ఒక పనిపిల్ల ఒంటరి పోరాటం

ది హౌస్ మెయిడ్ (కొరియన్ చిత్రం)
చిరు పరిచయం

ప్రకృతిలో అందమూ ఉంది. వినాశమూ ఉంది.

ప్రకృతి మురిపిస్తుంది. మైమరపిస్తుంది. శిక్షిస్తుంది కూడా.

బొమ్మలనుంచి బొమ్మలను తయారు చేసే ప్రక్రియలో ఎంతో ఆహ్లాదముందనీ, మానవాళి కొనసాగడానికి అదే ఆలంబన అనీ కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ ఇక్కడో “అన్యాయం” చేశాడు దేవుడు/చేసింది ప్రకృతి.

సృష్టికార్యంవరకూ స్త్రీ పురుషులిద్దరినీ సమానంగా బాధ్యుల్ని చేసినా, జననమిచ్చే ప్రక్రియలో మాత్రం కేవలం స్త్రీకే పాత్ర కేటాయింపు జరిగింది. అది అక్కడితో ఆగలేదు. అనేక విధాలుగా, అనేక కోణాల్లో ఆ అస్తవ్యస్తత వ్యక్తమౌతూనే ఉంది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, చివరికి ప్రాపంచికంగా కూడా – ప్రకృతి విధించిన ఈ నియమాన్ని స్త్రీలకు వ్యతిరేకంగా వర్తింపజేస్తూనే ఉన్నారు – స్థలకాలాలతో  సంబంధం లేకుండా!

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒకరినొకరు ఇష్టపడ్డారు. మానసికంగా ఒకటయ్యాక, శారీరకంగానూ ఏకమయ్యారు. అంతవరకూ బాగానే జరిగే కథ అక్కడ ఒక క్రూరమైన మలుపు తిరుగుతుంది.

ఆగుతాను. ‘క్రూరమైన’ అన్నాను కదూ?

‘క్రూరమైన’ అన్నది అనేక పరిస్థితుల మీదా, వర్గ వైవిధ్యాల మీదా ఆధారపడుతుంది. అంచేత అన్నిసార్లూ ఆ మలుపు – గర్భధారణ – క్రూరం కాబోదు.

పైన చెప్పిన ఇద్దరిదీ ఒకే వర్గం, ఒకే సామాజిక స్థాయి, ఒకే ఆర్థిక స్థాయి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదేమో. సమాజం విధించే షరతులు, నియమాలు వర్తిస్తాయి – ఇక్కడ. అంతా హాపీ.  శారీరకమైన కష్టం మాత్రం ఎల్లప్పుడూ ఎక్కడైనా మహిళదే.

ఒక బీదపిల్ల. తగినంత అమాయకురాలు. అత్యాశ ఆమెకు తెలియదు. ఒక ధనికుడి ఇంట్లో ఆయాగా పనిలో చేరుతుంది. ఆ యింటి యజమానికి – కవలలను ప్రసవించబోతున్న భార్య, అయిదారేళ్ల కూతురు ఉన్నారు. ఆ భార్యకు, కూతురికి సాయపడుతుండడం, వంటపనితో సహా ఇంట్లో చిన్నాచితకా పనుల్లో చేదోడువాదోడుగా ఉండటం ఆమె బాధ్యతలు. ఈమె కాక, వయసులో పెద్దదైన ఒక వంటావిడ కూడా ఉంది ఆ యింట్లో.  ఆవిడే ఈమెను పనికి కుదిర్చింది అసలు.

కథలో ఆవిడకు ఇంకా చాలా పాత్ర ఉంది.

యజమాని భార్య, భర్తకు అనుకూలవతే. కానీ, ప్రస్తుతం తన శారీరక స్థితి (నిండు చూలాలు) ఆమెను భర్తతో శృంగారంలో బెరుకు లేకుండా పాల్గొననివ్వదు. దాంతో భర్తకు అసంతృప్తి తప్పదు.

అలాంటి ఒక రాత్రి, యజమాని పనిపిల్లను తాకుతాడు. వీళ్ళిద్దరికీ తృప్తి దక్కుతుంది – అప్పటికి…

అలా మరోసారి, ఇంకోసారీ జరుగుతుంది. తమకంతో దహనమూ, చల్లారడాలూ షరా మామూలే. వాళ్ళిద్దరి తమకపు వేడి, ఒకసారి వంటావిడకు తెలిసిపోతుంది. ఆవిడ వెళ్ళి, యజమాని అత్తగారికి ఉప్పందిస్తుంది. ఎన్నో ఏళ్లనుంచీ ఆ యింటి ఉప్పు తింటున్న మనిషి కదా మరి! మండిపడిన అత్తగారు అదను కనిపెట్టి, అనుకోకుండా జరిగినట్లు అనిపించేలా, ఆ పనిపిల్ల ఎక్కి ఉన్న నిచ్చెనను కుదుపుతుంది. రెండో అంతస్తునుంచి కిందపడి చనిపోవలసిన పనిపిల్ల, ఆస్పత్రిలో కోలుకుంటుంది.

అక్కడ చేసిన పరీక్షల్లో తెలుస్తుంది – ఆమె నాలుగు వారాల గర్భవతి అని.

అంతవరకూ అక్కడక్కడా శృంగార సన్నివేశాలతో దృశ్యాలతో నల్లేరు మీద బండిలా సాగిపోతున్న కథ, వేగాన్ని తగ్గించుకుని, ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగుతుంది.

పనిపిల్ల, భ్రూణహత్యకు పాల్పడేందుకు ఒప్పుకోదు. ధనాశకూ లొంగదు.

అప్పుడేమైంది? అత్తగారు ఇంకేం చేసింది? ఎందుకు చేసింది? వేగంగా ఎదురవుతున్న పరిస్థితులపట్ల ఆ యజమాని ధోరణి ఏమిటి?

ఇంతకీ యజమాని భార్య ఎలా స్పందించింది?

చివరకు ఏం జరుగుతుంది?

ఇవన్నీ చూసి తెలుసుకోవలసిందే. కళ్ళ ముందు రోజూ నడుస్తున్న పురుషాహంకారయుత ప్రపంచాన్ని –ఆ అసహ్యాన్ని ఛెళ్ళున మనకు చేరవేస్తుంది. ‘ది హౌస్ మెయిడ్’ సినిమా పేరు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

ఈ సినిమాకు అనేక అవార్డులు వచ్చాయి. నిర్మాతల, దర్శకుల, నటీనటుల, సాంకేతిక నిపుణుల సమిష్టి కళాసృష్టికి తగిన గౌరవం దక్కింది. కానీ మానవసృష్టి భారాన్ని, సంసారబాధ్యతల్లో అతి ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ఒంటరిగా తలకెత్తుకుని మోస్తున్న మహిళకు, ప్రపంచం తగిన స్థాయిలో గౌరవాన్ని సమకూరుస్తోందా?

జ్యోన్ దో యోన్ – పనిపిల్ల

లీ యుంగ్ యే – భర్త/యజమాని  

సెయో వూ – భార్య 

యూన్ యుహ్-యూంగ్ – వంటావిడ

పార్క్ జీ యంగ్ – యజమాని అత్తగారు

ఇమ్ సాంగ్-సూ – దర్శకుడు

కిమ్ కి-యంగ్+ఇమ్ సాంగ్-సూ – రచన

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు