మోపసా కథ: ఇద్దరు మిత్రులు 

మూలం: గయే దె మోపసా

త్రువులు ముట్టడించిన పారిస్ నగరం కరువు కోరల్లో చిక్కుకొని ఉంది.

ఇళ్ళ పై కప్పుల పై ఎగిరే చిన్ని పిచుకలు , మురుగు లో లుకలుక లాడుతూ తిరిగే ఎలుకలు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు. ప్రజలు ఏది దొరికితే అది తింటున్నారు.

మోరీజో వ్రృతి రీత్యా వాచీలు తయారు చేసేవాడు. పెద్దగా పని లేని, సూర్యుడు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్న ఒక జనవరి మాసంలోని పొద్దున, ఆకలి కడుపుతో, చేతులు కోటు జేబులో పెట్టుకుని వీధిలో నడుస్తున్నాడు. అనుకోకుండా చేపల వేట ఇష్టమైన మరో మిత్రుడు సొవేజ్ ఎదురు పడ్డాడు.

యుద్ధం రాక ముందు మోరీజోకి ప్రతి ఆదివారం పొద్దున్నే ఓ వెదురు బొంగు భుజానికి, చిన్న ఇనుప డబ్బా వీపుకి తగిలించుకొని చేపలు పట్టడానికి బయటకు వెళ్లడం అలవాటు. అర్జెంటైల్ ట్రైన్ పట్టుకొని కొలంబస్ లో దిగి అక్కడి నుంచీ మరుంతికి నడుచుకుంటూ వెళ్లేవాడు. అది అతని కలల ప్రపంచం. అక్కడ చేపల వేట ప్రారంభించేవాడు. పొద్దు పోయేవరకు వరకు అదే పనిలో నిమగ్నమై ఉండేవాడు.

ప్రతి ఆదివారం అక్కడే అతను సొవేజ్ ని కలిసేది. సొవేజ్ దృఢంగా ఉండే సరదా మనిషి. కాస్తంత పొట్టిగా ఉంటాడు. ‘డు నాట్ రేమ్ డి లోరెడ్డ ‘వీధిలో అతనికి చిన్న బట్టల దుకాణం ఉంది . అతనికి కూడా కూడా చేపల వేటంటే మహా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి నది నీళ్లలో కాళ్లు పెట్టుకొని, చేతిలో చేపలు పట్టే గాలం పట్టుకొని చాపల కోసం వేటాడుతూ సగం రోజు పక్కపక్కనే కూర్చుని గడిపే వాళ్ళు. అలా కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.

అదొక వసంత కాలం పొద్దు. 10:00 గంటలు అయింది. వెచ్చటి సూర్యుడి కిరణాలు గాలాలు పట్టుకొని నీటిలో దిగిన మిత్రులిద్దరి వీపులను వెచ్చగా తాకుతున్నాయి. ఆ కిరణాలు నీటి పై సన్నటి మంచు పొరను ఏర్పరిచాయి. నీరు వెచ్చగా ఉంది. మోరీజో అప్పుడప్పుడు తన పక్కనే కూర్చున్న మిత్రుడి తో,
“ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది కదా” అంటాడు.

దానికి అతడు, “ఇంతకంటే ప్రశాంతతను నేను ఊహించుకోలేను”, అంటూ బదులు ఇస్తాడు.

అంతే .ఆ రెండు మాటలే వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ,మెచ్చుకోవడానికి సరిపోతాయి.
ఆకురాలు కాలంలో సూర్యాస్తమయం సమయంలో ఎర్రటి వెలుగు ఆకాశం లోని పశ్చిమ దిక్కు అంతా వ్యాపించి ఉంటుంది. ఎర్రటి ఎరుపు మేఘాలంతా వ్యాపించడమే కాదు నది అంతా విస్తరిస్తుంది; స్నేహితులిద్దరి మొహాలలో కాంతిని నింపుతుంది. నది ఒడ్డున ఉన్న చెట్లన్నీ జిలుగు వెలుగులతో నిండిపోతాయి. చలికాలం మొదలు కావడంతోనే ,జిల్లుమన్న చలికి చెట్లు ఆకులను రాల్చడం మొదలుపెడతాయి. సొవేజ్ కొన్ని కొన్ని సార్లు నవ్వుతూ, మోరీజో తో,”ఎంత అద్భుతమైన దృశ్యం” అంటాడు.

మోరీజో కూడా నీటి పైనుండి దృష్టిని మరల్చకుండానే,” ఇది మన ఊరి రహదారి కన్నా ఎంతో గొప్పగా ఉంటుంది కదా” అంటాడు.

వాళ్ళిద్దరూ కలిసి ఒకరినొకరు గుర్తించగానే స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. మారిన పరిస్థితులలో కలుసుకున్న భావన వారి హృదయాలను సున్నితంగా తాకింది.

సొవేజ్ ఒక నిట్టూర్పు విడిచి, “ఏం కాలమిది!” అన్నాడు.
మోరీజో దిగులుగా తల ఊపి, “ఈ వాతావరణంలో! ఈ ఏడాదికి ఇదే మొదటి రోజు” అన్నాడు.

నిజానికి ఆరోజు ఆకాశం ప్రకాశవంతంగా ఉంది. చక్కటి నీలి రంగులో నిర్మలంగా ఉంది. మబ్బులు లేవు .
ఇద్దరూ పక్క పక్కనే నడుస్తున్నారు. ఒకరి భావాలను ఒకరు మౌనంగా పంచుకుంటూ, విచారంగా.
” ఇద్దరం కలిసి చేపలు పట్టడం గురించే ఆలోచిస్తున్నాను . మనం కలిసి చేపలు పడుతూ గడిపిన ఆ రోజులు ఎంత మంచివి!” అన్నాడు మోరీజో.

” మళ్లీ మనం ఎప్పుడు చేపలు పట్టగలుగుతామో కదా?” సావేజ్.

ఇద్దరూ కలిసి ఒక చిన్న కెఫే కి వెళ్ళారు. ‘ఆప్సింతే’ తాగారు. ఆ తర్వాత పేవ్మెంట్ మీద మళ్లీ నడక మొదలుపెట్టారు.

ఉన్నట్టుండి మోరీజో ఒకచోట ఆగి,” మనిద్దరం కలిసి మరో ‘ఆప్సింతే’ తాగుదామా?” అని అడిగాడు.
“నువ్వు తాగుదామంటే సరే ” సొవేజ్.

ఇద్దరూ కలిసి దారిలో ని ఒక సారా దుకాణం లోకి జొర బడ్డారు.ఆకలి కడుపుతో మందు తాగడం వలన ఇద్దరూ బయటికి వచ్చేసరికి జోగు తున్నారు. ఆరోజు వాతావరణం చక్కగా, ప్రశాంతంగా ఉంది. చల్లటి లేత గాలి వాళ్ళ ముఖాలను తాకింది.

ఆ స్వచ్ఛమైన గాలి, మందు ప్రభావాన్ని మరింత పెంచింది. సొవేజ్ గబుక్కున ఆగి,” మనం అక్కడికి వెళ్తేనో” అన్నాడు.

” ఎక్కడికి?”

” అదే చేపలు పట్టడానికి”

” అదేలే ,ఎక్కడికి అంట?”
” మనం ఇదివరకు వెళ్లే చోటుకే. కొలంబస్ కి.ఆ దగ్గరలోనే ఫ్రెంచ్ వాళ్ళ సైనిక అవుట్ పోస్ట్ ఉంది.
అక్కడ ఉండే కల్నల్ డుమాలి నాకు పరిచయస్తుడు, మనకి లోపలికి వెళ్లడానికి అనుమతించే పాస్ సులభంగానే ఇస్తాడు.”

మోరీజో కి వెళ్లాలనే తహతహ పెరిగింది.
వెంటనే,” సరే తప్పకుండా వెళ్దాం పద పద”, అన్నాడు.

అనుకున్నదే తడవుగా మిత్రులు ఇద్దరూ తమ తమ గాలాలను, ఇతర చాపల వేట సరంజామాను తెచ్చుకోవడానికి చెరో వైపు వెళ్లిపోయారు.

ఆ తర్వాత గంటకి ఇద్దరూ రహదారిపై పక్కపక్కనే నడుస్తున్నారు. కాసేపటికి కల్నల్ నివసిస్తున్న విల్లాని చేరుకున్నారు. మీరి విజ్ఞప్తిని విన్న కల్నల్ చిన్నగా నవ్వి, అనుమతినిచ్చాడు. అనుమతి తీసుకుని, లోనికి ప్రవేశించడానికి ఇచ్చే పాస్వర్డ్ తో సహా, మిత్రులిద్దరూ తమ నడకను కొనసాగించారు.

కాసేపటికి ఇద్దరూ అవుట్ పోస్ట్ దాటి ముందుకెళ్లారు. నిర్జీవంగా ఉన్న కొలంబస్ ని చేరుకున్నారు. ఆ ప్రదేశం ‘సైని’ సరిహద్దులలో ఉంది .అక్కడ ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది.

అప్పుడు సమయం 11: 00.గంటలు.

వారికి దగ్గరలో ‘అర్జెమెంట్’ గ్రామం ఉంది. సహజంగానే అక్కడ ఎవరూ నివసించడం లేదు. నిర్జీవంగా ఉంది.

ఆర్జేమెంట్, సన్నాయిస్ మైదానాల పచ్చతనం ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆ మైదానాలు ‘నాటరే’ వరకు వ్యాపించి ఉన్నాయి. పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. అక్కడ బూడిద రంగు కలిసిన మట్టి నేల మీద పండ్లు లేని చెర్రీ చెట్లు ఉన్నాయి.

సొవెజ్ చేతులెత్తి దూరంగా ఉన్న ప్రాంతాన్ని చూపిస్తూ ,”అదిగో అక్కడే ప్రష్యన్ లు ఉన్నారు” అన్నాడు.
ప్రష్యన్లను ఇద్దరు మిత్రులలో ఎవరూ ఎప్పుడూ చూడలేదు. కానీ ప్రష్యన్లను గురించి పారిస్ లోని ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలోనూ ఒకే అవగాహన ఉంది;గత కొద్ది కాలంగా- నెలల తరబడి- వాళ్లు ఫ్రాన్స్ ని దోచుకుంటున్నారు . మారణకాండ సృష్టిస్తున్నారు. తిండి లేకుండా చేస్తున్నారు. ఎన్నడూ చూడని ఆ మనుషుల పట్ల, తమను జయించిన ఆ దేశం పట్ల భయం తో పాటు ఏహ్యత కూడా అక్కడి ప్రజలందరిలో కలగలిసి ఉంది.

“ఒకవేళ వాళ్లలో ఎవరినైనా మనం కలిస్తేనో!” మోరీజో.

“మనం వాళ్ళకి కొన్ని చేపలు ఇద్దాంలే” అన్నాడు, ఏ శోకమూ పూర్తిగా తొలగిపోదన్న పర్షియన్ తత్వాన్ని జీర్ణించుకొన్న సొవేజ్ తేలికగా.

అయినప్పటికీ గ్రామంలో బహిరంగంగా తిరగడానికి వాళ్లు వెనుకాడారు. నిశ్శబ్దం అక్కడ పూర్తిగా రాజ్యమేలుతోంది.

ఆఖరికి సొవేజ్ ధైర్యంగా,”పద, మనం ఇక మొదలుపెడదాం. అయితే కాస్త జాగ్రత్తగా ఉందాం” అన్నాడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడున్న ద్రాక్ష తోట కింది నుంచి బాగా వంగి నడిచి వెళ్లడం మొదలుపెట్టారు. అయితే కళ్ళు, చెవులు రెండింటిని అప్రమత్తం గా ఉంచుకున్నారు.

నది ఒడ్డుకి చేరడానికి మధ్యలో ఒక మైదానాన్ని దాటవలసి ఉంది. ఆ మైదాన ప్రాంతం అంతా పరిగెత్తి చివరికి నీటి దగ్గరికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడ ఏపుగా పెరిగిన ఎండు గడ్డి మధ్యలో దాక్కున్నారు.

మోరీజో చెవులను నేల కానించి జాగ్రత్తగా విన్నాడు, దూరంలో ఎక్కడైనా అడుగులు చప్పుడు వినపడుతుందేమోనని. ఏమి వినిపించలేదు. తామిద్దరే ఒంటరిగా ఉన్నామన్న నమ్మకం కలిగింది.
ఇక వెంటనే ఇద్దరూ చేపల వేట మొదలుపెట్టారు.

ఆవలి వైపునున్న’ ఇలా మరుంటే’ వారిని ఎవరికీ కనబడకుండా దాచి ఉంచింది. వారు దాటి వచ్చిన ఆ చిన్న రెస్టారెంట్ ఇప్పుడు మూసి ఉంది. కానీ ఏళ్ల తరబడి మూసే ఉన్నట్టు అనిపిస్తున్నది.

మొట్టమొదట సొవేన్ వేట మొదలుపెట్టాడు. ఆ తర్వాత మోరీజో అనుసరించాడు. ప్రతి క్షణం ఓ మెరుపు మెరుస్తూనే ఉంది. ఒక వెండి చేప మెలికలు తిరుగుతూ గాలం అంచులకు చేరుతూనే ఉంది. వాళ్ల ఆట అద్భుతంగా సాగుతోంది.

పట్టిన చేపలన్నిటిని తమ కాళ్ల దగ్గర ఉన్న బుట్టలో వేసుకున్నారు. వారి సంతోషానికి హద్దే లేదు. చాలా రోజుల తర్వాత వాళ్లు ఇంతటి ఆనందాన్ని అనుభవించారు. గడ్డు రోజులు వారిని తమ ప్రవృత్తికి దూరం చేశాయి.

నెమ్మదిగా సూర్యకిరణాలు వాళ్ళ వీపులపై పడడం మొదలైంది. వారిక ఏ చప్పుళ్ళని, ఏ విషయాలని పట్టించుకునే స్థితిలో లేరు. అసలు ప్రపంచాన్నే మరిచిపోయారు. కేవలం చేపలు పట్టడం పైనే దృష్టి అంతా ఉంది.

అకస్మాత్తుగా గడగడమంటూ శబ్దం వినిపించింది. ఆ శబ్దం భూమిలో నుంచి పుడుతున్నట్టు అనిపించింది . కాళ్ల కింద ఉన్న భూమి అంతా కంపించింది. ఫిరంగులు గర్జించాయి.

మోరీజో తలతిప్పి ఎడమవైపుకు చూడంగానే నది ఒడ్డున ‘మౌంట్ వేలరిన్’ సరిహద్దుల్లో నుండి తెల్లటి దట్టమైన పొగ రావడం గమనించాడు. ఆ తర్వాత రెండోసారి కూడా అదే విధంగా కనిపించింది. ఆ తర్వాత మళ్లీ మరోసారి.మళ్లీ భూమి కంపించడం మొదలైంది.

నిమిషానికి ఒకసారి కొండల మధ్య నుంచి దట్టమైన తెల్లటి పొగ పైకి ఎగసి నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న స్వర్గంలో కలిసి పోతున్నది. ఎత్తయిన పర్వత శిఖరాలు దాటి ఆకాశాన్ని చేరుతున్నది.

సొవేజ్, భుజాలు ఎగరేస్తూ,”వాళ్లు మళ్లీ అదే పని మొదలు పెట్టారు” అన్నాడు.

మోరీజో తన కాళ్ళు కింద ఉన్న నీటి బుడగలు కిందికి పైకి ప్రయాణిస్తూండడాన్ని గమనిస్తున్నాడు. ప్రశాంతంగా పని చేసుకుంటున్న వాళ్ళపై గుళ్ళు పేల్చిన పిచ్చి వాళ్లను చూసి అతనికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే చిరాకుగా,”ఒకళ్ళను ఒకళ్ళు చంపు కుంటున్న వీళ్లంతా తెలివి తక్కువ వాళ్ళు” అన్నాడు.

“వీళ్లు అసలు పశువుల కన్నా హీనం” జవాబు ఇచ్చాడు సొవేజ్.

అప్పుడే గాలం లో పడ్డ చేపని చూస్తూ మోరీజో,”ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు ఒకే విధంగా పాలన
ఉంటుందని అనుకోవడం కేవలం భ్రమ”.

“రిపబ్లిక్ అయి ఉంటే యుద్ధం ప్రకటించి ఉండదు” అని సొవేజ్ అడ్డు పడబోయాడు.

మోరీజో వెంటనే కలగజేసుకొని,”రాజుల అధీనంలో రాజ్యాలు ఉన్నప్పుడు విదేశాలతో యుద్ధాలు జరుగుతాయి. అదే రిపబ్లిక్ లో అయితేనేం తమిళనాట రాజ్యసభ ఎన్నికలు అంతర్యుద్ధాలు జరుగుతాయి”అన్నాడు.

అలా వాళ్ళిద్దరూ రాజకీయాల గురించి ప్రశాంతంగా తమకున్న లోకజ్ఞానంతో చర్చించుకుంటున్నారు, ఒక సాధారణ పౌరుల లాగా. ఇద్దరూ కలిసి ఒక విషయంలో అంగీకారానికి వచ్చారు- తమకు ఎన్నటికీ స్వేచ్ఛ రాదు. మౌంట్ వెలారిన్ నిరంతర తుపాకుల మోతతో నిండిపోయింది . ఫిరంగుల కాల్పులతో ఫ్రెంచ్ ప్రజల గృహాలు ధ్వంసం అయ్యాయి. మనుషుల జీవితాలు ఛిద్రం అయ్యాయి; కలలు కల్లలు అయ్యాయి; వాళ్ళు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి; సంతోషంగా గడుపుదామని అనుకుంటున్న కోరికలు నాశనమయ్యాయి. భరించలేని కష్టాలు ఎదురవుతున్నాయి. ఇతర ప్రాంతాలలో నివసించే భార్యలు, ఆడపిల్లలు, అమ్మల హృదయాలు అంతులేని వేదనతో నిండిపోయాయి.

” జీవితమంటే ఇదే” ప్రకటించాడు సొవేజ్.
” ఎందుకు ,చావంటే ఇలా ఉంటుందని అనరాదా” అన్నాడు మోరీజో నవ్వుతూ.

అదాట్టుగా తమ వెనకనే అడుగులు చప్పడు విని వణికిపోయారు .వెనక్కి తిరిగి చూస్తే, తమ వెనకే నలుగురు పొడుగ్గా , గడ్డాలతో, చదునుగా ఉన్న టోపీలను తలపై పెట్టుకుని, ప్రత్యేకమైన యూనిఫాం వేసుకున్న మనుషులు నిలబడ్డారు. వారు చేతిలో తుపాకులతో, రెండు కోణాలనూ కప్పి నిలుచున్నారు.

మిత్రులు ఇద్దరి చేతిలో నుంచి గాలాలు నదిలోకి జారి పడ్డాయి.

కొన్ని సెకండ్లలోనే వాళ్ళిద్దరినీ బంధించి పడవలో పడేశారు.’ ఇల్లే మరేంటి ‘కి తీసుకెళ్లి పోయారు.
నిజానికి అక్కడ ఉన్న ఇంటి లో ఎవరూ లేరని భావించారు ఆ స్నేహితులు . కానీ అక్కడ డజన్ల కొద్ది జర్మన్ సైనికులు ఉన్నారు.

అందులో గజిబిజీ గా జుట్టు ఉన్న ఒక భారీ కాయుడు, పొడవాటి మట్టి పైప్ నుండి పొగ వదులుతూ చక్కని ఫ్రెంచ్ భాషలో, ” మీ అదృష్టం బాగున్నట్టుందే! బాగా చేపలు పడ్డట్టు ఉన్నాయే!” అన్నాడు.

వెంటనే ఒక సైనికుడు, అధికారి కాళ్ళ దగ్గర చేపలు నిండుగా ఉన్న సంచిని పెట్టాడు.

ఆ ప్రష్యన్ చిన్నగా నవ్వుతూ,”పర్వాలేదు. అయితే మనం మరో విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. మీరేం కంగారు పడకండి. నా దృష్టిలో మీరిద్దరూ గూడచారులు. నా జాడ తెలుసుకోమని మిమ్మల్ని పంపినట్టే భావిస్తాను. సహజంగానే ,నేను మిమ్మల్ని పట్టుకుంటే కాల్చేయాలి. మీరు కేవలం చేపలను పట్టుకుంటున్నట్టు నటిస్తున్నారు. నిజానికి మీ అసలైన పని వేరే ఉంది. మీరు నా చేతుల్లో పడ్డారు కాబట్టి ఫలితం అనుభవించక తప్పదు .యుద్దంలో ఇలాగే జరుగుతుంది.

అయితే ,మీరు అవుట్ పోస్ట్ ని దాటుకొని వచ్చారు కాబట్టి ,మీరు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లడానికి మీకు తప్పనిసరిగా పాస్వర్డ్ తెలిసే ఉంటుంది. మీరు నాకు ఆ పాస్వర్డ్ చెప్తే మిమ్మల్ని పంపించేస్తాను.”
మిత్రులిద్దరి మొహాలు పాలిపోయాయి. నిశ్శబ్దంగా పక్క పక్కనే నిల్చున్నారు. వారి భావావేశాలను ఏమాత్రం బయట పడనీయకుండా లోలోనఅదిమి పెట్టుకున్నారు.

“మీరు నాకు చెప్పిన విషయం ఎవరికీ తెలియదు”, అంటూ అధికారి కొనసాగించాడు.”మీరు మీ ఇళ్ళకి సజావుగా వెళ్ళిపోవచ్చు. ఆ రహస్యం నాలోనే నిలిచి పోతుంది. మీరు గనక చెప్పడానికి నిరాకరిస్తే, వెంటనే చనిపోతారు. ఇక మీ ఇష్టం. తేల్చుకోండి!”

ఇద్దరూ నిశ్చలంగా నిలబడ్డారు. పెదవులు కదపలేదు.

ప్రష్యన్ ప్రశాంతంగా నిలబడి చేతులు నది వైపు చాపి,” ఆలోచించండి. అయిదే ఐదు నిమిషాల్లో మీరు ఆ నది నీటి కింద ఉంటారు. ఐదు నిమిషాలు చాలు. మీకు బంధువులు ఉన్నారని నేను అనుకుంటున్నాను.”
మౌంట్ వెలారీ లో ఇంకా తుపాకీ గుళ్ళ మోతలు మోగుతూనే ఉన్నాయి.

చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళిద్దరూ మౌనంగా నిలుచున్నారు. వచ్చిన జర్మన్, తన భాషలో సైనికులకు ఆదేశాలు ఇచ్చాడు. ఆ తర్వాత, దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు- బందీలకి మరీ దగ్గరగా కాకుండా. ఇంతలో డజన్ మంది తుపాకులు చేత పట్టుకొని ముందుకొచ్చి తమ తమ స్థానాల్లో నిల్చున్నారు-దాదాపు 20 అడుగుల దూరంలో.

” నేను మీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను, ఆ తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగను” అన్నాడు సైనికాధికారి.
తర్వాత వెంటనే లేచి నిల్చుని ఆ ఇద్దరు స్నేహితుల దగ్గరికి వెళ్లాడు. మొదట మోరీజో దగ్గరికి వెళ్లి ,అతని చేయి పట్టుకుని పక్కకు తీసుకువెళ్లి,” తొందరగా పాస్వర్డ్ చెప్పు. నీ స్నేహితుడికి కూడా విషయం తెలియనివ్వను. నువ్వు చెప్పడానికి అంగీకరించనట్టే నేను ప్రవర్తిస్తాను” అన్నాడు.

మోరీజో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఆ తర్వాత సొవేజ్ దగ్గరకు కూడా వెళ్లి అదే విధంగా పక్కకు తీసుకెళ్లి అదే ప్రతిపాదనను పెట్టాడు.
సొవేజ్ కూడా మారు మాట్లాడలేదు.

ఆ తర్వాత ఇద్దరినీ పక్కపక్కనే నిలబెట్టాడు.
అధికారి ఆదేశాలు ఇచ్చాడు. సైనికులు తుపాకులను ఎక్కుపెట్టారు.
ఇంతలో మోరీజో తనకు కొద్ది దూరంలోనే గడ్డిలో సంచి నిండా ఉన్న చేపలను గమనించాడు.
నీరెండలో చేప పిల్లలు నిగనిగా మెరుస్తున్నాయి. మోరీజో హ్రూదయం ఒక్కసారి కృంగిపోయింది. ఎంత ప్రయత్నించినా కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీళ్లు ఆగలేదు.

“గుడ్ బాయ్ సొవేజ్,” మోరీజో.
” గుడ్ బాయ్ మోరీజో ‘ సొవేజ్.
ఒకరికి ఒకరు కరచాలనం చేసుకున్నారు నిలువెల్లా వణికిపోతూ. నిగ్రహించుకోవడం వారి వల్ల కాలేదు.
అధికారి ఆదేశాలు ఇచ్చాడు.

” కాల్చేయండి”.
12 మంది ఒకేసారి తుపాకులు గురిపెట్టి కాల్చారు.

సొవేజ్ వెంటనే నేలకొరిగాడు. ఆ తర్వాత పొడుగ్గా ఉన్న మోరీజో నెమ్మదిగా పక్కకొరిగి పడిపోయాడు. మోహం ఆకాశాన్ని చూస్తూనే ఉంది. గుండె నుంచి రక్తం ఉబికి అతను వేసుకున్న కోటు పైనుండి ప్రవహిస్తోంది.

ఆ జర్మన్ మళ్లీ ఒక ఆర్డర్ వేశాడు.
అక్కడున్న వాళ్లంతా వెళ్ళిపోయారు. తిరిగి వస్తూ పెద్దపెద్ద తాళ్లను , రెండు పెద్ద బండ రాళ్ళను తీసుకుని వచ్చారు. వాటిని ఇద్దరు మిత్రుల కాళ్లకు కట్టారు. ఇద్దరినీ మోసుకెళ్లి నది ఒడ్డుకి చేర్చారు.

మౌంట్ వ్యాలిరిన్ శిఖరాగ్రం ఇప్పుడు దట్టమైన తెల్లటి పోగతో నిండిపోయింది. ఇప్పటికీ తుపాకుల మోత ఎడతెరిపి లేకుండా వినిపిస్తూనే ఉంది.

ఇద్దరు సైనికులు,మోరీజో తలనొకరు కాళ్ళ నొకరు పట్టుకున్నారు. అలాగే సొవేజ్ ని కూడా మరో ఇద్దరు పట్టుకున్నారు. ఇద్దరి శరీరాలను బలమైన చేతులతో గట్టిగా ఊపుతూ దూరంగా నదిలోకి విసిరేశారు.
నదిలో నీరు పెద్ద ఎత్తున పైకి ఎగసి పడింది.నురగలు వచ్చి నెమ్మదిగా సద్దుమణిగాయి. చిన్నచిన్న అలలు తీరం వరకు వచ్చి వెనుదిరిగాయి.

ఎర్రటి రక్తం చారలు నీటి పైన అంతా తేలియాడాయి.

అధికారి అంతసేపూ ప్రశాంతంగానే గమనిస్తూ ఉన్నాడు.ఎకసెక్కంగా,”ఇప్పుడిక చేపల వంతు వచ్చింది” అన్నాడు.

ఆ తర్వాత తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

వెళుతూ వెళుతూ, చేపలు నిండా ఉన్న సంచి గడ్డిలో పడి ఉండడం గమనించాడు. దాన్ని తీసుకొని పరిశీలించాడు. నవ్వుతూ, ‘విల్మ’ ని పిలిచాడు.

తెల్లని కోటు వేసుకున్న ఒక సైనికుడు ఆ పిలుపుకి ప్రతిస్పందనగా అక్కడికి వచ్చాడు. అతని వైపు చేపలు నిండా ఉన్న సంచిని విసిరేస్తూ,” నేను చంపిన వాళ్ళిద్దరూ పట్టిన చేపలివి. వీటిని వెంటనే వేయించి నాకు పెట్టు: అవి బతికుండగానే వేయించాలి ,అప్పుడే మంచి రుచిగా ఉంటాయి ” అన్నాడు.

ఆ తర్వాత తన పైపును నింపాదిగా వెలిగించుకున్నాడు.

*

ఉషారాణి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొప్ప కథను తెలుగులో అందించినందుకు ధన్యవాదాలు. ఈ వాక్యం ఒక్కటే అర్థం కాలేదు:
    “తమిళనాట రాజ్యసభ ఎన్నికలు అంతర్యుద్ధాలు జరుగుతాయి”.

  • దేశాదేశాల్లో సాగుతున్న యుద్ధ నేపథ్యాల్లో అనామకంగా రాలిపోయిన ఇలాంటి అప్రకటిత అమాయక దేశభక్తులు ఎండరో! నిరాలంకారంగా, గుండె ద్రవింపజేసేలా వుంది కథ. అనువాదకురాలికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు