వ్యక్తి అంటే…!

నేనెవరిని? అన్న ప్రశ్న వేరు. వాడెవరు? అన్న ప్రశ్న వేరు.

 గత వ్యాసంలో పాశ్చాత్య  కథానికకీ మన కథానికకీ ఉన్న తేడా గురించి మాటాడుకున్నాం. అక్కడ వ్యక్తికీ ఇక్కడ వ్యక్తికీ ఉన్న అంతరం గురించి స్థూలంగా కొంత చెప్పుకున్నాం. మన తెలుగు కథానిక లోకి ప్రయాణించే ముందు దీని గురించి మరికొంత వివరంగా ఆలోచించాల్సి ఉంది.

ముందుగా ‘వ్యక్తి’ అంటే మనం ఆలోచించుకోవాలి.

నేనెవరిని? అన్న ప్రశ్న వేరు. వాడెవరు? అన్న ప్రశ్న వేరు.

వ్యక్తి తనని తను శోధించుకోటం మొదటిది. వ్యక్తి అంటే ఏమిటి అన్న పరిశీలన రెండవది.

ఇక్కడ మనం రెండవ ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నాం. ఎందుకంటే ఆధునిక కథానిక వ్యక్తి కేంద్రకంగా చెప్పుకుని ఆలోచిస్తున్నాం కనక.

వ్యక్తి(person) మానవుడు (human) అనే రెండు పదాలు ఉన్నాయి. మానవుడు అనేది జీవకోటిలో ఒకటి. ఇది తేల్చుకున్నంత సులువుగా వ్యక్తి అంటే తేల్చలేం. మానవుడు అనేది ఒక ప్రాణి లేదా జంతువు యెక్క ఉమ్మడి లక్షణాల ఆధారంగా అర్ధం చేసుకునేది. ఆమానవ సముదాయంలో వ్యక్తి ఒక సభ్యుడు. ఆసభ్యునికి గల ప్రత్యేక లక్షణాల గురించి చెప్పవలసి వచ్చినపుడు వ్యక్తి అని వ్యవహరిస్తాం.

ఒక వ్యక్తికి గల ప్రత్యేక లక్షణాలను కలిపి చెపుతూ దానిని వ్యక్తిత్వం అంటాం.

ఈ వ్యక్తిత్వం లేదా వ్యక్తుల మధ్య భిన్నతకి మూలం ఏమిటి?

ఒక శరీరం, దానిలోనే భాగమైన మెదడు అనే అవయవం, దాని ప్రతిచర్య, ఆ చర్యని ప్రేరేపించే లేదా చేయించే బాహిర ఘటనలు( వేడి, చలి, భయం వంటివి కలిగించేవి) లోపలి అవసరాలు(ఆకలి, కామం వంటివి) ఇవన్నీ భౌతికమైనవే. ఈ క్రమంలో న్యూరాన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, హార్మోన్స్ పనిచేసే తీరుని సైన్సు ఈనాడు పరిశీలించగలుగుతోంది. జీన్స్(జన్యువు) అనబడేవి ఒక గుంపు తాలూకు సాధారణ లక్షణాల వాహికలు. ఇవి తలిదండ్రల నుంచి బిడ్డలకి అందిస్తాయి.   ఇవి కూడా భౌతికమైనవే. వీటన్నింటితో కూడిన లక్షణ నిర్ధారణ చేసి అది ఆ ప్రత్యేక వ్యక్తి వ్యక్తిత్వం అంటారు. ఆ వ్యక్తిత్వాన్ని సాధారణ వ్యక్తిత్వ లక్షణాలతో పోల్చి వ్యక్తిత్వ లోపం(personality disorders)  నిర్ధరిస్తారు. ఆ లోపాలు అర్ధం చేసుకోటానికీ సరిచెయ్యటానికీ ఈనాడు సైన్సు రంగంలో చాలా కృషి సాగుతోంది. జీవశాస్త్ర పునాదిపై ఏర్పడే ఈ వ్యక్తిత్వంపై ఇపుడిపుడే జరుగుతున్న పరిశోధనలు మానవ ప్రస్థానంలో ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయన్నది ప్రస్తుతానికి అగమ్యగోచరం.

ఈ వ్యక్తిత్వం లేదా భిన్నతకి మరో మూలం గురించి ఆలోచనలు ఉన్నాయి.

ఈ జీవశాస్త్రం చెప్పే వ్యక్తికే భౌతికమైనదే అయిన మెదడు ఉంటుంది. జననం తరవాత ఎదుగుతుండగా ఇది మరోరకం ప్రభావాలకు గురవుతుంది. వాటిని సామాజిక ప్రబావాలు అనవచ్చు. అంటే పుట్టుకకి ముందు ప్రత్యేక లక్షణాలు ఒకరకం. పుట్టాక మెదడు సమకూర్చుకునేవి మరోరకం.  పుట్టటం ద్వారా వచ్చే లక్షణాలు ఒక వ్యక్తిత్వం. పెరగటం ద్వారా మెదడు అలవరుచుకునే లక్షణాలు మరో వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే సాహిత్యంలో ప్రధానమైనది.

పుట్టుక ద్వారా తలిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా కొన్ని గుణాలు సంక్రమిస్తాయనే ఊహ సమాజంలో కనిపిస్తుంది. ఉదాహరణకి రాజు కొడుకుకి రాచలక్షణాలు వస్తాయి. దొంగ కొడుకు దొంగ అవుతాడు. వ్యభిచారి కూతురు వ్యభిచారే అవుతుంది. ఉన్నత కులంలో ఉన్నతులే పుడతారు. ఈ ఉదాహరణలలో కొన్ని ఆమోదయోగ్యం. కొన్ని ఒప్పుకోలేనివి. మంచి లక్షణాలైతే ఆ ఊహ సరైనదే అనుకుంటాం. అవలక్షణాలైతే అలా ఊహించటం తప్పుగా భావిస్తాం. ఇలా భావించటం ఆధునిక యుగ లక్షణాలలో ఒకటి. అది సాహిత్యంలో విరివిగా కనిపిస్తుంది.

పుట్టుకా(nature)… పెంపకమా(nurture) ఏది వ్యక్తిత్వానికి మూలం? ఇది చాలా కాలంగా నడుస్తున్న చర్చ.

ఈ ప్రశ్నకి పెంపకమే మూలంగా జవాబిచ్చేది ఆధునిక సాహిత్యంలో ప్రధాన స్రవంతి.

***

పెంపకమే ప్రధానమైనదన్నపుడు వ్యక్తిని పెంచిన సమూహాలు అనేక రకాలు.

ఈ సమూహాల బిన్నత్వం రెంటిమీద ఆదారపడి ఉంటుంది. స్థలం, కాలం. ఒకే సమయంలో అనేక ప్రదేశాలలో వ్యక్తులు వివిధ సమాజాలుగా, ఆ సమాజాలలో వివిధ సమూహాలుగా జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఐరోపా సమాజం భారతీయ సమాజం విడి ప్రదేశాలలో ఒకే కాలంలో ఉంటాయి. ఇది స్థల బేధం. ఆయా సమాజాలు, వాటిలోని సమూహాలు కాలక్రమంలో అనేక మార్పులకి గురవుతాయి. ఉదాహరణకి రాయల కాలం నాటి సమాజం వేరు. అదే ప్రదేశంలో నేడు నివసించే సమాజం వేరు. ఇది కాలబేధం.

ప్రస్తుత చర్చ స్థలబేధం మీద మాత్రం దృష్టి పెడుతుంది.

కథానిక నిర్మాణ చాతుర్యంలోనూ, దాన్ని ఇంపుగా చెప్పటంలోనూ, వస్తువు ఎంపికలోనూ, దాని వ్యక్తీకరణలోనూ, ఉపమానాలలోనూ, వర్ణనలలోనూ   రచయితలలో ఉపజ్ఞా బేధం ఉంటుంది. వస్తువు అవగాహనలోనూ, రసాస్వాదనలోనూ, అనుభూతి చెందటంలోనూ, వర్ణనల స్వారస్య గ్రహణంలోనూ పాఠకులలో ప్రజ్ఞాబేధం ఉంటుంది. రచయితల ఉపజ్ఞా స్థాయి, పాఠకుల ప్రజ్ఞా స్థాయీ పరస్పర ఆధారితాలు. సంపూరకాలు. ఒక ప్రాంతపు కథానికా వికాశం ఈ స్థాయిని బట్టి ఉంటుంది.

అయితే యూరప్ ఇండియా తప్ప ప్రాంతాలు లేవా? ఉన్నాయి.  మనకి పాశ్చాత్య సాహిత్యంతో ఉన్నంత సంబంధం తోటి ఆశియా దేశాల సాహిత్యంతో లేదు. కనక మన చర్చ పాశ్చాత్య, తెలుగు కథానికలకే పరిమితం.

***

Necessity is the mother of inventions. ఈ ఆంగ్ల సామెత చాలామంది వినే ఉంటారు. ఇది ప్లేటో అన్నట్టు చెపుతారు. దాదాపు 18వ శతాబ్దం వరకూ ప్లేటో ప్రాశ్చాత్య ప్రపంచానికి అంతగా తెలియడు. కాని 15 వ శతాబ్దంలోనే ఇంగ్లీషులో సామెతగా ప్రజల నోళ్లలో వినిపించేది.

ప్రపంచవ్యాప్తంగా, అనాదికాలం నుంచీ మానవులందరికీ వర్తించేవి ఆహారం, సమాజం, మతం.

వీటిలో ఆహారం ప్రాణి అవసరం. ఆ అవసరం నుంచి పుట్టినది సమూహం. ఆ సమూహం నిలబడటానికి పుట్టినది మతం. పాశ్చాత్య ప్రపంచంలో religionకీ, భరత ఖండంలో ఉన్న మతాలకీ, ఇతర ప్రాంతాలలో పుట్టిన మత సమానమైన వ్యవస్థలకీ చిన్న చిన్న తేడాలుండవచ్చు. అలాగే కాలక్రమంలో ఈ మతం అనేక రూపాలు ధరించింది. పేర్లను సంతరించుకుంది. కాని ఏ పేరున్నా ఎన్ని తేడాలున్నా మతం అనే గొడుగుపదం కింద ఉండే వ్యవస్థ చేసే పనులు రెండు. ప్రకృతితో పోరాటంలో వ్యక్తికి దిటవు ఇవ్వటం ఒకటి. సమూహానికి వ్యక్తిని బద్ధుడిని చేయటం అంటే సమూహంతో పోరాడకుండా చేయటం రెండవది.

సమూహానికి బద్ధుడిని చేయటానికి మతం ఉపయోగించే సర్వకాలీన, సర్వజనీన భావన పాపం. సమూహ జీవనానికి నియమాలు అవసరం. ఆ నియమాలను మీరటమే పాపం. ఉదాహరణకి టెన్ కమాండ్మెట్స్ తీసుకుందాం. వాటిలో మొదటి నాలుగు దైవ విశ్వాసంకి సంబంధించినవి. మిగిలిన ఆరూ నియమాలు. 5వది తలిదండ్రులని గౌరవించటం. అది సమూహగమనానికి అవసరమైన ఆధిపత్య రూపం. మిగిలిన 5 దొంగతనం, హత్య, వ్యభిచారం, దొంగసాక్ష్యం, పొరుగువాని సొత్తుపై ఆశ, ఈర్ష్య అనేవి పాపాలు. ఇవన్నీ సమాజ నియమాలను వ్యక్తి ఉల్లంఘించటంలో భాగాలు. ఆదిలో పాపాలు. తరవాత నేరాలు. ఇంచుమించు అన్ని మతాలలోనూ ఇవే పాపాలు, నేరాలు.

పాపాలకి పరలోకంలో శిక్షలుంటాయనేది ఒక భావన. నేరాలకి ఇహలోకంలోనే శిక్ష విధించటమనేది ఒక పద్దతి. ఈ భావన అన్ని సమూహాలలోనూ మతాలూ ఉపయోగించిన పనిముట్టు.

ఆదిమ కాలంలో సమూహం అంటే సమాజమే. ఈ సమూహాల నమ్మకాలు, దైవాలు ఒకే నాయకుని లేదా ఒకే కుటుంబపెద్ద ఆలోచనలే. తనని తనగుంపు నిర్ద్వందంగా అంగీకరించాలి. దానికోసం రకరకాల బోధనా పద్దతులు వాడేవాడు. ఈ విధానాన్ని మనం ఆధునిక భాషలో cult అంటున్నాం. ఈ సమూహాలు కలిసి జీవించవలసిన పరిస్థితులలో ఏర్పడిన పెద్ద సమూహాన్నే- అవగాహనా సౌల్లభ్యం కోసం- సమాజం అంటున్నాం. ఈ సమూహాలన్నింటినీ కలిపి ఉంచాలి. దానికి ఆ సమూహాల నాయకులు ఊహించిన దైవాలనూ, నమ్మకాలనూ, బోధనలను ఇముడ్చుకునే క్రమంలో బహుదైవారాధన మతాలు పుట్టాయి.

ఈ బహుదైవారాధన మతాలను మనం  తొలి మతాలు అనవచ్చు. పాపం, శిక్షల నిర్ధారణలో వ్యక్తి యొక్క  పుట్టుకకి పాత్ర ఉండటం ఈ మతాలలో జరిగింది. అంటే అతని పుట్టు సమూహం తతిమ్మా సమూహాలపై అధికమయినది కావాలి. ఎందుకూ అంటే గెలిచిన సమూహాలే పాలక వర్గాలయాయి. పాలక వర్గాలలో పుట్టిన వారు పాపం చేసినా, వారికి పాప తీవ్రత తక్కువగానూ శిక్ష తక్కువగానూ ఉండేట్టు బహుదైవారాధన మతం నియమాలను తయారుచేసేది.  ఇది ఒక రకమైన రిజర్వేషన్ విధానం,

ప్రధానంగా దీనికి వ్యతిరేకంగానే అనేక దేశాలలో  ఏక దైవ మతాలు పుట్టాయి. మన నేలమీద బౌద్ధం, జైనం చైనాలో కన్ఫ్యూషియస్, ఐరోపాలో క్రైస్తవం వంటివన్నీ అలా పుట్టినవే. అశేష ప్రజానీకంలో అవి పట్టు సాధించాయి. అంటే అంతవరకూ రెండో లేదా మూడో స్థాయిలో ఉన్న వర్గం(ఇంచుమించు వర్ణం) ఈ మతాలను స్వంతం చేసుకుంది. అంటే పాలక వర్గంలో సముచిత స్థానాన్ని పొందాయి. అలా రాజీ కుదుర్చుకున్న  పాలకవర్గాలు ఆ మతాలనే అడ్డు పెట్టుకుని అదనపు విలువను స్వంతం చేసుకోటంలో ప్రావీణ్యత సాధించాయి. వాటిలో అబ్రహామిక మతాలు నిలబడ్డాయి. బౌద్దం జైనం వంటివి మన నేలమీద సాధించిన ఆధిపత్యం చాలావరకూ కోల్పోయాయి.

మతంలోని పరిణామాలను గురించి  ఇంత వివరంగా చెప్పుకోకపోతే ఆధునిక సాహిత్యంలో యూరో-అమెరికా సమాజానికీ మన సమాజానికీ ఉన్న తేడా కనిపెట్టటం కష్టం. సంస్కృతి రూపొందటంలో  మతంది ప్రధానపాత్ర. మతం వ్యక్తికి కలిగించే ఊహలే, చేసే అలవాట్లే అతని thinking(ఆలోచనా విధానం) నిర్దేశిస్తాయి.

***

వివిఎస్ శర్మ గారనే పండితులు, నా స్నేహితులు English thinking అనే వ్యాసం రాసారు. మైకేల్ హెవిట్ గ్లీసన్ అనే cognitive science ప్రొఫెసర్, ఇంగ్లీషు ఆలోచనా విధానం (English thinking ) ఆధారంగా school of thinking అని ఆరంభించారుట. దానికీ Indian thinking కీ ఉన్న తేడా గురించి శర్మగారు ఆలోచించారు. English thinking అనేది క్రైస్తవమత ప్రాబల్యంగల ప్రాశ్చాత్య ఆలోచనా విధానం అని వారు అభిప్రాయపడ్డారు. భారతీయమత ప్రాబల్యంగల భారతీయ ఆలోచనావిధానం అనేది భిన్నమైనదని వారు అంటారు.  ఈ అబిప్రాయంతో నాకు సాహిత్యానికి సంబంధించినంతవరకూ ఏకీభావం ఉంది.

నాస్తికులకీ, ఇతర మతాలలోకి మారినవారికీ, ఇతర ప్రాంతాలకు వలస పోయినవారికీ మతప్రాబల్యంగల ఆలోచనావిధానం(thinking) మారదా? ఇది సబబైన ప్రశ్న. ఈ thinking మెదడుకి సంబంధించినది. కనక మారదనీ, మారటానికి చాలా తరాలు పడుతుందనీ ఒప్పుకోవాలి.

***

మన ఆలోచనావిధానానికీ, ప్రాశ్చాత్య ఆలోచనావిధానానికీ మధ్య తేడాలు, ఆధునిక సాహిత్యాన్ని ప్రభావితం చేసేంత ప్రధానమైనవా? బలమైనవా? అయితే అవి ఏమిటి? అవి ఎలా కల్పనా సాహిత్యం సృజనలో.. దాని విమర్శలో.. ప్రత్యేకించి కథానిక ప్రక్రియలో.. ఎలా manifest అయాయి? ఏమైనా ఉదాహరణలతో చెప్పగలమా? తరవాత సంచికలో మాటాడుకుందాం.

(ఇంతవరకూ నేను రాసిన వ్యాసాలలో ఇది నా మటుకు క్లిష్టమైనది. దీని గురించి నా ఆలోచనలను ఒక కొలిక్కి తెచ్చుకోటానికీ, వాటికి అక్షరరూపం ఇవ్వటానికీ చాలా సమయం పట్టింది. ఒక కొత్తదోవ కనిపించినపుడు అది సరైనదేనని గమ్యం చేరేవరకూ తెలియని బాటసారి పరిస్థితి నాది. నేను బుకాయించలేను. వివేచించకుండా ముక్క రాయలేను. నాతో కథాయానంలో ఎవరైనా పాల్గొంటూంటే వారికి నా ఆలశ్యానికి సంజాయిషీ ఇచ్చుకోటం నా బాధ్యత కదా! అందుకే ఈ రెండు ముక్కలూ..)

*

Avatar

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు