యుద్ధం!
“యుద్ధం చెయ్యాల్సిందే!”
“అలాగే చేద్దాంగాని, అసలు యుద్ధం అంటే యేమిటి?”
“యుద్ధమంటే యుద్ధమే…”
“సరే, యుద్ధం చేస్తే వచ్చే కష్టనష్టాలు తెలుసా?”
“మనకన్నా వాళ్ళకే యెక్కువ కష్టం యెక్కువ నష్టం…”
“పోనీ యుద్ధంవల్ల మనదేశంలోనూ ప్రాణనష్టం ఆస్తినష్టం…”
“జరిగితే జరగనీ… మనకన్నా వాళ్ళకే యెక్కువ…”
“రోజుకు సుమారుగా అయిదు వేలకోట్లు ఖర్చవుతుంది…”
“ఖర్చయితే అవనీ, మనకన్నా వాళ్ళకే యెక్కువ…”
“వాళ్ళు యెలాగూ నాశనమయిపోతున్నామని న్యూక్లియర్ బాంబ్ వేస్తే?”
“వేస్తే వెయ్యనీ, మనదేశంలో వుండే హిందువులందరూ వుచ్చపోస్తే చాలు పాకిస్తాన్ కొట్టుకుపోతుంది!”
“……………………….?!?……………………….”
దేశభక్తి!
‘దేశభక్తి అంటే యేమిటి?’ అని వో యూట్యూబ్ ఛానెల్ జనంలో పడి వొపీనియన్స్ కలెక్ట్ చేస్తోంది.
ఎదురుపడిన దంపతులని అడిగితే, “లేడీస్ ఫస్ట్,” అని భర్తని మోచేత్తో వెనక్కినెట్టి “ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని… అని గురజాడ అప్పారావుగారన్నట్టు…” చెపుతున్న భక్తురాల్ని భర్త ఆపబోయాడు. “మీరాగండి, మొన్నే పవన్ కళ్యాణ్ వీడియో చూశాను, నాకు గుర్తుంది,” కసురుకొని, “భూమి భారతిని యెందుకు పొగడాలంటే, మనదేశంలో యెన్నో గుళ్ళూ గోపురాలూ పుణ్యక్షేత్రాలూ వున్నాయి కాబట్టి. గోవుని పూజిస్తాం కాబట్టి. దేశం కూడా దైవంలాంటిది కాబట్టి. అటువంటి దేశంపట్ల భక్తిని కలిగి వుండడమే దేశభక్తి!” అని జ్ఞానకాంతులీనుతూ వెలిగిపోతున్న కళ్ళతో చూసింది భక్తురాలు, యింకా అడగండి అన్నట్టు. “మీరు మీ దేశభక్తిని యెలా చూపించుకుంటారు?” గొట్టాం నోటికి ఐస్‌క్రీమ్ అందించినట్టు అందించాడు ట్యూబర్. “వారాన్ని బట్టి అంటే రోజుని బట్టి ఆదివారం సూర్యనారాయణస్వామి, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు…” చెపుతుంటే మధ్యలో “అర్థమైంది,” అన్నాడు ట్యూబర్. “టెంకాయ కొట్టి అగరువత్తులు వెలిగించి లక్షవత్తుల నోము యింకా గో పంచకం…” చెపుతుంటే ఎపిసోడ్ అయిపోయేలా వుందనేమో, గొట్టాంతీసి మరొకరి నోటిముందు పెట్టాడు ట్యూబర్.
“దేశభక్తి అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చెయ్యడం!” బోర విరిచి చెప్పాడో కుర్రాడు.
“సింపుల్‌గా పాకిస్తాన్ని మేప్‌లోంచి తీసేయ్యాలె, గదే దేశభక్తి!’ చాలా ఆవేశంగా అన్నాడు మరో కుర్రాడు.
“దేశభక్తి అంటే…” ట్యూబర్ అడక్కముందే “భార్త్ మాతాకీ జ్జెయ్య్…” అరిచిందో నూనూగు మీసం.
“మీ దేశభక్తిని యెలా చూపించుకుంటారు?” యేదో వొకటి మాట్లాడాలన్నట్లు ట్యూబర్ అడిగాడు.
“క్రికెట్లో గెలిచి! పాకిస్తాన్ మేచిల ఇండియా గెలిస్తే, ఖతం. అప్పుడే మనం విన్ అయితాం…” అందో లేత గడ్డం.
“కశ్మీరులో త్రీసెవెంటీ యాక్ట్ రద్దు చేయడమే దేశభక్తి!” అందో కర్లింగ్ హెయిర్.
“సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్… యిదంతా దేశభక్తే!” అందో కళ్ళజోడు.
“భారతదేశంలో వుంటూ హిందూమతం పాటించని వాళ్ళని పాకిస్తాన్‌కు పంపించడమే నిజమైన దేశభక్తి!” అందో కండువా.
“పహల్గామ్‌లో మతం అడిగి కాల్చినట్టు మనమూ మతము అడిగి కాల్చేయాలి!” బొట్టుగలవాడు అని నాలుకను గట్టిగా పల్లతో కొరికి వుద్రేకంగా చూశాడు.
“ఇదీ దేశభక్తి!” అని అందరూ అతణ్ణి యెత్తుకు జైజై నినాదాలు చేశారు!
దేశద్రోహం!
అంకం-1
“యుద్ధాలు శవాలనూ శకలాలనూ మిగులుస్తాయి కాని శాంతిని కాదు,” అని ఫేస్‌బుక్కులో పోస్టు పెట్టింది ఆమె.
“మీయింట్లో వాళ్ళని కాల్చి చంపితే తెలిసేదే ముండ,” అన్నారు. “ముందు దీన్ని కాల్చి పగలమింగాలి,” అన్నారు. “యుద్ధం వద్దంది యెందుకో తెలుసా?, యీ ముంజ పాకిస్తాన్ ఏజెంట్,” అని కూడా తేల్చేశారు. “రెండున్నరయేళ్ళ క్రితం ఆమె వాఘా బార్డర్ ద్వారా సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు వెళ్ళింది, ఎందుకోసం వెళ్ళింది? ఎవరిని కలిసింది? వివరాలు బయటపెట్టాలి…” అని దేశభక్తులు అంతా ఫేస్‌బుక్కుల్లోనూ ఇన్స్టాగ్రామ్‌ల్లోనూ చేతికొచ్చింది రాయడమే కాదు, యూట్యూబుల్లో నోటికొంచ్చింది వీడియోలు చేసి పెట్టారు.
దేశద్రోహం కేసు ఆమె మీద నమోదు చెయ్యాలని డిమాండ్‌లు వెల్లువెత్తాయి.
దేశద్రోహం కేసు ఆమె మీద పెట్టినా పెట్టకపోయినా దేశభక్తుల దృష్టిలో ఆమె దేశద్రోహి అయ్యింది.
అంకం-2
“దౌత్యం, చర్చలే ప్రాధాన్యంగా వుండాలి తప్ప యుద్ధం కాదు. యుద్ధం బాలీవుడ్ సినిమాల్లో కనిపించినట్టు ఆకర్షణీయంగా వుండదు. దాని ప్రభావం చాలా తీవ్రంగా వుంటుంది. ప్రియమైనవాళ్ళని కోల్పోయినవాళ్ళకే బాధ తెలుస్తుంది. యుద్ధం నివారించడానికే మనం మొగ్గు చూపాలి!”
భారత ఆర్మీ మాజీచీఫ్ వొకరు అనేసరికి “నువ్వు సర్వీసులో వుండగా వుద్యోగం యెప్పుడైనా చేసావురా బాడకావ్,” అన్నారు. “ఇప్పటివరకూ యెంత సాలరీ తీసుకున్నావో మొత్తం కక్కు నా కొడకా,” అన్నారు. “వీడు ఖచ్చితంగా పాకిస్తాన్‌వాడికి పుట్టివుంటాడు,” అని కూడా అన్నారు.
దేశద్రోహం కేసు అతని మీద పెట్టాలని సోషల్ మీడియా మారుమోగిపోయింది.
దేశద్రోహం కేసు అతని మీద పెట్టినా పెట్టకపోయినా దేశభక్తుల దృష్టిలో అతను దేశద్రోహి అయ్యాడు.
అంకం-3
పాకిస్తాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ వొప్పందంపై భారత విదేశాంగ కార్యదర్శి అధికార ప్రకటన చేశాడు. యుద్ధం లేదని తన సొంత అభిప్రాయం కాకుండా, ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే చెప్పాడు.
అంతే, పాపం వొక్కసారిగా దేశభక్తిని నిరూపించుకొనే అవకాశం కోల్పోయారు భక్తులు.
భారత విదేశాంగ కార్యదర్శిని దేశద్రోహి అన్నారు. కుట్రదారు అన్నారు. కూతురు పౌరసత్వాన్ని సయితం ప్రశ్నించారు. భార్యనీ వదల్లేదు. ఫోను నంబర్లు కూడా సర్క్యులేట్ చేశారు.
పాకిస్తాన్ మీద చెయ్యాలనుకున్న యుద్ధం అతనిమీద చేసేశారు.
అతను భారతీయుడే అయినా పాకిస్తానీలా చూశారు. కాదు, వుగ్రవాదుల పక్కన చేరిన వుగ్రవాదిలా చూశారు.
అంకం-4
యుద్ధానికి కాలు దువ్వుతున్న దేశభక్తుల కాళ్ళని విరిచేసినట్టయింది. ఎవరో కనిపించని సంకెళ్ళు వేసి కట్టేసినట్టయింది. పాక్‌వాళ్ళ ప్రాణాలు తియ్యడంలోనే మనదేశానికి ప్రణవ హారతి పట్టినట్టు అవుతుందని అనుకున్నవాళ్ళకి ఆయువు ఆపేసినట్టుగా అయింది.
“యుద్ధం యెందుకు ఆగిపోయింది?” తర్జనభర్జనలు పడుతూ చాలామంది భక్తులు గిజగిజలాడారు. గింజుకున్నారు.
“యుద్ధం వద్దు అని మనదేశం నిర్ణయం తీసుకుందా?”
“లేదు, తీసుకోలేదు, కాని నిర్ణయానికి కట్టుబడింది,”
“అదేంటి? పాకిస్తాన్ యేమంది?”
“ఏమీ అనలేదు, తనూ నిర్ణయానికి కట్టుబడింది,”
“అసలేమైంది?”
“ఏమవలేదు!”
“ఏమీ కాకుండా యుద్ధమెలా ఆగిపోతుంది?”
“ఆగిపోయింది,”
“మన రెండుదేశాలు కొట్టుకుచస్తే, యెవడికైనా యేమిటి నొప్పి?”
“అదే కదా, మన చావు కూడా మనల్ని చావనివ్వడం లేదు!”
“కాదూ మనలో మనమాట, యెవడైనా న్యూక్లియర్ బాంబ్ వదులుతాను అనిగాని అన్నాడా?”
“లేదు, యే క్షిపణులూ వెయ్యలేదు, వొక్క గుండు కూడా గురి పెట్టలేదు!”
“హౌ?”
“చిన్న ట్వీట్!”
“వాట్?”
“యెస్, యిదిగో ఆ ట్వీట్…”
“After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a FULL AND IMMEDIATECEASEFIRE. Congratulations to both Countries on using Common Sense and Great Intelligence. Thank you for your attention to this matter.”
“ఒక్క ట్వీట్‌కు యెగిరెగిరి పడ్డ మనవాడు కూడా మూసుకున్నాడు…”
“మనదేశానికి ప్రధాని యెవరు? మోడీనా… ట్రంపా?”
“ప్రపంచ ప్రధానిమాట యే ప్రధాని అయినా వినాల్సిందే!”
అంకం-5
“యుద్ధాల యుగం కాదు యిది. ఉగ్రవాదానికి కూడా కాలం కాదు యిది. ఆపరేషన్ సిందూర్ అనేది వొక ఆపరేషన్ కాదు, కోట్లాది పౌరుల భావోద్వేగాల ప్రతిబింబం…”
వీడియో చూస్తూ “మొత్తానికి యుద్ధం వద్దు అంటున్నారు, అంతేనా?” అన్నాడో భక్తుడు.
“ఔను, అతను మన శాంతిదూత!” అన్నాడు మరో భక్తుడు.
“ఇప్పుడేమి చేద్దాం?” అనేకమంది భక్తుల అనుమానం.
“యుద్ధం ఆపేశారేమని ప్రశ్నించినవాళ్ళమీద దేశద్రోహం కేసు పెట్టాలి!” నాయకులందరిదీ వొకే మాట.
“యుద్ధం చెయ్యడం వుగ్రవాదుల సంస్కృతి. ఉగ్రవాదం యింకా చర్చ వొకే సమయంలో సాధ్యం కాదు. ఉగ్రవాదం వాణిజ్యం కలిసి నడవలేవు. నీరు మరియు రక్తం కలిసి ప్రవహించలేవు. బుద్ధుడు మనకు శాంతిమార్గం చూపించాడు. మానవతా విలువలు, శాంతి, సంపద వైపు ప్రయాణించాలంటే…”
దేశానాయకుని మాటలకే దేశభక్తులూ కోరస్ యిస్తున్నారు!
రాజనీతి శాస్త్రం!
“యుద్ధం యెప్పటివరకు వుండొచ్చు?”
“పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేవరకు!”
“అంటే?”
“ఉగ్రవాదుల్ని పూర్తిగా యేరివేసేవరకు!”
“అంటే యెంత కాలం పడుతుంది?”
“అదెలా చెప్పగలం?”
“ఒక అంచనా వుంటుంది కదా?”
“అక్టోబర్ ఆర్ నవంబర్ అని ఎక్ష్‌పెక్ట్ చేస్తున్నారు…”
“అదేంటి, అప్పుడే కదా బీహార్ ఎలక్షన్స్…?”
“అబ్బా… యెంత మాంసం తిన్నా, యెముకలు మెళ్ళో వేసుకున్నట్టు మాట్లాడకూడదు!”
“అర్థమయింది?!”
“ఫ్లాష్ న్యూస్… యిప్పుడే ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించాడు?”
“ఆయనకివన్నీ తెలీవుగా?”
“పర్లేదు, రావలసిన మైలేజీ వచ్చేసిందిలే!”
“ఎన్నికలకు మద్యం, మనీ యెవరైనా ఖర్చు పెడతారు…”
“కరెక్ట్, మతాన్నీ దేశభక్తినీ వాడేవాడే అసలైన నాయకుడు…”
“అది సరే, టెర్రరిస్టులు టైమ్‌కి కాల్పులు జరిపి కోపరేట్ చేయడమేమిటి?”
“అలాంటివి మాట్లాడకూడదు!”
“ఓకే, బట్… నాకర్థం కాలేదు?!”
“మంచివాళ్ళకు మంచివాళ్ళు సాయపడతారని పెద్దలు చెప్పారు!”
“మంచివాళ్ళెవరు?”
“నువ్వూ… నేనూ! ముయ్…”
“……………………………….”
టైటిల్ వార్!
యుద్ధం యిప్పుడు బోర్డర్‌లో ఆగిపోయింది.
సినిమా రిజిస్ట్రేషన్ ఆఫీసులముందు మొదలయింది.
ఒకే టైటిల్ కోసం అంతా క్యూలు కట్టి కొట్టుకు చచ్చేలా వున్నారు. అందరికీ ‘ఆపరేషన్ సిందూర్’ కావాలి. యుద్ధం యిచ్చిన అవకాశాన్ని వదులుకుంటే అదృష్టాన్ని వదులుకున్నట్టేనని, ‘వార్ యీజే ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్’ అని యెరిగినవాళ్ళు యెలాగోలా టైటిల్ సాధించాలని గట్టిగానే పట్టుబట్టారు.
అలా రిజిస్టర్ అయిన టైటిల్స్ కొన్ని.
‘ఆపరేషన్ సింధూర్’ ద వొత్తుగా బుల్లెట్.
‘హమారా ఆపరేషన్ సిందూర్’కు ట్యాగ్ లైన్ ‘పాకిస్తాన్ ఖబడ్దార్’.
‘దేశభక్త ఆపరేషన్ సిందూర్’ ఎట్ ది రేట్ ఆఫ్ పహల్గావ్.
‘హిందూ సిందూర్ ఆపరేషన్’ భారత్ మాతాకీ జై.
‘ఆపరేషన్ పవిత్ర్ సిందూర్’ ‘ఆపరేషన్ జై జవాన్ సిందూర్’ ‘ఆపరేషన్ గాయ్ సిందూర్’ ‘ఆపరేషన్ గోవ్ సిందూర్’ ‘ఆపరేషన్ కమల సిందూర్’ ‘ఆపరేషన్ దేశ్ సిందూర్’ ‘ఆపరేషన్ అగ్ని సిందూర్’ …………….
ఇంటెలిజెంట్స్!
‘ఇది ఇంటలిజెన్స్ వైఫల్యం’ అని చాలామంది విమర్శించేసరికి, ఆ శాఖ అలా అన్నవాళ్ళ మీద నిఘా పెట్టింది.
మైసూరుపాకు, తమలపాకు, కరివేపాకు కొంటున్నవాణ్ణి తీసుకెళ్ళి బొక్కలో వేసింది. ‘పాక్ ప్రేరిపితుడు’గా కేసు నమోదు చేసింది.
పైగా వాళ్ళ పిల్లలు కూడా ‘ఆక్ పాక్ కరివే పాక్’ అని ఆడుతున్నారని, యింతకన్నా సాక్ష్యం యేమి కావాలని గట్టిగానే బుద్ధి చెప్పింది.
వాటర్ వా(ట)ర్!
వాట్సప్‌ల్లో విజయాన్ని షేర్ చేసుకుంటున్న వేళ. పాకిస్తాన్‌కు నీళ్ళు వెళ్ళకుండా కట్టేసిన వేళ. పాకిస్తాన్ వాళ్ళకి ముడ్లు యెండిపోతున్నాయని ముచ్చట పడుతున్న వేళ. వాళ్ళు గొంతెండి చావాలని గొంతెత్తి అరుస్తున్న వేళ…
గొంతెత్తి అరచింది బామ్మ.
“ఏమ్మా?”
“మంది పాకిస్తానా ఇండియానా?”
“ఏం?”
“మనకి నీళ్ళు రావడం లేదు?”
అంతే, “యిది పాకిస్తాన్ కుట్ర!” యింటిల్లిపాదీ దేశభక్తితో అరిచాం!
ప్రహేళి!
“నాన్నా నాన్నా… పహల్గామ్‌లో కాల్పులు జరిపింది వుగ్రవాదులు కదా?”
“ఔను,”
“నలుగురే కదా?”
“ఔను,”
“సింధూ జలాల వొప్పందం రద్దు చేస్తే, పాకిస్తాన్ ప్రజలకు నీళ్ళు వుండవు కదా?”
“ఉండకూడదనే…”
“ఉగ్రవాదులు కాల్పులు జరిపితే అక్కడి ప్రజలందరికీ నీళ్ళు అందకుండా చెయ్యడం కరెక్టేనా?”
“కరెక్టే, అక్కడి ప్రజల్లో వుగ్రవాదులు కలిసిపోయి వుంటారు కదా?”
“ఓహో అక్కడి ప్రజల్ని చంపేస్తే, ప్రజల్లో కలిసిపోయిన వుగ్రవాదులు కూడా చచ్చిపోతారన్న మాట!”
“ఊ!?”
“నాన్నా ఆపరేషన్ సిందూర్‌తో వుగ్రవాదులందర్నీ చంపేశాం అని ప్రైమ్ మినిస్టరు చెప్పారు కదా?, మరి యిప్పుడు నీళ్ళిస్తారా?”
“ముందెళ్ళి నాకు నీళ్ళు తీసుకురా!”
శాంతి దూతలు!
“ఎవరు శాంతిదూత?”
“గాంధీజీ…”
“ప్రెజెంట్ యెవరని?”
“ఊ… మన ప్రధాని మో…”
“నో, ఆయన యుద్ధం యుద్ధం అని పలవరించారు కదా?”
“ఇప్పుడు యుద్ధం వద్దని దేశానికి శాంతి సందేశం యిచ్చారు కదా?”
“ఆ… యిచ్చారు, యెవరివల్ల?”
“అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌వల్ల,”
“సో… ప్రపంచ శాంతిదూత ట్రంపే!”
“మరి ఇజ్రాయిల్‌కి ఆయుధాలిచ్చి యుద్ధం చేయిస్తున్నది అమెరికాయే కదా?”
“నిజమే, శాంతి యెలా వస్తుంది?”
“ఎలా వస్తుంది?”
“యుద్ధం జరిగితేనే శాంతి వస్తుంది!”
“ఔనా?”
“మరి, యుద్ధానికీ యుద్ధానికీ మధ్య విరామమే శాంతి!”
మాసూ మాకూ!
“ఎవరమ్మా యింట్లో?”
“ఎవరూ లేరండి…”
“మీ ఆయన పెట్టిన పోస్టులు చూసి ఆర్మీలో చేరుదామని వచ్చాం,”
“దానికి ఆయనెందుకూ?”
“ఆయన కూడా మాతో పాటు సైన్యంలో చేరుతారని,”
“యిదిగో… సారు యిక్కడ దాక్కున్నారు, వాషింగ్ మిషన్ టబ్‌లో…”
“అదేంటి?”
“ఏం లేదు, మాక్ డ్రిల్లు ప్రాక్టీసు చేస్తున్నా…”
“అరే… లైట్ ఆర్పేసావేమమ్మా?”
“ఇప్పుడు బ్లాక్ అవుట్!, లైట్ వేస్తే పాక్ సైనికులకి మనం కనిపించిపోతాం. బాంబులు వేసేస్తారు,”
“అరే, లైట్ యెందుకు వేస్తున్నారూ… ఎయిర్ రైడ్ జరిగితే?”
“మీరు ముందు చెవులు మూసుకు కూర్చోండి, తర్వాత డక్‌లాగ ఫ్రాగ్‌లాగ కుప్పిగంతులు వేస్తూ సేఫ్ సెంటర్స్‌కు వెళ్ళండి,”
“సేఫ్ సెంటరా, యేది?”
“మీ యిల్లే… యెవరి యిళ్ళకు వాళ్ళు పొండి…”
“అరే మళ్ళీ లైట్ ఆర్పేసార్రా… యేమీ కనిపించడం లేదు,”
“అమ్మా… చచ్చాన్రో,”
“ఏమయింది? బాంబ్ పడిందా?”
“లేదు, గోడ గుద్దుకున్నాను…”
“పర్లేదు, అలాగే మీ యిళ్ళకు… అదే సేఫ్ సెంటర్స్‌కు వెళ్ళండి,”
లౌకిక రాజ్యం!
“మాది లౌకికరాజ్యం!”
“ఎలా?”
“చూడు కరాచీ బేకరీస్ నేమ్ బోర్డు మీద భారతదేశపు జెండా యెగరేశారు,”
“ఆ?”
“మాది లౌకిక రాజ్యమని బేకరీ ముందు బోర్డు కూడా చెపుతుంది,”
“ఏమని?”
“మేము భారతీయులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నాము’ అని!”
వార్ బిట్వీన్…
“పాకిస్తాన్‌లో ‘ఇండియన్ కిచెన్’ షాపు మీద దాడి చెయ్యలేదు. ‘ది బోంబే బేకరీ’ మీద దాడి చెయ్యలేదు, తెలుసా?”
“నువ్వు ఎన్నయినా చెప్పు పాకిస్తాన్ మతతత్వదేశం!”
“భారతదేశంలో కరాచీ బేకరీమీద దాడి చేశారు…”
“మనది మతతత్వదేశం కాదు, హిందూదేశం!”
“సరే, చైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్సూ కొరియన్ ఫుడ్ కోర్టులూ జపాన్ టెక్స్‌టైల్సూ అమెరికా కేఎఫ్‌సీలూ అన్నీ వుండగా కరాచీ బేకరీమీదే యెందుకూ?”
“కరాచీ అనే వూరు పాకిస్తాన్‌లో వుంది కాబట్టి,”
“ఔను, మరి పాకిస్తానే యెందుకు?”
“అక్కడ ముస్లిమ్స్ వుంటారు, అది కూడా తెలీదా?”
వారా వన్నమ్మా?!
“ఏంటి కుర్రాళ్ళంతా యిలా వచ్చి క్యూ కట్టారు?”
“సైన్యంలో చేరుదామని వచ్చారు సార్…”
“గుడ్… వీళ్ళ దేశభక్తి చూస్తుంటే నాకు మాటలు రావడంలేదయ్యా…”
“అంటే సార్… అది…”
“ఏమిటి?”
“ఆర్మీలో లక్షాయెనభై వేల పోస్టులు ఖాళీగా వున్నాయి కద సార్…”
“ఊ… అయితే?”
“ఈ వార్ టైమ్‌లోనయినా ఫిలప్ చేస్తారేమోనని అప్లై చేసుకోవడానికి వచ్చార్సార్…”
కిష్కింధ కాండ!
పాఠశాల ప్రాంగణం కాదు, అదో యుద్ధక్షేత్రం. కిక్కిరిసిన జనం. విద్యార్థులూ వారి తలిదండ్రుల మధ్య వుపాధ్యాయుడొకడు దొరికిపోయిన శత్రు సైనికుడిలా వున్నాడు. దోషిలా తలవంచుకు నిలబడ్డాడు. అతని దుస్తులే కాదు, చర్మమూ అక్కడక్కడా చిరిగివుంది. నల్లని పెదవులు చిట్లి యెర్రగా వున్నాయి. తెల్లని కంటి పాపలు కమిలి నల్లగా వున్నాయి. బుగ్గలు వాచి వున్నాయి.
సేవా సైన్యం అతణ్ణి చుట్టుముట్టింది. తమ పూర్తి అధీనంలోకి తీసుకుంది.
యుద్ధక్షేత్రంలో వున్నట్టే ఆ వుపాధ్యాయుడు బెదురుచూపులు చూస్తున్నాడు.
“చెప్పు…”
బేలగా చూశాడు. ఫట్‌మని చెంప పగిలింది.
“క్లాసులో యేమి చెప్పావురా లంజొడకా?”
“బూమి వొక గ్రహమని చెపితే చెప్పావ్, తర్వాత యేమన్నావు బే? బూమంతా వొక్కటా? మనం… అదేంటి ఫెన్షింగ్‌లు వేసుకుంటే… సరిహద్దులు పెట్టుకుంటే దేశాలుగా విడిపోయాయా?”
ఎవడో కుర్రాడు ఆ వుపాధ్యాయుడి జుట్టుపట్టి వెనక్కి లాగి వదిలాడు.
“పాకిస్తానుకూ మనకీ తేడా లేదా? నీకూ నాకూ తేడా లేదా? నేను రాత్రికి నీ పెళ్ళాం దగ్గరికి వెళ్తే, నీకు వోకేనా?”
నేనలా అనలేదు అన్నట్టు వుపాధ్యాయుడు తలను అడ్డంగా వూపాడు.
“ఏంట్రా అది? ఇండిపెండెన్స్‌కు ముందు ఆళ్ళూ మనమూ కలిసే వుండేవాళ్ళమా? అందుకే వాళ్ళు మనకి దాయాదులా?”
“ఒక్కటి దెంగన్నా పాకిస్తాన్ పోతడు…”
“ఇది జాతి వైరం కాదా? మరేమిటి మీ అమ్మ బొక్కా?”
వెనుకనుంచి నెత్తిమీద టప్‌మని మరొక దెబ్బ పడింది.
“మనమూ వాళ్ళూ అన్నదమ్ములమా? స్వాతంత్రం వస్తూ వస్తూ రెండుగా విడిపోయామా? నువ్వు అప్పుడే పాకిస్తాన్ పోలేకపోయావా? మా హిందూదేశంల యెందుకురా నీ యమ్మ…”
“ఆడు మతం అడిగి కాల్చుతాడు. మతం లేదు గీతం లేదు అని నువ్వు పాఠాలు చెపుతావా?”
“ప్రేమిస్తే ప్రేమ వస్తుందట. ద్వేషిస్తే ద్వేషం వస్తుందట. రేపటి తరానికి యివా నువ్వు చెప్పే పాఠాలు?”
“యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని స్కూల్లో స్లోగన్స్ రాసిండన్నా…”
ఎవడో వెనుకనుంచి వెన్ను మీద యెగిరి తన్నాడు.
ముందుకు తూలిపడిన వుపాధ్యాయున్ని లేపి నిలబెట్టి “ఇది రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, రెండు మతాల మధ్య యుద్ధం. తెలిసిందా? ఎనభైయేళ్ళ క్రితం కాదు, యెప్పుడూ పాకిస్తాన్‌కూ మనకూ సంబంధం లేదు…”
పోలీసులు మూగ దెయ్యాల్లా చూస్తున్నారు.
ఉపాధ్యాయుడి పన్ను వొకటి వుమ్మితో పాటు జారి కిందపడి మట్టిలో చేరింది.
“భారత్ మాతాకీ జై!”
సైన్యం అరుపులకి వుగ్రవాదులు వులిక్కిపడ్డారో లేదో గాని చదువులు చెప్పే అయ్యవారి గుండె వొక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంది.
*
Image: Rafi Haque
మొన్న జరిగిన 4 రోజుల యుద్ధాన్ని బాగా వర్ణించారు భజరా గారు . చదువుతుంటే బలే అనిపించింది.