స్పష్టత వచ్చాకే విమర్శ రాస్తాను!

కొలకలూరి రామయ్య విమర్శన పురస్కార గ్రహీత కెంగార మోహన్ తో కాసిని కబుర్లు 

కవిత్వమూ, విమర్శా, కార్యాచరణ ముప్పేటగా కలగలసిపోయిన వ్యక్తిత్వం కెంగార మోహన్. కొలకలూరి రామయ్య విమర్శ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా వెంకట కృష్ణ చేసిన ముఖాముఖీ ఇది.
కొలకలూరి రామయ్య విమర్శన పురస్కారం`2026 అందుకుంటున్న సందర్భంగా అభినందనలు మోహన్. కవిగా మొదలై విమర్శకుడిగా స్థిరపడినట్లేనా?
ధన్యవాదాలు సార్. ఈ పురస్కారంవల్లనే స్థిరపడ్డానని అనుకోడానికి వీల్లేదు. వొక్కసారి విమర్శకుడి ప్రయాణం మొదలు పట్టాక ఆగిపోయే పరిస్థితి        ఉండదు. విమర్శకుడికి విమర్శ రాయడం నిరంతర ప్రక్రియ. విమర్శలో ఏదో రాసేశామనడానికి లేదు. నా మటుకు వొక పుస్తకాన్ని లేదా వొక కావ్యాన్ని విమర్శ  చేసే సందర్భంలో ప్రాథమికంగా కవి సమకాలీన జీవితానికి, సమకాలీన మనస్తత్వ చైతన్యాలకు సంబంధించినంత వరకు ఆ కవి ఎంతవరకు ఈ సమాజాన్ని తన సృజన ద్వారా ప్రగతిశీల దృక్ఫథం కలిగి ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాడో స్పష్టత వచ్చాకే విమర్శ రాస్తాను.
విమర్శలో నీ ప్రాతిపదికలేమిటి. పరికరాలేమిటీ. ఎక్కువగా కవిత్వం మీద రాసినట్టున్నావు కదా?
సాహిత్య సిద్దాంతాలకు లోబడి చేసే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మార్క్సిస్ట్ దృక్ఫథంతో సమాజాన్ని చూడటం, మనస్తత్వ దృష్టికోణంలోంచి సాహిత్యాన్ని చూడటం. విమర్శకు మార్క్సిజమే పునాదిరాయి అని బలంగా నమ్ముతాను. ఇది వాస్తవం కూడా..నేను సైకాలజీ చదవడం మూలంగా కావ్యాన్ని మనస్తత్వ దృష్టితో చూడటం అలవాటయ్యింది. అందుకే నా పరికారాలు మార్క్సిజం`మనస్తత్వశాస్త్రం. విమర్శ ఎక్కువగా కవిత్వం మీద రాయడానికి కారణం. నేను కవిగానే సాహిత్యజీవితాన్ని ప్రారంభించాను. ఎక్కువగా చదివింది కూడా కవిత్వమే. ఆ తర్వాత ఎక్కువగా చదివింది ఏదైనా వుందంటే అది విమర్శనే. విమర్శకు సంబంధించి అనేక పుస్తకాలు ఇప్పటికీ చదువుతూనే వుంటాను.
సాహిత్యసృజన నుంచి విమర్శకుడిగా వున్నావు కదా. నీ సాహిత్యసృజన మీద నీలోని విమర్శకుడి అభిప్రాయం ఏమిటి?
నేనేం గొప్ప సృజనకారుడని అనుకోవడం లేదు. అలా అని నేనేం గొప్ప కవిత్వం రాశానని కూడా అనుకోవడం లేదు. వర్తమాన సమాజంలో నెలకొని వున్న సమస్యలనే ఇతివృత్తాలు చేసుకుని కవిత్వం రాశాను, రాస్తున్నాను. కానీ కవిత్వాన్ని ఎలా చూడాలో, ఎలా కొలవాలో, ఎలా పోస్ట్‌మార్టం చేయాలో బాగా తెలుసుకున్నాను. కవిత్వమంటే నిర్ధిష్టమైన నిర్మాణసూత్రాలుండాల్సిందేననే నిర్ణయానికొచ్చాను. అందుకే నన్ను కవిగా కంటే విమర్శకుడిగానే ఈ సాహిత్యసమాజం గుర్తింపు నిచ్చింది.
చెమట చెక్కిన వాక్యంలో తెలుగు నేల మీద వున్న చాలా మంది రచయితలను పరామర్శించినా, రాయలసీమ రచయితలే ఎక్కువగా వున్నారు కదా.దీని గురించి ఏమంటావు?
నేను రాయలసీమలో ఉండటం వల్ల, ఈ ప్రాంతం కవులతో ఎక్కువగా పరిచయం ఉండటం వల్ల ఈ పుస్తకంలో ఎక్కువమంది సీమకవుల పుస్తకాల మీద రాసి వుండొచ్చు. కానీ స్పానిష్ కవి పాబ్లో నెరుడా, ఇరానియన్ కవి అబ్బాస్ కియారొస్తమి కవులపై విమర్శ కూడా వుంది. నా చేతికంది, నేను చదివినపుడు నాకు నచ్చితే ఆ కవిత్వం గూర్చి రాయడమే. నిజం చెప్పాలంటే నాకు పరిచయం లేనివాళ్ళ కవిత్వం గూర్చి కూడా రాశాను. ఈ పుస్తకంలో అన్ని ప్రాంతాల కవుల కవిత్వంపై విమర్శ వ్యాసాలున్నాయి.
విమర్శకుడిగా తెలుగు వర్తమాన కవిత్వం మీద నీ అంచనా ఏమిటి?
తెలుగులో వర్తమాన కవిత్వం పుంఖానుపుంఖాలుగా వస్తున్నా విమర్శకులు ఆశించినంత స్థాయిలో రావడం లేదు. సామాజిక మాధ్యమాలొచ్చిక కవులకు అనేక వేదికలు అవకాశాలు వచ్చాయి. సామాన్యజనాన్ని ప్రభావితం చేసే కవిత్వం రాలేదనే అనిపిస్తుంది. విమర్శకులు ప్రతీ కవిత్వాన్ని రాయడం సాధ్యం కాదు.
*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

3 comments

Leave a Reply to Murali Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మా సత్యం
    కెంగార మోహన్ గారు
    ఇంటర్వ్యూ పర్వాలేదు.
    మీ విమర్శన దృష్టి కోణంలో ప్రధానంగా నన్ను ఆకర్షించినవి. రెండు ఒకటి మార్క్సిస్టు దృష్టి కోణం, రెండవది మనో వైజ్ఞానిక కోణం.
    సిగ్మాండ్ ఫ్రైడ్ 1901లో రాసిన
    సైకోపాథాలజీ ఆఫ్ ఎవ్రీడే లైఫ్”వారి సిద్ధాంతం అన్ని రంగాలపై గాఢమైన ప్రభావం చేశాయి.
    మీరు “సాహిత్యాని
    మనస్తత్వ దృష్టి కోణంలో చూడడం అలవాటైందని పేర్కొన్నారు. ఒక విషయాన్ని మాత్రం మీతో
    నా అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను
    ఈనాడు జరుగుతున్న ఉద్యమాలు అన్నింటిని కూడా మార్క్స్ అండ్ సిగ్మండ్ ఫ్రైడ్ కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
    ఎం ఏ సత్యనారాయణ రావు
    9494052775

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు