ఇది ‘సారంగ’ పుట్టిన నెల. సంగీతంలో ‘సారంగ’ అనేది ఒక రాగం. విన్నవారికి ఆహ్లాదాన్ని అందించడం దీని గుణం. మనం సాహిత్య ‘సారంగ’ ఒక మెట్టు పైకెక్కి ఇక్కడి రచనలు చదివిన ఆహ్లాదంతోపాటు ఆలోచనాత్మక శక్తినీ అందిస్తోంది. సారంగ పుట్టినరోజంటే నిజంగా అది సాహిత్య పండగ. ఈ సమయంలో సారంగతో నా ప్రయాణం గురించి కొన్ని మాటలివి..
2020లో అఫ్సర్ అమెరికా నుంచి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కాల్ చేశారు. అప్పుడే కొత్తగా జర్నలిజంలోకి వచ్చాను. రెండు కథలు రాసి ఉన్నాను. మరిన్ని కథలు రాయాలన్న ఉత్సాహంతో ఉన్నాను. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు. ఉన్నట్టుండి కరోనా లాక్డౌన్. చుట్టూ ప్రపంచం అంతా నిశ్శబ్దం. మాది పాత్రికేయ వృత్తి కాబట్టి ఊరంతా తిరిగే అవకాశం. అలాంటి సమయంలో అఫ్సర్ నుంచి మొట్టమొదటి కాల్.
‘సారంగకు మీరేదైనా రాస్తే బాగుంటుంది’ అన్నారు.
అప్పటికి సారంగ వెబ్ పత్రిక గురించి తెలుసు. అందులో ‘నేను తోలుమల్లయ్య కొడుకుని’, ‘రంగురెక్కల వర్ణపిశాచం’, ‘దేవుడమ్మ’, ‘గజ్జెలపొంగు’, ‘అదే ప్రేమ’ లాంటి కొన్ని కథలు చదివి ఉన్నాను. అన్నీ గట్టి కథలు. ఏదైనా ఒక సాహిత్య పత్రిక స్టాండర్డ్‌ని ఆ పత్రికలో వచ్చే కథల్ని బట్టి అంచనా వేసుకోవడం నాకలవాటు. ఆ ప్రకారం సారంగ బెస్ట్ అనిపించింది. అలాంటి పత్రిక నాలా అప్పుడప్పుడే రాయడం మొదలుపెట్టిన వాణ్ని రాయమని అడగడం చాలా పెద్ద విషయం అనిపించింది. రొటీన్‌గా ఏదో ఒకటి రాయడం కన్నా కొత్తగా ఏదైనా రాస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆయనకు నా ‘మైక్రో కథల’ ఐడియా చెప్పాను. ‘బాగుంది. పంపండి’ అన్నారు. పంపించారు. చదివారు. ‘మైక్రో కథలు’ పేరిట శీర్షిక మొదలుపెట్టించారు. అది మొదలు. ఆ తర్వాత ఇవాళ్టి దాకా సారంగతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. నా సాహిత్య జీవితంలో సారంగది చాలా పెద్ద పాత్ర.
‘మైక్రో కథలు’ సిరీస్‌లో పది కథలు పూర్తయ్యాక, పెద్ద గ్యాప్ లేకుండానే మరో శీర్షిక మొదలుపెట్టమని అఫ్సర్ ప్రతిపాదన తెచ్చారు. ఏం చేద్దాం..ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందే చందు తులసి అన్న చేసిన ‘రేపటి కథ’ శీర్షిక గుర్తొచ్చింది. ఒక రచయిత కథతోపాటు వారి ఇంటర్వ్యూ ప్రచురించి, వారి భావాలను పాఠకులకు చెప్పడం ఆ శీర్షిక పని. మరో శీర్షికతో దాన్ని నేను కొనసాగిద్దామని అనిపించింది. రకరకాల పేర్లు ఆలోచించి చివరకు నేను, అఫ్సర్ కలిసి ‘కథలపొద్దు’ అనే పేరు ఖరారు చేసుకున్నాం. 2021 జనవరిలో చరణ్ పరిమి రాసిన ‘పొగ’ కథతో ఆ శీర్షిక ప్రారంభమైంది. ప్రతినెలా ఒక రచయిత కథతోపాటు వారి ఇంటర్వ్యూ పబ్లిష్ చేయడం మా లక్ష్యం.
మొదలైతే పెట్టాను కానీ, దాన్ని ఎంతకాలం కొనసాగించగలనన్న సందేహం ఎప్పుడూ ఉండేది. పట్టుమని పది మంది రచయితలైనా దొరుకుతారా? ఒక ఏడాది పాటైనా ఈ శీర్షిక నిర్వహించగలనా అనుకున్నాను. ఏడాది పూర్తయ్యింది. 2022 వచ్చింది. ‘కథలపొద్దు’ ఆగలేదు. రచయితలు ఇంకా రాస్తున్నారు. నేను వారి కథలు ఎడిట్ చేసి వేస్తూ ఉన్నాను. 2023, 2024, 2025..ఇలా సాగుతూనే ఉంది. మధ్యలో ఒకటి, రెండు సార్లు ఆ నెల మిస్ అయినా ఆ తర్వాత అందుకుని కొనసాగుతూనే ఉంది. 2021 జనవరి నుంచి మొదలుపెడితే 2026 జనవరి వరకు ఐదేళ్ల ప్రయాణం. 60 మందికి పైగా రచయితలు. వారి వల్లే ఈ ప్రయాణం ఇంత బాగా సాగింది.
తెలుగులో సుదీర్ఘకాలంగా సాగుతున్న సాహిత్య శీర్షికల్లో ‘కథలపొద్దు’ కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల రచయితలు ఇందులో భాగం పొందారు. అన్ని రకాల మాండలికాలూ ఈ కథల్లో ఉన్నాయి. దళిత, స్త్రీ, మైనార్టీ, బీసీవాదాల నేపథ్యంలోని కథలతోపాటు మ్యాజిక్ రియలిజం, కామెడీ, సెటైర్, లవ్..ఇలా అన్ని జాన్రాలలో రాసిన కథలు ఇందులో ప్రచురితమయ్యాయి.
కొందరు ఇక్కడే తమ తొలి కథ రాశారు. ఈ శీర్షిక ద్వారానే తమ ప్రయాణం మొదలుపెట్టాలని ఆశపడుతున్నవారూ ఉన్నారు. ఈ శీర్షికలో ప్రచురితమైన కథలు ఇతర ప్రతిష్ఠాత్మక కథాసంకలనాల్లో రావడం విశేషం. ఇప్పటికి 60 మందికిపైగా రచయితలు ఇందులో పాలుపంచుకున్నా అందులో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండటం మాత్రం అప్పుడప్పుడూ నేను లోటుగా ఫీలయ్యే విషయం. దాన్ని భర్తీ చేయాలన్న ప్రయత్నాలు చాలాసార్లు చేసినా ఎందుకో అది కలిసిరాలేదు. ఇకపైన అయినా ఆ లోటు తీరుతుందని అనుకుంటున్నాను.
సారంగలో ‘కథలపొద్దు’ శీర్షిక పాపులర్ అయిన తర్వాత చాలామంది నన్ను ‘సారంగ’ బృందసభ్యుడు అనుకోవడం ఆనందం కలిగించే విషయం. కొన్నిసార్లు స్టేజీ మీదకు నన్ను పిలిచేటప్పుడు ‘సారంగ వెబ్ పత్రిక సభ్యుడు’ అంటుంటారు. బయట ఎక్కడైనా కలిసినప్పుడు ‘మీ సారంగ మెయిల్‌కి కథ పంపానండీ! చూశారా?’ అంటుంటారు కొంతమంది. లోపల చిరుసంతోషం కలుగుతుంది. ‘సారంగ ఎడిటర్ అఫ్సర్! మీరు పంపిన కథ ఆయనే చూస్తారు. కథలపొద్దులో వచ్చే కథలు మాత్రమే నేను పరిశీలిస్తాను’ అని సమాధానం చెప్తుంటాను. మనం చేసే చిన్నపనులకు వచ్చే పెద్ద గుర్తింపు లెక్కలేనంత సంతోషాన్ని అందిస్తుంది.
తెలుగులో ఒక పదిదాకా ఆన్లైన్ సాహిత్య పత్రికలున్నాయి. నూతనత్వం, ప్రత్యేకతల విషయంలో సారంగ నెంబర్ వన్ అని నాకనిపిస్తుంది. ఇది ముఖస్తుతికో, అఫ్సర్ని పొగడాలన్న ఆసక్తితోనో చెప్తున్న మాటలు కావు. సారంగను ఓ ఆరునెలలపాటు చదివితే ఎవరికైనా అర్థమయ్యే విషయం ఇది. సారంగ తన పత్రికలో చోటిచ్చినన్ని శీర్షికలు మరెవరూ ఇవ్వలేదు. సారంగలో రాసినంతమంది కొత్త రచయితలు కూడా ఇతర పత్రికల్లో రాయలేదనే నా అంచనా. కథలు, కవిత్వం, వ్యాసాలు అందరూ ప్రచురించేవే! ఇంటర్వ్యూలు కూడా కొన్ని పత్రికలు చేస్తుంటాయి. సారంగ మరో అడుగు ముందుకు వేసి ‘కథా కచ్చీరు’, ‘శేఫాలికలు’, ‘కథాలజీ’ వంటివాటిని అందించి తెలుగు సాహిత్యానికి చక్కటి చేర్పును మిగిల్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పలు సంకలనాల కథలు మొదట సారంగలోనే రావడం అందరికీ తెలిసిందే. తెలుగులోపాటు ఇంగ్లీషులోనూ సారంగ సంచికలు ఏకకాలంలో విడుదలవుతూ రెండు భాషలు పాఠకులకూ చేరువవడం విశేషం.
సారంగ నిర్వహణపరంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటుంది. అక్కడెక్కడో అమెరికాలో ఉన్న అఫ్సర్ ఇక్కడ తెలుగు నేలపై జరిగే ప్రతి పరిణామాన్ని వెంటనే పట్టుకొని, దానిపై వ్యాసం రాయిస్తుంటారు. సాహిత్యలోకంలో ఒక ఉదంతమో, నూతన పుస్తకావిష్కరణో, ఒకరి మరణమో, ఒకరికి పురస్కారం రావడమో జరిగినప్పుడు వెంటనే స్పందించి, ఆ అంశం గురించి సమర్థంగా రాయగలిగేవారిని వెతికి మరీ రాయించడం చాలా ఆశ్చర్యం నాకు. ఇంత వేగంగా ఈయన ఎలా స్పందించగలరా అనిపిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే అంశాలపైనా ఎప్పటికప్పుడు సారంగలో వ్యాసాలు ప్రచురితమవుతుంటాయి. అటు ఉద్యోగ జీవితం, ఇటు వ్యక్తిగత జీవితాల్లో బిజీబిజీగా గడిపే సారంగ మిత్రులు ఈ పనులన్నీ పూర్తి చేసి, 15 రోజులకోసారి సారంగ సంచికలు వెలువరిస్తున్నారంటే నిజంగా వారికి హ్యాట్సాఫ్!
మన ‘సారంగ’ మరింత సమర్థంగా ముందుకు సాగాలి. సాహిత్యంతోపాటు సినిమా, ప్రచురణరంగం, బుక్ మేకింగ్, ఆధునిక అనువాద రీతులు, కార్టూన్లు వంటి అంశాలపైనా విరివిగా వ్యాసాలు రావాల్సిన అవసరం ఉంది. గతంలో జ్యోతి, యువ వంటి పత్రికలు దీపావళి, ఉగాది ప్రత్యేక సంచికలు తెచ్చినట్టు ‘సారంగ’ కూడా ప్రత్యేక సంచికలు తెస్తే బాగుంటుందని చాన్నాళ్ల నుంచి నాకనిపిస్తోంది. ఇవన్నీ జరగాలంటే అఫ్సర్ ఒక్కరే కాదు, మనందరం కలిసి పూనుకోవాలి. అంటే బండలో, కొండలో మోయాల్సిన అవసరం లేదు. వీలైనంతగా మేలు రచనల్ని సారంగకు అందించాలి. సారంగలో ఇతర రచయితలు రాస్తున్న రచనల్ని చదివి అభిప్రాయాలు తెలపాలి. సారంగలో గురించి మరింత మందికి తెలియజేయాలి.
సారంగ ప్రయాణానికి మరిన్ని మేల్తలపులు.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం








Add comment