వల 

నాన్న ఎలుమును వేళ్ళతో సుతారంగా ఆడిస్తూ

వల అల్లుతున్నాడు

“ఇదేంటిది నాన్నా?” పసితనమూ అమాయకత్వమూ

కలగలసిపోయిన చూపులతో నేను

“జిమ్మలు పట్టుటానికి వల నేస్తున్న”

ఖాయమైపోయిన రేపటి గెలుపువార్త తెచ్చే

చిరుగర్వం నాన్న పెదాల మీద

 

వల అంటే మోసమని నాకప్పుడు తెలియదు

 

పొయ్యిమీది మంగులం పెంక లెక్క

మలమల మాడుతున్న కడుపులకు

వలవేసి చేపలు పట్టటమొక పవిత్రవృత్తి

ఆకలిపోగులు నేసి చేసిన వల నాన్నది

 

వయసుతోపాటూ వచ్చిన ఓటుహక్కు తప్ప

తమకంటూ ఏమీ లేనివాళ్లమీద

వల విసిరి ఓట్లు దోచుకోవటం

అధికార రాజ్యాంగంలో నేరంగా నమోదు కాదు

 

వాని గుమ్మినిండా ఓట్లను నింపుకొని

పేడతో మెత్తు వేసుకుంటున్నాడు

ఇంతకీ వాని వల రహస్యం ఏమనుకుంటున్నారూ?

కులమొక పోగు మతమింకొక పోగు

ప్రజాస్వామ్యపు మొండికత్తి తెంపినా తెగని వల

 

వల అంటే మోసమని వాళ్ళకెప్పుడు తెలుస్తుంది?

 

వేటగాని ఎత్తుకు చిక్కిన సింహంలా

దేశమిప్పుడు వలలో విలవిల

*

తోకల రాజేశం మంచిర్యాల జిల్లా ఆవడం అనే గ్రామానికి చెందిన వారు. ప్రస్తుత నివాసం మంచిర్యాల. ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వచన కవిత్వంతో పాటు,పద్యకవిత్వం కూడా రాస్తారు.అప్పుడప్పుడు సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు కూడా రాస్తుంటారు.తెలుగులో వస్తున్న చాలా దినపత్రికల్లో కవితలు, సామాజిక వ్యాసాలు రాస్తుంటారు.ఇప్పటివరకు “చెమట చుక్కలు(2010)”,”పాతాళ గరిగె(2013)”,”అడవి దీపాలు(2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(2020),మట్టివిజయం(2024) అనే రచనలు ముద్రించారు.2012 లో ప్రతిష్టాత్మకమైన ఎక్సరే ప్రధాన పురస్కారం పొందారు.2023 లో సినారె పురస్కారం అందుకున్నారు.వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ సందర్భాలలో పదికి పైగా సాహిత్య పురస్కారాలు అందుకున్నారు.

      నేనెందుకు కవిత్వం రాస్తున్నానంటే…?

                ” ఈ ప్రపంచం నాకు ఇలా అర్థమైంది “అని నా తోటి వాళ్లకు చెప్పటం కోసం నేను కవిత్వం రాస్తున్నాను.నేను అర్థం చేసుకున్న ప్రపంచంలో మనిషిని వ్యవస్థలు ఎట్లా మోసం చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను.ఒక మనిషి ఏ కారణం చేతనైనా హక్కులు కోల్పోవటమనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పటానికి రాస్తాను. మనిషి మనిషిగా నిలబడాలని అందుకోసం కవిత్వం ఒక చేయూత కావాలన్నది నా ఆశ.

తోకల రాజేశం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు