదటి రోజో, రెండో రోజో హాస్టల్లో ఉండే ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలామంది సినిమాకు వచ్చారు. ఓ 20, 30 టికెట్లు ఇవ్వగానే కౌంటర్స్ మూసేశారు. అంతకుముందు ఈ అక్రమంపై ఆ థియేటర్ యజమానిని ప్రశ్నించినవాడు లేడు. ఆరోజు వచ్చింది ఎస్.కె. యూనివర్సిటీలో పిజి చేస్తున్న స్టూడెంట్స్…
సమాజం విద్యార్థులను బలమైన శక్తిగా చూస్తున్న కాలం. పోలీసులు కూడా విద్యార్థుల జోలికి వెళ్లాలంటే కొంచెం ఆలోచించి అడుగేసే కాలం.
స్టూడెంట్స్ మేనేజర్ రూమ్‌లో దూరి అక్కడున్న యజమానిని నిలదీశారు. మొదట్లో నచ్చజెప్పడానికి ప్రయత్నించిన యజమాని, వాగ్వాదం ముదిరాక ‘మీకు చేతనైంది చేసుకోండి’ అనే అర్థంలో మాట్లాడాడు. అక్కడున్నది విద్యార్థులు కదా… ఉడుకు రక్తం. స్టూడెంట్స్ చేతుల్లోకి కట్టెలు, రాళ్లు వచ్చాయి. థియేటర్స్ అద్దాలు, పగిలాయి. కుర్చీలు విరిగాయి.
థియేటర్స్ యజమాని డబ్బుతోపాటు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. మరుసటి రోజు హాస్టల్లలో కంటబడిన విద్యార్థులను కొందరిని, పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కొందరిని పోలీసులు తీసుకుపోయారని తెలిసిన వెంటనే, మరి కొందరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వాళ్లనూ లోపలేసారు.
థియేటర్స్ యజమాని వచ్చాడు. పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. అతని అహం చల్లారే వరకు స్టూడెంట్స్ ను పోలీసులు లాఠీలతో మోదారు.
పోలీసు అధికారుల విజ్ఞప్తితో ఆ థియేటర్స్ యజమాని దయతలిచాడు. కేసు లేకుండా మాత్రం స్టూడెంట్స్‌ను వదిలేశారు.
ఈ సంఘటన, యూనివర్సిటీలో పిజి చేస్తున్న నా బావమరిది చెప్పినప్పుడు, దాన్ని కొంత కల్పనతో కథగా మలిచాను.
నాకు అప్పటికే రాసే అలవాటు ఉన్నింది. రెండు కథలు 1984 లోనే రాసుకుని ట్రంకు పెట్ట అడుక్కు తోసేసిన అనుభవం ఉంది. అప్పటికే రేడియోలో రెండు కథలు, ‘అడవి మల్లి’ అనే అర్థగంట నాటిక ప్రసారమయ్యాయి.
‘కాపలా కుక్కలు’ ఆంధ్రజ్యోతి ఆదివారంలో అచ్చయిన సందర్భంలో, నేను గ్రామకక్షల గొడవల్లో జైల్లో ఉన్నాను.
ఆ కథ ప్రచురణకు తీసుకున్నట్లు కూడా ఎటువంటి కార్డు ముక్క లేదు.
మమ్మల్ని చూడ్డానికి జైలుకు వచ్చిన మా ఊరి స్నేహితుడొకరు ‘మొన్న ఆదివారం ఆంధ్రజ్యోతిలో నీ కథ ‘కాపలా కుక్కలు’ వచ్చిం’ దన్నాడు.
ఆ రోజుది పత్రిక సంపాదించి తీసి పెట్టమని అతనికి చెబితే. అతను తీసి పెట్టలేదు.
నేను బయటికి వచ్చాక గ్రామ రాజకీయాల వేడిలో పడి, కథ గురించి ఆలోచించలేదు. ఆ కథ నా దగ్గర లేదు. కథానిలయంలో నేను వేసిన ‘చుక్క పొడిచింది’ సంపుటిలో వున్న కథలు మాత్రమే ఉన్నాయి.
ఇక్కడ మరో కబురు చెప్పాలి. 1984లోనే రెండు కథలు రాసి ట్రంకు పెట్ట అడుక్కు తోసేశానన్నాను కదా! అవి ‘మరణ శయ్యపై నుండి ప్రేమలేఖ’, ‘చెలియలికట్ట తెగింది’.
ఈ నడుమ పాత సూట్ కేసు ఒకటి, నా శ్రీమతి బయట పడేస్తానంటుంటే అందులో ఏమున్నాయోనని తెరిచి చూశాను. కొన్ని స్నేహితుల లేఖలతో పాటు, అప్పటి రెండు కథల్లోని ‘మరణశయ్యపై నుండి ప్రేమలేఖ’ కంటబడింది. 1983 లో పాతబస్తీలో మత కలహాలు పుట్టి అల్లర్లు జరిగాయి. ఒకరో ఇద్దరో చంపబడినట్లు కూడా గుర్తు. ఆ నేపథ్యంలో రాసిన ప్రేమ కథ ఈ కథ.
అప్పట్లో నా ఆలోచనలు తీవ్రంగా ఉండేవి. ఆ తీవ్రత కథలో కనిపిస్తుంది. చలం ప్రభావం వల్లనేమో కథలో ఆమె పేరు ‘అమీనా’ అని పెట్టాను. ఇన్నేళ్లకు కంటబడిన ఆ కథను ‘సారంగ’కు పంపాను. అఫ్సర్ గారు చదివి, ‘కథ బాగుంది సారంగలో వేస్తున్నా’ మని మెయిల్ చేశారు.
నేను నాలుగవ తరగతి నుండే చందమామ, సోవియట్ భూమి కథలు చదవడం… తరువాతి కాలంలో గొప్ప రచయితల పుస్తకాలు, మానవ పరిణామక్రమ చరిత్రలు చదవడం… ఈ కారణాల వల్లనేమో, నేను కథలు రాయడం మొదలుపెట్టిన మొదటి కథ నుండే శిల్పం, శైలి అలవడింది.
ఇదంతా నేను చదివిన రచయితల చలువే.
ఇప్పుడు నా మొదటి కథ 1984లో రాసిన ‘మరణశయ్యపై నుండి ప్రేమలేఖ’ అవుతుంది. దీన్ని వెలుగులోకి తెచ్చిన “సారంగ”కి ధన్యవాదాలు.
*








Add comment