1
ముళ్లచెట్లని,కంపలని దాటుకుంటూ
సన్నని దారిలో నలుగురం
~
“హాయ్ రాక్స్”
రాళ్లని తాకుకుంటూ, తొక్కుకుంటూ
ముళ్ళు, ఒంటి మీద గీస్తున్న తెల్లటి గీతలను స్పర్శించుకుంటూ
కొండమీద మేం…
చుట్టూ
బిల్డింగుల వెలుగులు
వా…..వ్
నిద్రరాకపోయినా
గరుకుల రాయిపైన వాలిపోయి నేను.
పక్కన కొన్ని ముచ్చట్లతో పాటు
కొన్ని పాటలు...
అలా పైకి చూడగానే
పౌర్ణమి చంద్రుడు
బూడిద రంగులో ఆకాశం
అలలలాగా మేఘాలు
మరి నక్షత్రాలు ఏమయ్యాయి?
నా కళ్ళలో ఏదైనా కొలను దాగుందా?
మరి చంద్రుడెందుకు
నా కళ్ళని పైకి లాగుతున్నాడు.
ఎక్కడనుంచో పేరు తెలీని
పక్షో,పురుగో పాట
దొరికిన వెదురు కర్రతో, దానికి
సోపతిగాడు కొట్టే సంగీతం
నా చూపుకీ చంద్రుడికి మధ్య
పచార్లు చేస్తూ
ఏవో పక్షులు
బహుశా చకోరాలేమో!
చల్లగాలి పీలుస్తూ
వచ్చీ రాని సుషుప్తిలోకి నేను
అమ్మాయిల మాటలు
నిద్రాభంగం
2
2PM వాన
★
భయంకరంగా దుమదుమ ఉడుకుతోంది: ఎండ
చెట్లు కూడా నీరసించిపోయి
చెమటనీళ్ళు రాల్చుతున్నాయి invisible గా
అవే చల్లగా మందమైన నీడల్లాగ పుడుతున్నాయి
•
పిట్టల పాటలే వినిపిస్తున్నాయి
అది ఏడ్పు కూడా అవ్వొచ్చేమో!
వాటి ఆచూకీ సూరీడికే కనిపిస్తుంది
•
కుక్కలు – అడవి పందులు గసతీర్చుకుంటూ
గోతులు తవ్వుకుంటున్నాయి
జింకలు ఏ పొదల్లోనో టెంపుల్ రాక్స్ లోనో
బతుకుని దాచుకున్నట్టున్నాయి
★
ఇలాగ ఈ మధ్యాహ్నం పూట
రాలుతున్న ఎండపిడుగుకి భయపడి గాయపడుతూ
కాంపస్: ఉక్కపోతకి సొమ్మసిల్లి అల్లాడిపోతూ
•
ఇక్కడ మనుషులు- బయట గొడుగుల కింద
పడి తడుస్తున్నారు: వేడి నీడ కింద :
ఇంకొందరు బస్టాపుల్లో Shopcom నీడల్లో కూర్చుని
•
ఏమైందో ఇక
మబ్బులు కమ్ముకుని
ఆకాశమంతా పల్చని చీకటి వలయాలు పరుచుకుని
తుంపర్లు తుంపర్లుగా కురుస్తున్నాయి చినుకులు
ప్రళయప్రవాహమేమి కాదు కానీ
కాంపస్ మాత్రం
కల్లాపు చల్లినట్లు ప్రశాంతంగా
గుప్పున మట్టి వాసన కొడుతూ ముక్కు పుటాలకు;
కాకపోతే కొన్ని ఉరుముల శబ్దాలు
•
తడిచిన తలపై చేయి పెట్టుకొని
అనుకున్నాను ఇలా: తెల్లటి చినుకులు
కారుమబ్బుల్లోంచి ఎలా కురుస్తున్నాయి !!
•
ఎవరిదో గొంతు చికాకుపడుతూ:
Ah! Why this rain now??
జీవితంలో అనూహ్యంగా ప్రవేశపెట్టబడే చికాకులు అవగతమైనవాడిలాగ
•
Creambell Cone Icecream తింటూ
పక్కగా నడుస్తూ ఒక అమ్మాయి
•
వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్ కడుపులో వేసుకుంటూ
తెలుగు అమ్మాయి
ఇప్పుడే నేర్పిన పదాలు పునరావృతం చేస్తూ
సంబరంగా మలయాళీ కుర్రాడు:
చాలా ఉరుములు మెరుపులు
చల్లని చినుకులు
ఏమో! అతను ఎండలో చినుకుల స్పర్శని ప్రేమిస్తున్నాడేమో!
•
ఇప్పుడిక ఎండకు తడిచిన గొడుగులు
చినుకులుకీ తడిచాయి
★★★
@ South Shopcom, HCU (16.03.2023)
కవితలు బాగున్నాయి. బతుకు ఈ క్షణం ఎక్కడుందో, ఏది చూస్తున్నామో, అదంతా మనకు ఎలాంటి అనుభూతిని అనుభవాన్నీ కలిగిస్తుందో దాన్ని రాయడమే కరెక్ట్. నేనే క్యాంపస్ లో ఉండి అవన్నీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
Thank you very much Mama 😀
తమ్ముడు… కవితలు బాగున్నాయి. నువ్వు ఏది రాసినా హృదయం తో రాస్తావు..
నీకు ప్రేమపూర్వక ఆలింగనాలూ..
“కుక్కలు అడవి పందులు గసతీర్చుకుంటూ గోతులు తవ్వుకుంతున్నాయి..👌”
Thank you very much Anna 😊