ఊరి చివర రాబందులు
సగం పీకి వదిలేసిన కళేబరాలు..
అపార్ట్మెంట్ లో రాలిపడే పావురాలు…
శిథిలమైన పిట్ట గూళ్లు..
నగరంలో రోడ్డు పక్కన
పాతపుస్తకాల కుప్పలు…
ట్రాఫిక్ సిగ్నల్ లో వీధి బాలల్లాంటి
ఆ పాత పుస్తకాల మధ్య నుంచే
కదా రోజూ భారంగా వెళుతుంటాను.
అట్టలు పోయిన అసహ్యమైన పుస్తకాలు
ఎండకు ఎండి, వానకు తడిసిన ముసలి శరీరం లాంటి పుస్తకాలు….
అమ్మే వాళ్లను, కొనే వాళ్లను చూసి ఎప్పుడూ నవ్వుకుంటాను.
***
రోజులు మారుతున్నా…
కేలండర్ పేజీలు చిరిగి పోతున్నా…
ఎన్నాళ్లైనా అమ్ముడు పోని ఒక పుస్తకం…
పేరు చదువుతుంటే ఏదో ఒక జ్ఞాపకం.
పేజీలతో పాటే నా గతం తెరుచుకుంది.
నాన్న ప్రేమతో ఇచ్చిన పుస్తకం అది,
ఇంతకాలం రోడ్డు పక్కన అనాథలా….
ఎలా పోగొట్టుకున్నానో, ఇన్నాళ్లకు దొరికింది.
ప్రేమతో నాన్న రాసిన అక్షరాలు ..
బాగా చదవాలంటూ ఆశీర్వదించిన నాన్న సంతకం….
అక్క దిద్దిన సగం ముగ్గులు
అమ్మ రాసిన పచారీ కొట్టు లిస్ట్
పుస్తకం పేజీల మధ్య నెమలీకలు.
ఆపాత పుస్తకంలో ఎన్ని ప్రేమ గురుతులో…
ఇప్పుడు అదే దారిలో పొడవునా
పాత పుస్తకాల పరిమళాలు….
పాత పుస్తకమంటే ఎవరిదో జ్ణాపకాల తేనెతుట్టె
ప్రతి పుస్తకం…
పదిలంగా దాచుకున్న ఒక పాత సందుక..








Add comment