లాఖ్య రోడ్డు మీన నిల్వడి తనెదురుగా ఉన్న సిమెంట్ బెంచీనే చూస్త ఉన్నడు. గా సిమెంట్ బెంచ్ ఏపసెట్టు నీడల సేదదీరతా ఉన్నట్లు కన్పిస్తుంది. దాన్జుట్టూ చిందరవందరగా పడున్న ఏపాకులు, ప్లాస్టిక్కవర్లు జూస్తంటే గతంల తను గట్లాంటి సోట అన్నం దింటుంటే తనకి కనిపించిన నల్ల తేలు యాదికొచ్చింది. ఆ యాది అతన్కి తెల్వకుంటనే కళ్లలో బుగుల్బుట్టించింది.
కుడి భుజానికి ఓ పెద్ద బ్యాగ్. అందుల చీరలు, ఆడోళ్ల డ్రెస్సులు, పిల్లల బట్టలు ఉన్నై. ఎడం చేతిల రంగు రంగుల ఫ్రాకులు, ముక్క చీరలు ఏలాడుతున్నై. నిప్పులు గురుస్తున్న ఎండల గట్లనే నిల్వడి జూస్తా ఉన్నడు. మస్తు ఆకలి, దూపైతున్నట్లున్నదతన్కి. సిమెంట్ బెంచ్ ఎన్కనున్న ఇంట్ల బట్టలు ఉతుక్కుంటూ లాఖ్య అచ్చిన దగ్గర్నుంచి అతణ్నే గమనిస్తున్నది రాజేశ్వరి. బెంచ్ వైపు అతని కళ్ళు చాలా దీనంగా జూస్త ఉన్నై. ఎందుకో అనుమానమచ్చి ఇంట్లో టీవీ చూస్తున్న భర్త విజేయ్ని పిల్శి విషయం జెప్పింది.
లుంగీ మడ్సుకుంట అచ్చి “ఏయ్! ఎవల్నువ్వు? ఇంటి వైపు అరగంట నుంచి చూస్తున్నవంట. ఏం సంగతి? బట్టలమ్మే వానిలా మారువేషంల వచ్చిన దొంగవా? పోలీసుల్ని పిలవాల్నా?” గంభీరంగ అడిగిండు.
“అయ్యయ్యో అద్దు సార్! నేనేం దొంగన్గాను. ఆకలేస్తున్నది. మస్తు ఎండగుంది. గీ బెంచ్ మీన కూసోని తినాలనుకుంటున్న. మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నగనీ భయమేస్తున్నది. అన్నం తినొచ్చా సార్ బెంచీమీన గూసొని?” ఎప్పటిసందో కడుపుల దాచుకున్న మాటని అడిగిండు లాఖ్య.
విజయ్‌కి లాఖ్య పరిస్థితి సమజైంది. “దానిదేముంది? పిల్శడిగితే వొద్దంటమా తినొద్దని? బుగుల్వడుడెందుకు? పోయ్ కూసొని తిను” అన్నడు. ఆ మాట ఇనంగనే లాఖ్య మస్తు ఖుషీ అయ్యి బ్యాగు, చేతిలో శీరల్ని బెంచీమీనవెట్టి పక్కన్నే కూసున్నడు. శేతులు కడుక్కుందమని బ్యాగులకెల్లి బాటిల్ దీశి జూస్తే అది ఖాళీగున్నది. దగ్గర్లేమన్న కొట్టుడు పంపున్నదేమోనని కళ్లతో సుట్టుపక్కల దేవులాడిండు.
ఆలుమగలిద్దరూ జర్రంతసేపు లాఖ్యనే సూస్కుంట ఆడ్నే నిలవడ్డరు. ఎండ తాకిడి జూస్త, పోరగాని తాన నీళ్లులేవని గమనించిన విజేయి “రాజీ! ఇంట్లకొయ్యి ఫ్రిజ్లవి నీళ్లు దీస్కరా” అన్జెప్పిండు. ఆమె ఇంట్లకి పోయి బాటిల్ దెచ్చి లాఖ్య చేతికిచ్చింది. ఓ శిర్నవ్వుతో థ్యాంక్స్ జెప్పినట్టు ఆమె ముకందిక్కు జూశిండు. ఆ శెట్టు నీడల లాఖ్య ముఖం సంధ్యవేళ శెంద్రుడిలా కన్పించిందామెకి.
తను దెచ్చుకున్న అన్నం జూసి ఆళ్లు ఏమైనా అనుకుంటరని మొకమాటం పడ్కుంటా, ఇంట్లోకి పోతరేమోనని వాళ్ళ దిక్కే జూస్తున్నడు లాఖ్య.
“ఏమైనది తమ్మీ! తిను” అన్నడు విజేయ్.
లాఖ్య ఇంకా బయంతో వొణ్కుడు షురూ జేశిండు. మళ్లా నెమ్మదై “ఏమన్కోకుంట మీరు లోపల్కోయి మీ పనుల్జేసుకోండ్రి సార్. నేన్దింట” అన్నడు. అతని మాటలు ఏందో దాస్తున్నట్టున్నై.
“సరే! పోతంలేగని. నువ్వు తిను. కూరేమన్న కావాల్నా?” అడ్గిండు విజేయ్.
“నో థ్యాంక్స్ సార్” అన్నడు శిన్నగ ఆళ్ళ మంచితనం జూసి సంతోషపడ్కుంట.
ఇద్దరూ లోపల్కి పోయిర్రు.
ఆళ్ళు పోయిర్రని అన్కున్న తర్వాత తన బ్యాగులకెల్లి ఓ బుల్గురంగు ప్లాస్టిక్ కవర్ని బయట్కి దీశిండు. అందుల హైదరాబాద్ సిటీలల్ల అమ్మే ఐదు రూపాయల భోజనమున్నది. తనకి పరిచయం లేని ఓ మన్షిచ్చిన వాటిర్ బాటిల్ వంక ప్రేమగా జూస్త శెయ్యి గా సల్లటి నీళ్లతోనే కడుక్కున్నడు. ఇదంత కిటికీలకెల్ల జూశిండ్రు ఆలుమగలిద్దరు.
“పోరగాన్కి నిండా జూస్తే పదారేండ్లు లేనట్లు ఉన్నై. సద్వుకోకుండా గీ పని జేసుడేంది? గా అన్నం తినుడేంది” అన్కుంట ఇంట్లకెల్లి బయటకచ్చి, “ఔ తమ్మీ! నీ పేరేంది?” అనడిగిండు విజేయి భుజం మీన చెయ్యేస్త. రాజేశ్వరి కూడా భర్తెంబట అచ్చింది.
ఒక్కపారే ఆగమై వణుక్కుంటా “లాఖ్య సార్” అన్జెప్పిండు. ఆళ్లు సూడకుండ గా బుల్గు రంగు ప్లాస్టిక్ కవర్ని బట్టల్బాగులో దపాదప్న వెట్టిండు. కుడి చేయి ఎంగిలిగనే ఉన్నది.
గా పేరు విని, లాఖ్య శేతుల్కున్న పచ్చబొట్లు జూశి విజేయ్కి అతనెవరో సమజైనట్లు “లంబాడోల్లా? ” అన్నడు అతని పక్కన కూసుంట.
“ఔ సార్! నేను లంబాడీనే ”
“సద్వుకుంటలేవా? గీ పని జేస్తున్నవ్?”
“సద్వుకుంటున్న సార్. మొన్ననే పదో తరగతి అయిపోయింది కరోనల. పాలిటెక్నిక్ సద్వుదామన్కొని ఎంట్రెన్స్ రాశ్నా. అబ్దుల్లాపూర్మెట్ల సీటచ్చింది. అడ్మిషన్, హాస్టల్ ఫీజు కట్టనీకి పైసల్ లేకుంటే గీ పని జేస్తున్న సార్”
“గట్లనా… మీ అమ్మానాయన ఏం జేస్తరు?”
“మా నాయ్న నా శిన్నప్పుడే సచ్చిపోయిండు. మా అమ్మ తండాల ఉండుకుంట ముఠాలో కూలి పన్కిపోతది.”
ముఖం మీద నరాలన్నీ నుదుటి మీదకి దెచ్చుకుని “మళ్ళా నువ్వెందుకు హైదరాబాద్ అచ్చినవ్ మీ తండాలుండకుంట?” అనడ్గిండు.
“మా తండాల్ల మాకు భూములున్నగని అవంత సారవంతమైనవేంగాదు. ఎంతసేపు మావోళ్లు బత్కనీకి ముంబైకో, మెద్రాస్కో ఎటెటో కూలీనాలీ చెయ్యనీకి పోతుంటరు. అట్ల పోయినోల్లు తిరిగొచ్చిన దాఖలాలైతే లెవ్వు సార్. మా తండాల పద్నాల్గేళ్ళస్తె పెండ్లి జేస్తరు. మా నాయనకి గట్లనే జేసిండ్రంట. నాకూ జేస్తరేమోనని అనిపించుండె. నాకేమో సద్వుకొనుడంటే ఇష్టం సార్. పెండ్లి జేస్తే సద్వుకొనుడు జరగది గదా. గందుకే సిటీల సంపాదించి నెలనెలా ఇంటికి పైసలు పంపుతనన్జెప్పి అక్కడ్నుంచి హైదరాబాదచ్చేశ్న. సద్వుకుంట, సెలవల్ల ఈ పన్జేసుకుంట నెలనెలా ఇంత ఇంటికి పైసలు పంపిస్తుంట” అన్నడు.
“మరి మీ అమ్మ ఎట్లుంటుంది గాడ ఒక్కతే?”
“నాకో తమ్ముడున్నడు సర్. వాన్కి పదేండ్లుంటై. మా వూళ్ల బళ్లోనే సద్వుతున్నడు. వానితో కలిసి ఉంటది.”
“మరి మీవోళ్ళతో ఫోన్ మాట్లాడాల్నంటే ఎట్ల? ఫోనున్నదా?” ఆత్రుతగా అడ్గింది రాజేశ్వరి.
“ఒకప్పుడు ఉన్నది మేడం. నా పైసల్తో కొన్న. రెండు నెలల క్రితమే ఓ ఇద్దరన్నలు ముకాలకి దస్తీ గట్కొనొచ్చి, నేను ఒంటరిగా ఉండుడు జూశి నన్ను బెదిరించిర్రు ఫోనియ్యమని. ఇయ్యనన్న. కొట్టి లాక్కుపోయిర్రు. ఇగో ఈ దెబ్బ గుర్తులు గవే సార్” ముఖమ్మీన గాయంగుర్తులు జూపిస్త అన్నడు. అయ్యో అన్కున్నడు విజేయ్ మన్సుల.
“ఆళ్లు మామూలు సావు సావరు” అన్నది రాజేశ్వరి గరంగరమైత. కొంచెంసేపు నిశ్శబ్దం ఆవరించింది ఆడ.
“ఇందాంక ఎందుకు దొంగలెక్క భయవడ్డవ్ అన్నం దింటా అని అడ్గనీకి?” అడిగిండు విజేయ్.
“గదా సార్! నిన్న బట్టలు అమ్ముకుంట ఓ గల్లీల దిర్గుతున్నప్పుడు మా లంబాడామె ఒకామె మా బంజారా బట్టలు ఏస్కునున్నది. ఎడం సంకల పిల్లోణ్ని, తల మీద పండ్లున్న వెదురు తట్ట పెట్టుకుని అమ్ముకుంటున్నది. నాకు లాగనే వీధులు దిరుక్కుంట ఓ బల్లమీన కూసోని పిల్లోనికి పాలచ్చింది. పిల్లోడు పాలుతాగినంక, ఆకలైతున్నదని తట్టలకెల్లి అన్నం బాక్స్ దీశి తినుడు మొదల్వెట్టింది. గప్పుడే పిల్లోడు బాత్రూమచ్చి దానిమీదనే కూసున్నడు. అది జూశ్న అక్కడి ఇంటి వాచ్మెన్ ఆమెని ఒళ్ళు తుక్కుతుక్కు అయ్యేటట్లు కొట్టిండు. పోరగాన్ని నేలమీదకి ఇసిరేశిండు. ఆ బల్ల గట్టిచ్చిన ఇంటి ఓనర్ని పిల్శిండు. ఆ ఓనరు సద్వుకున్నట్టె ఉన్నడుగని, దయ లేనట్టున్నది.
“ఓసే లంబాడీ ముండా! నీకు, నీ కొడుక్కి ఏడా జాగ దొర్కలే? ఈడ్నే ఏర్గిచ్చినవ్. సస్తవ్ యిప్పుడ్నా చేతుల్ల గదంతా నీ బట్టల్తో సుబ్రం జేయకుంటే. మా నాయనమీన గౌరవంతోటి ఆ బెంచీ ఏయిస్తే గిట్ల గలీజ్ జేయిస్తవే బద్మాష్దానా” అని ఆయన గూడ చేయి జేస్కున్నడు.
ఆమెని, పోరడ్ని హీనంగా జూస్కుంట ఓనర్ జెప్పిండని ఓ ఎర్ర రంగు ప్లాస్టిక్ బకెట్ల నీళ్లు దెచ్చిండు వాచ్మెన్. ఆ బాయి గాయాలైన బాధతో ఏడ్సుకుంట, ఎంగిలి శేతితోనే పిల్లోని మలాన్ని అన్నం తింటున్న గిన్నెల్నే ఎత్తింది. వాచ్మెన్ దెచ్చిన నీళ్లతో బల్లంతా కడ్గి, తన బట్టల్తో తుడ్శింది. ఒంటినిండా మట్టంటకపోయిన ఆ శిన్నపిలగాని ఏడ్పు ఆ సుట్టుపక్కలంతా ఇన్పిచ్చింది. జనమంతా ఏం మాట్లాడకుంట అట్లనే జూస్తున్నరు. అక్కడ ఎవరో ఇంటామెకి బట్టలు జూపిస్త నేను గిది జూశ్న. అద్జూశి వెనక్కి తిరిగి మా తండాకి ఎల్లిపోదామన్కున్న. కానీ ఇక్కడ్దాకా ఒచ్చినోన్ని ఏం వెళ్తానని గమ్మునుండిపోయ్నా. ఇక్కడెవరైనా నన్ను కొడ్తరని బయపడిన సార్” అన్నడు అమాయకమైన ముఖంతోని. విజేయిచ్చిన బాటిలెత్తి మంచినీళ్లు తాగి శేయి కడుక్కున్నడు.
“ప్రపంచం క్రూరత్వంల ఉన్నది గని మరీ ఇంత క్రూరత్వంల ఏం లేదు” అన్నడు విజేయి.
“లేద్సార్. నేన్రోజూ పది గల్లీలు దిర్గుతుంట గదా! నేన్జూస్తుంట. మీరెందుకో నాకు మంచిగన్పిచ్చిన్రు. గందుకే గివన్నీ జెప్పిన మీకు”.
“హు! ముందిదైతే జెప్పు. బట్టలు అమ్మనీకొచ్చినోన్వి ఎందుకు అరుస్తలేవు?” మరో ప్రశ్న వేశిండు విజేయి.
“ఇందాక మీరే అనుమానపడ్డరు కదా సార్ నా మీన. గది తప్పని నేననను. గైతే బత్కుదెర్వు కోసం మొత్తుకున్నా ఈ రోజుల్ల కంప్లైంటిస్తున్నరు సార్ మా గల్లీలకొచ్చి న్యూసెన్స్ జేస్తున్నరని. గందుకే ఎవలైనా నన్ను జూశి పిలస్తరమోనని ఆశతో తిర్గుతున్న మొత్తుకోకుండా” అని బట్టలు సర్దుకుంటున్నడు. విజేయి ఆలోశనలో వడ్డడు. మొదట మాట్లాడిన మాటలు గుర్తు దెచ్చుకుని. “మరి వంట ఎట్ల జేస్కుంటవ్?” తన ప్రశ్నగా అడ్గింది రాజేశ్వరి.
కొంచెం మొహమాటం పడ్కుంటనే ఇందాక బ్యాగులో దాశిపెట్టిన బుల్గు కవర్ని బైటికి దీశి సూపెట్టిండు.
దరిద్రమైన బత్కులు, ప్రపంచంలనున్న క్రూరత్వానికి బలైన జీవితాలు మళ్ళీ తన పనికి ఆకలితోనే బట్టల్మీదేస్కుని పోతున్న లాఖ్యలో కన్పించినై ఆళ్లిద్దర్కీ.
*
అనుభవాలే కథలుగా రాస్తున్నా!
* హాయ్ లిఖిత్! మీ గురించి చెప్పండి.
మాది ఖమ్మం జిల్లా మధిర తాలూకా బనిగండ్లపాడు. ఇంటర్ దాకా అక్కడే చదివాను. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ఎమ్మే తెలుగు చేస్తున్నాను.
* సాహిత్యంపై ఆసక్తి ఎలా కలిగింది?
నాలో సాహిత్యంపై ఆసక్తి కలగడానికి కారణం మా నాన్న వెంకటపతి. చిన్నప్పుడు నేను ఒక పిల్లల పత్రిక అడిగితే ఆయన నాలుగైదు తెచ్చి నా చేతికిచ్చేవారు. నన్ను బాగా ప్రోత్సహించారు. గతేడాది మేలో ఆయన చనిపోయారు.
* కథల ప్రయాణం ఎలా మొదలైంది?
ఏడో తరగతిలో మా స్కూల్‌కి పోతగాని సత్యనారాయణ అనే కవి వచ్చారు. ఆయన ముందు మా ఫ్రెండ్స్ కొన్ని కవితలు వినిపించారు. నాకూ అలా ఏదైనా రాస్తే బాగుంటుందని అనిపించింది. అదే సమయంలో పిల్లల మాసపత్రిక ‘బాలభారతం’ చదువుతూ ఉండేవాణ్ణి. దానికి కథలు రాసి పంపాలనుకున్నాను. ‘హరితహారం’ పేరిట రాసిన తొలి కథ 2016 డిసెంబర్‌లో ప్రచురితమైంది. అలా దాదాపు 30 దాకా పిల్లల కథలు రాశాను. ‘మొలక’ అనే వెబ్ పత్రికలోనూ ఆ కథలు ప్రచురితమయ్యాయి.
* మీరు చేతి రాత పత్రిక నడిపారు కదా! దానికి ఆలోచన ఎలా వచ్చింది?
ఫేస్‌బుక్‌లో సాహిత్య ఆసక్తి ఉన్న కొంతమందిమి కలిసి ‘పలక’ అనే చేతిరాత పత్రిక మొదలుపెట్టాం. ఆరు మంది సభ్యులు. అందులో ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. పవిత్ర అనే అమ్మాయి బొమ్మలు వేసేది. 2021 జూన్‌లో తొలి సంచిక తెచ్చాం. ఎనిమిది సంచికలు తయారు చేశాం. ఆ తర్వాత మేమంతా చదువు కోసం వేర్వేరు ప్రాంతాలకు రావడం వల్ల ఆ పత్రికను ఆపేయాల్సి వచ్చింది.
* మీకు నచ్చిన రచయితలు?
గాబ్రియేల్ మార్క్వెజ్, చెహోవ్, రస్కిన్ బాండ్, గోపిని కరుణాకర్, సంక్రాంతి విజయ్‌కుమార్, ఎండపల్లి భారతి, సమ్మెట ఉమాదేవిల రచనలు చాలా నచ్చుతాయి. శ్రీకాంత్ గారి కవిత్వం చాలా ఇష్టంగా చదువుతాను.
* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?
బాలసాహిత్యం కాకుండా ఇప్పటిదాకా ఏడు కథలు రాశాను. అయితే ఎక్కడా ప్రచురించలేదు. వాటిని మరింత ప్రభావవంతంగా రాయాలని ఉంది. అలాగే నా ఇంటర్మీడియట్ అనుభవాలను కథలుగా మలచాలని ఉంది.
*
Very touching story.