చిదానంద సాలి గారు రచించిన “మలే” నవలను రంగనాథ రామచంద్ర రావు గారు తెలుగులోకి “వాన” గా అనువాదం చేశారు. ఇది వానని ఒక సహజ సంఘటనగా కాకుండా, మానవ జీవితాలు, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే బహుముఖ చిహ్నంగా చూపుతుంది. ఈ నవల సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను, మారుతున్న మానవ సంబంధాలను ప్రకృతి వైపరీత్యం నేపథ్యంలో అద్భుతంగా చిత్రించింది.
నవలలో ప్రధాన పాత్ర తిమోతి తన గ్రామం (వేసంగిపురం) నుండి నగరం (బిసిలూరు)కు వలస వచ్చిన వ్యక్తి. గ్రామంలోని పేదరికం, కులవివక్షత, కుటుంబాల మధ్య అనుబంధం,ఇవన్నీ నగరంలో వ్యక్తిగతవిషయాలుగా మారతాయి.
నవలలో గ్రామీణ సమాజానికి, పట్టణ సమాజానికి మధ్య ఉన్న స్పష్టమైన సామాజిక తేడాను రచయిత చూపారు. గ్రామాల్లో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం కనిపిస్తుంది. ఒకరి ఇంటి మిద్దెపైకి మరొకరు ఎక్కి సహాయం చేసుకోవడం, గోనెసంచులు పంచుకోవడం వంటివి పల్లెటూరి సామాజిక బంధాన్ని సూచిస్తాయి. కానీ నగరాల్లో స్వార్థపూరిత ధోరణి కనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కూడా నగరవాసులు తమ స్వంత ఇళ్లను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ప్రక్క వారి గురించి ఆలోచించరు. వరదను రాజకీయ నాయకులు, మీడియా, అధికారులు ఎలా దుర్వినియోగం చేసుకుంటారో నవల బలంగా చిత్రీకరించింది.
రచయిత ఒకప్పుడు ఒక జర్నలిస్టుగా పనిచేసినందున, నవలలో మీడియా సామాజిక బాధ్యత గురించి లోతైన చర్చ జరిగింది. సమకాలీన సమాజంలో జర్నలిజం సంస్కృతి ఎలా ఉందో ప్రొఫెసర్ రామలింగం పాత్ర ద్వారా రచయిత విశ్లేషించారు. కేవలం సంచలనాల కోసం వార్తలు రాసే సమకాలీన మీడియా సంస్కృతిని విమర్శిస్తూనే, జర్నలిజంలో ఉండాల్సిన సామాజిక నిబద్ధతను, మానవీయ విలువలను రచయిత నొక్కిచెప్పారు. కెవిన్ కార్టర్ (సూడాన్ ఫోటో) సంఘటన ద్వారా జర్నలిస్టు మానసిక సంఘర్షం చాలా శక్తివంతంగా చిత్రీకరిచారు.
కరువు కాలంలో భూగర్భజలాలు అడుగంటి, లభించే కొద్దిపాటి నీటిలోనూ ఫ్లోరైడ్ ఉండటం వల్ల ఆ ప్రాంతప్రజలు చేతులు, కాళ్లు వంకరపోయి యవ్వనంలోనే వృద్దులవుతున్న ఆరోగ్య సమస్యలను రచయిత భావోద్వేగంతో చిత్రీకరించారు. వర్షం పడినప్పుడు ఇంట్లో వండుకోవడానికి తిండి లేక గింజలు వేయించుకుని తినే పేద కుటుంబాల నిస్సహాయతను నవల హృదయవిదారకంగా చిత్రీకరించారు. సాంస్కృతిక జీవనంలో ఆహారం ఒక భాగం. వర్షం పడుతున్న రాత్రి పొయ్యి ముందు కూర్చుని పప్పుశనగలు, వేరుశనగలు వేయించుకుని తినడం, ‘వగ్గాణి-మిర్చిబజ్జీలు’ వంటి స్థానిక వంటకాలను ప్రస్తావించడం ద్వారా ప్రాంతీయ ఆహార సంస్కృతిని నవలలో సహజంగా పొందుపరిచారు.
భారతీయ సంస్కృతిలో వర్షం జీవనానికి, ఫలసమృద్ధికి, వినాశనానికి సంకేతం. అల్లమ ప్రభు వచనంతో మొదలయ్యే ఈ నవల, వానను ఆధ్యాత్మిక, దార్శనిక కోణంలో కూడా చూపిస్తుంది. మట్టి వానన పరిమళం భారతీయ సృష్టి తత్వాన్ని గుర్తు చేస్తుంది. నగరాల్లో మురుగుకాలువలు పూడిపోవడం, వాటిలో పిచ్చిమొక్కలు పెరగడం వల్ల స్వల్పవర్షానికే రోడ్లు జలమయం కావడం వంటి అంశాలు నగరపాలక సంస్థల నిర్లక్ష్యాన్ని సూచిస్తాయి. అలాగే వరదల వల్ల వంతెనలు కూలిపోయినా, రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని పత్రికా ప్రతినిధుల సంభాషణల ద్వారా సామాజిక విమర్శగా చిత్రీకరించారు.
భారతీయ సంస్కృతిలో ప్రకృతిని దైవంగా భావించడం సహజం. ఈ నవలలో తీవ్రమైన ఎండల తర్వాత వర్షం పడగానే, దేవుడిపై నమ్మకం లేని తిమోతి సైతం తనకు తెలియకుండానే ఆకాశానికి చేతులెత్తి నమస్కరిస్తాడు. ప్రజలు జలాన్ని ‘గంగమ్మ’గా, మబ్బులను ‘వాన రాయుడు’గా సాక్షాత్తు దేవుళ్లుగా ఆరాధించడం ఇక్కడి సాంస్కృతిక మూలాలను తెలియ జేస్తుంది.
నవలలో తల్లి దండ్రుల పాత్రల మధ్య ఉన్న వైరుధ్యం భారతీయ కుటుంబ సాంస్కృతిక పరిణామాన్ని చూపిస్తుంది. తండ్రి సాంప్రదాయకమైన కలిసి ఉంటే కలదు సుఖం అనే తత్వానికి, అల్పసంతోషానికి ప్రతీక. తల్లి ఆధునిక ఆశలకు, కొడుకు చదువుకుని నలుగురిలో గొప్పవాడు కావాలనే సాంస్కృతిక మార్పుకు ప్రతీక. ఊరు వదిలి వెళ్లిన కొడుకు క్రమంగా పేగుబంధాన్ని కోల్పోయి, కేవలం చావులకో, పెళ్లిళ్లకు మాత్రమే గ్రామానికి వస్తూవుండడం మారుతున్న కుటుంబ సాంస్కృతిక విలువలపై ఆవేదనను కలిగిస్తుంది.
చిదానంద సాలి గారి ఈ నవల కవితాత్మకం. వర్షపు చినుకులు, మట్టి వాసన, ఉరుములు ఇవి భారతీయ సాహిత్యంలోని ప్రకృతి వర్ణన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. ‘వాన’ నవల కేవలం ఒక వర్షం లేదా వరద గురించిన కథ కాదు. అది ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మానవ సమాజంలో బయటపడే నిజస్వరూపాలను, మారుతున్న సాంస్కృతిక విలువలను పట్టిచూపే ఒక అద్భుతమైన సామాజిక దర్పణంగా చెప్పవచ్చు.
*








పుస్తక పరిచయం చాలా బాగుంది