రెండు రోజుల సాహిత్య వెన్నెల

 నిజానికి నాకైతే ఇదే నేను హాజరైన తొలి సాహిత్య కార్యశాల. ఒక సాహిత్య వాతావరణం ఎలా ఉండాలో   తెలుసుకోవడం కూడా మొదటి సారే. 

వేసవి ఎండలో చల్లని సాహిత్యం. కోనసీమలో రెండు రోజుల పాటు విరగ కాసిన సాహిత్య వెన్నెల. గోదావరి కోనసీమ – సాహిత్య సమాలోచన.. పేరే ఎంతో ఆకర్షించేలా ఉంటే ఈ రెండు రోజులు జరిగిన ప్రసంగాలు.. చర్చలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యంలో ఎంతో ఎదిగిన వారు సరే, ఇప్పుడిప్పుడే కలం పట్టుకున్న నాలాంటి వారికి ఈ సమావేశాలు చాలా నేర్పాయి. ముఖ్యంగా ఏది రాయాలి.. ఏది రాయకూడదు అనే విచక్షణను తెలుసుకునేలా చేశాయి.

చారిత్రక నవలలు చదువుతున్నప్పుడు ఆ నాయికా నాయకులు, వాతావరణం, ఆ భాష, వేషధారణలకు చెందిన వివరాలు, గగుర్పాటు కలిగించే సన్నివేశాలు… ఇలా కళ్ళముందు కదలాడుతుండేవి. ఎప్పటికైనా చారిత్రక నవల రాయాలి అని అనుకున్న. కాని అది ఎంత కష్టమో చారిత్రక నవల రాసిన మారుతీ పౌరోహిత్యం గారు చెప్పాక, చారిత్రక నవల రాయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు వాయిదా వేసుకుందాం అనుకున్నాను. ఇలా అనుకోవడానికి అనేకానేక కారణాలున్నాయి. ఈ నవల కోసం విపరీతమైన పరిశోధన, అవసరమైన కచ్చితత్వం. ఒకవేళ కల్పిత కథనం చారిత్రక విషయాలకు జోడించవలసి వస్తే, రెండింటి మధ్య సమన్వయం, నవలలోని పాత్రల కాలానికి చెందిన భాష.. ఇలా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి అని మారుతీ పౌరోహితం  గారు చెబితే, చెప్పొద్దూ… ఒకింత భయం వేసింది.

మారుతి పౌరోహితం గారు  1200 పేజీలు డ్రాఫ్ట్ రాసుకుని, దాన్ని చివరకు 120 పేజీల చారిత్రక నవల రాసే సరికి చాలా ఎడిటింగ్ జరిగిందని, అలాగే ఎంతో సహనం, ఓర్పు అవసరమని చెప్పారు. మరీ ముఖ్యంగా… భాషలో చాలా జాగురూకత అవసరమని చెబుతూ దానికి ఉదాహరణగా… ఆయన రాసిన ప్రణయహంపి నవలలో ఒకచోట ‘హాలు’ అనే పదం వాడిన విషయాన్ని మరో రచయిత తన దృష్టికి తీసుకు రావడాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, పాత్రల కాలానికి వెళ్ళి అప్పటి భాష వాడడం, లేదా నేటి కాలపు పాఠకులకు చేరువయ్యేలా భాషను సరళం చేసి రాయడం, ఏది చెయ్యాలన్నా కత్తి మీద సాములా ఉండటాన్ని మారుతీ గారు విడమరిచి చెప్పిన విధానం ఆ సభలో ఉన్న మా వంటి వర్ధమానులకు తెలిసొచ్చింది.

దళిత నవల రాద్దామా అనుకుంటే, కెంగార మోహన్ గారు చెప్పినట్లు “అనుభవించి పలవరించడమే” బాగుంటుందనిపించింది. కారణం, దళితేతరులు దళిత నవలలు రాసినా, నేరుగా అనుభవించిన వారి హృదయానికి దగ్గరగా ఉండకపోవచ్చు. కాబట్టి దళిత నవలలు దళిత రచయితుల నుండే విరివిగా వస్తే బావుంటుందనే విషయం మోహన్ గారు స్పష్టంగా చెప్పారు.

ఉద్యమ నవల అంటే ఇన్నాళ్ళూ ఓ అభిప్రాయం ఉండేది. విప్లవాన్ని కాంక్షిస్తూ రాసేవే ఉద్యమ నవలలు అనే భ్రమలో ఉన్న నాకు ప్రతిదీ ఉద్యమ నవలే అనే విషయం ఈ సమావేశాల్లోనే అర్థం అయ్యింది..విప్లవ నవల, స్త్రీవాద నవల, బహుజనవాదం, దళిత ఉద్యమం, మైనారిటీ ఉద్యమ నవల…ఇలా ఏ అస్తిత్వ పోరాటమైనా అది ఉద్యమ నవల కిందకే వస్తుందని  వెంకట కృష్ణ గారు మాకున్న సందేహాలను పటాపంచలు చేశారు. ముందు అస్తిత్వం పోరాటం, ఆ పైనే వర్గ పోరాటం అని చెప్పారు. వీరు ముగ్గురూ చెప్పిన దానికి సోదహరణంగా, గత 25 సంవత్సరాల కాలంలో వచ్చిన అనేక నవలలు, చారిత్రక, దళిత, బహుజన, స్త్రీవాద, ఉద్యమమే కాకుండా ఇంకా అనేక నవలలను, వాటి ధోరణలును, వాటిలోని మంచి చెడులను వివరించారు కే.పి.అశోక్ కుమార్ గారు. ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో ఇన్ని నవలలు వచ్చాయా అని ఆశ్చర్యపోవడం అక్కడున్న వారిందరి స్వానుభవం.

పోస్ట్ మోడర్నిజం నవలల మీద ఉన్న అనేక సందేహాలను తుడిచేశారు సుభాషిణి గారు. పోస్ట్ మోడర్నిజం ధోరణిలో ఉండవలసిన ముఖ్య లక్షణాలైన వినిర్మాణం, నాన్ లీనియర్ మెథడ్ (కాల క్రమానుగతం కాని విధానం), మహా కథనాలకు కాకుండా గుర్తింపునకు నోచుకోని పాత్రల ఆధారంగా కథనాలకు ప్రాధాన్యతనివ్వడం, వాటి లోతైన వివరాలు చెప్పారు.  వీటికి గొప్ప ఉదాహరణగా అరుంధతీ రాయ్ గారి “ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్,  ది మినిస్టిరీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్”,  అమిత్ ఘోష్ గారి “ది షాడో లైన్స్”  నవలలను  చెబుతూ..పోస్ట్ మోడర్నిజంలో ఉండే ఒక రకమైన గజిబిజి మలుపులను వివరిస్తుంటే నాకు C/o కంచరపాలెం సినిమా గుర్తొచ్చింది.

జి.ఎస్.చలం గారు నవలలో భాష గురించి చెబుతూ, అప్పట్లో సంప్రదాయ భాషా నిపుణులకు, వ్యావహారిక భాషా నిపుణులకు మధ్య నడిచిన సంవాదాలను వివరించారు. సంప్రదాయవాదులను ఎదిరించి పాత్రకు తగిన యాసను ప్రవేశ పెట్టిన గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నవలను ఉదహరించారు. మాండలీకం అనివార్యత అనేది నవలను పాఠకులకు ఎలా చేరువ చేస్తుందో తెలిపారు. ఈ విషయం ‘మాండలికంలో సాగిన రచన ఆ ప్రాంతం వరకే పరిమితమౌతుంది’ అనే నా ఆలోచనను ముక్కలు చేసింది.

కవిత్వం రాయడం అంటే మన మనసులోని స్పందనకు అక్షర రూపం ఇవ్వడం అని తెలుసు. స్త్రీవాద, దళిత వాద ధోరణుల కవిత్వం గురించి, ఆ ధోరణిలోనే కొనసాగుతున్న నా స్నేహితులు కొందరి ద్వారా తెలుసుకున్నాను. అనుభూతి కవిత్వం కూడా ఒక ధోరణి అనే విషయం… కవిత్వం-ధోరణుల పరిచయంలో భాగంగా సీతారాం గారు చెబుతుంటే చాలా ఆశ్చర్యపోయాను. అనుభూతి అనేది వ్యక్తిగత వ్యవహారం అనుకున్న విషయం ‘కాదు’ అని తేలిపోయింది. అంతే కాదు, విమర్శ  ఎలా ఉండాలో సీతారాం గారు చాలా విపులంగా చెప్పారు. విమర్శ సహేతుకంగా, సద్విమర్శగా ఉండాలి గాని, కక్ష సాధింపుగా కాదని చెప్పారు సీతారాం గారు.

కుప్పిలి పద్మ గారు కవిత్వం , శిల్పం అనే అంశాల గురించి తెలియచేసిన తీరు బలే ఉంది. ఈ సాహిత్య కార్యశాల ప్రాంగణంలో ఉంచిన ప్రముఖ కవుల కవిత్వాన్ని ఉదాహరణగా తీసుకుని కవితా శిల్పం ఎలా ఉండాలో చెప్పారు. కవిత రాసిన వెంటనే ప్రచురించేయాలి, లేదా ముఖ పుస్తకంలో పెట్టేయాలి అని కాకుండా, కొంత సమయం / రోజుల తరువాత దానిని మళ్ళీ చదువుకుంటే అందులో లోపాలేమైనా ఉంటే మనకు తెలుస్తుందన్నారు.

మిరప మహేష్ గారు రెండు రాష్ట్రాల కవిత్వం గురించి చెబుతూ,  తెలుగు రాష్ట్రాల్లో కవిత్వం విరివిగానే వస్తోందని, ప్రత్యేకించి హింస, అణచివేత, ఉద్యమం ఇలా ఆయా ప్రాంతానికి చెందిన అంశాల మీద ఆ ప్రాంత రచయితల నుండి ఆ ప్రాంత మాండలీకంలో మంచి కవిత్వం వస్తోందని, దానికి ఆదరణా ఎక్కువగానే ఉందన్నారు. ఎప్పటికప్పుడు జరిగే సంఘటనల మీద కూడా విస్తృతమైన కవిత్వం వస్తోందని, కవిత్వం విశ్వవ్యాప్తం అయిందని చెప్పారు.

కవిత్వంలో స్త్రీ కవయిత్రుల ధోరణుల గురించి  డాక్టర్‌ కాళ్ళకూరి శైలజ గారు వివరించారు. ఆవిడ ఉదహరించిన చాలా కవితలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏ ఇద్దరు కవయిత్రుల కవిత్వం ఒకే ధోరణిలో ఉండకపోవచ్చు. కానీ, మొత్తానికి స్త్రీ కవయిత్రులు మాత్రం తమ అనుభవాలు, హింస, బాధ ఏదైనా… తాము అనుభవించిన దాన్ని  కవిత్వంగా వారు మాత్రమే గొప్పగా చెప్పగలరు అని స్పష్టమైంది. మందరపు హైమవతి గారు, వాణిశ్రీ నైనాల గార్లు కూడా కవిత్వంలో దళిత కవయిత్రుల పాత్రను, ఆ కవిత్వపు ఆవశ్యకతను బాగా వివరించారు.

కవిత్వంలో ఏ రూపం, ఏ దృష్టి, ఏ కోణం, ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అనేది స్పష్టత వచ్చింది. నిజానికి నాకైతే ఇదే నేను హాజరైన తొలి సాహిత్య కార్యశాల. ఒక సాహిత్య వాతావరణం ఎలా ఉండాలో   తెలుసుకోవడం కూడా మొదటి సారే.

రెండు రోజుల సాహిత్య ప్రయాణంలో సమయం ఎంతమాత్రం వృధా కాకుండా గడిచింది. చివరకు విరామ సమయంలో కూడా ఉబుసుపోని కబుర్ల స్థానంలో సాహిత్య చర్చలు కొత్త విషయాల్ని నేర్పించాయి. ఆఖరుకు భోజనాల సమయంలో కూడా ఆహారపు అలవాట్ల మీద వచ్చిన కథల గురించి మాట్లాడుకోవడంతో ఎంతో జ్ఞానం పెరిగింది. ఈ నలభై ఎనిమిది  గంటల కాలం ఫోన్ లో తలకాయ పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అటువంటి మంచి సమయాన్ని మాకు అందించింది ఈ “గోదావరి కోనసీమ సాహితీ సమాలోచన” సాహిత్య కార్యశాల. అంతేనా అంటే … అసలైంది…నా మనసులో ఎన్నో రోజులుగా చెలరేగుతున్న అనేక సందేహాలకు సమాధానాలను అందించింది ఈ కార్యశాల.

ఏదేమైనా “దిగితేనే కదా లోతు తెలిసేది, ఒడ్డున కూర్చుని బీరాలు పలకడం కాదు” అనేది ఈ కార్యశాల ద్వారా బాగా స్పష్టం అయింది. ఇటువంటి కార్యశాలకు మా వంటి వర్ధమానులకు హాజరయ్యే అవకాశం కల్పించిన నిర్వాహకులు  ముక్కామల చక్రధర్ గారికి నా కృతజ్ఞతలు.

ఒకే సంవత్సరంలో రెండో ఉగాదిలా అనిపించింది ఈ విధమైన వాతావరణం. ఇహ పేరుకు తగ్గట్లు గోదావరి సంస్కృతి అడుగడుగునా కనిపించింది. కేవలం సాహిత్య విషయాలకే పరిమితం కాకుండా నిర్వాహకులు ఏర్పాటు చేసిన యానాం గోదావరి సందర్శన మరచిపోలేని తీపి జ్ఞాపకం. అలాగే, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఉండే ప్రాచీన కళ బుర్రకథ కూడా ఈ సాహిత్య సమావేశాల్లో మరో హైలెట్‌. వచ్చే ఏడాది జరిగే సమావేశాల కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నాను.

*

రాధకృష్ణ కర్రి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు