కృష్ణానగర్ వీధుల్లో…
ఇదివరకే ఈ కథలు ఎందుకు రాసానో చెప్పాను. రెండేళ్ళ తర్వాత, నాకీ కథలు ఏమనిపిస్తున్నాయో చెబుతున్నాను.
We write to taste the life twice అని ఎక్కడో విన్నాను. సెకండ్ ఎడిషన్‌కి ముందు ఈ కథల్ని చదువుతున్నప్పుడు మళ్ళీ ఆ గతకాలపు జీవితంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ప్రతి కథ, వాక్యం, మాట రాసిన సందర్బం గుర్తులేదు. కానీ అప్పుడు నేను ఫీలైన ఎమోషన్. తిరిగి మళ్ళీ, చాలా టైట్‌గా నన్ను హోల్డ్ చేసింది.
ఏమనిపించింది అప్పుడు. ఎటు వెళ్ళిపోయాను నేను?
సినిమా లేదా కథలూ పూర్తయ్యాక కూడా పాత్రలూ వాటి యాక్షన్స్ అక్కడ పుట్టే మరో కథ ఉంటుంది. ముగింపు తర్వాత ఏం జరగొచ్చు అని ఊహించేవాడ్ని చిన్నప్పుడు. ఉదాహరణకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాని తీసుకుంటే, అసలిద్దరూ ఏ పనీ సరిగ్గా చెయ్యరు. ఆ తర్వాతి కథలో చిన్నోడి ఫైనాన్షియల్ సిట్యుయేషన్ వల్ల బ్రేకప్ అయితే, పెళ్ళి చేసుకున్నా డివోర్స్ అయితే. అసలు రేలంగి మావయ్య ‘తొక్కలో ఫిలాసఫీలు చెప్పుకుంటూ ఉన్న డబ్బుని కాపాడుకోలేకపోయాను’ అని మనోవేదనతో చనిపోతే. పెద్దోడికి ప్రేమ చూపించడం రాక అంతే ఇబ్బందిపడుతూ తాగుడికి బానిసైతే. ఇట్లా ఉండేవి ఆ ఆలోచనలు.
చెప్పని ఆ కథ నాకు చాలా ఇంపార్టెంట్. చెప్పిన కథ గురించి కాకుండా చెప్పని కథ గురించి ఆలోచించడం, ఊహించడం నాకిష్టం.
అట్లాంటి నేను. కృష్ణానగర్ వీధుల్లో కథలు రాసి, ఆ కథలకి extended versionని ఎలా వదిలేస్తాను. వీలైనంతలో ఆ మనుషుల్ని, పాత్రల్ని కలుసుకున్నాను.
నా కథల్లో హీరోలూ, విలన్లూ, సేఫ్ జోన్‌లో బ్రతుకుతూ ఇతరులకి మోటివేషన్స్ ఇచ్చే పాత్రలూ ఉండవు. సాధారణ మనుషులుంటారు. వాళ్ళ కదలికలు, రియాక్షన్స్ ఇవే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. అలా ఆలోచిస్తూనే ఈ కథలు రాసాను. ముఖ్యంగా ఇదేదో కొత్తగా ఉందే అని కథ రాయను. ఈ విషయమేదో చెప్పాలనిపిస్తుందే అనుకున్నప్పుడు కథ రాస్తాను.
అయితే, ఈ రెండేళ్ళ తర్వాత మళ్ళీ ఆ మనుషుల్ని కలిసాక తెలిసింది, ఆ మనుషుల్ని కలిసాను కానీ అదే మనుషుల్ని కాదని. ఏదైతే 23 సంవత్సరాలప్పుడు నేను కలిసానో, వాళ్ళూ వీళ్ళూ వేరువేరు. ఇప్పుడు వారి కథలే వేరు.

ఈ కొనసాగింపు నేను ఊహించనిది. కథల్లో బాధపడిన వాళ్ళు, ఇప్పుడు చక్కగా నవ్వుతున్నారు. అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని తలకిందులు చేసుకున్నవాళ్ళు, ఇప్పుడు దైర్యంగా నిలబడున్నారు. మాటల్లో తేడా, మనుషుల్లో తేడా. ఏ నొప్పీ లేకుండా మరణముంటే బావుండని ఆశపడ్డవాడి లోపల peace. గాయాలు పాతవైనా ప్రతిరాత్రీ వాటిని కొత్తగా అనుభవించాల్సి ఉంటుందని చీకట్లో నడుస్తున్నవాడూ ఎలానో వెలుతుర్లోకి వచ్చాడు. ఇప్పుడు కాలంతోపాటు గాయాలు మానకపోయినా మనుషులు మానుపుతారని చెబుతున్నాడు. అందమూ…ప్రేమా మధ్య కొట్టుమిట్టాడిన మనిషి జీవితంలోకి అసలైన ప్రేమ తొంగిచూసింది.
బావుందిలాగా.
కథలకి కొనసాగింపు.
నా కథల్లోని మనుషులకీ, ఈ కథలు కేవలం జ్ఞాపకం.
బావుంది.
ఊహలు మన చేతుల్లోనే ఉంటాయి, వాస్తవాలు కాదు. ఊహల్ని దాటి అందమైన వాస్తవంగా తమ కథల్ని మార్చుకున్న మనుషులకి ప్రేమతో…
*
కథకులకు స్వాగతం
ఇదొక అరుదైన శీర్షిక! సాధారణంగా మీరు కథ రాస్తారు. అది ఎక్కడో ఒక చోట అచ్చవుతుంది. కానీ, ఏ పాత్రల్ని దృష్టిలో వుంచుకొని ఆ కథలు రాశారో ఆ పాత్రల గురించి మీ ఆలోచనలు మారిపోతాయి. అసలు ఆ పాత్రే కొత్త అవతారం ఎత్తుతుంది నిజ జీవితంలో!
ఇలాంటి అనుభవాలు మీకు తప్పనిసరిగా వుండే వుంటాయి. వాటిని క్లుప్తంగా రికార్డు చేయండి. మీ పాత్రల్ని కొత్తగా అన్వేషించండి.
300 పదాలకు మించకుండా మీ పాత్రల మారిపోయిన జీవితాల్ని గురించి రాయండి.
మీ రచన editor@saarangabooks.com కి పంపించండి.








Add comment