రాయలసీమ ప్రాంతం నుండి తొలి నవల, తొలి దళితనవల వచ్చిందనే చర్చ నేడు విస్తృతంగా జరుగుతున్నది. తొలి తెలుగునవలపై సాహిత్యలోకంలో, విశ్వవిద్యాలయాల్లో చర్చలూ, పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్రనే తొలి నవల అని అందరూ గంపగుత్తగా తేల్చేసిన సందర్భంలో..ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వాతంత్రాన్ని కంటే పూర్వం ప్యాపిలి డిప్యూటీకలెక్టర్‌గా పనిచేసిన నరహరి గోపాలకృష్ణమచెట్టి రాసిన శ్రీరంగరాజచరిత్ర తొలి నవల అని పరిశోధకులు ఇటీవల పరిశోధన వ్యాసాలు రాస్తున్నారు. కందుకూరి రాజశేఖరచరిత్ర 1878లో రాగా శ్రీరంగరాజచరిత్ర 1872లో వచ్చింది. నవల నిర్మాణ లక్షణాలపై భిన్నమైన అభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో నవలే కాకుండా తొలిదళిత ఏది అని పరిశోధించినపుడు శ్రీ రంగరాజు చరిత్ర నవలే తెరమీదకొస్తుంది.
కథాంశం విషయానికొస్తే రంగరాజు వేటకు వెళ్లి వడదెబ్బ తగిలి సొమ్మసిల్ల పడిపోతే దరిదాపుల్లో ఉన్న కొందరు కాపులు పరుగున వచ్చి అతని నోట్లో నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఒక ముసలాయన వచ్చి ఆ రాజుకి మనం నీళ్లు పోయకూడదు. ఈ నీళ్లు తాగితే అతడు కుల భ్రష్టుడౌతాడు అని వాళ్ళని అడ్డుకుంటాడు. ఈ సన్నివేశం గమనిస్తే ఆ కాలంలో దళితజీవితంతో వెలువడిన కథాంశమే కనబడుతుంది.
ఈ నవల విజయనగరరాజల కాలం నాటి కథ. రాజుకు ఇద్దరు కొడుకులు. వొకడు రాణి కొడుకు. వాడిపేరు రంగరాజు. మరొకడు వేశ్య కొడుకు. రాజు ఇద్దరినీ సమానంగా చూస్తాడు. రంగరాజుకు అది నచ్చదు. ఇల్లు వదిలి పారిపోతాడు. ఒక ఊళ్ళో లంబాడి కన్య సోనాబాయి కనిపిస్తుంది. రంగరాజు ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించే ఇంకొకడు ఆమెను కొండవీడుకు ఎత్తుకుపోతాడు. ఆమెను వెతుకుతూ రంగరాజు కొండవీడు చేరుకుంటాడు. అక్కడ సోనాబాయి రంగరాజుకు మేనత్త కూతురని తెలుస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు.
ఇక రాజశేఖరచరిత్ర నవలలో దళిత కథాంశం పరిశీలించినట్లయితే కథానాయకుడు అస్పృశ్యుడు ఇచ్చిన నీళ్లు తాగడానికి ఇష్టపడడు. కానీ నరహరిగోపాల కృష్ణమచెట్టి రాసిన శ్రీ రంగరాజ చరిత్రలో ఒక గిరిజన కుటుంబంలో పెరిగిన క్షత్రియ యువతి కథ కనిపిస్తుంది. సోనాబాయి పరిణయము అనే వేరే పేరుకూడా ఈ నవలకు ఉంది. ఈ నవలను నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టి నవీనప్రబంధమని అన్నాడు. ఇందులో ప్రధానంగా గమనించవలసిన విషయం నవలాకారుడు లంబాడిలకంటే మాదిగ కులానికి చెందిన వాళ్లు నిమ్న కులాలని రాశారు. ఒక రకంగా అంతరాలు సృష్టించారు. రాజశేఖరచరిత్రలో కూడా దళిత సమస్యల్ని కందుకూరి ప్రస్తావించారు. ఐతే శ్రీరంగరాజు చరిత్రకు నవలాలక్షణాలు లేవని అనడం అతిశయోక్తిగా కనబడుతుంది. ఈ క్రమంలో నవలే కాదు తొలి దళిత నవలకూడా శ్రీరంగరాజు చరిత్ర అని, నవలైనా దళితనవలైనా రాయలసీమ నుండే పుట్టిందనే వాదనలో అర్థం ఉంది.
ఈ క్రమంలో రాయలసీమ నుండి వచ్చిన దళిత నవలలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లా తలుపులపల్లెకు చెందిన డా.కేశవరెడ్డి దాదాపు ఐదునవలలు దళితజీవితమే ప్రధానంగా రాశారు. బానిసలు(1971), శ్మశానం దున్నేరు(1979), మాలమాదిగలు ఫ్యూడల్ వ్యవస్థ పాదాల క్రింద నలిగిపోయే నేఫథ్యంలో సాగే కథాంశంతో ఇన్‌క్రెడిబుల్ గాడ్జెస్(1979)రాశారు. అతడు అడవిని జయించాడు నవల దళితజీవనచిత్రంగా కనబడుతుంది. 1987లో రాముడుండాడు..రాజ్యం ఉండాది నవలలో కులవ్యవస్థ విధ్వంసం రాశారు.
1988లో అనంతపురానికి చెందిన చిలుకూరి దేవపుత్ర పంచమం అనే నవల రాశారు. ఇందులో 1975 నుండి వరకు1999 దళితఉద్యమాల చారిత్రక నేపథ్యం రాశారు. రాయలసీమ నుండి దళితుడే రాసిన దళితనవలగా పంచమం అనడంలో సందేహంలేదు. చిలుకూరి దేవపుత్ర రాసిన అద్దంలో చందమామ కూడా దళిత నేపథ్యం కలదే. అదే అనంతపురం జిల్లాకు చెందిన దళితేతరుడైన బండినారాయణస్వామి 1996లో గద్దలాడతాండాయి నవల రాయలసీమ దళితుల జీవితంపై రాశారు. 1998లో సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి ‘కాడి’ నవలలో మాల మాదిగల అంతరాలు రాశారు. దళిత సానుభూతి రచనగా మిగిలింది. గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు తమ కామదాహం తీర్చుకోడానికి మాతంగినులుగా, బసివినిలుగా ఎలా బలితీసుకుంటారో వి.ఆర్.రాసాని నవల మట్టిమనుషుల్లో బయటపెట్టారు.
2001లో విరసం బాధ్యులు పాణి ‘నిప్పులవాగు తెచ్చారు. రాయలసీమ ముఠా కక్షల నేపథ్యంలో వేంపెంట సంఘటన స్ఫూర్తితో వెలువడిన నవల నిప్పులవాగు. నల్లమల అటవీప్రాంతంలో పీపుల్స్‌వార్ ప్రవేశం నుంచి అనేక రాజకీయ పరిణామాలు ఇందులో చోటుచేసుకున్నాయి. భూస్వామ్య సాయుధముఠాలు పోలీసుల వెన్నుదన్నుతో, మాదిగల్ని సజీవ దహనం చెయ్యడం నుంచి, మాలమాదిగల మధ్య ఉన్న వైరుధ్యాలను, విప్లవోద్యమ క్రమం నుంచి మాదిగ దండోరా వరకూ చిత్రించింది. కేశవరెడ్డి ‘రావుడుండాడు రాజ్జెముండాది, శాంతి నారాయణ ‘పెన్నేటి మలుపులు మొదలైన నవలలో మాల మాదిగల జీవితం చైతన్యవంతంగా కనిపిస్తుంది.
అనంతపురం జిల్లా సామాజిక రాజకీయచరిత్రను బండినారాయణ స్వామి మీ రాజ్యం మీరేలండి నవలలో చూడవచ్చు. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుని మతాలు మార్చుకుని కులస్వభావాన్ని భద్రంగా అంటిపెట్టుకుని, రెండు అగ్రవర్ణాల వారు ఎలా దళితుల్ని కీలుబొమ్మలుగా చేస్తారో ఈ నవలలో స్వామి అధ్భుతంగా రాశారు. మానవ సంబంధాల్లో డొల్లతనం వల్ల కలిగే మానసిక సంవేదన, సంఘర్షణలను చిత్రిస్తూ కేతు విశ్వనాథరెడ్డి వేర్లు నవల రాశారు. ముప్పయ్యేళ్ళ క్రితం విద్యావంతుడైన ఒక దళితుడి అంతరంగానికి అద్దంపట్టే నవల వేర్లు.
రాయలసీమ నుండి దళిత నవల ఇక లేదు, రాలేదు అనుకుంటున్న సందరర్భంలో 2021లో హిందూపురం నుండి దళితుడైన శొంఠి జయప్రకాష్ ఆకుల నరసమ్మ పేరుతో ధీరోదాత్త దళిత మహిళ జీవితాన్ని నవలగా తెచ్చారు. ఆ తర్వాత రాయలసీమ నుండి దళిత నవలలు రాలేదని చెప్పవచ్చు.
*








ఎక్సలెంట్ తమ్ముడు, కంగ్రాట్స్
తొలి నవల రాయలసీమ నుంచే వచ్చిందని తెలుసుకోవడం నాకు అమితానందాన్ని కలిగించింది.
మీ వ్యాసం చాలా బాగుంది.
Excellent sir