రికార్డు జాతి

    నేను Inland Immigrantని ఎందుకంటే నాన్న(రవి) పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ చాలు ఉంటున్న ఊరు పర్మినెంట్ అడ్రసు అవుతుందనే తరుణంలో టెంపరెరీ చిరునామాగా మారిపోయేది.అందుకే నేను ‘ఫలానా ప్రాంతానికి మాత్రమే చెందినవాడినని’ చెప్పి ఒకే ఊరికో లేక ప్రాంతానికో నన్ను నేను confine చేసుకోలేను. అయినా పుట్టిన ఊరిలో S/o బుజ్జమ్మ అంటారు. నాన్న ఉద్యోగరీత్యా ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలో నా బాల్యం గడిచింది.
      దాదాపు మూడు దశాబ్దాల నుండి తెలుగు సాహిత్యానికి మా ఇంటికి ఆత్మీయత ఉందనే చెప్పాలి. తెలుగులో క్లాసిక్స్ నేను చదవక మునుపే నాన్న గొంతులో ఆ వాక్యాలను వినేవాడిని. అప్పటికి పూర్తిస్థాయిలో అర్థంకాకపోయినా, ఇప్పుడు గుర్తుచేసుకుంటే ఇస్మాయిల్ (గారి) కవితల్లో ఈ లైన్ ‘మోహానికి/మోహరానికీ/రవంతే తేడా’ (Make Love, Not War) నాలో చెక్కుచెదరలేదు. మన అఫర్ గారి ‘అణగిపోయిన దేహాలకు/ నలిగిపోయిన కంఠాలకు/ పోరాటం సిద్ధాంతం కాదు, బతుకు పాఠం!’ మీద జరిగిన అనగనగా ఓ రాత్రి  చర్చ. అట్లా అప్పుడెప్పుడో అచ్చయిన సాహిత్యం నుండి ఇప్పుడిప్పుడే వస్తున్న వాటి వరకు చర్చలు జరుగుతుంటాయి. సీతారాం గారి ‘ఇదిగో…ఇక్కడిదాకే’ సంపుటి చాలా కొంత మంది దగ్గర అమూల్యంగా ఉంటుంది. వీటి నడుమ గద్దర్ నుంచి కలేకూరి మీదుగా జయరాజు గార్ల పాటలు కూడా వినిపించేవి. మద్దూరిని తెరేష్ బాబుని చెప్పడం మరిస్తే నా మెమోరీ తగ్గినట్లే కదా! కథల సంగతి చెప్పడానికి చాలానే ఉంది.
      నేను, మా తమ్ముడు గౌతమ్‌ దేవ్ ఇద్దరం సివిల్ ఇంజనీరింగ్ చదివాము.కొంత నాన్న మరికొంత మేం చదువుకున్న ‘కవిరాయని పబ్లిక్ స్కూల్’ ప్రిన్సిపాల్ & సెక్రెటరీ శ్రీ GCVS సుబ్బారావు గారు కూడా సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు అవ్వడం కూడా ఒక కారణం. అతని చదువును passion కోసం ఉపయోగించి, దగ్గరుండి స్కూల్ ప్లానింగ్ నుంచి కన్‌స్ట్రక్షన్ వరకు అన్నీ తానై నడిపించారు.
      2018లో ‘నడిచే దారిలో…’ అనే కవితా సంపుటిని ప్రచురించాను. నన్ను చిన్నప్పటి నుంచి ఆలోచింపచేసిన ప్రతీ అంశాన్ని కవిత్వంగా మార్చాను, మారుస్తాను. నా భాష ఎక్కడినుండో import చేసుకున్నది కాదు, నేను ఇట్లానే మాట్లాడతాను.నా వాడుకభాషలోనే రాస్తాను.

రికార్డు జాతి

 

ధార్ చేతి వేళ్లకు
మన తోలుబొమ్మలాట తాళ్లు
కనుపాపలు హత్తుకునే సమయం
కుదించబడింది.
ఇప్పుడు.. అప్పటిలాగే
కోడి కూత వినిపించక మునుపే
పెరిగెడుతుంది నరుల లోకం
పల్లెల్లో పొలాల సద్దిమూటలో
నాలుగు ముక్కలుగా చీల్చిన
ఆ ఉల్లిపాయ నంజుక కోసం
నగరం ఉలిక్కిపడి లేస్తుంది.
రైతులు పెద్దగా కనిపించరు
ఆ పాత్రను పోషించే వాళ్ల
కొట్టుల కొలువులు హౌస్ ఫుల్
అనగనగా ఓ రైతు బజారు
రైతులను మాయం చేసే
దళారీ మాంత్రికుడి స్థావరం.
ఇప్పుడు…అప్పటిలాగ
పార్కులలో వాకింగ్ ట్రాక్ మీద
జిమ్స్ లో ట్రెడ్ మిల్ పైన
నడవడం తగ్గించి
ఇంటి నుంచి సబ్సీడీ ఉల్లి కౌంటర్ వరకు
ఒక ల్యాప్
ఇక్కడ ‘క్యూ’లో నిల్చుని నిల్చుని
వెన్నుముక నిటారుగా
దానంతట అదే సర్దుకుని
నత్త నడకన ముందుకు వెళ్తుంది
Stiff spineతో ఎముకల డాక్టర్ కు దగ్గరగా
జరుగుతుంది జీవితం.
చలికాలంలో
శరీరానికి చెమట పట్టించే
తెలుగు సినిమా ఇంటర్వెల్ కి
జేజెమ్మ
క్షణక్షణానికి మారుతున్న ఉల్లి రేటు.
స్కూల్ లో
Onion సెల్స్ మైక్రోస్కోప్ లో
చూడడానికి
Safranin సొల్యూషన్ లో
స్టైన్ చెయ్యడం గుర్తు
ఆ ప్రయోగాన్ని ఓవర్ స్టైన్ చేసి
ఇక్కడ ఉన్నవాళ్లు విఫలం అయినట్లున్నారు
అందుకే ఇలా
ఈ లైన్ లో పడిగాపులు.
‘ఎప్పటి లెక్క అప్పటికి అప్పుడే’
అనడం‌ వింటూ పెరిగాం కదా!
ఇంత కథ చెప్పిన
మాస్టారి తరుణం వచ్చింది
‘ఫోన్‌లో ఆధార్ స్క్రీన్ షాట్ చెల్లదు’
అన్నాడు.
E-అభివృద్ధి అంటే ఈ అభివృద్ధేనా?
ఇంతకు చెప్పడం మరిచాను
Safranin సొల్యూషన్ రంగు
కొంత అటు ఇటుగా కాషాయం
మోతాదు ఎక్కువైతే
జీవకణాలు కంటికి కనిపించవు
జీవితంలో కూడా
ఆ కాషాయపు Safranin
మోతాదు పెరిగితే
‘సత్యమేవ జయతే’ మనుగడ
ప్రశ్నార్థకంగా మారిపోతుందేమోనని
భయం.
కొంత మనస్సులపై వాడిపోకుండా
ఆ తెల్లటి glycerine వెయ్యాలి
ఎప్పుడో ఒకసారి
నిన్ను నీవు తడుముకుంటే
కొంత సజీవంగా
మరికొంత సహజంగా
నీకు నీవు అనిపించాలి.
ఏ సొల్యూషన్
ఏ రంగో
తెలుసుకోవడంలో తప్పులేదు
వర్ణం మీద వర్గాలు
సృష్టించిన రికార్డు జాతి మనది.
*
ఈ కవితా నేపథ్యం…
 
  ఇది ప్రజాస్వామ్యం చరిత్రగా మారిపోయి రాజకీయస్వామ్యం నడుస్తున్న గడ్డుకాలం.మరి ప్రభుత్వాలు కాకుండా పార్టీలు దేశాలను పాలిస్తున్నప్పుడు ఇట్లాంటి కవిత్వం రావాలి, వచ్చి తీరుతుంది కూడా.ఇంకా రాతియుగం, కత్తి యుద్ధాల గురించి చదువుకుంటూ కూర్చుంటే భవిష్యత్తుకు అవసరమైన వాటిని ఎప్పుడు నేర్చుకోవాలి? చిన్ననోటు తీసుకువెళ్ళి పెద్దసంచి నిండా నిత్యావసరాలు తెచ్చుకున్న రోజులను చరిత్ర పాఠ్యాంశంగా కంటెంట్‌ ని అప్డేట్ చెయ్యాలి. మన దేశంలో వంద పైసలు ఒక రూపాయి, అదే మనల్ని పరిపాలించిన దేశంలో వంద బ్రిటీష్ పెన్నీ ఒక పౌండ్.ఇప్పటికీ వాళ్ల దేశంలో వాడుకలో ఉన్నాయి, కానీ మన దేశంలో 21వ శతాబ్దంలో పుట్టిన వాళ్లు మన పైసా నాణేలను చూసుండరు.అంతెందుకు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరో గుడిమెట్ల మీదో రూపాయి కాసును ఇచ్చి చూడండి, వాళ్లే అంతో ఇంతో మీరిచ్చిన దానికి కలిపి తిరిగిస్తారు. మన RBI పది రూపాయల కాయిన్ చెల్లతుందని చెప్తున్నా చిల్లర కొట్టు దగ్గర చెల్లదు. ఈ ఉదాహరణ చాలా మన ఆర్థిక వ్యవస్థ మీద పరిపాల’కుల’కు ఉన్న అవగాహన చెప్పడానికి?
 ‘రికార్డు జాతి’ అనే ఈ శీర్షికలో Stiff Spine అనే పదం వాడడం జరిగింది. కానీ నేను BiPC విద్యార్థిని కాదు. అయినా స్కూల్ ల్యాబ్ లో ఒక Skeletonతో పాటు Anatomy బొమ్మ కూడా ఉండేవి. అప్పుడు అడిగిన ప్రశ్న ఇంకా గుర్తే ‘Why Spinal Cord’s Lumbar isn’t Straight?’ దానికి ఆ మేడం Cervical నుండి Coccygeal వరకు చెప్పారు.
     ఈ కవితలో ‘Onion Cells, Microscope, Safranin Solution, Glycerine, Slides’ అనే పదాలను ఉపయోగించాను.ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు ‘ఎప్పుడైనా ఈ కవి వీటిని కనీసం చూసాడా?’ అని.నా‌ నేపథ్యంలో చెప్పడం జరిగింది నేను చదువుకున్న చోట హైస్కూల్ స్థాయిలోనే పైవాటితో పాటు Petri dishes, Dyes, Indicators, Forceps, Beakers, Test tubes and Flasks ఉపయోగించి ప్రయోగాలు చెయ్యడం జరిగింది. ఉల్లి రేటు చూసి కవిత్వం రాయడానికి నిర్ణయించుకున్న తరుణంలో ఆ రోజు చేసిన experiment గుర్తుకొచ్చింది.
    GCVS సుబ్బారావు, వరలక్ష్మి గార్లు ఆనాడు Quality and Practical చదువు చెప్పడం వలన వృత్తిపరంగా & ప్రవృత్తి అయిన సాహిత్యానికి కూడా ఉపయోగపడుతుంది.

Surendra Dev Chelli

Honestly,The toughest part at the moment is to write a self introductory note. Though I have registered as Surendra Dev Chelli on records but, my mates like to crack the shell of a nut gently as per their phonetic convenience. Previously published collection of poems in Telugu as “Nadiche Daarilo”, currently living in UK and working as a Dispensary Manager after Post Graduation in Business. The ambience of literature is a constant source of motivation to walk in the unknown frontiers without fear and record the memoir to recollect the best part of the life lived so far.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వర్తమాన విషయాలకు వాస్తవికమైన భౌతిక సంఘటనలను రాజకీయ నేపథ్యంలోంచి కుల కలకలాన్ని రేపే ఆధునిక కోణంలోంచి నీదైన శైలి,భాషలోంచి విశ్లేషణాత్మకంగా చెప్పడం కొత్త దృక్కోణాన్ని బలపరుస్తోంది. ఈ అంశాన్నే సామాజికాస్త్రంగా ఉపయోగించడం వ్యాసాన్ని పరిపూర్ణవంతం చేసింది. నీ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తూ…

    • మీ స్పందనకు ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు